ప్రెస్ రివ్యూ: సాంకేతికతతో వ్యవసాయం సుసంపన్నం

  • 18 నవంబర్ 2017
బిల్ గేట్స్ Image copyright facebook

సాంకేతికతతోనే సాగు సుసంపన్నమవుతుందని మైక్రోసాఫ్ట్ అధినేత, బిల్ అండ్ మిలిండా గేట్స్ కో ఛైర్మన్ బిల్‌గేట్స్ అన్నారు.

చిన్న సన్నకారు రైతులకు వెన్నుదన్నుగా నిలవాలని ఆకాంక్షించారు. విశాఖలో జరిగిన అగ్రిటెక్ సదస్సు ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆయన కీలకోపన్యాసం చేశారు.

వ్యవసాయాన్ని ఉత్పత్తిదారులు, వినియోగదారుల అవసరాలు తీర్చే ఉత్తమమైన, లాభసాటి వ్యాపారంగా మార్చాలని పిలుపునిచ్చారు. సాంకేతికతతో చిన్న రైతులు మార్కెటింగ్, ఇతర అవరోధాలను అధిగిమించే వీలు కల్పించాలని సూచించారు.

చిన్న కమాతాలున్న రైతులను ప్రోత్సహిస్తే దేశ ఆర్థికాభివృద్ధికి వారు పెద్ద వనరులవుతారు అని బిల్‌గేట్స్ అన్నారని ఈనాడు పేర్కొంది.

Image copyright facebook

పోలవరం: కేంద్రం ఫుట్‌బాల్ ఆడుకుంటోంది.

"పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యాం పేరుతో కేంద్రప్రభుత్వం ఫుట్‌బాల్ ఆడుకుంటోంది. సకాలంతో ప్రాజెక్టు పూర్తికి సంపూర్ణ సహకారం అందిస్తామంటూనే.. సాంకేతిక కారణాలను చూపుతూ ఎలాగోలా కాలయాపన చేయాలని చూస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంబంధం లేని శాఖలకు పెత్తనం ఇస్తూ విస్మయానికి గురిచేస్తోంది" అంటూ ఆంధ్రజ్యోతిపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.

ఇప్పటికే పోలవరం డ్యాం డిజైన్లను కేంద్ర జల సంఘం, మసూద్ కమిటీ, కేంద్ర జల సంఘం పరిధిలోని పాండ్యా నేతృత్వంలోని డ్యామ్ డిజైన్ సమీక్ష కమిటీ వంటి సాంకేతిక కమిటీలు సమీక్షిస్తున్నాయి.

ఆ కమిటీలను కాదని, తాజాగా కేంద్ర ఇంధన శాఖ పరిధిలోని నేషనల్ పవర్ కార్పొరేషన్‌(ఎన్‌హెచ్‌పీసీ)కి ఎగువ కాఫర్ డ్యాం డిజైన్ పరిశీలన బాధ్యతలను అప్పగించడం విస్మయం కలిగిస్తోంది.

అందుకు ఎన్‌హెచ్‌పీసీ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. జలవనరుల శాఖ సూచనల మేరకు తాము కాఫర్ డ్యాం డిజైన్లపై నివేదిక ఇవ్వలేమని స్పష్టం చేసింది.

Image copyright Getty Images

అనంతపురంపై 'కన్నేసిన'కొరియా

అనంతపురం పేరును దక్షిణ కొరియా కలవరిస్తోంది. కియా మోటార్స్ అక్కడ కాలు మోపడంతో ఆ దేశంలోని పలు సంస్థలు, ఇప్పుడు అనంతపురం వైపు ఆసక్తిగా చూస్తున్నాయి. భారీ పరిశ్రమలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి.

భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి పలు ప్రాంతాలను అన్వేషించి, చివరకు ఆంధ్రాలోనే అడుగు పెట్టేందుకు మొగ్గుచూపుతున్నాయి. దాదాపు 3 వేలకు పైగా పరిశ్రమలు తరలివచ్చే అవకాశం ఉందంటూ ఈనాడు కథనం ప్రచురించింది.

Image copyright Getty Images

"ఒక్కో ఉద్యోగానికి రూ.3 లక్షలు"

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో గ్రేడ్-3 ఆలయ కార్యనిర్వాహక అధికారి(ఈవో) పోస్టులను బ్రోకర్లు రూ.3 లక్షల చొప్పున అమ్మకానికి పెట్టారు. ముందుగా రూ.లక్ష చొప్పున వసూలు చేసిన బ్రోకర్లు, తాత్కాలిక సిబ్బందికి పదోన్నతులు కల్పించడం ద్వారా పోస్టులను భర్తీ చేసేందుకు మెమో కూడా జారీ చేయడం గమనార్హం.

ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాల్సిన 167 పోస్టులకు నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం వద్ద పలుకుబడి కలిగిన బ్రోకర్లు ఈ వ్యవహారం నడిపిస్తున్నారంటూ సాక్షి పత్రిక ఓ కథనం ప్రచురించింది.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 167 మంది నుంచి రూ. లక్ష చొప్పున వసూలు చేశారని పేర్కొంది.

Image copyright Telangana CMO

జిల్లాల విభజనకు కేంద్రం అనుమతి అక్కర్లేదు

2024 నాటికి తెలంగాణ బడ్జెట్ రూ.5 లక్షల కోట్లకు చేరుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు.

పరిపాలనా సౌలభ్యం, ప్రజలే కేంద్ర బిందువులుగా జిల్లాల విభజన చేశామని అన్నారు. విశ్వనగరంగా హైదరాబాద్ ఖ్యాతికి విఘాతం కలగకుండా ఉండేందుకే అలాగే కొనసాగించామని అసెంబ్లీలో స్పష్టం చేశారు.

జిల్లాల విభజన రాష్ట్రాల హక్కు, కేంద్రం జోక్యం అవసరం లేదని సీఎం వ్యాఖ్యానించారు. కొత్త జోన్లపై అందరి సలహాలు తీసుకుంటామని, 5 వేల కొత్త గ్రామ పంచాయతీలు, 20 మున్సిపాలిటీల ఏర్పాటుతో నూతన పంచాయతీ రాజ్ చట్టం తీసుకొస్తామన్నారు.

అవసరమైతే మరిన్ని మండలాలు ఏర్పాటు చేస్తామని కేసీఆర్ పేర్కొన్నట్లు ఆంధ్రప్రభ కథనం ప్రచురించింది.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి)