దిల్లీలో ప్రమాదకరస్థాయిలో వాయు కాలుష్యం

  • 12 నవంబర్ 2017
వాయు కాలుష్యం Image copyright Reuters

దిల్లీలో గతవారం ఓ ఆరేళ్ళ అబ్బాయి శ్వాస తీసుకోలేకపోతున్నానని స్కూలు నుంచి ఇంటికి తిరిగొచ్చేశాడు. కొద్దీ గంటల్లోనే ఆ అబ్బాయి తీవ్రంగా దగ్గడం మొదలుపెట్టాడు. వెంటనే తల్లిదండ్రులు ఆ అబ్బాయిని దగ్గరో ఉన్న ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. "ఊరికే స్కూలు నుంచి వచ్చేయాలని అలా అంటున్నాడేమో అనుకున్నాను.." అని ఆ అబ్బాయి తండ్రి అన్నాడు. ఆసుపత్రిలో ఆ అబ్బాయి తీవ్రమైన బ్రోంకైటీస్ సమస్యతో బాధపడుతున్నాడని వైద్యులు తేల్చారు.

వెంటనే అతనికి స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఇస్తూ నెబ్యులైజర్‌తో చికిత్స అందించారు.

ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండేందుకు ఆ అబ్బాయికి యాంటీబయాటిక్స్, అలర్జీ మందులు ఇచ్చారు. "ఆ అబ్బాయి తీవ్రంగా బాధపడ్డాడు", అందుకే మేము కూడా వేగంగా చికిత్స అందించాం "అని మ్యాక్స్ స్మార్ట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చీఫ్ పల్మనాలజిస్ట్ ప్రశాంత్ సక్సేనా తెలిపారు.

కోలుకునేందుకు ఆ అబ్బాయికి మూడు రోజులు పట్టింది. ఇప్పుడు అతను ఇంట్లోనే ఉంటున్నాడు. రోజుకు రెండుసార్లు అతనికి నెబ్యులైజర్‌తో పాటు ఆవిరి పీల్చే చికిత్స అందించారు.

"ఆరోగ్యంగా ఉండే మా అబ్బాయికి ఇలా కావడంతో మేం షాక్‌కి గురయ్యాం" అని అతని తండ్రి తెలిపారు.

Image copyright Getty Images

ఈ వారం మొదట్లోనే దట్టమైన పొగమంచు దిల్లీ నగరాన్ని కప్పేసింది. గాలిలో అత్యంత ప్రమాదకరమైన ధూళికణాలు చాలా ఎక్కువ స్థాయిలో నమోదయ్యాయి. ఆ గాలి పీల్చితే ధూళికణాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోయి తీవ్రమైన ఇబ్బంది కలిగిస్తాయి.

దిల్లీలోని ప్రతి క్యూబిక్ మీటర్ గాలిలో 700 కన్నా ఎక్కువ స్థాయి కాలుష్యం నమోదైంది. అది చివరికి పెరుగుతూ 999కి చేరిందని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రికార్డుల్లో నమోదైంది.

అది రోజుకు రెండు ప్యాకెట్ల సిగరెట్లు తాగడంతో సమానమని డాక్టర్లు చెబుతున్నారు. "దిల్లీ ఓ గ్యాస్ ఛాంబర్‌గా మారిపోయిందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.

దిల్లీలోని ఆసుపత్రుల్లో దగ్గు, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడేవారిసంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది.

అవుట్ పేషేంట్ వార్డులు వారితోనే నిండిపోయి ఉన్నాయి. అలాంటి రోగులు 20శాతం వరకూ పెరిగారని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), మ్యాక్స్ స్మార్ట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

డాక్టర్లు "పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ"ని ప్రకటించారు. దీని అమలుపై స్పష్టత ఎలా ఉన్నా ప్రజలు ఇంట్లోనే ఉండడం మేలని అంటున్నారు.

"పొగమంచుతో కూడిన చల్లని వాతావరణం ఆరోగ్యానికి ప్రమాదకరం" అని డాక్టర్ సక్సేనా తెలిపారు.

"ఇది ప్రత్యేకించి ఉబ్బసం, దీర్ఘకాలిక బ్రోంకైటీస్ వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారికి మరింత ప్రమాదకరం" అని వివరించారు.

Image copyright AFP

గాలిలో దట్టమైన పొగ పెరుగుతుండడంతో పిల్లలు ఎక్కువగా ఈ కాలుష్యభూతం బారిన పడుతున్నారని పరిశోధకులు తెలిపారు. ఎమర్జెన్సీ వార్డుల్లో పిల్లల సంఖ్యే అధికంగా ఉంది.

ఈ ఏడాది ప్రారంభంలో దిల్లీలోని నాలుగు ప్రముఖ ఆసుపత్రులు సంయుక్తంగా ఓ పరిశోధన మొదలుపెట్టాయి. గాలి నాణ్యతలో మార్పులు, రోగులలో శ్వాసకోశ సమస్యలకు ఉన్న సంబంధంపై పరిశోధన చేస్తున్నాయి.

ఇందుకోసం శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న రోగుల వివరాలను నమోదు చేసేందుకు ఈ ఆసుపత్రులు ప్రత్యేకంగా నర్సులను నియమించాయి. గాలి నాణ్యతలో మార్పులతో ఎంతమంది రోగులు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. వారికి చికిత్స ఎలా ఉందో పరిశీలించడంతోపాటు వాయు కాలుష్యం పెరుగుతున్నప్పుడు రోగుల పరిస్థితి ఎలా ఉందనే వంటివాటిపై పరిశోధనలు జరుపుతున్నారు.

