ఇందిరా గాంధీని ఫిరోజ్ మోసం చేశారా... వారి మధ్య గొడవలకు కారణాలేంటి?

  • బెర్టిల్ ఫాల్క్
  • రచయిత, స్వీడన్
ఫిరోజ్ గాంధీ, ఇందిరా గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

ఇందిరా గాంధీ, ఫిరోజ్‌ల వివాహం 1942 మార్చి 26న జరిగింది. వీరిరువురి సంబంధంలో ఎన్నో సంక్లిష్టతలున్నాయి. అయితే, తనకు ఫిరోజ్ నుంచి సహకారం కావాల్సి వచ్చినప్పుడల్లా ఆయన నా పక్కనే ఉండేవారని ఫిరోజ్ మరణం తర్వాత ఇందిరా గాంధీ రాసిన ఒక లేఖలో పేర్కొన్నారు.

ఇందిర తన పిల్లలతో కలసి అలహాబాద్‌లోని తన నివాసం వదిలేసి తండ్రికి చెందిన ఆనంద్ భవన్‌కు రావడంతోనే వారిద్దరి మధ్య కలహాల పర్వం మొదలైంది.

బహుశా ఇది కాకతాళీయం కాకపోవచ్చు గానీ 1955లోనే ఫిరోజ్ గాంధీ కాంగ్రెస్‌ పార్టీ లోపల అవినీతికి వ్యతిరేకంగా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదే ఏడాది ఇందిరకు పార్టీ వర్కింగ్ కమిటీలోనూ, కేంద్ర ఎన్నికల సంఘంలోనూ చోటు లభించింది.

ఆ రోజుల్లో కాంగ్రెస్‌కు పార్లమెంటులో పూర్తి మెజారిటీ ఉండేది. ఆనాటి ప్రతిపక్ష పార్టీలు చిన్నవిగా, బలహీనంగా ఉండేవి. ఈ కారణం వల్ల నూతనంగా ఆవిర్భవించిన భారత రిపబ్లిక్‌లో ఒక రకమైన శూన్యం ఉండేదని చెప్పొచ్చు.

అధికార కాంగ్రెస్‌ పార్టీ కుటుంబానికి దగ్గరివాడు, పార్లమెంట్ సభ్యుడు అయిన ఫిరోజ్‌కు అనధికారిక ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు ఉండేది. దేశంలో నిరసనగళం వినిపించిన మొట్టమొదటి నాయకుడు కూడా ఆయనే.

ఆయన చాలా జాగ్రత్తగా లేవనెత్తిన అవినీతి ఆరోపణల ఫలితంగా చాలా మంది జైలుకు వెళ్లాల్సి వచ్చింది. బీమా పరిశ్రమను జాతీయం చేయాల్సి వచ్చింది. పరిణామాలు ఆర్థిక మంత్రి రాజీనామాకి కూడా దారితీశాయి.

అయితే, ఫిరోజ్ గాంధీ చేస్తున్న కృషి ఆయన మామ, అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు నచ్చలేదు. ఇందిర కూడా ఫిరోజ్ చర్యలను పార్లమెంటులో ఎప్పుడూ ప్రశంసించలేదు.

తన భార్య ఇందిర నియంతృత్వ ధోరణిని మొట్టమొదట గుర్తించింది ఫిరోజ్ గాంధీనే.

1959లో ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యత చేపట్టారు. అదే సమయంలో కేరళలో మొట్టమొదటసారిగా ఏర్పాటైన కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించారు.

ఆ సందర్భంగా ఓరోజు ఆనంద్ భవన్‌లో ఉదయం అల్పాహారం చేస్తున్న సమయంలో జవహర్ లాల్ నెహ్రూ సమక్షంలోనే ఇందిరా గాంధీని ఫిరోజ్ ఫాసిస్టు అని అన్నారు. ఆ తర్వాత ఆయన చేసిన ఓ ప్రసంగంలో ఎమర్జెన్సీ రావొచ్చని కూడా ముందే అంచనా వేశారు.

ఫొటో సోర్స్, Getty Images

భావ ప్రకటనా స్వేచ్ఛను ఫిరోజ్ గాంధీ బలంగా నమ్మేవారు. ఆ రోజుల్లో పార్లమెంటులో ఎవరైనా ఏదైనా మాట్లాడగలిగేవారు. అయితే పాత్రికేయులెవరైనా దాని గురించి రాసినా, మాట్లాడినా అందుకు వారిని శిక్షించేవారు.

దీనిని పరిష్కరించేందుకు ఫిరోజ్ గాంధీ ఒక ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టారు. చివరికి అది చట్టరూపం దాల్చింది. అదే 'ఫిరోజ్ గాంధీ ప్రెస్ లా' గా పేరుగాంచింది. ఇది చట్ట రూపం దాల్చడం వెనుక కూడా ఒక ఆసక్తికరమైన కథ ఉంది.

ఫిరోజ్ గాంధీ మరణం తర్వాత పదిహేనేళ్లకు దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ఆ సమయంలో ఇందిరా గాంధీ ఆ చట్టాన్ని చెత్తబుట్టలో పడేశారు.

ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ ప్రభుత్వం ఆ చట్టాన్ని మళ్లీ పునరుద్ధరించింది. ఇప్పుడు మనం పార్లమెంటులో జరిగే కార్యకలాపాలన్నింటినీ రెండు టీవీ చానెళ్ల ద్వారా చూడగలుగుతున్నామంటే దానికి పునాది వేసింది ఫిరోజ్ గాంధీనే.

