ఆధార్ లింక్ లేక.. కూలీ డబ్బులు రాక..

  • 10 నవంబర్ 2017
ఆధార్ కార్డుతో మహిళ

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా ముగపాక మండలంలో ఏడాది కాలంగా ఉపాధి హామీ పథకం కింద కూలీలు పని చేస్తున్నారు. కానీ ఇప్పటికీ వీరికి అందాల్సిన కూలీ డబ్బులు అందలేదు.

బ్యాంకు ఖాతాలతో ఆధార్ అనుసంధానం చేసుకోవాలన్న నిబంధన వీరి కడుపు మాడ్చుతోంది. తమ బ్యాంకు ఖాతాలకు ఆధార్ సంఖ్యను జోడించాలని వీరు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

మునగపాక మండలం పరిధిలో 20 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 12 పంచాయతీల్లో పోస్టాఫీసుల ద్వారా చెల్లింపులు చేస్తారు. మిగతా ఎనిమిది గ్రామాల్లోని కూలీలు బ్యాంకులకు వెళ్లాల్సిందే.

ఉపాధి హామీ పథకం కూలీలంతా తమ ఆధార్ వివరాలను బ్యాంకు ఖాతాలతో లింకు చేసుకోవాల్సిందేనంటూ ప్రభుత్వం నిబంధన పెట్టింది. దాంతో బ్యాంకుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం మాత్రం కనిపించలేదు.

మునగపాక గ్రామంలో సుమారు 480 మంది ఉపాధి హామీ పథకం కింద రోడ్లు, భవనాల నిర్మాణం, వ్యవసాయ అనుబంధ పనులకు వెళ్తున్నారు. కానీ, వారిలో సుమారు 20 మందికి ఏడాది గడుస్తున్నా కూలీ డబ్బులు ఇవ్వడం లేదని వారు చెబుతున్నారు.

చిత్రం శీర్షిక రాములమ్మ

'మీ ఆధార్ పనిచేట్లేదు'

కూలీకెళ్తేగానీ ఇల్లు గడవని పరిస్థితి పై ఫొటోలో కనిపిస్తున్న రాములమ్మది. కానీ, ఆమె ఆధార్ కార్డు పని చేయడంలేదు. తనకు ఏడాదిగా కూలీ డబ్బులు అందడం లేదని ఆమె చెబుతున్నారు. దాంతో ఉపాధి హామీ పనులకు వెళ్లడం మానేశారామె.

"ఆధార్ కార్డు వివరాలు ఇచ్చేందుకు ఎన్నోసార్లు బ్యాంకుకు వెళ్లాను. కానీ, ఇప్పటికీ పని కాలేదు. వెళ్లినప్పుడల్లా నా కార్డు వివరాలు రావడం లేదని బ్యాంకు వాళ్లు అంటున్నారు. నేను ఒంటరిదాన్ని. చేసిన పనికి కూలీ డబ్బులు రాకుంటే ఎలా బతకాలి?" అంటూ దీనంగా అడుగుతున్నారు రాములమ్మ.

అర్జునమ్మ, పద్మలదీ ఇదే పరిస్థితి. ఉపాధి హామీ కూలీ రాకపోవడంతో అర్జునమ్మ ఇతర వ్యవసాయ పనులకు వెళ్తున్నారు. పద్మ ఇళ్ల నిర్మాణ పనులకు వెళ్తున్నారు.

"ప్రతిసారీ మళ్లీ రండి అని బ్యాంకు వాళ్లు అంటున్నారు. ఎప్పుడూ నీ ఆధార్ కార్డు వివరాలు అప్‌డేట్ కాలేదు, నీ ఖాతాలో డబ్బులు లేవు అని చెబుతున్నారు." అని అర్జునమ్మ చెప్పారు.

"ఉపాధి హామీ పథకం కింద పనులకు ఇన్నాళ్లూ వెళ్లాను. కానీ, కూలీ డబ్బులు ఇవ్వడంలేదు. కూలీకి వెళ్లకపోతే ఇల్లు గడవదు. పనులు దొరకడంలేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు" అంటున్నారు పద్మ.

ఈ సమస్య ఒక్క మునగపాకలో మాత్రమే కాదు. సమీప గ్రామాలైన పాటిపల్లి, పీ.ఆనందపురం గ్రామాల్లోనూ పరిస్థితి ఇలాగే ఉన్నట్లు చెబుతున్నారు.

చాలా మందికి సమయానికి ఉపాధి హామీ కూలీలకు డబ్బులు అందడంలేదని స్థానిక 'అంబేడ్కరిజం పునాది' సంఘం అధ్యక్షుడు రాజన్న బుజ్జిబాబు తెలిపారు.

నైపుణ్యం లేని కూలీలకు ఉపాధి కల్పించాలన్నదే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉద్దేశం. కానీ, ఎంతోమంది గ్రామస్తులకు కూలీ డబ్బులు సరైన సమయానికి అందడంలేదు. బ్యాంకు ఖాతాలతో ఆధార్‌ అనుసంధానం కాకపోవడమే అందుకు కారణమని చెబుతున్నారు’’ అని బుజ్జిబాబు అన్నారు.

అయితే ఈ సమస్య గురించి ముగనపాక ఎంపీడీవో శాంతిలక్ష్మితో బీబీసీ మాట్లాడారు. ఇది తమ నుంచి జరిగిన లోపం కాదని, బ్యాంకుల వల్లే సమస్య తలెత్తిందని ఆమె అన్నారు.

"నాలుగు నెలల నుంచి పనిచేసిన వారి ఖాతాల్లో ఇప్పుడు డబ్బులు పడుతున్నాయి. ఇన్ని రోజులు ఆధార్ అనుసంధానం అయ్యిందో లేదో వాళ్లు చేసుకోలేదు. ఇప్పుడు కూలీ డబ్బులు వచ్చాయని తెలిశాక, బ్యాంకు ఖాతాలో బ్యాలన్స్ చూసుకున్న తర్వాత ఆధార్ లింక్ కాలేదని వాళ్లకు అర్థమైంది" అని ఆమె అన్నారు.

"మేము అందరి జాబ్ కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేశాం. ఆధార్ కార్డు పనిచేయని వారు మళ్లీ దరఖాస్తు (ఎన్‌రోల్) చేసుకోవాలని సూచించాం. మా దగ్గర ఏ పొరపాటూ లేదు. సమస్య వచ్చిందల్లా బ్యాంకుల వద్దే. వాళ్లు బ్యాంకు ఖాతాలకు ఆధార్ కార్డులను లింక్ చేయించుకోలేకపోతున్నారని ఈ సోమవారం మా దృష్టికి వచ్చింది. దాంతో బ్యాంకు వద్ద సాయపడేందుకు కూలీలకు తోడుగా మా సిబ్బందిని కూడా పంపించాం" అని ఎంపీడీవో శాంతిలక్ష్మి అన్నారు.

ఎంపీడీవో చెప్పిన దానితో ‘అంబేడ్కరిజం పునాది' సంఘం అధ్యక్షుడు రాజన్న బుజ్జిబాబు విభేదించారు. "ఇలా అధికారులు బ్యాంకుల వాళ్లను, బ్యాంకుల వాళ్లు అధికారులను నిందించడం కొత్తేమీ కాదు. తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసమే ఇలా మాట్లాడుతున్నారు" అని ఆయనన్నారు.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు