అమరావతి తీర్పు: ఎన్జీటీ కమిటీలు ఏం చేస్తాయి? ఐదు కోట్ల బ్యాంకు గ్యారెంటీ ఎందుకు?
- బీఎస్ఎన్ మల్లేశ్వర రావు
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, AP Govt
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై దాఖలైన కేసులో జాతీయ హరిత ట్రైబ్యునల్ తుది తీర్పు వెల్లడించింది. రాజధాని నిర్మాణాన్ని ఆపాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది.
అమరావతి నిర్మాణానికి రాష్ట్రస్థాయి పర్యావరణ ప్రభావ మదింపు సంస్థ (ఎస్సీఐఏఏ) ఇచ్చిన అనుమతిని రద్దు చేయటానికి నిరాకరిస్తున్నట్లు తెలిపింది.
అయితే, నిబంధనలకు అనుగుణంగా రాజధాని నిర్మాణం అయ్యేలా చూసేందుకు రెండు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఒక కమిటీ విధాన పరమైన అంశాలను పర్యవేక్షిస్తే.. మరో కమిటీ ఆయా నిబంధనలు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చూస్తుంది. ఇందుకోసం పర్యవేక్షణ కమిటీ మూడు నెలలకు ఒకసారి, అమలు కమిటీ నెలకు ఒకసారి సమావేశమవుతాయి. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇవి ట్రైబ్యునల్‌కు నివేదిక సమర్పిస్తాయి.
పర్యవేక్షణ కమిటీలో జాతీయ స్థాయి సభ్యులు.. అమలు కమిటీలో రాష్ర్ట స్థాయి సభ్యులు ఉంటారు.
జాతీయ హరిత ట్రైబ్యునల్ చైర్పర్సన్ జస్టిస్ స్వతంత్రకుమార్, సభ్యులు జస్టిస్ రఘువేంద్ర ఎస్ రాథోడ్, నిపుణుడు బిక్రం సింగ్ సజ్వాన్‌లతో కూడిన ప్రధాన ధర్మాసనం శుక్రవారం ఉదయం తీర్పు ఇచ్చింది.
భోపాల్‌లోని జాతీయ హరిత ట్రైబ్యునల్ సెంట్రల్ జోన్ బెంచ్‌లో ఉన్న రఘువేంద్ర రాథోర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనే 145 పేజీల ఈ తీర్పును రాశారు.
అమరావతి నిర్మాణాన్ని సవాల్ చేస్తూ పండలనేని శ్రీరామన్నారాయణ 2015 జూలైలో ఒరిజినల్ పిటిషన్ దాఖలు చేశారు.
రిటైర్డు ఐఏస్ అధికారి ఈఏఎస్ శర్మ, సత్యనారాయణ బోలిశెట్టిలు కూడా ఇలాంటి పిటిషన్లనే దాఖలు చేయగా.. వాటినీ ఒరిజినల్ పిటిషన్‌తో కలిపి విచారించారు.
అమరావతి నిర్మాణం కేసుల్లో జాతీయ హరిత ట్రైబ్యునల్ తీర్పు నేపథ్యంలో న్యాయ వాదులు, రాజకీయ నాయకులతో బీబీసీ న్యూస్ తెలుగు నిర్వహించిన ఫేస్బుక్ లైవ్‌ను కింది వీడియోలో చూడవచ్చు.
ట్రైబ్యునల్ తీర్పులోని ముఖ్యాంశాలు:
- 2015 అక్టోబర్ 9వ తేదీన అమరావతికి లభించిన పర్యావరణ అనుమతిని రద్దు చేయటానికి మేం నిరాకరిస్తున్నాం. ఈ ప్రాజెక్టు కేటగిరీ బీ పరిధిలోకే వస్తుంది. అయితే, దీనికి అదనపు నిబంధనలు విధించటం తప్పనిసరి. పర్యావరణ అనుమతితో పాటు విధించిన నిబంధనలతో పాటు వీటిని కూడా అమలు చేయాల్సి ఉంటుంది.
- ఈ ప్రాంతంలోని జల వనరుల్ని కాపాడేందుకు సమర్థవంతమైన ప్రణాళిక కోసం సమగ్ర అధ్యయనం (హైడ్రోజియోమోర్ఫాలజీ) నిర్వహించాలి. తద్వారా భూమి లోపల, ఉపరితలంపైన లభించే నీటిని సంరక్షించాలి.
- అధ్యయనం జరిపిన తర్వాతే.. రాజధాని ప్రాంతంలో వరదనీటి కాల్వలు, నీటిని నిల్వ చేసే చెరువులు మొదలైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి.
- నది, సహజ వరద నీటి ప్రవాహాలకు ఎలాంటి సవరణలు చేయకూడదు.
- ప్రస్తుతమున్న కరకట్టలకు ఎలాంటి మార్పులు చేర్పులు చేయకూడదు. అయితే, అమరావతికి వరద ముప్పును తట్టుకునేలా వాటిని బలోపేతం చేయాల్సి ఉంటే చేయొచ్చు. ఇలా చేయాలనుకుంటే సమగ్ర అధ్యయనం జరపాలి.
- రాజధాని ప్రాంతంలో నిర్మాణాల కారణంగా వచ్చే చెత్తను సమర్థవంతంగా నిర్వహించాలి.