ఈ అధ్యయనం తొలి దశలోనే ఉంది. ప్రస్తుతం ఈ పరిశోధన ఎమర్జెన్సీ వార్డుల రికార్డుల వరకే పరిమితం చేశారు.

అవుట్ పేషేంట్ వార్డుల్లో, ఇతర క్లినిక్లలో శ్వాసకోశ సమస్యలతో చికిత్స పొందుతున్న వారి వివరాలను నమోదు చేయలేదు.

ఈ పరిశోధనలో దిల్లీలో కాలుష్యం సంబంధిత ఆరోగ్య సంక్షోభ తీవ్రత ఎంతవరకూ ఉంటుందో అంచనా వేస్తున్నారు.

వాయు కాలుష్యంతో బాధపడేవాళ్ళలో పిల్లల సంఖ్యే అధికమని ఈ పరిశోధనలో తేలింది.

గాలిలో నాణ్యత తగ్గినప్పుడు పిల్లల్లో అనారోగ్యం పెరుగుతోంది. దగ్గు, ఊపిరి ఆడకపోవడం, తీవ్రమైన జలుబు, శ్వాస సంబంధిత సమస్యలు, కళ్లు, ముక్కు నుంచి నీరు కారుతూ ఉండడం వంటి సమస్యలతో చిన్న పిల్లలు ఎక్కువగా బాధపడుతున్నారని ఈ పరిశోధన తెలిపింది.

Image copyright Getty Images

దగ్గు, ఊపిరి ఆడకపోవడం, తీవ్రమైన జలుబు, శ్వాస సంబంధిత సమస్యలు, కళ్లు, ముక్కు నుంచి నీరు కారుతూ ఉండడం వంటి సమస్యలతో చిన్న పిల్లలు ఎక్కువగా బాధపడుతున్నారని ఈ పరిశోధన తెలిపింది.

చిన్నారుల ఊపిరితిత్తులు సున్నితంగా ఉంటాయి. కాలుష్యం ధాటికి అవి త్వరగా దెబ్బ తింటాయి. 2015లో నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం.. దిల్లీలో ప్రతి 10మంది పిల్లల్లో నలుగురు తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారు.

దిల్లీలోని వాయు కాలుష్యంతో ఆస్తమా రోగుల పరిస్థితి మరింత క్షీణిస్తుందని ఎయిమ్స్‌కు చెందిన పల్మనాలజిస్ట్ డాక్టర్ కరణ్ మదాన్ తెలిపారు.

దీంతో ఔట్ పేషెంట్ క్లినిక్‌లలో, ఎమర్జెన్సీలో ఆస్తమా రోగుల తాకిడి పెరుగుతుందని ఆయన అన్నారు. ఇలాంటి వారికి నెబ్యులైజేషన్, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ఆక్సిజన్, వెంటిలేటర్ ద్వారా చికిత్స అవసరమని తెలిపారు.

"ఈ పరిస్థితి మరింత తీవ్రమైతే ఊపిరితిత్తుల పనితీరులో దీర్ఘకాలంలో తీవ్రమైన ప్రభావాన్నే చూపుతాయి" అని డాక్టర్ మదాన్ తెలిపారు.

"ఈ సమస్య పరిష్కారానికి.. ఒకటి శ్వాస తీసుకోవటం మానేయాలి. అది సాధ్యం కాదు. రెండోది దిల్లీ వదిలేసి వెళ్ళిపోవాలి. అదీ సాధ్యం కాదు. మూడోది తాజా గాలి పీల్చే హక్కు ఉద్యమాన్ని ప్రారంభించాలి" అని ఓ ఛాతి సమస్యల వైద్యుడు న్యూయార్క్ టైమ్స్‌తో అన్నారు.

Image copyright Getty Images

బయటికి వెళ్ళినప్పుడు ప్రజలు యాంటీ పొల్యూషన్ మాస్కులు ధరించాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఇన్‌హేలర్‌ వాడాలని, ఎప్పటికప్పుడు ఫ్లూ, న్యుమోనియా టీకాలు తీసుకోవాలని తెలిపారు.

ఇళ్లలో కూడా ఎయిర్ ప్యూరిఫయర్లను వాడాలని, ధూమపానం అలవాటున్నవారు ఇంటికి దూరంగా వెళ్లి పొగ తాగాలని, వ్యర్థాలను కాల్చరాదని సూచిస్తున్నారు.

వాయు కాలుష్యం జీవితకాల ప్రమాణంపై ఎంతవరకూ ప్రభావం చూపుతుందనే విషయంపై చికాగో విశ్వవిద్యాలయ ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్ మైఖేల్ గ్రీన్ స్టోన్ ఓ అధ్యయనం నిర్వహించారు. ఇందులో ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి.

భారత ప్రమాణాల ప్రకారం వాయుకాలుష్యం ప్రతి క్యూబిక్ మీటర్ గాలిలో 40 మైక్రో గ్రాములు కంటే తక్కువ ఉంటే దిల్లీ ప్రజలు మరో 6 ఏళ్ళు ఎక్కువ బతుకుతారని సర్వే తెలిపింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ప్రతి క్యూబిక్ మీటర్ గాలిలో వాయుకాలుష్యం 10 మైక్రో గ్రాముల కంటే తక్కువ ఉంటే దిల్లీ ప్రజలు మరో 9 ఏళ్ళు ఎక్కువ బతుకుతారని ఈ అధ్యయనంలో తేలింది.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)