బీమా కోసం డెడ్‌బాడీని చంపేశారు

  • 17 నవంబర్ 2017
బాడీ ఔట్‌లైన్ ఆన్ రోడ్ Image copyright Getty Images

బీమా సొమ్ము కోసం మృతదేహాన్ని రోడ్డుపై వేసి కారుతో తొక్కించి ప్రమాదంలో మృతిచెందినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలి సమీపంలో చోటుచేసుకుంది. అయితే.. ఆ వ్యక్తి తొలుత అనారోగ్యంతో మృతిచెందారా? లేక హత్యకు గురయ్యారా? అనేది పోస్టుమార్టం నివేదిక వచ్చాక కానీ తెలియదని పోలీసులు చెప్తున్నారు.

తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ జయకుమార్ కథనం ప్రకారం.. రమావత్ ఖత్నానాయక్ (56) తెనాలి సమీపంలోని పెదరావూరు సుగాలితండా నివాసి. ఆయన కొంత కాలంగా టీబీ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు అల్లుళ్లు ఉన్నారు.

ఖత్నానాయక్ అనారోగ్యంతో ఉన్నాడని.. చనిపోతే డబ్బులు వస్తాయనే ఆలోచనతో 15 రోజుల కిందట భార్య, అల్లుళ్లు కలిసి ఆయన పేరుతో రూ. 10 లక్షలకు జీవిత బీమా తీసుకున్నారని తమ విచారణలో తెలిసినట్లు ఎస్ఐ జయకుమార్ బీబీసీ ప్రతినిధికి చెప్పారు. మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన రాజునాయక్ అనే బీమా ఏజెంట్ ఈ బీమాను ఇప్పించారు.

ఖత్నానాయక్ బుధవారం (నవంబర్ 15) రోడ్డు ప్రమాదంలో చనిపోయారంటూ ఆస్పత్రికి తీసుకెళ్లారు భార్యా, అల్లుళ్లు. సమాచారం అందుకుని ఆస్పత్రికి చేరుకున్న పోలీసులకు.. ఆయన పెదరావూరు నుంచి చినపరిమి డొంకకు వెళ్లే రోడ్డులో రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు వారు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా మృతుని బంధువులు చెప్తున్న మాటలపై అనుమానం కలిగింది.

ఖత్నానాయక్ ఆ రోజు ఉదయం ఇంటి దగ్గరే చనిపోయినట్లు ఊర్లో చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు తెలిపారు. మృతుని భార్యను, అల్లుళ్లను గట్టిగా విచారించగా.. ఆయన ఇంట్లోనే చనిపోయారని, బీమా సొమ్ము కోసం రోడ్డు ప్రమాదం నాటకం అల్లామని ఒప్పుకున్నట్లు ఎస్ఐ జయకుమార్ బీబీసీ ప్రతినిధికి తెలిపారు.

‘‘ఖత్నానాయక్ మృతదేహాన్ని ఆటోలో డొంక రోడ్డు మీదకు తీసుకెళ్లి పడుకోబెట్టారు. ఎల్ఐసి ఏజెంట్ రాజునాయక్ కారును ఆ మృతదేహం మీది నుంచి పోనిచ్చారు. అలా ప్రమాదంలా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు’’ అని ఎస్ఐ వివరించారు. ప్రస్తుతం కేసును దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

‘‘అయితే ఖత్నానాయక్ వాస్తవానికి సహజంగా మృతిచెందారా? హత్యకు గురయ్యారా? అనేది పోస్టు మార్టం నివేదిక వచ్చాక తెలుస్తుంది. ఆ నివేదికను బట్టి కేసు దర్యాప్తు చేస్తాం’’ అని ఆయన పేర్కొన్నారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)