- రాష్ట్ర ప్రభుత్వం కానీ, దాని సంస్థలు కానీ.. వాన నీటి సంరక్షణ, సౌర విద్యుత్ వినియోగం, మురుగునీటి నిర్వహణ, హార్టీకల్చర్, వ్యవసాయం మొదలైన అంశాలపై బిల్డింగ్ ఉప చట్టాలను నోటిఫై చేయాలి.
- పర్యావరణ అనుమతిలో పేర్కొన్న విధంగా అమరావతిలో వాతావరణ మార్పుల ప్రభావాన్ని తట్టుకునేలాగా ప్రత్యేక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రాబోయే ఆరు నెలల్లోపు.. ఆయా రంగాల వారీగా రూపొందించాలి.
- కొండవీటి వాగు, దాని పరివాహక ప్రాంతాలను, అందులోని జల వనరులను సంరక్షించాలి.
- అమరావతి ప్రాంతంలో 251 ఎకరాల అటవీ భూములు ఉన్నాయి. వీటిని రాజధాని ప్రాంతానికి ప్రాణవాయువు ఇచ్చే వనరులు (గ్రీన్ లంగ్స్)గా సంరక్షించాలి. వీటిని ఎలాంటి అటవీయేతర అవసరాలకు వినియోగించకూడదు. ఆఖరికి పార్కులు, వినోద కార్యక్రమాలకు కూడా వాడకూడదు.
జాతీయ హరిత ట్రైబ్యునల్ తీర్పు ప్రతిలోని ఒక పేజీ
రెండు కమిటీలు, వాటి విధి విధానాలు
అమరావతి ప్రాజెక్టు పర్యావరణ, జీవావరణ అంశాలను దృష్టిలో పెట్టుకుని రెండు కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని ఎన్జీటీ తెలిపింది.
పర్యవేక్షక కమిటీ: దీనికి కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ అదనపు కార్యదర్శి ఛైర్మన్‌గా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ అదనపు ప్రధాన కార్యదర్శి (పర్యావరణ) నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీకి చెందిన సీనియర్ శాస్త్రవేత్త, బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌కు చెందిన సీనియర్ శాస్త్రవేత్తలు సభ్యులుగా ఉంటారు. ఆ రెండు సంస్థల డైరెక్టర్లు వీరిని నామినేట్ చేస్తారు. అలాగే, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్య కార్యదర్శి, సావిత్రి భాయి ఫూలే పూణే యూనివర్శిటీ జియాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ ఎన్జే పవార్ మిగతా సభ్యులుగా ఉంటారు.
ఈ కమిటీ ప్రతి మూడు నెలలకు కనీసం ఒకసారి భేటీ అవుతుంది. అమరాతికి సంబంధించిన నిబంధనలు అన్నీఅమలయ్యేందుకు అవసరమైన విధాన పరమైన మార్గనిర్దేశనం చేస్తుంది.
అమలు కమిటీ: దీనికి ఆంధ్రప్రదేశ్ అదనపు ప్రధాన కార్యదర్శి (పర్యావరణ) ఛైర్మన్‌గా ఉంటారు. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్య కార్యదర్శి, బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌కు చెందిన సీనియర్ శాస్త్రవేత్త, అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ మైక్రో బయాలజీ విభాగానికి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ వెంకటేశ్వర్లు కడియాల సభ్యులుగా ఉంటారు.
ఈ కమిటీ ప్రతి నెలా ఒకసారి భేటీ అవుతుంది. అన్ని నిబంధనలు, మార్గదర్శకాలు క్షేత్ర స్థాయిలో అమలయ్యేలా చూస్తుంది. నిబంధనల అమలు నివేదికను కూడా తయారు చేస్తుంది.
- నిబంధనలు తప్పక అమలయ్యేలా చూడటం, వాటి అమలు తీరును పర్యవేక్షించటం, తనిఖీలు చేయటం, కాల పరిమితులు విధించటం, పర్యావరణానికి నష్టం జరగకుండా, కాలుష్యం తలెత్తకుండా చూడటం ఈ కమిటీల పని. ఈ క్రమంలో పర్యవేక్షక కమిటీ మరిన్ని అదనపు నిబంధనలు, మార్గదర్శకాలు జారీ చేయొచ్చు.
- ప్రతి ఆరు నెలలకు ఒకసారి కమిటీ నివేదికను ట్రైబ్యునల్‌కు సమర్పించాలి. మొదటి నివేదికను మాత్రం ఈ తీర్పు వెలువడిన మూడు నెలల్లోపు ఇవ్వాలి.
- కమిటీకి అమరావతి ప్రాజెక్టు సంస్థ (సీఆర్డీఏ) రూ.5 కోట్ల బ్యాంకు గ్యారెంటీని సమర్పించాలి. ఏమైనా అంశాలు సరిగ్గా అమలు చేయని పక్షంలో ఈ మొత్తం నుంచి జరిమానాను కమిటీ మినహాయిస్తుంది. ఈ మేరకు కమిటీ షోకాజ్ నోటీసు కూడా జారీ చేయాల్సి ఉంటుంది.
ఫొటో సోర్స్, మల్లేశ్
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)