గుజరాత్: సోషల్ మీడియాలో బీజేపీని ఢీకొంటున్న కాంగ్రెస్

  • 11 నవంబర్ 2017
కాంగ్రెస్ బీజేపీ Image copyright Getty Images

సోషల్ మీడియా, ఇంటర్నెట్ వేదికగా రాజకీయ సమీకరణ విషయంలో కాంగ్రెస్‌కు అంతగా పేరు లేదు.

ప్రజాభిప్రాయాన్ని బాగా ప్రభావితం చేయగల ఈ రంగాన్ని మొట్టమొదట 2014 సాధారణ ఎన్నికలకు ముందుగా బాగా వాడుకుంది బీజేపీనే. అప్పటి నుంచి చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఇందులో పెద్దగా నైపుణ్యం అలవడలేదనే అనిపించిది.

అయితే ఇప్పుడు గుజరాత్ ఎన్నికల్లో పరిస్థితులు అలా లేవు.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నినాదం - 'వికాస్ గాండో థయో ఛే' అంటే 'అభివృద్ధికి పిచ్చిపట్టింది' - దిల్లీ దాకా చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు బీజేపీ 'హూం ఛూం వికాస్, హూం ఛూం గుజరాత్' అనే నినాదాన్ని చేపట్టి ప్రచారంలో కాంగ్రెస్‌తో పోటీ పడుతోంది.

గుజరాత్‌లో ఇంటర్నెట్ యుద్ధం ఈసారి చాలా ఆసక్తికరంగా మారింది. రెండు పార్టీల్లోనూ దూకుడుగా ఉండే యువ కార్యకర్తలతో కూడిన ప్రచార సైన్యాలు పోటీ పడుతున్నాయి. ఒకరి ప్రచారాన్ని మరొకరు ఎద్దేవా చేస్తున్నారు.

Image copyright @INCINDIA

కాంగ్రెస్: 'మాకు 20 వేల వాలంటీర్లు'

అహ్మదాబాద్‌లోని సత్యం మాల్‌ మూడో అంతస్తులో గుజరాత్ కాంగ్రెస్ ఐటీ సెల్ కార్యాలయం ఉంది. ఈ ఐటీ సెల్‌కు రోహన్ గుప్తా నేతృత్వం వహిస్తున్నారు. రాష్ట్రంలో ఐటీ సెల్‌కు మొత్తం 8 మంది ఉపాధ్యక్షులున్నారు. వీరిలో ఒకరు హీరేన్ బైంకర్.

కాంగ్రెస్ పార్టీ ఐటీ కార్యాలయంలో దాదాపు 10-12 మంది యువ కార్యకర్తలుంటారు. వారితో మాట్లాడడానికి మాకు అనుమతి లభించలేదు.

హీరేన్ ఒక వీడియో చూస్తున్నారు. అందులో ఇద్దరు వ్యక్తులు గుజరాత్ ఆత్మగౌరవం విషయంలో వాదించుకుంటున్నారు. ఇంతలో మూడో వ్యక్తి అక్కడికొచ్చి, గుజరాత్ ఆత్మగౌరవం గుజరాతీల వల్లనే ఏర్పడింది తప్ప బీజేపీ వల్ల గానీ, మరెవరి వల్ల గానీ, ఏ ప్రభుత్వం వల్ల గానీ కాదని అర్థం చేయించడానికి ప్రయత్నిస్తాడు.

ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీర్ అయిన హీరేన్ బైంకర్ ప్రస్తుతం గుజరాత్ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్‌ అభ్యసిస్తున్నారు. ఆయన గత నాలుగేళ్లుగా కాంగ్రెస్ ఐటీ సెల్‌లో పని చేస్తున్నారు.

అహ్మదాబాద్‌లో 20-25 మంది ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ ఐటీ సెల్‌లో పని చేస్తున్నారని హీరేన్ తెలిపారు. వీరితో పాటు ప్రతి జిల్లాలోనూ దాదాపు 250 మంది కార్యవర్గ సభ్యులున్నారని ఆయన చెప్పారు. మొత్తం గుజరాత్‌లో దాదాపు 20 వేల మంది వలంటీర్లు తమ కోసం పని చేస్తున్నారని ఆయన అన్నారు.

"దాదాపు వెయ్యి మంది ట్విటర్‌లో యాక్టివ్‌గా ఉన్నారు. వాళ్లు ట్రెండ్ మొదలు పెట్టగానే మా వలంటీర్లందరూ దాన్ని ఫాలో అవుతారు" అని ఆయన చెప్పారు.

చిత్రం శీర్షిక గుజరాత్ కాంగ్రెస్ ఐటీ సెల్‌కు చెందిన సందీప్ పాండ్యా (ఎడమ), హీరేన్ బైంకర్

వాట్సాప్ ఏర్పాట్లు

'వికాస్ గాండో థయో ఛే' తర్వాత తమ టీం ఇలాంటివే మరో రెండు వ్యంగ్యాత్మకమైన ప్రచార క్యాంపెయిన్లు చేపట్టిందని హీరేన్ చెప్పారు. వాటిలో - 'నా బావమరిది నన్ను ఫూల్‌ను చేశాడు', 'ఇక ఎవరూ మనల్ని మోసగించలేరు' అనే అర్థం వచ్చే గుజరాతీ నినాదాలున్నాయి.

స్మార్ట్‌ఫోన్ విప్లవం తర్వాత ఎన్నికల ప్రచారంలో నినాదాల పాత్ర విపరీతంగా పెరిగిందన్నది నిర్వివాదం. గుజరాత్‌లో కాంగ్రెస్ మొదట 'కాంగ్రెస్ వస్తుంది, నవ చైతన్యం తెస్తుంది' అనే నినాదం చేపట్టింది. ఇప్పుడు 'గుజరాత్ సంతోషంతో ఉండాలి' అనే నినాదం తీసుకుంది.

తమ పార్టీ గుజరాత్ వ్యాప్తంగా 40 వేల వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసినట్టు హీరేన్ తెలిపారు. వాటిలో చాలా గ్రూపులు వృత్తిని బట్టి ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు. "వ్యాపారులకు సంబంధించిన గ్రూపులలో జీఎస్టీ వల్ల కలుగుతున్న నష్టాల గురించిన విషయాలు షేర్ చేస్తాం. విద్యార్థులకు సంబంధించిన గ్రూపులలో నిరుద్యోగ సమస్య గురించిన విషయాలు పోస్ట్ చేస్తాం" అని హీరేన్ చెప్పారు.

చిత్రం శీర్షిక కాంగ్రెస్ ఐటీ సెల్

బీజేపీని ఎలా ఎదుర్కొంటారు?

బీజేపీ సోషల్ మీడియాలో చేసే ప్రచారాన్ని ఎదుర్కోవడానికి తామేం చేస్తామో హీరేన్ కొన్ని ఉదాహరణలు చెప్పారు. "బీజేపీ 'ధన్యవాద్ నరేంద్ర భాయ్' అనే క్యాంపెయిన్ నిర్వహించింది. దానికి జవాబుగా కాంగ్రెస్ 'ధన్యవాద్ మోటా భాయ్' అనే క్యాంపెయిన్ చేపట్టింది. 'పెట్రోల్ ధర 80 రూపాయలైంది, ధన్యవాద్ మోటా భాయ్' అని రాయడం మొదలుపెట్టాం. 'ఇంత మంది నిరుద్యోగులయ్యారు, ధన్యవాద్ మోటా భాయ్' అని రాశాం" అని హీరేన్ చెప్పారు.

గతంలో బీజేపీ 'గర్జే గుజరాత్' (గర్జిస్తున్న గుజరాత్) అనే నినాదంతో ప్రచారం నిర్వహించింది. దీనికి ప్రతిగా కాంగ్రెస్ 'జో గరజ్తే హై వో బరస్తే నహీ' (ఉరిమే మేఘాలు కురవవు) అనే నినాదంతో ప్రచారంతో బీజేపీకి జవాబిచ్చింది.

"దీంతో బీజేపీ వెంటనే తమ ప్రచారాన్ని వెనక్కి తీసుకోవడమే కాకుండా, ఇది తమ ప్రచారమే కాదని కూడా ప్రకటించింది" అని హీరేన్ తెలిపారు.

అట్లాగే, బీజేపీ చేపట్టిన 'అడిఖమ్ (దృఢమైన) గుజరాత్' అనే ప్రచారాన్ని కూడా ఎదుర్కొన్నామని హీరేన్ చెప్పారు. "వాళ్లు మీ దగ్గరికి వచ్చి అడిగినప్పుడు దృఢంగా ఉండాలని మేం రాశాం. ఇంకా ఏమైనా మాట్లాడితే 30 లక్షల ఉద్యోగాల విషయంపై గట్టిగా అడగండి. వాళ్లేదైనా పథకం గురించి మాట్లాడితే ప్రభుత్వ ఆసుపత్రుల తీరుతెన్నుల గురించి ప్రశ్నించండి" అని రాసినట్టు హీరేన్ తెలిపారు.

చిత్రం శీర్షిక బీజేపీ రాష్ట్ర ఐటీ, సోషల్ మీడియా కన్వీనర్ పంకజ్ శుక్లా

ఫొటోలు ఇవ్వ నిరాకరించిన బీజేపీ ఐటీ సెల్

చాలా సార్లు ప్రయత్నించిన మీదట బీజేపీ రాష్ట్ర ఐటీ, సోషల్ మీడియా కన్వీనర్ పంకజ్ శుక్లాతో మేం కేవలం రోడ్డు మీదే కలవగలిగాం. ఆయన మాకు తమ కార్యాలయాన్ని చూపించడానికి, దాని ఫొటోలు పంపించడానికి నిరాకరించారు. మరో రెండు రోజుల తర్వాత జాతీయ ఐటీ నేత అమిత్ మాలవీయ అక్కడికి వస్తున్నారనీ, అప్పుడే మీడియా తమ ఐటీ సెల్ ఫొటోలు తీసుకోవచ్చనీ ఆయన చెప్పారు.

పంకజ్ శుక్లా కుటుంబం రెండు తరాల ముందు ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ నుంచి ఇక్కడికొచ్చి స్థిరపడింది.

ఐటీ సెల్‌లో పని చేసేవారి సంఖ్య విషయంలో స్పష్టంగా చెప్పడానికి నిరాకరించిన పంకజ్, బీజేపీ కేడర్‌పై ఆధారపడిన పార్టీ అని, గుజరాత్ అంతటా సోషల్ మీడియాలో తమ కార్యకర్తలు క్రియాశీలంగా ఉన్నారని తెలిపారు.

15-20 మందితో కూడిన టీం కంటెంట్ రూపొందిస్తుందని ఆయన చెప్పారు. దానిని తమ కార్యకర్తలు జిల్లా, జోన్, మండలం, అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్ బూత్ స్థాయి వరకు ఏర్పడిన అనేక వాట్సాప్ గ్రూపుల ద్వారా చేరవేస్తారని ఆయన తెలిపారు.

"ప్రతి బూత్ వరకూ, ప్రతి వ్యక్తి మొబైల్‌లోనూ బీజేపీ సాహిత్యం అందజేస్తాం. మా ప్రభుత్వం సాధించిన విజయాల్ని గుర్తు చేసే విధంగా పని చేస్తాం" అని పంకజ్ చెప్పారు.

'ఇప్పుడు మాదే హవా'

'వికాస్ గాండో థయో ఛే' నినాదం ఇప్పుడు పాతబడిపోయిందని పంకజ్ అన్నారు.

