తెలంగాణ: రైతు సమన్వయ సమితులు - వాద వివాదాలు

 • 18 నవంబర్ 2017
కె.చంద్రశేఖరరావు Image copyright Telangana CMO

‘‘రైతు సమితుల్లో టీఆర్ఎస్ కార్యకర్తలే ఉంటారు. మేం చేసేది తప్పయితే ప్రజా కోర్టులో మాకు శిక్ష తప్పదు. మేం చేసేది ఒప్పయితే ప్రజా కోర్టులో మళ్లా మేమే నెగ్గొస్తాం’’

''అటుకులు బుక్కో.. అన్నం తినో.. ఉపాసం ఉండో.. నీళ్లు తాగో.. ఈ బక్కపేద టీఆర్ఎస్ కార్యకర్తలే తెలంగాణ తెచ్చిన్రు 14 సంవత్సరాలు కొట్లాడి. ఇవాళ తెలంగాణ పునర్నిర్మాణానికి కూడా గా కార్యకర్తలే పనిచేస్తరు. వాళ్లే రైతు సమన్వయ సమితుల్లో ఉంటరు. నేను అధికారికంగా చెప్తున్నా.. ఈ రైతు సమన్వయ సమితుల్లో విశ్వాసం ఉన్నవాళ్లను, నమ్మకం ఉన్నవాళ్లను, ప్రభుత్వ లక్ష్యాలను అర్థం చేసుకుని దానిని కొనసాగించేవారినే పెడతం. ప్రభుత్వ లక్ష్యాలకు గండి కొట్టేవాళ్లను పెట్టం. పెట్టంగాక పెట్టం. మేం చేసేది తప్పయితే ప్రజా కోర్టులో మాకు శిక్ష తప్పదు. మేం చేసేది ఒప్పయితే ప్రజా కోర్టులో మళ్లా మేమే నెగ్గొస్తాం. ఇది మా కమిట్‌మెంట్. నేను వంద శాతం స్పష్టం చేస్తున్నా. టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తల సభ్యత్వం 56 లక్షలు. అంటే టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకోంగనే ఈ 56 లక్షల మంది అనర్హులైపోతరా? ఇక పనికిరారా? ఇదేం అన్యాయం? వాళ్లలో రైతులు లేరా? లోకానికి వచ్చినట్లు వాళ్లకి రావా? అదేమన్నా అన్యాయమా?''

- తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శాసనసభలో చేసిన ప్రకటన ఇది.

Image copyright facebook
చిత్రం శీర్షిక తెలంగాణ ప్రభుత్వం మంత్రులు, ఎమ్మెల్యేల నామినేషన్ పద్ధతిలో రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసింది

ఏమిటీ రైతు సమన్వయ సంఘాలు?

రైతులను సమన్వయ పరిచి వారిని ఉమ్మడి వేదికల మీదకు తీసుకురావడం కోసం ఈ రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

ఇందుకు సంబంధించిన విధివిధానాలతో ఆగస్టు 27న జీఓ 39ని జారీ చేసింది.

ప్రభుత్వ నామినేషన్ ద్వారా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్లు ఆ జీఓలో పేర్కొన్నారు.

Image copyright facebook
చిత్రం శీర్షిక రైతు సమన్వయ సమితుల్లో టీఆర్ఎస్ కార్యకర్తలే ఉంటారని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ప్రకటించారు

ఆ జీవో ప్రకారం...

 • రెవెన్యూ గ్రామ స్థాయిలో 15 మంది, మండల స్థాయిలో 24 మంది, జిల్లా స్థాయిలో 24 మంది, రాష్ట్ర స్థాయిలో 42 మంది సభ్యులతో ఈ రైతు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తారు.
 • ఈ సమితులకు ప్రభుత్వం నామినేషన్ పద్ధతిలో ఒక సమన్వయకర్త (కోఆర్డినేటర్)ను కూడా నియమిస్తుంది.
 • ఈ కమిటీకి నామినేట్ అయ్యే రైతులు గ్రామంలో వ్యవసాయం చేస్తున్న పట్టాదారు రైతులై ఉండాలి. మూడో వంతు మంది సభ్యులు మహిళలు ఉండాలి. గ్రామంలోని అన్ని వర్గాల వారికీ కమిటీలో ప్రాతినిధ్యం ఉండాలి.
 • వ్యవసాయశాఖ నోడల్ శాఖగా ఉంటుంది. వ్యవసాయ శాఖ కమిషనర్ - డైరెక్టర్ రాష్ట్ర నోడల్ అధికారిగా ఉంటారు. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్లు నోడల్ అధికారులుగా ఉండగా.. వారికి జిల్లా వ్యవసాయ అధికారులు సాయంగా ఉంటారు.
 • ఈ రైతు సమన్వయ కమిటీల సభ్యులు, కోఆర్డినేటర్ల పేర్లను ఖరారు చేసేందుకు 13 జిల్లాలకు 13 మంది మంత్రులను ప్రభుత్వం నామినేట్ చేసింది.
 • రైతులకు కనీస మద్దతు ధర లభించేలా చర్యలు చేపట్టడానికి రాష్ట్ర స్థాయి రైతు సమన్వయ సమితికి రూ. 500 కోట్ల రివాల్వింగ్ నిధిని కేటాయించాలని ప్రణాళిక రచించినట్లు ప్రభుత్వం పేర్కొంది.
Image copyright facebook
చిత్రం శీర్షిక విత్తనం నాటే నుంచి దిగుబడి అమ్మేవరకూ రైతు సమన్వయ సమితులు ముందుండి నడిపిస్తారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు

ఈ సమన్వయ కమిటీలు ఏం చేస్తాయి?

''ఈ రైతు సమితుల సభ్యులకు ప్రభుత్వం ఏకాణ ఇయ్యదు. రైతులకు ఇబ్బంది రాకుండా అధికారులు - రైతులకు మధ్య వారధిగా పనిచేయాలంతే. విత్తనం నాటే నుంచి దిగుబడి అమ్మే వరకు రైతు సమన్వయ సమితులు ముందుండి పైలట్ చేస్తరు'' అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.

 • రాష్ట్రంలో రైతుల దుస్థితిని పరిగణనలోకి తీసుకుంటూ.. 2018-19 నుండి రైతులకు పెట్టుబడి మద్దతు పథకం కింద ఒక్కో పంట సీజన్‌కు ఎకరాకు రూ. 4,000 (ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి రూ. 8,000) చొప్పున చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, ఇతర అవసరాల ఖర్చుల కోసం ఈ మొత్తాన్ని అందిస్తారు.
 • ఈ పథకం అమలును రైతు సమన్వయ సమితులకు అప్పగించనున్నారు. ఒక్కో ఎరానికి సీజన్‌కు రూ. 4,000 చొప్పున రెండు సీజన్లకు ఇవ్వనున్న రూ. 8,000 పంపిణీలో ఈ సమన్వయ కమిటీలు కీలకపాత్ర పోషించనున్నాయి.
 • పంటల ధరలు నిర్ణయించడంలో కూడా ఈ రైతు సమన్వయ సమితుల పాత్ర కీలకంగా మారనుంది. రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించేందుకే ఈ సమితులను ఏర్పాటుచేస్తున్నట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. వ్యాపారుల వద్ద గిట్టుబాటు ధర లభించకపోతే పంటను రైతు సమన్వయ సమితులు కొంటాయన్నారు. వారికి ఎటువంటి అధికారాలు, జీతభత్యాలు ఉండవన్నారు.
 • ఈ సమితులకు తన పూచీకత్తుతో రూ. 10,000 కోట్ల రుణాలు కూడా ఇప్పస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
 • సాగుయోగ్యమైన భూముల వివరాలు, భూమిని బట్టి వేయాల్సిన పంటలపై సూచనలు, గ్రామాలవారీగా నిపుణుల సలహాలను రైతులకు అందించడం, మార్కెటింగ్ వెసులుబాట్లు వంటి వివిధ రకాల పాత్రలను రైతు సమితులే పోషిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది.
Image copyright facebook
చిత్రం శీర్షిక నామినేషన్ పద్ధతిలో ఏర్పాటయ్యా రైతు సమన్వయ సమితులకు అధికారాలు కట్టబెట్టడం రాజ్యాంగ ఉల్లంఘనేనని ప్రతిపక్షాలు, ఉద్యమ సంఘాలు ఆరోపిస్తున్నాయి

ఈ సమితుల గురించి రైతు సంఘాలు ఏమంటున్నాయి?

ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ లబ్ధి కోసమే ఈ రైతు సమితులను ఏర్పాటు చేస్తున్నారని కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఐ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ ఆరోపిస్తున్నాయి.

ఈ రైతు సమితుల ఏర్పాటు చట్టవిరుద్ధమని, వాటిని రద్దు చేయాలని కోరుతూ ఆయా పార్టీల నాయకులందరూ తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ (టీజేఏసీ) చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో సెప్టెంబర్ 14వ తేదీన రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

’స్థానిక సంస్థలకు అధికారాలనిచ్చే 73వ రాజ్యాంగ సవరణను.. రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ 39 తీవ్రంగా దెబ్బతీస్తుంది’ అని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. అదీగాక టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ సమితుల్లో అధికార పార్టీ సభ్యులనే నియమిస్తోందని.. ఈ జీఓను ఉపసంహరించేలా ప్రభుత్వాన్ని నిర్దేశించాలని అందులో కోరారు.

అక్టోబర్ మొదటి వారంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు కూడా నిర్వహించారు.

Image copyright facebook
చిత్రం శీర్షిక రైతు సమన్వయ సమితులను వ్యతిరేకిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా సత్యాగ్రహదీక్షలు జరిగాయి

అవినీతి, డబ్బు సంపాదన కోసమే నామినేషన్: రైతు సంఘం

రైతు సమన్వయ సమితులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామనిఅఖిల భారత రైతు సంఘం జాతీయ కార్యదర్శి సారంపల్లి మల్లారెడ్డి అన్నారు.

మల్లారెడ్డి బీబీసీతో మాట్లాడుతూ, "పంట రుణాలు ఇప్పించడం మొదలుకొని, ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు సకాలంలో అందేలా చూడటం, పంటలకు మద్దతు ధరలు లభించేలా చర్యలు చేపట్టడం వరకూ 12 రకాల బాధ్యతలను ఈ సంఘాలకు సమితులకు అప్పగించారు" అని అన్నారు.

"ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కమిటీలను నిరాకరించి.. వాటిని నామినేటెడ్ నియామకాల కమిటీకి అధికారాలను అప్పగించడం రాజ్యంగ ఉల్లంఘన" అని ఆయన ఆరోపించారు.

గ్రామాల్లో తల్లుల కమిటీలు, పాఠశాల కమిటీలు, నీటి సంఘాలు వంటి వాటిని ఆయా ప్రజలే ఎన్నుకున్నారు. ఈ రైతు సమితులను కూడా గ్రామంలోని రైతులందరూ సమావేశమై ఎన్నుకుంటే అది ప్రజాస్వామ్యం.

‘‘కానీ ఈ సమితి సభ్యులను మంత్రులే నామినేట్ చేస్తారని జీఓ 39లో ప్రకటించారు. ఇప్పటికే మార్కెట్ కమిటీల వంటివి నామినేషన్‌తో ఏర్పాటవుతున్నాయి. కానీ పంటకు మద్దతు ధర సమస్యలు వచ్చినపుడు అవి ఏమాత్రం స్పందించవు. దీనినిబట్టి నామినేటెడ్ పదవులు, కమిటీలు అందులోని వారి ఆదాయం కోసం, డబ్బు సంపాదించుకోవడం తప్ప.. న్యాయం చేసే ధైర్యం చేయలేవనేది స్పష్టమవుతోంది. రైతులకు నిజంగా న్యాయం చేయాలనుకుంటే ఈ కమిటీలను కూడా రైతులనే ఎన్నుకోనివ్వండి. లేదా ఇప్పటికే పంచాయతీలో భాగంగా ఉండే వ్యవసాయ కమిటీలకు అప్పగించండి. అది రాజ్యంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది. అసలు వ్యవసాయంలో 45 శాతం కౌలుదారులే ఉన్నారు. నిజమైన సాగుదారులైన కౌలురైతులను గుర్తించబోమని, వారికి పంట పెట్టుబడి పథకం అమలు చేయబోమని రాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రి శాసనసభ వేదికగా ప్రకటించారు. పట్టాదారు పాస్ పుస్తకం చట్టాన్ని సవరించి.. అందులో కౌలుదారు, ఆక్రమణదారుల పేర్లను తొలగించి అన్యాయం చేశారు. పోరాడి సాధించుకున్న 2011 కౌలుదారుల చట్టాన్నీ అమలు చేయబోమని చెప్తున్నారు. డెబ్బై ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఇంతటి అధ్వాన్నమైన ప్రకటన ఏ ముఖ్యమంత్రీ చేయలేదు.’’ అని మల్లరెడ్డి అన్నారు.

Image copyright facebook
చిత్రం శీర్షిక అధికార టీఆర్ఎస్ రాజకీయ గుత్తాధిపత్యం కోసమే ఈ రైతు సమితులను ఏర్పాటు చేశారని రైతు సంఘాలు తప్పుపట్టాయి

గుత్తాధిపత్యం కోసమే ఈ కమిటీల ఏర్పాటు: టీజేఏసీ

‘‘టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సంఘాలను తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ (టీజేఏసీ) వ్యతిరేకిస్తోంది. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు నామినేట్ చేస్తే.. ఆ పార్టీ కార్యకర్తలతో ఏర్పాటైన కమిటీలవి. భూరికార్డుల ప్రక్షాళన నుంచి గిట్టుబాటు ధరల వరకూ రకరకాల వ్యవహారాల పర్యవేక్షణను వీటికి కట్టబెట్టారు. నామినేటెడ్ కమిటీలకు ఇలాంటి విస్తృతాధికారాలు కల్పించడం గుత్తాధిపత్యానికి దారితీస్తుంది కానీ సమస్యల పరిష్కారం ఉండదు. రైతులందరూ కలిసి ఇటువంటి సమన్వయ, సహకార సంఘాలను, కమిటీలను ఎన్నుకోవడం హేతుబద్ధమైన, ప్రజాస్వామికమైన పద్ధతి. ఈ కమిటీలను ఎన్నికల కోసమే ఏర్పాటు చేసినట్లు అనిపిస్తోంది. సారాంశంలో ఇవి టీఆర్ఎస్ బూత్ కమిటీలే కానీ.. రైతు సమన్వయ కమిటీలు కావు. కాబట్టి వీటిని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.‘‘

- ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ జేఏసీ చైర్మన్

Image copyright facebook
చిత్రం శీర్షిక రైతు సమన్వయ సమితులను తక్షణమే రద్దు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి

నిజమైన రైతులకు చోటు లేదు: రైతు స్వరాజ్య వేదిక

''గ్రామ పంచాయతీలు, గ్రామ సభల ద్వారా నిర్వహించి ఉంటే అన్ని వర్గాల వారికీ, పార్టీల వారికీ స్థానం లభించివుండేది. ఇప్పుడు ఒక పార్టీకి సంబంధించిన వారినే వీటిలో చేర్చుకున్నారు. వీటిలో నిజమైన రైతులకు, కౌలు రైతులకు, పోడు చేసుకునే వారికి స్థానం లేదు. ఇప్పుడు పత్తి, మొక్కజొన్న పంటలకు గిట్టుబాటు ధరలు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినా ఈ రైతు సమన్వయ సంఘాలు ఏమీ చేయడం లేదు. పాస్‌బుక్ ఉన్నంత మాత్రాన హైదరాబాద్‌లో వ్యాపారాలు చేసుకునే వారిని, రాజకీయ వారసులను ఈ కమిటీల్లో చేర్చడం వల్ల నిజమైన సాగుదారులకు న్యాయం జరగదు. ఈ కమిటీల్లో నియామకాలు పారదర్శకంగా జరగాలి. అన్ని వర్గాల వారికీ చోటు కల్పించాలి.''

- కొండల్‌రెడ్డి, రైతు స్వరాజ్య వేదిక కార్యకర్త

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం