ఫ్రాన్స్‌లో లభించిన వందేళ్ల నాటి భారతీయ సైనికుల అస్థిపంజరాలు

  • 17 నవంబర్ 2017
జాతీయ జెండాను పరిచిన భారతీయ సైనికుల శవపేటికలు

ఫ్రాన్స్‌లో వందేళ్లపాటు అనామకంగా భూమిలో మగ్గిపోయిన ఇద్దరు భారతీయుల అస్థిపంజరాలు ఇటీవలే బయటపడ్డాయి. వాటికి రెండు దేశాల సైనికుల వందనాల నడుమ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి.

2016లో ఫ్రాన్స్‌లోని లావెంటీ అనే చిన్న పల్లెలో చోటు చేసుకున్న ఈ ఘటన భారత్-ఫ్రాన్స్ మైత్రికీ, మొదటి ప్రపంచ యుద్ధంలో భారత సైనికుల పాత్రకూ అద్దం పడుతోంది.

ఇంతకీ విషయమేంటంటే.. గతేడాది లావెంటీలో ఓ కాలువను విస్తరించడానికి మట్టి తవ్వుతున్నప్పుడు రెండు అస్థిపంజరాలు కనిపించాయి. వాటిపైన ఉన్న దుస్తులూ, '39' అనే అంకె ఆధారంగా, ఆ అస్థిపంజరాలు భారత్‌కు చెందిన 39వ రాయల్ గఢ్వాల్ రైఫిల్స్ రెజిమెంట్‌కి చెందిన సైనికులవని గుర్తించారు.

వెంటనే ఆ సమాచారాన్ని భారత సైనికాధికారులకు అందజేశారు. ఇప్పటికీ భారత్‌లో ఆ రెజిమెంట్ పనిచేస్తుండటం విశేషం.

మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో, 1914-15లో 39వ రెజెమెంట్‌కు చెందిన తొలి రెండు బెటాలియన్లూ ఫ్రాన్స్‌లో జరిగిన యుద్ధంలో పాల్గొన్నాయి. ఆ సమయంలోనే ఆ ఇద్దరు సైనికులూ చనిపోయుంటారని అధికారులు అంచనాకు వచ్చారు.

ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం ఆ అస్థిపంజరాలకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని భారత సైనికాధికారులు నిర్ణయించారు. దాంతో 39వ రాయల్ గఢ్వాల్ రైఫిల్స్ రెజిమెంట్‌కి చెందిన కొందరు సైనికులూ, అధికారులూ ఫ్రాన్స్‌కి బయల్దేరారు.

అక్కడి లావెంటీ గ్రామంలోని లా గార్జ్ శ్మశాన వాటికలో ఆ సైనికుల అస్థిపంజరాలకు హిందూ మతాచారాల ప్రకారం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. రెండు శవ పేటికలపై జాతీయ జెండాను పరిచారు. భారత్‌తో పాటు ఫ్రెంచ్ ఆర్మీ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఫ్రాన్స్‌లోని భారత రాయబారి వినయ్ మోహన్ కవాత్రా, స్థానిక మేయర్‌తో పాటు దాదాపు నూట యాభై మంది భారతీయులు ఆ సైనికులకు తుది వీడ్కోలు పలికారు.

మా ఇతర కథనాలు

మొదటి ప్రపంచ యుద్ధంలో పది లక్షలకుపైగా భారత సైనికులు బ్రిటన్ తరఫున పోరాడారు. వాళ్లలో అరవై వేల మందికి పైగా జవాన్లు ఫ్రాన్స్ లాంటి దేశాల్లో యుద్ధం చేస్తూ చనిపోయారు.

భారతీయ సైనికుల త్యాగాలను చరిత్ర పుస్తకాలు మరచిపోయాయన్న విమర్శలున్నా, లావెంటీలో మాత్రం వాళ్ల పాత్రను ఇంకా గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. అందుకే అక్కడి శ్మశాన వాటికలో వారికి ప్రత్యేక స్థానం కల్పించడంతో పాటు సమీపంలోని నీవ్ చాపెల్ ప్రాంతంలో సైనికుల స్మారక చిహ్నాన్నీ ఏర్పాటు చేశారు.

ఆ స్మారక చిహ్నంపైన బ్రిటీష్ సామ్రాజ్యం తరఫున యుద్ధం చేస్తూ చనిపోయిన ఎందరో భారతీయ సైనికుల పేర్లను చెక్కారు. ఏటా ఓ రోజున 'రిమెంబ్రెన్స్ సండే' పేరుతో నిర్వహించే ఓ కార్యక్రమంలో స్థానికులు సైనికులకు నివాళులర్పిస్తారు.

'మొదట్నుంచీ మేం ఇక్కడ లభించిన భారతీయ సైనికులందరి మృతదేహాల్నీ ఒకే చోట ఖననం చేస్తున్నాం. లావెంటీ శ్మశాన వాటికలో అయితే చాలామంది మంది భారతీయుల సమాధులు పక్కపక్కనే ఉన్నాయి' అంటారు కామన్వెల్త్ వార్ గ్రేవ్స్ కమిషన్‌కు చెందిన లిజ్ స్వీట్.

1915 మార్చిలో ఉత్తర ఫ్రాన్స్‌లోని లిల్లే ప్రాంతంలో నీవ్ చాపెల్ యుద్ధం జరిగింది. అందులో పాల్గొన్న సేనల్లో సగం మంది భారతీయులే.

ఆ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన భారత సైనికుడు గబ్బర్ సింగ్ నేగీని బ్రిటన్ ప్రభుత్వం అత్యున్నత విక్టోరియా క్రాస్‌ అవార్డుతో సత్కరించింది. భారత సైన్యంలో అధికారిగా ఉన్న గబ్బర్ సింగ్ మనవడు దాన్ని స్వీకరించారు.

నాటి యుద్ధంలో అమరులైన భారతీయ సైన్యాన్ని స్మరించుకునేందుకు ఏటా ఓ రోజు ఫ్రాన్స్‌లో నివశిస్తున్న వేలాది భారతీయులు నీవ్ చాపెల్‌లో భారత సైనికుల స్మారక చిహ్నం దగ్గరికి చేరుకుంటారు. తమ మూలాల్ని గుర్తు చేసుకోవడానికి ఫ్రాన్స్‌లోని భారతీయులకు ఇదో మంచి అవకాశం.

మా ఇతర కథనాలు

'నీవ్ చాపెల్‌కి రావడం, సైనికులకు అంజలి ఘటించడం మాకో ప్రత్యేకమైన అనుభూతి. దాన్ని చూసినప్పుడల్లా అప్పట్లో ఇక్కడికొచ్చి పోరాడిన భారత సైనికులే గుర్తొస్తారు. ఓ చరిత్ర కళ్లముందు కనిపిస్తున్నట్లుగా తోస్తుంది' అంటారు రంజిత్ సింగ్. ఫ్రాన్స్‌లో స్థిరపడ్డ సిక్కుల్లో ఆయన ఒకరు.

రంజిత్‌లాంటి ఎందరో భారతీయులు ఆ ఇద్దరు సైనికుల అంత్యక్రియల్లో పాల్గొన్నారు. నాటి భారత సైనికుల పోరాటాన్ని మరోసారి గుర్తుచేసుకున్నారు.

ఆ త్యాగాల తాలూకు జ్ఞాపకాల్ని ఎప్పటికీ మరచిపోకుండా ఉండేందుకు, ఆ సమాధుల దగ్గర్నుంచి కొంత మట్టిని సైన్యాధికారులు భారత్‌కు తీసుకురానున్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)