బంగ్లాలో కొడుకులు.. బజారులో తల్లిదండ్రులు!
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

అందరూ ఉన్నా అనాథలే.

  • 19 నవంబర్ 2017

కన్న కొడుకులు కాదన్నారు. బిడ్డలూ భారమనుకున్నారు. ఆస్తులన్నీ లాక్కుని తండ్రిని రోడ్డున పడేశారు. తిండి లేక, ఆకలికి తట్టుకోలేక బిస్కెట్లు తింటూ అతను కాలం వెల్లదీస్తున్నారు.

కర్నూలు జిల్లా శిరివెళ్ల మండలం గోవిందపల్లె గ్రామానికి చెందిన గంగదాసరి నాగిరెడ్డికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 20ఏళ్ల క్రితం భార్య చనిపోవడంతో అన్నీతానై పిల్లల్ని పెంచి, పెద్ద చేశారు.

ఒకప్పుడు గోవిందపల్లెకు ఈయన ఉప సర్పంచ్. వారసత్వంగా వచ్చిన 16ఎకరాలకు తోడు మరో 26ఎకరాలు సంపాదించారు. రెండు ఇళ్లతో పాటు తన 40 ఎకరాలను కొడుకులకు రాసిచ్చాడు. ఆస్తులు తీసుకున్న కొడుకులు తర్వాత తండ్రి ఆలనాపాలన మరిచారు. దాంతో 75ఏళ్ల వయసులో నాగిరెడ్డి ఒంటరివాడయ్యాడు. అన్నంపెట్టే దిక్కులేక సత్రాల్లో కడుపు నింపుకుంటున్నాడు.

న్యాయం కోసం లోక్ అదాలత్‌ను ఆశ్రయించాడు. తండ్రికి కొంత భూమి ఇవ్వాలని జడ్జి తీర్పు ఇచ్చారు. లోక్ అదాలత్‌తీర్పుతో నాగిరెడ్డిని తీసుకెళ్లినా నాగిరెడ్డి పరిస్థితి మాత్రం మారలేదు. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నాగిరెడ్డి ఫిర్యాదుతో అతని కుమారులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. తండ్రికి కొంత భూమి ఇవ్వాలని సూచించారు. కానీ ఇంతవరకు అది జరగలేదు. జీవిత చరమాంకంలో తల్లిదండ్రుల్ని ఆదరించకపోతే చట్టప్రకారం నేరమని పోలీసులు చెప్తున్నారు.

అయితే, తండ్రిని తామే పోషిస్తున్నామని నాగిరెడ్డి కుమారులు చెప్పారు. తండ్రి ప్రవర్తన సరిగా ఉండదని ఆరోపించారు.

నాగిరెడ్డి లాంటి వారికి అశ్రమాలే అన్నం పెడుతున్నాయి. వీరిలో కొందరు అందరూ ఉండీ అనాధలయ్యారు. మరికొందరు ఎవరూ లేని అనాధలు. ఒక్కొక్కరిది ఒక్కో దీనగాధ. ఆస్తికోసం పెద్దకొడుకు, చిన్నకొడుకును హత్య చేయడంతో ప్రాణభయంతో ఇంటి నుంచి బయటికొచ్చింది సుబ్బమ్మ అనే వృద్ధురాలు.

చూపు లేదని తనను ఇంట్లోంచి తరిమేశారని మరో వృద్ధుడు వాపోయాడు. కొడుకులు, కూతుళ్లు ఉన్నా పిడికెడు మెతుకులు పెట్టే వారే లేరని మరో వృద్ధురాలు కంటతడి పెట్టుకుంది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)