చిరుత కూనలను తల్లి ఒడికి ఎలా చేర్చారంటే

  • 16 నవంబర్ 2017
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionగూడు చెదిరిన చిరుత కూనలను తల్లి చెంతకు ఎలా చేర్చారో చూడండి

చెరకు తోటలో రైతులకు దొరికిన చిరుత పులి కూనలను, విజయవంతంగా వాటి తల్లి చెంతకు చేర్చారు ఓ పశు వైద్యుడు.

మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా బ్రాహ్మణ్‌వాడ రైతులు చెరకు తోటలో నవంబర్ 8న కొద్ది రోజుల క్రితమే పుట్టిన మూడు చిరుత పులి కూనలను గుర్తించారు.

ఆ కూనలను అటవీ అధికారులకు అప్పగించారు. వాటిని తల్లి వద్దకు చేర్చేందుకు అధికారులు ప్రయత్నించారు.

నాలుగు రోజులపాటు ప్రయత్నించినా వారికి సాధ్యం కాలేదు. దాంతో వన్యప్రాణి సంరక్షణ సంస్థలో పశు వైద్యుడిగా పనిచేస్తున్న డా. అజయ్ దేశ్‌ముఖ్‌ను సంప్రదించారు.

ఈ చిరుత పిల్లలు దొరికిన చెరకు తోటను అజయ్ పరిశీలించారు. అక్కడ తల్లి చిరుత అడుగులు కనిపించాయి.

Image copyright Wildlifesos.org

ఆ అడుగుల ఆధారంగా అది ప్రసవించిన ప్రదేశాన్ని గుర్తించారు. నవంబర్ 12న సాయంత్రం 5.30 గంటలకు ఈ కూనలను తీసుకెళ్లి అక్కడ వదిలిపెట్టారు.

ఓ గంటసేపటికే తల్లి చిరుత వచ్చి తన పసి బిడ్డలను ప్రేమగా చేరదీసింది.

కెమెరాలు ఏర్పాటు చేసి ఆ దృశ్యాలను రికార్డు చేశారు.

మహారాష్ట్రలోని చెరకు తోటల్లో చిరుత పులులు తరచూ కనిపిస్తూనే ఉంటాయి. ఆ తోటల్లోనే చిరుతలు ఎక్కువగా ప్రసవిస్తుంటాయి.

అక్టోబర్ నుంచి జనవరి వరకు ఇక్కడ చెరకు కోతలు జరుగుతుంటాయి. అయితే, చిరుతల ప్రసవ సమయమూ ఇదే.

దాంతో కూలీల అలికిడికి, గుబురుగా ఉండే తోటలు కోయడం వల్ల చెల్లాచెదురై తల్లీపిల్లలు దూరమవుతున్నాయి.

Image copyright Wildlifesos.org

ఇప్పటి వరకు ఈ వన్యప్రాణి సరక్షణ సంస్థ 40 పిల్లలను వాటి తల్లుల చెంతకు చేర్చింది.

అలా దొరికిన పులి కూనలను అటవీ అధికారులకు రైతులు అప్పగిస్తుంటారు. వాటిని సంరక్షించేందుకు జున్నార్ ప్రాంతంలో ఓ అనాథాశ్రమాన్ని అటవీశాఖ ఏర్పాటు చేసింది.

అయితే, చిరుత కూనలను మనుషులు తాకితే, వాటిని తల్లి దగ్గరకు రానీయదని అంటుంటారు. కానీ అందులో వాస్తవం లేదని స్పష్టం చేస్తున్నారు డా. అజయ్

Image copyright Wildlifesos.org

"ఇలా దొరికిన పసి కూనలను సంరక్షించడం చాలా కష్టమైన పని. వాటికి గాయాలున్నాయా? ఆరోగ్యంగా ఉన్నాయా? అని క్షుణ్ణంగా పరిశీలిస్తాం. గుండె వేగాన్నీ పర్యవేక్షిస్తుంటాం. మేక పాలు మాత్రమే తాగిస్తాం. రెండు నెలల వయసు వచ్చేవరకు అవి మరే ఆహారమూ తినవు. ఇలా ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి" అని డా.అజయ్ అంటున్నారు.

Image copyright Wildlifesos.org

"తన పిల్లలు దూరమైనప్పుడు తల్లి చిరుత విపరీతమైన ఆక్రోశంతో ఉంటుంది. దాంతో మనుషులపైనా దాడి చేస్తుంది. అలాంటి దాడులు జరగకుండా ఉండాలంటే కూనలను తల్లీపిల్లలను కలపాలి" అని వన్యప్రాణి సంరక్షణ కార్యకర్త సంజయ్ భనదారి చెప్పారు.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)