ప్రెస్ రివ్యూ: తెలంగాణలో దళితులకు 'గగనసఖి' శిక్షణ

  • 12 నవంబర్ 2017
Image copyright SAM PANTHAKY

మూడు రోజులు.. లక్ష పెళ్లిళ్లు

ఆంధ్రప్రదేశ్‌ పెళ్లికళ సంతరించుకుంది. ఈ నెల 23, 24, 25 తేదీల్లో రాష్ట్రంలో లక్షకు పైగా వివాహాలు జరగబోతున్నాయి. ఒకమాసంలో మూడు మంచి రోజుల్లో ఇంత భారీ సంఖ్యలో పెళ్లిళ్లు జరగడం ఇదే మొదటిసారి అని పురోహితులు చెబుతున్నారు.

హేవళంబి నామ సంవత్సరంలో అత్యంత బలమైన వివాహ ముహూర్తాలు ఈ నెలలోనే వచ్చాయి. ఇవే ఈ ఏడాదికి చివరి ముహూర్తాలు. దీంతో ఏపీలో జిల్లాకు సగటున 10 వేల వివాహాలు జరగనున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా ఫంక్షన్ హాళ్లు దొరకడంలేదు. అంటూ ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది.

Image copyright Getty Images

దళితులకు 'గగనసఖి' శిక్షణ

విమానయాన రంగంలో దళితులకు శిక్షణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ పర్యాటక, ఆతిథ్య నిర్వహణ సంస్థ(నిథమ్) అందించే ఎయిర్ హోస్టెస్ కోర్సులో వారిని చేర్పించనుంది.

ఇందులో చేరేందుకు 200 మంది అమ్మాయిలు దరఖాస్తు చేసుకోగా.. వారిలో తొలి బ్యాచ్ కింద 50 మందికి శిక్షణ ఇవ్వాలని ఎస్సీ సహకార ఆర్థిక సంస్థ నిర్ణయించిందని ఈనాడు కథనం వెల్లడించింది.

Image copyright MONEY SHARMA/Gettyimages

అన్నీ ఉన్నాయ్.. డాక్టర్ లేడు

తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రుల రంగులు మారాయి. కొత్తగా ఖరీదైన మంచాలు, దుప్పట్లతోపాటు, అత్యవసర వైద్య సేవలకు అవసరమైన పరికరాలన్నింటినీ ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది.

కానీ, ఆ పరికరాలను ఆపరేట్ చేసేందుకు అవసరమైన సిబ్బంది నియామకంలో మాత్రం తీవ్ర అశ్రద్ధ చేస్తోంది. దాంతో ప్రాథమిక వైద్య సేవల పరిస్థితి కూడా దారుణంగా ఉంటోంది.

సర్కారు దవాఖానాల్లో ఆశించిన మేరకు వైద్య సేవలు అందకపోవడంతో తప్పనిసరై రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది.

ఈ సమస్యను అధిగమించాలంటే 23,478 పోస్టులను తక్షణం భర్తీ చేయాల్సిన అవసరం ఉందంటూ సాక్షి పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.

Image copyright Facebook

కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఏపీ సర్కారు అసంతృప్తి

పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం తీరుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసహనంగా ఉంది. ఈ ప్రాజెక్టుకు 2014 తర్వాత ఖర్చు చేసే నిధులన్నీ భరిస్తామని ప్రకటించిన కేంద్రం, చేతల్లో చూపించలేదన్న అసంతృప్తి కనిపిస్తోంది.

2015 తర్వాత నిర్మాణ పనులు వేగమందుకున్నా నిధులు అందించే విషయంలో కేంద్రం కొర్రీలు వేస్తోందనే భావన కనిపిస్తోంది.

ఇప్పటికే ఆకృతుల ఖరారు చేసేందుకు కేంద్ర జల సంఘం విశ్రాంత ఛైర్మన్ పాండ్యా నేతృత్వంలోని కమిటీ పనిచేస్తోంది. అయితే, పోలవరంపై మంచి అవగాహన ఉన్న ఆ కమిటీని కాదని, కాఫర్ డ్యాం నిర్మాణంపై కేంద్ర జలవనరుల శాఖ కొత్త కమిటీని నియమించడం ఏంటి? అంటూ రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయని ఈనాడు పేర్కొంది.

Image copyright Getty Images

అన్నీ అమ్మేద్దాం..!

పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావంతో పెరుగుతున్న 'ద్రవ్య' లోటును పూడ్చుకునేందుకు గాను.. కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ కాసుల వేటను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా 18 ప్రభుత్వ రంగ కంపెనీల్లో వ్యూహాత్మక వాటా విక్రయాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించింది.

ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ తగ్గి మందగమన పరిస్థితులు నెలకొనడంతో పాటు, దేశ ఆర్థిక వ్యవస్థలో స్తబ్ధత.. కారణంగా ప్రైవేటు సంస్థలు, విదేశీ పెట్టుబడిదారులు కొత్తగా పెట్టబడులు పెట్టేందుకు ఆసక్తి చూపడం లేదు.

తాజా వ్యూహం ప్రకారం వ్యూహాత్మక వాటా విక్రయాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చాలని కేంద్రం నిర్ణయించింది.

ఎంపిక చేసిన సంస్థల వాటాలతో పాటు వాటికి సంబంధించిన భూమిని కూడా కలిపి ఒక ప్యాకేజీ రూపంలో అమ్మకానికి పెడితే మంచి స్పందన, ధర లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోందంటూ నవతెలంగాణ పత్రిక ఓ కథనం ప్రచురించింది.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి)