జింబాబ్వే: అధ్యక్షుడు ముగాబేను గృహ నిర్బంధంలో ఉంచిన సైన్యం
Maj Gen Sibusiso Moyo read out a statement on national TV early on Wednesday
జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబేను రాజధాని హరారేలో సైన్యం గృహ నిర్బంధంలో పెట్టినట్లు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా చెప్పారు. తాను క్షేమంగా ఉన్నానని జాకబ్ జుమాతో ఆయన ఫోన్లో చెప్పినట్లు దక్షిణాఫ్రికా అధ్యక్ష కార్యాలయం తెలిపింది.
జాతీయ టీవీ చానల్‌ను స్వాధీనం చేసుకున్న అనంతరం, ఆర్మీ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. దేశాన్ని సామాజికంగా, ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్న రాబర్ట్ ముగాబే అనుయాయులను సైన్యం లక్ష్యంగా చేసుకుందని ప్రకటించారు.
పాలక కూటమి తన ట్విటర్ అకౌంట్లో ప్రభుత్వాన్ని సైన్యం స్వాధీనం చేసుకోడాన్ని 'రక్తపాతరహిత అధికార మార్పిడి'గా అభివర్ణించింది.
సైనిక కుట్ర జరిగిందనే వార్తలను ఆర్మీ జనరల్ ఒక ప్రకటనలో ఖండించారు. అధ్యక్షుడు ముగాబే క్షేమంగానే ఉన్నారని చెప్పారు. అయితే ఆయన ఎక్కడున్నది మాత్రం వెల్లడించలేదు.
ముగాబే 1980ల నుంచి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
ఉపాధ్యక్ష పదవి నుంచి తొలగింపునకు గురైన ఎమర్సన్ నాన్‌గాగ్వాను రాబర్ట్ ముగాబే స్థానంలో అధ్యక్షుడిని చేసేందుకు సైన్యం తాజా చర్య చేపట్టి ఉండొచ్చని బీబీసీ ప్రతినిధులు చెబుతున్నారు.
ఫొటో సోర్స్, Reuters
హరారే వీధుల్లో గస్తీ కాస్తున్న సైనికులు
హరారే ఉత్తర ప్రాంతాలు బుధవారం భారీ తుపాకుల మోతతో దద్దరిల్లాయి.
1980లో బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం లభించినప్పటి నుంచి స్వతంత్ర జింబాబ్వే రాజకీయాలను ఆయనే శాసిస్తున్నారు.
తాజా పరిణామాలపై ముగాబే నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
సైన్యం ఏమంటోందంటే..
జాతీయ వార్తా సంస్థ జెడ్‌బీసీ కేంద్ర కార్యాలయాన్ని సైనికులు ఆధీనంలోకి తీసుకున్నారు. మంగళవారమే హరారేను ఆర్మీ వాహనాలు చుట్టుముట్టాయి.
మేజర్ జనరల్ సిబిసిసొ టీవీలో మాట్లాడుతూ, "అధ్యక్షుడు, ఆయన కుటుంబం క్షేమంగా ఉంది. వారి భద్రతకు ఎలాంటి ఢోకా లేదు" అని చెప్పారు.
"మేం కేవలం దేశంలో సామాజిక, ఆర్థిక ఇబ్బందులకు కారణమవుతున్న వారిని లక్ష్యంగా చేసుకొని చర్యలు తీసుకోవాలనుకుంటున్నాం" అని అన్నారు.
"సాధ్యమైనంత త్వరగా మా లక్ష్యాన్ని పూర్తి చేస్తాం, ఆ తర్వాత పరిస్థితి సాధారణస్థితికి చేరుకుంటుందని ఆశిస్తున్నాం" అని చెప్పారు.
సైనిక చర్యకు ఎవరు నేతృత్వం వహిస్తున్నారన్నది ఇంకా తెలియరాలేదు. అయితే, అధికార పార్టీ జను పీఎఫ్‌లో అంతర్గత ప్రక్షాళన పేరుతో అధ్యక్షుడు ముగాబే తీసుకుంటున్న చర్యలకు ఆర్మీ ముగింపు పలుకుతుందని జనరల్ చివెన్గా చెప్పారు.
ఫొటో సోర్స్, Reuters
సైనిక ట్రక్కులతో దేశ రాజధాని హరారే రహదారులను ఆర్మీ చుట్టుముట్టింది
ఆర్థిక మంత్రి ఇగ్నాటియఎస్ చొంబో ఆర్మీ నిర్బంధంలో ఉన్నట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది.
ఇది సైనిక కుట్రేనా?
జింబాబ్వే ప్రతిపక్ష నాయకుడు మోర్గాన్ మాజీ సలహాదారు అలెక్స్ మగెయిసా ప్రస్తుత పరిణామాలపై బీబీసీతో మాట్లాడుతూ, " సైనిక తిరుగుబాటు కాదన్న ఆర్మీ ప్రకటలు నిజం కాదని నమ్ముతున్నాను" అని చెప్పారు.
"వాళ్లు దీన్ని తిరుగుబాటు అనకూడదని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఇలాంటి వాటిని ఎవరూ ఆమోదించరు. కానీ, దీన్ని ఖండించాల్సిందే" అని చెప్పారు.
కాగా, జాతీయ వార్తా సంస్థను ఆర్మీ స్వాధీనం చేసుకున్న వెంటనే, నగర కేంద్రంలో మూడు సార్లు పెద్ద స్థాయిలో పేలుడు శబ్దాలు వినిపించినట్లు హరారేలోని బీబీసీ ప్రతినిధి షిన్గాయ్ న్యోక చెప్పారు. ఈ ప్రాంతంలోనే దేశాధ్యక్షుడు నివసిస్తుంటారు. పెద్ద సంఖ్యలో ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి.
జింబాబ్వేలో మారుతున్న పరిస్థితులను సునిశితంగా పరిశీలిస్తున్నామని అమెరికా తెలిపింది. దేశంలోని పార్టీలన్నీ కలసి సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కోరుతున్నామని చెప్పింది.
అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా జింబాబ్వేలోని తమ రాయబార కార్యాలయాన్ని బుధవారం మూసివేస్తున్నట్లు అమెరికా ఎంబసీ ట్వీట్ చేసింది.
ఫొటో సోర్స్, AFP
సైనిక జోక్యం తప్పదని జింబాబ్వే ఆర్మీ జనరల్ కాన్స్టాంటినో చివెంగా ఇంతకుముందు హెచ్చరించారు.
'ఆయుధంపై ఆధిపత్యం రాజకీయాలదే'
జనరల్ చివెంగా వ్యాఖ్యలు దేశంలో శాంతికి విఘాతం కలిగించాయని, తిరుగుబాటును ప్రేరేపించాయని అధికార జను పీఎఫ్ పార్టీ పేర్కొంది. సైనిక చర్యలకు తాము తలొగ్గబోమని, ఆయుధంపై ఆధిపత్యం రాజకీయాలదేనని స్పష్టం చేసింది.
చివెంగాకు సైన్యం నుంచి పూర్తిస్థాయి మద్దతు లేదని పార్టీ యువజన విభాగం నేత కుడ్జాయ్ చిపంగా చెప్పారు.
దేశ ప్రథమ మహిళ గ్రేస్ ముగాబేకు పార్టీ యువజన విభాగం బలమైన మద్దతుదారుగా ఉంది.
ఫొటో సోర్స్, AFP
రాబర్ట్ ముగాబే, గ్రేస్ ముగాబే
గత సోమవారం ముఖ్యమైన సైనికాధికారులతో సమావేశమైన చివెంగా మీడియాతో మాట్లాడుతూ సైనిక చర్య తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు.
జను పీఎఫ్ పార్టీలో అంతర్గత ప్రక్షాళన పేరుతో దేశ అధ్యక్షుడు ముగాబే 'విముక్తి పోరాటంలో పాల్గొన్న పార్టీలోని కీలక నేతలను తొలగిస్తున్నారని ఆయన చెప్పారు. వారంతా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడినవారని గుర్తుచేశారు.
స్వాతంత్ర్యం కోసం 1970లో జరిగిన యుద్ధంలో పాల్గొన్న కీలక నేతల్లో నాన్‌గాగ్వా ఒకరు.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)