ప్రెస్ రివ్యూ: విద్యార్థుల ఆత్మహత్యలకు తల్లిదండ్రులే కారణమన్న ఏపీ సర్కారు

  • 14 నవంబర్ 2017
Image copyright Getty Images

అమెరికాలో రెట్టింపైన భారతీయ విద్యార్థులు

ఈనాడు: అగ్రరాజ్యం అమెరికాలో భారతీయవిద్యార్థుల సంఖ్య రెట్టింపైంది. 2016తో పోల్చుకుంటే ఈ ఏడాది 12.3 శాతం పెరిగింది. డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం వచ్చాక భారతీయ విద్యార్థులు అమెరికాకి వెళ్లి చదువుకోవాలంటే భయపడ్డారు. కానీ ఈ ఏడాది వారి సంఖ్య రెట్టింపవడం గమనార్హం. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థుల్లో చైనా మొదటి స్థానంలో ఉండగా భారత్‌ రెండో స్థానంలో ఉంది. 2016-17 విద్యా సంవత్సరంలో అమెరికాలో 186,267 మంది భారతీయ విద్యార్థులు ఉన్నట్లు ఐఐఈ (ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌) నివేదిక వెల్లడించింది. అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల్లో 17.3 శాతం మన భారతీయ విద్యార్థులే కావడం విశేషం. చైనాలో 350,755 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. ఈ ఏడాది అక్కడి భారతీయుల సంఖ్య 6.8 శాతం పెరిగింది.

అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో చైనా, భారత్‌, దక్షిణ కొరియా, సౌదీ అరేబియా, కెనడా, వియత్నాం, తైవాన్‌, జపాన్‌, మెక్సికో, బ్రెజిల్‌ దేశాలకు చెందినవారున్నారు. ఈ విదేశీ విద్యార్థులంతా ఎక్కువగా అమెరికాలోని కాలిఫోర్నియా, న్యూయార్క్‌, టెక్సాస్‌, మస్సాచుసెట్స్‌, ఇల్లినాయిస్‌, పెన్సిల్వేనియా, ఫ్లోరిడా, ఒహాయో, మిచిగన్‌, ఇండియానా రాష్ట్రాలోని విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నారు. ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువగా విదేశీ విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. అదే విధంగా అమెరికాకి చెందిన విద్యార్థులు ఎక్కువగా యూకే, ఇటలీ, స్పెయిన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ దేశాల్లో చదువుకుంటున్నారు.

Image copyright Getty Images

ఆత్మహత్యలకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులే కారణం

సాక్షి: 'రాష్ట్రంలోని కార్పొరేట్‌ కాలేజీల్లో గత కొన్నేళ్లుగా జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలకు వారు, వారి తల్లిదండ్రులే కారణం. కార్పొరేట్‌ కాలేజీల యాజమాన్యాలకు ఎలాంటి సంబంధమూ లేదు..' అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తేల్చింది. హాస్టళ్లలో ఉండటం ఇష్టం లేని విద్యార్థులను హాస్టళ్లలోనే ఉండాల్సిందిగా తల్లిదండ్రులు ఒత్తిడి చేయడం, ఎక్కువ మార్కులు, టాప్‌ ర్యాంకులు తెచ్చుకోవాలని బలవంత పెట్టడం, మొదటి సంవత్సరంలో ఫెయిల్‌ కావడం, కుటుంబ, వ్యక్తిగత కారణాల వల్లే విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని తన నివేదికలో స్పష్టం చేసింది. కార్పొరేట్‌ కాలేజీలు తమ వ్యాపార ప్రయోజనాల కోసం అనుసరిస్తున్న విధానాల వల్ల విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నా ప్రభుత్వం ఎక్కడా ఆ అంశాలను ప్రస్తావించలేదు.

గతంలో ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీలు.. ఆయా కాలేజీలు నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు లేకుండా నడుస్తున్నాయని, అక్రమంగా హాస్టళ్లను నిర్వహిస్తూ విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నాయని తేల్చినా ప్రభుత్వం ఆ అంశాలను విస్మరించింది. విద్యార్థుల నుంచి కళాశాలలపై టోల్‌ఫ్రీ నంబర్‌కు రోజూ 41 వరకు ఫిర్యాదులు వస్తున్నాయని ప్రభుత్వమే పేర్కొనడం.. కార్పొరేట్‌ కళాశాలల్లో పరిస్థితిని కళ్లకు కడుతుంది.

