ప్రెస్ రివ్యూ: లక్షల మంది నిరుద్యోగుల ఆశలపై నీళ్లు?

  • 11 నవంబర్ 2017
చంద్రబాబు నాయుడు Image copyright AndhraPradeshCM/facebook

ప్రతిపక్షం వైసీపీ అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడం వల్ల అల్లరి లేని సభను ప్రజలు చూస్తున్నారని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం లేదనేది మీడియాకు వార్త కాదు. అల్లరి లేకుండా సభ సాఫీగా జరుగుతోందన్నదే వార్త అని అన్నారు.

కేవలం పాదయాత్రలతోనే ముఖ్యమంత్రులు కారని వైకాపా అధ్యక్షుడు వైఎస్. జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు.

అవినీతిపరుల ఆస్తులు స్వాధీనం మొదలుపెట్టబోతున్నామని వెల్లడించారు. అందుకోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయబోతున్నామన్నారు. అవినీతిపరుల ఆస్తులు, చిట్‌ఫండ్ కంపెనీల కేసులకు సంబంధించిన ఆస్తులను జప్తు చేసి ప్రభుత్వ స్వాధీనంలోకి తీసుకుంటామని తెలిపారు.

"వైసీపీ వైరస్ లాంటిది. ఆ పార్టీ సభ్యులు సభలో లేకుంటే మాకు ప్రశాంతంగా ఉంది" అని మంత్రి ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యానించారని ఆంధ్రజ్యోతి పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.

Image copyright Getty Images

సుప్రీంకోర్టులో అనూహ్య పరిణామం

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పేర్లు చెప్పి లంచాలు తీసుకున్నారన్న ఆరోపణల వ్యవహారం శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానంలో అనూహ్య పరిణామాలకు దారితీసింది. ఈ కేసులో జస్టిస్. జె.చలమేశ్వర్, జస్టిస్. అబ్దుల్ నజీర్ గురువారం జారీ చేసిన ఉత్తర్వులను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్. దీపక్ మిశ్రా సారథ్యంలోని ధర్మాసనం తోసిపుచ్చింది.

అసలు విషయం ఏంటంటే.. 'మెడికల్ సీట్ల కుంభకోణం'గా పేర్కొంటున్న కేసును, జస్టిస్.చలమేశ్వర్ ధర్మాసనం విచారించకూడదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్.దీపక్ మిశ్రా ఆదేశించినప్పటికీ.. జస్టిస్.చలమేశ్వర్ విచారణ చేపట్టారు. అది ప్రధాన న్యాయమూర్తికి రుచించలేదు.

తానే రోస్టర్‌ను నిర్ధారించాల్సి ఉన్న దరిమిలా.. న్యాయమూర్తులు తమకు తాము కేసుల విచారణ బాధ్యతలను చేపట్టకూడదని చీఫ్జస్టిస్.మిశ్రా శుక్రవారం స్పష్టం చేశారని ఈనాడు పత్రిక పేర్కొంది.

Image copyright Getty Images

లక్షల మంది నిరుద్యోగుల ఆశలపై నీళ్లు

ఏపీలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలపై నీళ్లు కుమ్మరించే నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైందని సాక్షి పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.

ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామక కాంట్రాక్టును రాష్ట్రస్థాయిలో తమకు సంబంధించిన ఏజెన్సీకి అప్పగించి దాని ద్వారా తమ పార్టీకి అనుకూలురనే 'ఎంపిక' చేసుకోవాలని తలపోస్తోంది.

"పీఆర్సీతో ఔట్ సోర్సింగ్ వేతనాలు పెరగడం, భారీగా పోటీపడుతున్న నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర స్థాయిలో ఎంపికైన ఏజెన్సీ ఒక్కో పోస్టుకు రూ.2 లక్షలకు పైగా పెద్దలకు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు తెలిసింది" అని వివరించింది.

Image copyright facebook

పాలమూరు పచ్చబడేవరకు శ్రమిస్తా..

పాలమూరు జిల్లా పచ్చబడేవరకు విశ్రమించబోనని, పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను సస్యశ్యామలం చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

మరో రెండేళ్లలో ఎత్తిపోతలను పూర్తి చేసి ఉమ్మడి జిల్లాలో 20 లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తామని స్పష్టం చేశారు.

ప్రతి గ్రామ పంచాయతీకి రూ.10 లక్షలు, గూడేలు, తండాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున నిధులు విడుదల చేస్తామన్నారని నమస్తే తెలంగాణ పత్రిక కథనం ప్రచురించింది.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)