అభిప్రాయం: 2002 అల్లర్ల తర్వాత గుజరాత్ ముస్లింలు ఎంత మారారు?

  • జుబైర్ అహ్మద్
  • బీబీసీ ప్రతినిధి
గుజరాత్‌, ముస్లింలు

ఫొటో సోర్స్, Getty Images

ఈ డిసెంబర్‌లో గుజరాత్ ఎన్నికలు జరగనున్నాయి. గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ ముస్లిం ఓటర్ల మద్దతు లేకుండానే విజయం సాధించింది. ఎన్నికల్లో ముస్లిం అభ్యర్థులను నిలబెట్టిందీ లేదు, వారి ఓట్లను అభ్యర్థించిందీ లేదు. అందువల్ల రాష్ట్రంలో ముస్లింలను అనధికారికంగా పక్కకు పెట్టారనే భావన ఏర్పడింది.

ఇటీవల కాంగ్రెస్ పుంజుకుంటోందన్న వార్తల నేపథ్యంలో బీజేపీ నాలుగోసారి కూడా ముస్లిం ఓటర్లను నిర్లక్ష్యం చేయగలదా? ఆ మాటకొస్తే రాష్ట్రంలో పది శాతం జనాభాను ఏ పార్టీ అయినా పట్టించుకోకుండా ఉండగలదా?

అయితే ముస్లింలు మాత్రం ఏ పార్టీ వైపూ మొగ్గు చూపరన్న విషయం స్పష్టం. 2002 హింసాత్మక ఘటనల తర్వాత ముస్లింలు విద్యను ఆయుధంగా చేసుకుని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నారు. ఇప్పుడు అక్కడి ముస్లింలలో అక్షరాస్యత సుమారు 80 శాతం ఉంది.

అలాగని వాళ్లు ఆ అల్లర్లను మర్చిపోయారని కానీ, న్యాయం జరగాలని కోరడం ఆపేశారని కాదు. అలాగే నిశబ్దంగా రగిలిపోతున్నారనీ కాదు. మీడియా హడావుడికి దూరంగా చాలా మంది ముస్లింలు ఎంతో కష్టపడ్డారు. విద్య, వృత్తివిద్య శిక్షణ సాయంతో సాయుధులయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images

విద్యే ఆయుధం

2002 అల్లర్ల తర్వాత గుజరాతీ ముస్లింలు క్రమంగా మారుతున్న వైనాన్ని గమనించాను.

జాతీయ ప్రధాన స్రవంతి నుంచి దూరం చేయబడిన ముస్లింలు మొదట అభద్రతా భావంతో ఆందోళన చెందారు. ఆ తర్వాత క్రమంగా తమకు జరిగిన అన్యాయాలపై గళం విప్పడం ప్రారంభించారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తమకు తామే సాయం చేసుకోవాలని నిర్ణయించారు.

2002లో గుజరాత్‌లో హింస జరిగిన సమయంలో అక్కడ ముస్లింల ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థలు 200 ఉండేవి. నేడు వాటి సంఖ్య 800కు పెరిగింది. వీటిలో చదువుకునే విద్యార్థుల్లో ఎక్కువమంది 2002 అల్లర్ల తర్వాత జన్మించిన వారే.

అహ్మదాబాద్‌లోని షాపూర్ ప్రాంతంలో వందలకొద్దీ ముస్లిం బాలికలకు మతప్రమేయంలేని విద్యను బోధిస్తున్నారు.

అక్కడ నేను బురఖా ధరించిన 12 ఏళ్ల ఫిరదౌస్ అనే బాలికను కలిసాను. తాను గుజరాతీ, అలాగే భారతీయురాలు కావడం తనకెంతో గర్వకారణమని ఆ బాలిక ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పింది. ఇతర బాలికలూ అలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేసారు.

ఆ మాటలు ఏవో యధాలాపంగా చెప్పినవి కావు. గతంలో జరిగిన సంఘటనలకు కారకులపై వారిలో ఎలాంటి ద్వేషం లేదు.

అల్లర్ల బాధితులు ఈ కొత్త తరంలో ఆత్మవిశ్వాసాన్ని నెలకొల్పారు. ఆ విద్యార్థుల్లో కొందరు డాక్టర్లు కావాలనుకుంటుంటే మరికొందరు ఐటీ ప్రొఫెషనల్స్ కావాలనుకుంటున్నారు. వారెవరిలో కూడా ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన లేదు.

భవిష్యత్తులో ఏ ప్రభుత్వం కానీ, అధికారి కానీ ఆ పిల్లలను నిర్లక్ష్యం చేయలేని విధంగా విజ్ఞానం, నైపుణ్యాలతో వారిని సాయుధుల్ని చేస్తున్నామని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెల్లడించారు.

ఉద్యోగాలు తప్పకుండా వాళ్లను వెతుక్కుంటూ వస్తాయి. దాంతో పాటే ధనం కూడా. ఒక్కసారి వారు శక్తిమంతులయ్యాక అధికారం కూడా వస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ముస్లింలలో తొణికిసలాడుతున్న ఆత్మవిశ్వాసం

ప్రధాన స్రవంతిలోకి ముస్లింలు

హనీఫ్ లక్డావాలా అహ్మదాబాద్‌లోని ముస్లింల కోసం పని చేస్తున్న సామాజిక కార్యకర్త. ఒకసారి అతను 'గుజరాత్ హిందుత్వ పరిశోధనశాలగా మారింద'ని, అక్కడ ముస్లింలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నాడు.

కానీ విద్య వారికి 'సామాజికంగా తమను తాము నిరూపించుకునే అవకాశం ఇచ్చింది' అని అతను తెలిపాడు.

చదువుకున్న ముస్లింలు ఇప్పుడు ఇళ్ల నుంచి బయటకు వచ్చి, ఇతర కులాల వారితో కలుస్తున్నారని వివరించాడు.

ఫొటో సోర్స్, Getty Images

వదోదరలోని ఓ గ్రామంలో హిందూ సభ్యులంతా కలిసి ఒక ముస్లిం యువతిని సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. క్రమంగా ముస్లింలు సాధికారత సాధించాలని ఆమె అభిప్రాయపడ్డారు.

నేను అనేక మంది ముస్లిం వ్యాపారులు, రెస్టారెంట్ ఓనర్లను కలిసాను. వారంతా చాలా ఆత్మవిశ్వాసంతో కనిపించారు. వారి ముఖంలో ఇప్పుడు ఎలాంటి భయమూ లేదు.

దానికి భిన్నంగా వారు తమ మత చిహ్నాలను సగర్వంగా ప్రదర్శిస్తున్నారు. ముస్లిం వస్త్రధారణ, పొడవైన గడ్డాలు, మసీదుల్లో ప్రార్థన సందర్భంగా అనేక మంది గుమికూడడం నేటి గుజరాత్‌లో సర్వసాధారణంగా కనిపించే దృశ్యాలు.

దానికి మెజారిటీ వర్గాల నుంచి అభ్యంతరాలు కూడా లేవు.

గుజరాత్‌లో మరోసారి ముస్లింలు ఆత్మవిశ్వాసంతో జీవిస్తున్నట్లు కనిపిస్తోంది. వారి రాజకీయ సాధికారత కూడా ఎంతో దూరంలో లేదేమో!

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)