Image copyright Win McNamee

మోడీ, ఇవాంకల భద్రతపై ఎస్‌పీజీ, ఎఫ్‌బీఐల మధ్య లొల్లి

నవ తెలంగాణ: ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంక ట్రంప్‌ హైదరాబాద్ పర్యటన సందర్భంగా సెక్యూరిటీ విషయమై ఎస్‌పీజీ, యూఎస్‌ సెక్యూరిటీ అధికారుల మధ్య వివాదం నెలకొంది. ఈనెల 28, 29 తేదీలలో హెచ్‌ఐసీసీలో జరగనున్న అంతర్జాతీయ పారివ్రామిక వేత్తల సదస్సుకు ప్రధానితో పాటు ఇవాంక హాజరవుతున్న విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కూతురు కావడంతో ఇవాంక ట్రంప్‌ భద్రతా విధులను స్వయంగా నిర్వహించుకోవడానికి అమెరికా ఎఫ్‌బీఐ నిఘా విభాగం అధికారులు, సెక్యూరిటీ అధికారులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. అలాగే ప్రధాని మోడీ ప్రత్యేక భద్రతా విభాగం ఎస్‌పీజీకి చెందిన ఉన్నతాధికారులు కూడా హైదరాబాద్‌లో మకాం వేశారు. ఎస్‌పీజీ, రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ విభాగంతో పాటు యూఎస్‌ భద్రతా అధికారులు సోమవారం సమావేశమై భద్రతా ఏర్పాట్లలో సమన్వయం గురించి చర్చించారు.

అయితే హెచ్‌ఐసీసీలో సదస్సు వేదికతో పాటు హాల్‌లోపల కేవలం తమ సెక్యూరిటీ అధికారులు మాత్రమే ఉండాలని, ఒక వేళ ఇతర సెక్యూరిటీ అధికారులు లోనికి వస్తే వారి వద్ద ఆయుధాలు ఉండరాదని యూఎస్‌ భద్రతా అధికారులు స్పష్టం చేసినట్లు తెలిసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఎస్‌పీజీ అధికారులు ఈ సదస్సులో ప్రధాని మోడీ కూడా ఉంటారని ఆయన భద్రతను చూసుకోవలసిన బాధ్యత తమదేనని తెగేసి చెప్పినట్టు తెలుస్తోంది. గతంలో విదేశాలలో అంతర్జాతీయ సదస్సు జరుగుతుండగా రష్యాకు చెందిన భద్రతా అధికారి ఒకరు మరో దేశపు అధికారిపై కాల్పులు జరిపిన ఘటనను యూఎస్‌ అధికారులు ఉదహరిస్తూ ఈ కారణం చేతనే తమ వీఐపీ ఉన్న చోట ఇతర భద్రతా అధికారులు ఆయుధాలు ధరించరాదని నిబంధన పెడుతున్నామని వివరించినట్టు తెలిసింది. ఇవాంక తమ దేశానికి వస్తున్న ముఖ్యమైన అతిధి అని, ఆమె భద్రత పట్ల తామూ ప్రత్యేకంగా శ్రద్ద వహిస్తామని, ఈ విషయంలో ఎలాంటి తేడా ఉండదని ఎస్‌పీజీతో పాటు రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ విభాగం ఉన్నతాధికారులు నచ్చచెప్పే ప్రయత్నాలు చేసినట్టు సమాచారం.

Image copyright facebook

మా వెనుక ఎవరూ లేరు: ముద్రగడ పద్మనాభం

ఆంధ్రజ్యోతి: 'మా వెనుక ఎవరూ లేరు. ఉన్నారని నిరూపిస్తే ఉద్యమం ఆపేస్తా' అని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెంలో సోమవారం జరిగిన కాపు వన సమారాధనలో ఆయన మాట్లాడారు. కాపు ఉద్యమం వెనుక ఎవరో ఉన్నారంటూ మానసికంగా ఉద్యమాన్ని కుంగదీస్తున్నారని విమర్శించారు. ఎవరి నిధులతోనో ఉద్యమం చేయాల్సిన ఖర్మ తమకు పట్టలేదని, ఉద్యమంతో ఏ పార్టీకి సంబంధం లేదని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయమని అడిగితే సీఎం చంద్రబాబుకు ఎందుకు కోపం వస్తుందని ప్రశ్నించారు.

Image copyright Getty Images

కొండెక్కిన కోడిగుడ్డు

నమస్తే తెలంగాణ: కోడిగుడ్డు ధర వినగానే ప్రజలు గుడ్లు తేలేస్తున్నారు. రిటైల్‌ధర ఒక్కోగుడ్డుకు ఆరు రూపాయలు కావడమే ఇందుకు కారణం. ఇన్నాళ్లుగా కూరగాయల ధరలే చుక్కలు చూపిస్తుండగా, ఇప్పుడు గుడ్డు ధర కూడా భారంగా మారింది. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు, వినియోగం పెరుగడం దృష్ట్యా మరో రెండు నెలలు ఇదే పరిస్థితి ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రోజురోజుకు ధర పెరుగుతూ సోమవారం ఆల్‌టైం రికార్డును తాకింది. ఇంకా పెరిగే అవకాశముందని తెలుస్తున్నది. రంగారెడ్డి జిల్లా మార్కెట్‌లో ఆదివారం 100 గుడ్లకు రూ.482 ధర పలుకగా సోమవారం రూ.488 ధర పలికింది. అయితే చిల్లరగా ఒక్కగుడ్డు ధర రూ.6 పలుకుతుండటం గమనార్హం. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే నెక్ రంగారెడ్డి రేటు రూ.500 దాటి పరుగులు తీసే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. డిసెంబర్ మాసంలో పెరిగే ధర నవంబర్‌లోనే గరిష్ఠస్థాయికి చేరింది. అటు కూరగాయల ధరలు మండిపోవడం, ఇటు కోడిగుడ్డు ధరలు కొండెక్కడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)