ఫొటో సోర్స్, NEHRU MEMORIAL MUSEUM AND LIBRARY

ఫిరోజ్ గాంధీ, ఇందిరా గాంధీ అనేక విషయాల్లో వాదించుకునేవారు. పిల్లల పెంపకంలో కూడా వారికి భిన్నాభిప్రాయాలున్నాయి. రాజకీయంగా కూడా వారి అభిప్రాయాలు భిన్నంగా ఉండేవి.

"ఎన్నో ఏళ్లపాటు ఇందిరా గాంధీ, నేనూ స్నేహపూర్వక వాతావరణంలో వాదించుకునేవాళ్ళం. ఇతరుల వాదనను గౌరవించాలి. వారెలా ఉండాలని అనుకుంటున్నారో వారిని అలాగే ఉండనివ్వాలని నా అభిప్రాయం. కానీ అధికారాలు మొత్తం తన చేతుల్లోనే ఉండాలని ఇందిర అనుకునేవారు. ఆమె ఫెడరల్ విధానానికి వ్యతిరేకంగా ఉండేవారు. ఆ విధానంతో దేశం అభివృద్ధి చెందదని ఆమె భావించేవారు’ అంటారు మేరీ షెల్వాన్కర్.

ఇందిరా గాంధీకి అత్యంత సన్నిహితుల్లో మేరీ ఒకరు. ‘నేను ఫిరోజ్‌ని రెండు, మూడుసార్లు కలిసినా, ఎప్పుడూ ఆయనతో చనువుగా మాట్లాడలేదు. ఇందిరకు అది ఇష్టం లేదని నా అభిప్రాయం. కానీ పాలన విషయంలో ఇందిర ఆలోచనలకు ఫిరోజ్ వైఖరికీ ఏ మాత్రం పొంతన లేదని అర్థమైంది’ అని మేరీ చెబుతారు.

ఫొటో సోర్స్, Getty Images

అయితే ఫిరోజ్ గాంధీ ప్రజాస్వామ్య వారసత్వాన్ని లేకుండా చేయడంలో ఇందిరా గాంధీ విజయంతమయ్యారన్నది వాస్తవం.

అనేక విషయాల్లో భిన్నాభిప్రాయం కలిగిన వీరిద్దరిలో ఒక విషయంలో మాత్రం ఏకాభిప్రాయం ఉండేది. అదే ప్రకృతి పట్ల ప్రేమ, తోటపనిలో ఆసక్తి. నవంబరు 22, 1943న ఇందిరా గాంధీ ఓ లేఖలో దీని గురించి ప్రస్తావించారు.

అహ్మద్‌నగర్ ఫోర్ట్ జైలులో ఖైదీగా ఉన్న తన తండ్రి జవహర్‌లాల్ నెహ్రూకు ఇందిర రాసిన లేఖలో ఫిరోజ్ తోట పనిని బాగా ప్రశంసించారు.

1943 నవంబర్ 22న రాసిన ఆ లేఖలో "ఇప్పుడే నేను గార్డెన్ నుంచి వచ్చాను. కొన్ని నెలల ముందు అక్కడ కలుపు మొక్కలు ఉండేవి. కానీ ఇప్పుడక్కడ పచ్చిక బయళ్లు ఉన్నాయి. పూల మొగ్గలతో మొక్కలు కూడా చూడముచ్చటగా ఉన్నాయి. ఇదంతా ఫిరోజ్ వల్లే సాధ్యమైంది" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫిరోజ్‌ ఇందిరను మోసం చేశారనే వదంతులున్నాయి. అదే సమయంలో కొందరు మగవాళ్లు తమకు ఇందిరతో సంబంధాలున్నాయని గొప్పలు చెప్పుకున్నారు. కానీ ఫిరోజ్ గాంధీ, ఇందిరా గాంధీలిద్దరూ భారత అభివృద్ధికి ఇచ్చిన ప్రాముఖ్యతను చూస్తే మాత్రం అవన్నీ అసంబద్ధంగానే కనిపిస్తాయి. పలు ఎగుడుదిగుళ్లున్నప్పటికీ వారిద్దరి బంధం గాఢంగా పెనవేసుకున్నదే అని చెప్పాలి.

కేరళ విషయంలో ఫిరోజ్ గాంధీ తీసుకున్న వైఖరి ఇందిరా గాంధీకి ఒక హెచ్చరిక లాంటిది. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఆమె గడువు ముగియడానికి ముందే రాజీనామా చేశారు. ఆ తర్వాత ఫిరోజ్ గాంధీ, ఇందిరా గాంధీ, వాళ్ల పిల్లలు అందరూ కలిసి ఒక నెల సెలవులు గడిపేందుకు కశ్మీర్ వెళ్లారు.

తమ తల్లిదండ్రుల మధ్య ఏ సమస్యలున్నా ఆ సందర్భంగానే మర్చిపోయారని ఆ తర్వాత రాజీవ్ గాంధీ చెప్పారు. ఆ పర్యటన ముగిసిన కొద్ది రోజులకే ఫిరోజ్ గాంధీ గుండెపోటుతో మరణించారు.

(ఈ క థనం రాసిన బెర్టిల్ ఫాక్ స్వీడన్‌లో ఉంటారు. ఫిరోజ్ గాంధీ జీవిత చరిత్రను రాసిన ఏకైక రచయిత ఆయనే.)

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)