ఎన్నికల వేళ గుజరాత్‌లో ఇండ్లపై ఈ గుర్తులు పెడుతున్నదెవరు?

  • 16 నవంబర్ 2017
గుజరాత్

గుజరాత్‌‌లోని ప్రధాన నగరం అహ్మదాబాద్‌లో హిందువులకూ, ముస్లిం కుటుంబాలకు చెందిన కొందరి ఇండ్లపై ఎర్ర రంగుతో కొన్ని గుర్తులు కనిపించాయి. ఈ కారణంగా నగరంలోని ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు తలెత్తినట్టు వార్తలు వెలువడ్డాయి.

అహ్మదాబాద్‌లోని పాల్దీ ప్రాంతంలో ఉన్న అమన్ కాలనీ, ఎలీట్ ఫ్లాట్స్, డిలైట్ ఫ్లాట్స్, క్రిస్టల్ అపార్ట్‌మెంట్స్, సాహిల్ ఫ్లాట్స్ వంటి 12 భవన సముదాయాల్లో ఇంటి తలుపులపై ఈ గుర్తులు కనిపించాయి.

అహ్మదాబాద్‌లోని సంపన్న ప్రాంతాల్లో ఒకటైన పాల్దీలో ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న ముస్లిం కుటుంబాలు ఎక్కువగా నివసిస్తాయి. ఉదయాన్నే ఈ ముస్లిం కుటుంబాలు తమ ఇంటి గుమ్మాలపై ఉన్న ఈ గుర్తుల్ని చూశాయి. ఆ తర్వాత వదంతులు మొదలయ్యాయి.

మా ఇతర కథనాలు:

పోలీసుల కథనం

అహ్మదాబాద్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేయగా మునిసిపల్ కార్పొరేషన్‌కు చెందిన సఫాయి కార్మికులు ఈ గుర్తులు పెట్టారని తెలిసింది.

"మునిసిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు ఈ ఇండ్లపై గుర్తులు పెట్టారు. కేవలం ముస్లింల ఇండ్లకే ఈ గుర్తులు పెట్టలేదు. చాలా ప్రాంతాల్లో హిందూ కుటుంబాలకు చెందిన వారి ఇండ్లపై కూడా ఈ గుర్తులు కనిపించాయి. ఇంటింటి నుంచి చెత్త తీసుకెళ్లే స్కీమ్‌లో భాగంగా మునిసిపల్ ఉద్యోగులు ఈ గుర్తులు పెట్టారు" అని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ ఏకే సింగ్ బీబీసీకి తెలిపారు.

అమన్ కాలనీకి చెందిన ముబీన్ లకాడియా బీబీసీతో మాట్లాడుతూ, "ఈ గుర్తులు ఎవరు పెట్టారో మాకు తెలియదు. కానీ దీనితో మేం భయపడిపోయాం. నా భార్యాపిల్లలు ఇప్పుడు బయటికి వెళ్లడానికి జంకుతున్నారు" అని చెప్పారు.

మా ఇతర కథనాలు:

2002 అల్లర్ల జ్ఞాపకాలు

  • 2002లో జరిగిన అల్లర్లలో పాల్దీ ప్రాంతంలో ఉన్న డిలైట్ అపార్ట్‌మెంట్‌పై దాడులకు పాల్పడ్డారు.
  • అప్పుడు కూడా ఈ భవనాలకు ఇలాంటివే ఎర్ర రంగులో క్రాస్ గుర్తులు పెట్టారు.

మొదట్లో దీనిని చూసినప్పుడు ఇది విచిత్రంగా కనిపించిందనీ, కానీ తర్వాత చాలా ఇండ్లపై ఈ గుర్తు కనిపించడంతో భయమేసిందని ఎలీట్ కాలనీ సెక్యూరిటీ గార్డు ఒకరు అన్నారు.

మా ఇతర కథనాలు:

డిలైట్ ఫ్లాట్స్‌లో ఉండే ఓవేశ్ సరేశవాలా దీనిపై మాట్లాడుతూ, "ఎరుపు క్రాస్ గుర్తుతో ఎవరికైనా భయం కలుగుతుంది. ఎందుకంటే ఎరుపు క్రాస్ గుర్తులు దాడులకూ, ఉగ్రవాదానికీ ప్రతీక. మాపై ఎవరు దాడి చేయాలనుకుంటున్నారో తెలియదు. మేం పోలీసులకు లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేశాం. మాకు సహాయం కావాలని కోరాం. పోలీసులు కూడా దీనిపై స్పందించి ఈ విషయంపై దర్యాప్తు జరిపిస్తామని హామీ ఇచ్చారు" అని చెప్పారు.

ఇంతకన్నా ముందు కొన్ని వివాదాస్పద పోస్టర్లు కనిపించాయి. వాటిలో "పాల్దీ ప్రాంతాన్ని జుహాపురాగా మారకుండా అపండి" అని రాశారు. అతి పెద్ద ముస్లిం బస్తీలలో జుహాపురా ఒకటి.

"పాల్దీ ప్రాంత నివాసులు కొందరు ఆ పోస్టర్లను, ఈ ఎరుపు క్రాస్ గుర్తులతో జోడించి చూస్తున్నారు. మేం ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నాం" అని పోలీస్ కమిషనర్ ఏకే సింగ్ బీబీసీతో చెప్పారు.

గుజరాత్‌లో డిసెంబర్ 9, 14 తేదీలలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. 2012 నుంచి బీజేపీ వరుసగా విజయం సాధిస్తోంది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు