గుజరాత్ ఎన్నికలపై మూడీస్ రేటింగ్ ప్రభావం ఎంత?

  • 19 నవంబర్ 2017
నరేంద్ర మోదీ Image copyright Getty Images

ఆర్థిక సంస్కరణలకు లభించిన గుర్తింపుగా మూడీస్ తాజా రేటింగ్‌ను చాలా మంది పరిగణిస్తున్నారు. ఇదో పెద్ద సానుకూలాంశమే అయినప్పటికీ, దేశ ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టించేందుకు అడ్డుగా నిలుస్తున్న సవాళ్లు చాలానే ఉన్నాయనే అభిప్రాయమూ ఉంది.

ఈ సానుకూల పరిణామాన్నిసదవకాశంగా మలచుకొని, ఉపాధి కల్పన లాంటి సవాళ్ల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాల్సి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

భారత సావరిన్ రుణ రేటింగ్‌ను అంతర్జాతీయ రేటింగ్ సంస్థ 'మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్' 2004 తర్వాత ఇప్పుడు తొలిసారిగా పెంచింది.

గత ఏడాది కాలంలో ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణలు దీర్ఘకాలంలో భారత ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తాయని మూడీస్ చెప్పింది.

సంస్కరణలను తీసుకొచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఈ రేటింగ్ ప్రోత్సాహాన్నిచ్చేదే.

రేటింగ్‌ను మూడీస్ 'బీఏఏ2' నుంచి 'బీఏఏ3'కి పెంచింది. భారత్ పట్ల భవిష్యత్ అంచనా (ఔట్‌లుక్)ను కూడా మెరుగుపరుస్తూ, 'సానుకూలం (పాజిటివ్)' నుంచి 'స్థిరం (స్టేబుల్)'కు మార్చింది.

మూడీస్ తాజా ప్రకటనతో భారత్.. ఇటలీ, ఫిలిప్పీన్స్ లాంటి దేశాల సరసన చేరింది.

Image copyright EMMANUEL DUNAND/GETTY

తాజా రేటింగ్ వల్ల తక్కువ వడ్డీ రేట్లకే రుణాలు లభిస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది ప్రభుత్వానికి, కంపెనీలకు ఊరట కలిగించే విషయం. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి మరింత ఉత్సాహాన్నిస్తుంది.

శుక్రవారం మూడీస్ ప్రకటన ప్రభావం స్టాక్ మార్కెట్లలో స్పష్టంగా కనిపించింది.

బిజినెస్‌ సులభంగా చేసుకొనేందుకు ఉన్న అవకాశాలకు సంబంధించి ప్రపంచ బ్యాంకు కొన్ని వారాల క్రితం ప్రకటించిన వార్షిక ర్యాంకింగ్‌లలో భారత్ 30 స్థానాలు ఎగబాకింది. ఇంతలో మూడీస్ రేటింగ్ వచ్చింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 5.7 శాతానికి పడిపోయింది. మూడేళ్లలో ఇదే అతి తక్కువ వృద్ధిరేటు. ఆర్థిక వ్యవస్థ మందగమనానికి పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు తీరు ప్రధాన కారణాలు.

పెద్ద నోట్ల రద్దు, వస్తు-సేవాపన్ను(జీఎస్‌టీ) అమలు తీరుపై ప్రభుత్వాన్ని విమర్శించే విపక్షాలను తాజా సానుకూల పరిణామాల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ లక్ష్యంగా చేసుకొని మాట్లాడారు.

ఆర్థిక సంస్కరణల ప్రక్రియపై అనుమానాలున్నవాళ్లు ఆత్మావలోకనం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని దిల్లీలో మీడియా సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలకు మూడీస్ రేటింగ్‌ రూపంలో మద్దతు లభించిందని ముంబయికి చెందిన బ్రోకరేజీ సంస్థ జియోజిట్ బీఎన్‌పీ పరిబస్ ఉపాధ్యక్షుడు గౌరంగ్ షా వ్యాఖ్యానించారు. భారత ఆర్థిక వ్యవస్థ సరైన దిశలో సాగుతోందనేందుకు ఇదో సంకేతమని కూడా అభిప్రాయపడ్డారు.

రానున్న కొన్ని నెలల్లో స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్&పీ), ఫిట్చ్, ఇతర ప్రధాన క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు కూడా మూడీస్ తరహాలోనే భారత్ రేటింగ్‌ను మెరుగుపరిచే అవకాశముందని ఆయన చెప్పారు.

కొన్ని ఏజెన్సీలు మాత్రం మరికొంత కాలం వేచిచూసే వైఖరిని అనుసరిస్తాయని, కొత్త బడ్జెట్ సమర్పణ తర్వాత రేటింగ్‌పై నిర్ణయం తీసుకుంటాయని కేర్ (సీఏఆర్ఈ) రేటింగ్ సంస్థల ముఖ్య ఆర్థికవేత్త మదన్ సబ్నవైస్ అభిప్రాయపడ్డారు.

మూడీస్ రేటింగ్‌తో ఏర్పడే సానుకూలతను ప్రభుత్వం సదవకాశంగా మలచుకోవాలని, ఉపాధి అవకాశాలను పెంచడం, ప్రైవేటు పెట్టుబడులు పెరిగేలా చూడటం లాంటి పెద్ద సవాళ్లను అధిగమించేందుకు ప్రయత్నించాలని మదన్ సబ్నవైస్ సూచించారు.

ఏటా 1.2 కోట్ల ఉద్యోగాలు కావాలి

ప్రతి సంవత్సరం కొత్తగా అందుబాటులోకి వచ్చే యువతకు ఉపాధి కల్పించాలంటే భారత్ ఏటా 1.2 కోట్ల ఉద్యోగాలను సృష్టించాల్సిన అవసరముంది.

ఉపాధి అవకాశాలను కల్పించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఇదే అంశంపై గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు గుప్పిస్తున్నారు.

బ్యాంకులు అవసరమైన స్థాయిలో రుణాలు ఇవ్వగలిగిన స్థితిలో ఉంటే, అది పెట్టుబడులకు ఊతమిస్తుందని, ఫలితంగా ఉద్యోగాల సృష్టి జరుగుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.2.11 లక్షల కోట్లను ప్రభుత్వం అదనపు మూలధనంగా అందించనుంది. భారీ రుణ భారంతో సతమతమవుతున్న బ్యాంకులకు ఇది ఊరట ఇవ్వనుంది.

బ్యాంకులకు అదనపు మూలధనంతో రుణ వితరణ పెరుగుతుందని, ప్రైవేటు పెట్టుబడులు పెరుగుతాయని, ఇలాంటి అనేక సమస్యలు పరిష్కారమవుతాయని యస్ బ్యాంక్ ముఖ్య ఆర్థికవేత్త సుభద్రా రావు చెప్పారు.

Image copyright Getty Images

గుజరాత్ ఎన్నికలపై ప్రభావం?

మూడీస్ తాజా రేటింగ్, ప్రపంచ బ్యాంకు ర్యాంకింగ్ లాంటి పరిణామాలు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై చూపే ప్రభావం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ పరిణామాలు ఫైనాన్షియల్ మార్కెట్లకు ఉత్సాహాన్నిచ్చే విషయాలని, అయితే ప్రధానంగా స్థానిక అంశాల ప్రాతిపదికన జరిగే అసెంబ్లీ ఎన్నికలపై ఇవి ప్రభావం చూపవని మదన్ సబ్నవైస్ వ్యాఖ్యానించారు.

ఈ అంశంపై గౌరంగ్ షా స్పందిస్తూ- ఇవి ఎన్నికలపై నేరుగా ప్రభావం చూపకపోయినా, ప్రచారంలో అధికార పార్టీ (బీజేపీ) పట్ల సానుకూల వాతావరణాన్ని కల్పిస్తాయన్నారు.

ఆర్థిక మందగమనం, జీఎస్‌టీ అమల్లో లోటుపాట్లపై వస్తున్న విమర్శలతో కొన్ని నెలలుగా మోదీ ఆత్మరక్షణలో ఉన్నారు. మూడీస్ రేటింగ్, ప్రపంచ బ్యాంకు ర్యాంకింగ్‌ అంశాలను ప్రస్తావిస్తూ ఆయన ప్రతిష్ఠను పెంచేందుకు బీజేపీ ప్రయత్నించనుంది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు

కరోనావైరస్: మెదడుపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

లద్దాఖ్‌లో ప్రధాని మోదీ.. భారత్-చైనా ఉద్రిక్తతల మధ్య హఠాత్ పర్యటన

తెలుగు రాష్ట్రాలకు 'ఆత్మనిర్భర్ భారత్' కింద వచ్చింది ఎంత? పేదలకు ఇచ్చింది ఎంత?

కరోనావైరస్ - ఉత్తర కొరియా: 'వెలిగిపోయే విజయం మాది' అంటున్న కిమ్ జోంగ్ ఉన్

కరోనా వ్యాక్సీన్ ఎప్పుడు? భారత్ బయోటెక్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లాతో బీబీసీ ఇంటర్వ్యూ

భారత్-చైనా 5జీ స్పెక్ట్రమ్‌పై కన్నేసిన చైనా కంపెనీలను అడ్డుకోవడం ఎలా?

కాన్పూర్‌లో ఎన్‌కౌంటర్, డీఎస్పీ సహా 8 మంది పోలీసుల మృతి

వందల సంఖ్యలో ఏనుగులు అక్కడ ఎలా చనిపోతున్నాయి? ఏమిటీ మిస్టరీ?

బాలీవుడ్ డాన్స్ మాస్టర్ 'ఏక్ దో తీన్..' ఫేమ్ సరోజ్ ఖాన్ మృతి...