ప్రెస్ రివ్యూ: 'కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ మంత్రులకు వెన్నెముకే లేదు’

  • 15 నవంబర్ 2017
Image copyright APCRDA Plan

నాలుగేళ్లలో ఏపీ సర్కారు అప్పు 1.20 లక్షల కోట్లు

సాక్షి: ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన 1956 నుంచి 2014 వరకు చేసిన అప్పుల కంటే విభజన తర్వాత ఈ నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ చేసిన అప్పులు దాదాపు రెట్టింపునకు చేరువయ్యాయి. 1956 నుంచి 2014 వరకు 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ అప్పు రూ. 96 వేల కోట్లు. 2014 జూన్‌లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన నాటి నుంచి 2017 సెప్టెంబరు వరకు మూడున్నర ఏళ్లలో అప్పుల భారం మరో రూ. 1,20,611 కోట్లు. ఈ మూడున్నరేళ్లలోనే అప్పులు 125 శాతం పెరిగాయి. వీటిలో 39 శాతం మాత్రమే పెట్టుబడి వ్యయానికి ఖర్చు పెట్టి, మిగిలిన 61 శాతం రెవెన్యూలోటు భర్తీ కోసం వెచ్చించారు.

Image copyright Getty Images

పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చాకే ఎన్నికలకు వెళతాం: చంద్రబాబు

ఈనాడు: పేదల సొంతింటి కల నెరవేర్చిన తరువాతే ఎన్నికలకు వెళతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. 2019 జనవరికల్లా రాష్ట్రంలో 19 లక్షల ఇళ్లు నిర్మించి పేదలకు ఇస్తామని, ఆ తర్వాత ఎన్నికలకు వెళతామని మంగళవారం శాసనసభలో పేర్కొన్నారు. ఈ గృహాల కోసం రూ. 56 వేల కోట్లు వెచ్చిస్తున్నామని చెప్పారు. గృహ నిర్మాణంపై శాసనసభలో మంగళవారం సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. దేశంలోని మరే రాష్ట్రంలోనూ ఈ పథకం ఇంత పెద్దఎత్తున జరగడంలేదని తెలిపారు. నాడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ పేదల కోసం పక్కా ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. ఇప్పుడు తాము ఆ పథకాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. ఏడాదికి మూడు సార్లు పేదలతో సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహిస్తామని చెప్పారు. పేదల సొంతింటి కల నెరవేరుస్తామని స్పష్టం చేశారు. పట్టణాల్లో 5,39,586 ఇళ్లు కడుతున్నామని, గ్రామీణ ప్రాంతాల్లో మరో 13,06,555 ఇళ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల నాటికి 18,45,841 ఇళ్లు పూర్తి చేయాల్సి ఉందని, మొత్తంగా 19 లక్షల ఇళ్లను పూర్తి చేస్తామని చెప్పారు.

తెలంగాణలో కొత్తగా 40 మున్సిపాల్టీలు: కేటీఆర్

నమస్తే తెలంగాణ: ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువచేసేందుకు, పరిపాలన సౌలభ్యంకోసం కొత్త మున్సిపాల్టీలను ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. 15 వేలకు మించి జనాభా ఉన్న మేజర్ గ్రామపంచాయతీలను పట్టణపురపాలికలుగా మార్చాలని చెప్పారు. అదేవిధంగా పురపాలక సంస్థల పరిధిని విస్తరించి, వాటికి మూడు నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాలను విలీనం చేయాలని చెప్పారు. ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం మేరకు.. రాష్ట్రంలో కొత్తగా మరో 40 పురపాలక సంస్థలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. పురపాలక సంస్థల్లో అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్లతో మంత్రి కేటీఆర్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

స్థానిక ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా, పరిపాలన సౌలభ్యం కోసం కొత్త మున్సిపాల్టీలను ఏర్పాటుచేస్తున్నట్టు మంత్రి తెలిపారు. 2011 జనాభా లెక్కలు, సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా 15 వేలు మించి జనాభా ఉన్న గ్రామ పంచాయతీల వివరాలను అందజేయాలని చెప్పారు. ప్రస్తుత పంచాయతీల కాలపరిమితి వచ్చే ఏడాది జూలైలో ముగుస్తున్న నేపథ్యంలో, ఎంపికచేసిన గ్రామ పంచాయతీలను డీనోటిఫై చేసి, చట్టబద్ధంగా వాటిని తిరిగి పురపాలక సంస్థలుగా నోటిఫై చేయాల్సి ఉంటుందన్నారు. ఈ మొత్తం ప్రక్రియలో సాధ్యమైనన్నీ ఎక్కువ గ్రామ పంచాయతీల నుంచి నూతన పురపాలక సంస్థల ఏర్పాటు, ప్రస్తుతం పురపాలికల్లో విలీనం కోసం తీర్మానాలు తీసుకోవాల్సిందిగా కోరారు.

Image copyright Getty Images

భారత్‌లో 2.45 లక్షల మంది కోటీశ్వరులు: క్రెడిట్‌ సుయిస్‌

నవతెలంగాణ: భారత ప్రజల మొత్తం సంపద 5 లక్షల కోట్ల డాలర్లు (రూ. 320 లక్షల కోట్లు)గా స్విట్జర్లాండ్‌కు చెందిన బహుళజాతి ఆర్థిక సంస్థ క్రెడిట్‌ సుయిస్‌ ప్రపంచ సంపద నివేదిక-2017 వెల్లడించింది. భారత్‌లో కోటీశ్వరుల సంఖ్యను 2,45,000గా నివేదిక తెలిపింది. భారత్‌లో సంపద వృద్ధి 45,100 కోట్ల డాలర్లు (రూ.28,86,400 కోట్లు)గా పేర్కొన్నది. తాజా నివేదిక ప్రకారం సంపదను వృద్ధి పరచుకోవడంలో భారత్‌ ప్రపంచంలో 8వ స్థానంలో నిలిచింది. భారత్‌లో ఏటేటా సంపద వృద్ధి చెందుతున్నప్పటికీ, ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల దేశంలోని కొద్దిమందికే ధనరాశులు పోగు పడుతున్నట్టు నివేదికలోని పలు అంశాలు స్పష్టం చేశాయి. జనాభాలోని వయోజనుల్లో(పెద్దవారు) 0.5 శాతం లేదా 42 లక్షల మంది మాత్రమే లక్ష డాలర్లకు (రూ.64,00, 000) పైగా వ్యక్తిగత సంపద కలిగి ఉండగా, 92 శాతం వయోజనులు 10,000 డాలర్ల (రూ.6,40, 000) కన్నా తక్కువ సంపద కలిగి ఉన్నారని నివేదిక తెలిపింది.

దేశంలోని 760 మంది సంపద 10 కోట్ల డాలర్ల (రూ.640 కోట్ల)కు పైగా, 1820 మంది సంపద 5 కోట్ల డాలర్ల (రూ. 320 కోట్ల)కు పైగా ఉన్నదని నివేదిక తెలిపింది. వ్యక్తిగత ఆస్తుల్లో 86 శాతం మేర రియల్‌ ఎస్టేట్‌, గృహాలు, గృహోపకరణాల రూపంలో ఉన్నట్టు నివేదిక పేర్కొన్నది. 2022కల్లా భారత దేశ సంపద 7 లక్షల 10 వేల కోట్ల డాలర్ల (రూ. 454 లక్షల 40 వేల కోట్ల)కు చేరుకోనున్నట్టు నివేదిక తెలిపింది. ప్రపంచంలోని 50.1 శాతం సంపద ఒక్క శాతం మంది కోటీశ్వరుల చేతుల్లోనే పోగైనట్టు నివేదిక తెలిపింది. ఇదే సంస్థ 2008లో వెల్లడించిన నివేదిక ప్రకారం 42.5 శాతం సంపద ఒక్క శాతం కోటీశ్వరుల చేతుల్లో ఉన్నది. ప్రపంచంలోని ఒక్కశాతం కోటీశ్వరుల్లో భారత్‌ నుంచి 3,40,000 మంది ఉన్నట్టు నివేదిక తెలిపింది. ప్రపంచ సంపదలో భారత కోటీశ్వరుల వాటా 0.7 శాతంగా తెలిపింది.

Image copyright facebook

మంత్రులకు వెన్నెముక లేదు: టీడీపీ ఎంపీ జేసీ

ఆంధ్రజ్యోతి: 'కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ మంత్రులకు వెన్నెముకే లేదు. ఇప్పుడంతా పీఎం, సీఎం మాటే చెల్లుబాటవుతోంది. మా జమానాలోనే మంత్రుల మాట చెల్లుబాటయ్యేది. ఇప్పుడు వారి మాటేమీ చెల్లుబాటు కావడం లేదు'అని అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం అసెంబ్లీ లాబీల్లో విలేకరులు ఎదురుపడినప్పుడు 'నారద మహర్షులూ' అని ఆయన వారిని నవ్వుతూ పలుకరించారు. తర్వాత పిచ్చాపాటిగా మాట్లాడారు. జగన్‌ పాదయాత్ర వృథా ప్రయాసేనన్నారు. వైఎస్‌ పాదయాత్ర చేపట్టినప్పుడు రోజులు, ఇప్పటి పరిస్థితులు వేరని పేర్కొన్నారు. ఆనాడు టీవీ చానళ్లు చాలా తక్కువ ఉండేవని.. కానీ ఇవాళ భార్యాభర్తలు ఇంట్లో కాపురం చేసుకుంటున్నా వచ్చి కెమెరాలు పెట్టేస్తున్నారని చమత్కరించారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ కారణంగా రెడ్లకు విలువే లేకుండా పోయిందన్నారు. ఎంత కాదనుకున్నా రెడ్డి కులస్తులంతా జగన్‌ వెంటే వెళ్తున్నారని చెప్పారు. దాంతో.. రెడ్లను ఇతర కులాలకు చెందినవారు గౌరవించడం మానేశారని, రెడ్ల తోకను ఇలాంటివాళ్లు (పక్కనే ఉన్న ఎమ్మెల్సీ కరణం బలరాంను చూపుతూ) కోసేశారని వ్యాఖ్యానించారు. ఇక రాజకీయాలు తనకు అనవసరమని.. 2019లో రిటైరవుతానని స్పష్టం చేశారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)