"ఈ ప్రశ్న నన్ను రెండు నెలలు ముందు అడిగితే కొంత వరకు ఇది ఇంకా చెలామణిలో ఉందని చెప్పేవాడిని. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో మేం చాలా మెరుగైన పరిస్థితిలో ఉన్నాం.

"అబద్ధాలాడడం, గట్టిగా మాట్లాడడం కాంగ్రెస్‌కు అలవాటు. మాది అలాంటి క్యాంపెయిన్ కానే కాదు. టౌన్‌హాల్ కార్యక్రమంలో మేం అడిఖమ్ గుజరాత్ అనే నినాదం తీసుకున్నాం. అది బాగా నడిచింది. ఇప్పుడు మా ప్రచారం 'హూం ఛూం వికాస్, హూం ఛూం గుజరాత్' అనే నినాదంతో సాగుతోంది. దీనిని ప్రతి వ్యక్తీ తనతో కనెక్ట్ చేసుకుంటున్నాడు" అని పంకజ్ అన్నారు.

చిత్రం శీర్షిక గుజరాత్ ఎన్నికల్లో సోషల్ హవా

నెలన్నర క్రితం కాంగ్రెస్ సోషల్ మీడియాలో పైచేయి సాధించిందనే అభిప్రాయంతో పంకజ్ ఏకీభవించలేదు. "కాంగ్రెస్ ప్రయత్నించిన మాట నిజమే. ప్రింట్ మీడియాలో, అక్కడా ఇక్కడా కొంత అచ్చువేయించి ఆధిక్యం సాధించాలని అది చూసింది. కానీ అలాంటి హవా ఏదీ ఏర్పడలేదు. అదీ నెలన్నర, రెండు నెలల కిందటి మాట" అని పంకజ్ చెప్పారు.

రానున్న ఎన్నికల్లో ఫేస్‌బుక్ పాత్ర కీలకంగా ఉంటుందన్న విషయాన్ని బీజేపీకి చెందిన పంకజ్, కాంగ్రెస్‌కు చెందిన హీరేన్ - ఇద్దరూ అంగీకరించారు. ఇటీవలి కాలంలో వాట్సాప్ ఇంటింటికీ చేరింది కాబట్టి దాని పాత్ర కూడా కీలకంగా ఉండబోతున్నది. అయితే, సోషల్ మీడియా క్యాంపెయిన్‌ బడ్జెట్ గురించి అడిగినప్పుడు రెండు పార్టీల ఐటీ ప్రముఖులూ జవాబు దాటవేశారు.

సందీప్ పాండ్యా గుజరాత్ కాంగ్రెస్ ఐటీ ఉపాధ్యక్షులలో ఒకరు. ఇప్పుడు తమ నాయకులు స్వయంగా రంగంలోకి దిగారనీ, దాంతో కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారనీ ఆయన చెప్పారు.

"సూరత్‌లో ఒక సభ జరిగింది. దాదాపు 75 వేల మంది వచ్చారు. అక్కడ రాహుల్ గాంధీ 'జై సర్దార్ జై పాటీదార్' అని అనాల్సి ఉండె. కానీ ఆయన ఓ అడుగు ముందుకేసి 'జై భవానీ, భాజపా జవా నీ' (జై భవానీ, బీజేపీ పోవాలీ) అని అనేశారు. ఆయనది చాలా పకడ్బందీగా ఉండే టీం. దీంతో సహజంగానే మాలో కూడా ఉత్సాహం బాగా పెరిగిపోతుంది" అని సందీప్ చెప్పారు.

చివరగా, వెళ్తూ వెళ్తూ సందీప్ పాండ్యా ఒక మాటన్నారు - "ఎన్నికలలో ఫలితాలు ఎలాగైనా ఉండనీయండి. గుజరాత్ కాంగ్రెస్‌లో ఇంతటి ఆత్మవిశ్వాసం గతంలో ఎన్నడూ లేదు. గుజరాత్‌లో బీజేపీ ఇంత ఆత్మరక్షణా స్థితిలో ఎన్నడూ లేదు."

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)