తెలంగాణ: బహిరంగ మలవిసర్జనపై డ్రోన్ నిఘా!

  • 17 నవంబర్ 2017
డ్రోన్ల కెమెరా

కరీంనగర్ శివారులోని మానేరు డ్యాం వద్ద బహిరంగ బహిర్భూమికి వెళ్లే వారి కథ ఇది. కరీంనగర్ మానేరు డ్యాం పరిసర ప్రాంతాల్లో మలవిసర్జన చేస్తోన్నవారిని డ్రోన్ కెమెరాలతో పోలీసులు వీడియో తీస్తున్నారు. కెమెరాను చూసి పరిగెత్తేవారిని ఆపి మరీ పూలమాల వేసి సన్మానిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులతో పాటు మార్నింగ్ వాక్ అసోసియేషన్ సభ్యులు కూడా పాల్గొంటున్నారు.

మానేరు డ్యాం నుంచి కరీంనగర్‌ జిల్లాతోపాటు వరంగల్, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలకు తాగునీరు సరఫరా అవుతుంది. డ్యాం పరిసరాల్లో ఉన్న రెండు పార్కుల్లో, డ్యాం గట్టు మీదా స్థానికులు వాకింగ్ చేస్తుంటారు. మరోవైపు డ్యాంను చూడటానికి పర్యటకులూ ఇక్కడకు వస్తుంటారు.

కరీంనగర్‌ను స్మార్ట్‌సిటీగా ప్రకటించాక, ఆ స్థాయిని అందుకోడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే బహిరంగ మల విసర్జనను అడ్డుకోవడం లాంటివి జరుగుతున్నాయి. డ్యాం పరిసర ప్రాంతాల్లో అసాంఘిక కార్యక్రమాలను అరికట్టేందుకు కొత్తగా ఏర్పాటైన 'లేక్ పోలీస్' బృందం కూడా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు.

డ్యామ్ పరిసరాల్లో మద్యం తాగేవారు, అమ్మాయిలను వేధించేవారిపై పోలీసులు దృష్టి పెట్టారు. ఈ సంవత్సరం అక్టోబర్ నెల నుంచి డ్రోన్ వాడకం మొదలైంది. డ్రోన్ కెమెరా ఫుటేజ్ ఆధారంగా బహిరంగంగా మద్యం సేవిస్తున్న 260 మందిపై పోలీసులు కేసులు పెట్టారు.

అయితే.. ఈ డ్రోన్ కెమెరాలను బహిర్భూమికి వెళ్లే వారిని గుర్తించడానికి కూడా ప్రస్తుతం ఉపయోగిస్తున్నారు.

స్థానికులు కూడా పోలీసులతో చేతులు కలిపారు. పార్క్ పరిసరాలను కాపాడటానికి, ప్రజలు పార్కును ఉపయోగించుకునేలా ప్రోత్సహించడానికి ఒక అసోసియేషన్‌గా ఏర్పడ్డారు.

బహిరంగ మల విసర్జన చేస్తోన్న వారిలో సామాజిక మార్పు తేవడం కోసమే వారిని సన్మానించే కార్యక్రమం చేస్తున్నామని లేక్ వాకర్స్ అసోసియేషన్ సభ్యుడు నాగరాజు చెబుతున్నారు.

'వారిని అవమానించడానికి మేం సన్మానం చేయడం లేదు. బహిరంగ మలవిసర్జన వల్ల కలిగే నష్టాలను వారికి వివరించే ప్రయత్నం చేస్తున్నాం. వీరందరికీ వారి వారి ఇళ్లల్లో మరుగుదొడ్లు ఉన్నాయి. వాటికి నీటి సరఫరా కూడా ఉంది. కానీ బహిర్భూమికి వెళ్లడం వారికున్న అలవాటు మాత్రమే. ఈ అలవాటు మాన్పించడానికే వారికి పూలమాల వేసి సన్మానిస్తున్నాం. ఈ డ్యామ్ నీళ్లనే మనం తాగడానికి ఉపయోగిస్తున్నాం అని వారికి వివరిస్తున్నాం. కొందరిలో పరివర్తన వచ్చి మాతోపాటు కలిసి పని చేస్తున్నారు కూడా' అని నాగరాజు బీబీసీకి వివరించారు.

ఈ ఏడాదిలోగా కరీంనగర్‌ను బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 2,50,000 జనాభా ఉన్న కరీంనగర్‌లో 40,000 మరుగుదొడ్లు కట్టాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటికే 39,000కు పైగా మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయింది.

బహిర్భూమికి వెళ్లే వారికి జరిమానా విధించాలని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ తీర్మానించింది. కరీంనగర్‌లో దాదాపు అందరికీ మరుగుదొడ్లను నిర్మించాలని ప్రభుత్వం ఆదేశించిందని, వాటిలో చాలావరకూ కార్పొరేషన్ నిర్మించిందని కమిషనర్ శశాంక్ అన్నారు.

బహిరంగ మల విసర్జనకు వెళ్లడానికి మరుగుదొడ్లు లేకపోవడం కారణం కాదు. అది వారికి ఓ అలవాటు మాత్రమే. ప్రస్తుతం వారిలో మార్పు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం. బహిర్భూమి వల్ల జరిగే నష్టాల గురించి వారిని చైతన్య పరుస్తున్నాం. వారిలో మార్పు రాకపోతే ఇక జరిమానా విధించక తప్పదు. డ్రోన్ కెమెరా నిఘాతో పోలీసులు కూడా తమకు సహాయ పడుతున్నారని శశాంక్ చెప్పారు.

బహిరంగ మల విసర్జన చేస్తోన్న వారిని అరెస్ట్ చేయడం లేదని సీనియర్ పోలీస్ అధికారి అన్నారు. అలా పట్టుబడ్డ వారిని లేక్ పోలీసులు, స్థానిక లేక్ వాకర్స్ అసోసియేషన్, మరికొందరు అధికారులు కౌన్సెలింగ్ ఇస్తున్నారని ఆయన అన్నారు.

''బహిర్భూమికి వెళ్లే వారిపై ఎలాంటి కేసులూ, అరెస్టులూ చేయడం లేదు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత. మన ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి అందరం కలిసి పని చేస్తున్నాం.'' అని పోలీస్ అధికారి అన్నారు.

Image copyright బీబీసీ

బహిరంగంగా మల విసర్జన చేస్తోన్న వారిని గుర్తించడానికి డ్రోన్ కెమెరాలను వాడటం వ్యక్తిగత స్వేచ్ఛకు భంగమన్న వాదనలూ వినిపిస్తున్నాయి. అయితే, పోలీసులు బహిర్భూమికి వెళ్లే వారిని గుర్తించడం కోసం మాత్రమే డ్రోన్ కెమెరాలను వాడటం లేదని మానవ హక్కుల ఫోరం సభ్యుడు, న్యాయవాది వి.సుధాకర్ అన్నారు.

''బహిరంగ ప్రదేశాల్లో అనుచిత ప్రవర్తన, భయాందోళనలు కలిగించడం చట్టరీత్యా నేరం. ఇక బహిరంగ మల విసర్జన విషయానికి వస్తే.. ఆ చర్య వెనుక ఉన్న కారణాన్ని అధికారులు అన్వేషించాలి. ఆ తర్వాతే వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలి. డ్యామ్ పరిసర ప్రాంతాల్లో సామూహిక మరుగుదొడ్లను కూడా నిర్మించాలి.'' అని ఆయన అన్నారు.

నిర్మాణంలో ఉన్న సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయ్యాక ప్రజలు బహిరంగ మల విసర్జన మానుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు