గుజరాత్ మోడల్ అభివృద్ధి ఇదేనా? వైరల్‌గా మారిన మోదీ అభిమాని ప్రశ్న

  • సాగర్ పటేల్
  • బీబీసీ గుజరాతీ
వైరల్ వికాస్

'గుజరాత్ మోడల్ అభివృద్ధి' అన్నది బీజేపీ ప్రచార ముఖచిత్రంగా ఉంది. భారతీయ ఆర్థిక వేత్తలు, విదేశీ ఆర్థిక వేత్తలు ఇందుకు మద్దతు పలికారు కూడా.

ఈ అంశం నరేంద్ర మోదీని ఒక్కసారిగా ఆకాశానికెత్తేసి అధికారాన్ని కట్టబెట్టింది. చాలా సందర్భాల్లో తన పరిపాలనకు ఉదాహరణగా గుజరాత్‌ను చూపడం ఆయనకు ఆనవాయితీగా మారింది.

బీజేపీ పాలనలోని లోపాలను ఎవరైనా ఎత్తిచూపిన సందర్భాల్లో కూడా ఆ పార్టీ నాయకులు గుజరాత్‌ను ఓ కవచంగా వాడుకుంటున్నారు.

'క్రేజీ వికాస్' వైరల్ అయ్యింది

బీజేపీ ప్రచారాన్ని, గుజరాత్ అభివృద్ధిని ఎదుర్కోవడంలో కాంగ్రెస్‌తో పాటుగా ఇతర రాజకీయ పార్టీలు విఫలమయ్యాయి. కానీ నెటిజన్లు మాత్రం విఫలం కాలేదు.

సోషల్ మీడియాలో రకరకాల పోస్టులతో తీవ్రంగా స్పందిస్తున్నారు. అందులోనూ గుజరాతీ నెటిజన్లే.. గుజరాతీ హ్యాష్‌ట్యాగ్ 'vikas gando thayo chhe'తో క్రేజీ అభివృద్ధి అంటూ పోస్టులు పెడుతున్నారు.

ఈ పోస్టులన్నీ బీజేపీకి చురకలంటించేవిగా, చమత్కారంగా ఉన్నాయి. ఈ హ్యాష్‌ట్యాగ్ కొన్ని నెలలుగా వైరల్ అవుతూ ఉంది.

రాష్ట్రమంతా ఎన్నికల హడావుడి. ఇంకేముంది.. ఎలక్షన్లలో ఇదే నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ వాడుకుంది.

అంతేకాక ఆ నినాదానికి కొనసాగింపుగా దీపావళి సమయంలో మరో నినాదాన్నీ తెరపైకి తెచ్చింది. అదే.. ద లాస్ట్ దివాలీ ఆఫ్ క్రేజీ వికాస్ (the last Diwali of crazy Vikas).

నినాదం వెనుక 'ఆయన' హస్తం..

ఈ నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ వాడుకున్నప్పటికీ మొదలు పెట్టింది మాత్రం కాంగ్రెస్ కాదు. సోషల్ మీడియాలో ఈ హ్యాష్‌ట్యాగ్‌తో మొదట పోస్ట్ చేసింది తానేనని ఓ 20 సంవత్సరాల యువకుడు చెబుతున్నాడు.

అహ్మదాబాద్‌కు చెందిన 'సాగర్ సావలియా' తానే ఈ ట్రెండ్ సృష్టించానని, ఈ ట్యాగ్ లైన్‌తో మొదటి ఫోటోను పోస్ట్ చేసింది తానేనని అంటున్నాడు.

సాగర్ సవలియా అహ్మదాబాద్‌లోని ఓ కాలేజ్‌లో సివిల్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు.

"గుజరాత్ ఆర్టీసీ బస్సు.. నడిరోడ్డుపై ఉన్న ఓ గుంతలో ఇరుక్కుపోయిన ఫోటోను పోస్ట్ చేశాను. ఆ ఫోటోకు ఈ ట్యాగ్‌లైన్ ఉంచాను. వెంటనే ఈ ట్యాగ్ వైరల్ అయ్యింది.

వెంటనే వందలాదిమంది నెటిజన్లు రాష్ట్రంలోనూ, దేశంలోనూ నెలకొన్న అవినీతిపై తమ అభిప్రాయాలను ఈ ట్యాగ్‌లైన్‌తో పోస్ట్ చేశారు.

ఈ ట్యాగ్ ఇంత వైరల్ అవుతుందని నేను అనుకోలేదు" అని సాగర్ బీబీసీతో చెప్పారు.

అయితే.. సాగర్ మోదీకి వీరాభిమాని కావడం కొసమెరుపు.

"నేను మోదీ అభిమానిని. 2014 ఎన్నికల్లో బీజేపీ కోసం స్వచ్ఛందంగానే పనిచేశాను."

నిజాయితీ..

సాగర్ వ్యక్తిగత అనుభవం ఆయన రాజకీయ విశ్వాసాల్లో మార్పు తెచ్చింది.

"పాటీదార్ కులస్థులు చేస్తున్న భారీ ర్యాలీపై పోలీసులు దాడి చేయడం, వారిని చితకబాదడం నేను కళ్లారా చూశాను. ర్యాలీ జరిగిన ప్రాంతానికి సమీపంలోనే మా ఇల్లు. ఆ మరుసటి రోజే పోలీసులు మా ఇంటిలో కూడా విధ్వంసం సృష్టించారు" అని సాగర్ చెప్పారు.

సాగర్ చెబుతున్న సంఘటన ఆగస్ట్ 25న జరిగింది. అహ్మదాబాద్‌లోని జీఎమ్‌డీసీ మైదానంలో దాదాపు 5 లక్షల మంది పాటిదార్లు తమకు రిజర్వేషన్లు కల్పించాలంటూ ఓ బహిరంగసభ ఏర్పాటుచేసుకున్నారు.

ఈ సభ జరగకుండా పోలీసులు అడ్డుకున్నారు. మందిని చెల్లాచెదురు చేయడానికి పోలీసులు దాడులు ప్రారంభించారు. దీంతో గుజరాత్‌లో పలు చోట్ల ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.

ఈ సంఘటనల్లో చాలా మంది గాయపడ్డారు.

అంతవరకూ తాను రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉండేవాడినని, ఈ సంఘటన "పాటీదార్ అనామత్ ఆందోళన్ సమితి"లో చేరేలా తనను ప్రేరేపించిందన్నాడు.

'సేన్ వికాస్' అంటే ఏమిటి?

సాగర్ ఆలోచన ఈ శీతాకాలంలో రాజకీయ వేడిని పెంచింది. కానీ క్రియాశీల రాజకీయాల్లోకి రావడం తనకు ఇష్టం లేదని సాగర్ అన్నాడు.

"నేను ఏ రాజకీయ పార్టీలోనూ చేరను. ప్రస్తుతం నా దృష్టి మొత్తం నా చదువుపైనే" అని స్పష్టతనిచ్చాడు సాగర్.

'సేన్ వికాస్' (అభివృద్ధి) గురించి సాగర్‌ను ప్రశ్నిస్తే..

"అభివృద్ధి అంటే నా దృష్టిలో యువతకు ఉపాధి దొరకడం. ఉద్యోగాల కోసం యువత రోడ్లపై నిరసన చేస్తుంటే పోలీసులు వారిపై దాడులు చేయకూడదు" అని చెబుతున్నాడు.

మరి.. సాగర్ చెబుతున్న 'అభివృద్ధి' పాలకుల్లో, ప్రభుత్వంలో ఎలాంటి మార్పును తెస్తుందో చూడాలి.

కానీ సాగర్ నినాదం ప్రధాని నరేంద్ర మోదీను కూడా వదల్లేదు. ఓ సంధర్భంలో మోదీ కూడా సాగర్ నినాదాన్ని పలికారు కూడా.

"హూం వికాస్ ఛూం, హూం గుజరాత్ ఛూ.." (నేను అభివృద్ధిని.. నేను గుజరాత్‌ని) అంటూ సాగర్ మాటలను కోట్ చేశారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)