ఒంగోలు వాకర్స్ క్లబ్ సభ్యులు ఆ ఫ్లెక్సీ దగ్గరకి వచ్చేసరికి ఆగిపోతున్నారు
- బళ్ళ సతీశ్, సంగీతం ప్రభాకర్
- బీబీసీ తెలుగు

ఎవరి వంకా చూడకుండా చకచకా నడుచుకుంటూ వెళ్లిపోయే వాళ్లంతా అక్కడకు రాగానే కాస్త మెల్లిగా నడుస్తున్నారు. సరిగ్గా ఆ మూలకు వచ్చాక, ఓ క్షణం ఆగుతున్నారు.
కృష్ణా నది బోటు ప్రమాదంలో చనిపోయిన వారి ఫొటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఆ మూలన ఉంది. వారం క్రితం వరకూ ప్రతిరోజూ ఎదురొచ్చి పలకరించే వారు, ఇపుడు ఫ్లెక్సీలో ఫొటోలుగా నిర్జీవంగా కనిపించే సరికి వాకర్స్ మనసు బాధతో బరువెక్కుతోంది. వాకింగ్ మిత్రులను గుర్తు చేసుకుని కుమిలిపోతున్నారు.
కొందరు బాధను పక్కవాళ్లతో పంచుకుంటున్నారు. కొందరు మౌనంగా చూస్తూ ఉండిపోతున్నారు.
నిజానికి బోటు ప్రమాదం జరక్క ముందు కూడా కొన్నాళ్లుగా అక్కడ ఆ విహారయాత్రకు సంబంధించి సమాచారం ఇచ్చే ఓ ఫ్లెక్సీ ఉండేది!
ఒంగోలు పట్టణంలో గాంధీ పార్కు మంచినీటి చెరువును ఆనుకుని ఉంటుంది. ఆ చెరువు గట్టుపై పొద్దున, సాయంత్రం వందల మంది నడుస్తూనే ఉంటారు. కానీ ఆరోజు మాత్రం మిగిలిన రోజులా లేదు. అందరూ పైకి మామూలుగానే నడుస్తున్నా, చర్చ మాత్రం అటే మళ్లుతోంది.
అరుణ
"ఆ ఇద్దరు తల్లీకూతుళ్లు ఎప్పుడూ నవ్వుతూ పలకరించేవారు. శనివారం సాయంత్రం వెళ్లే ముందు కూడా నన్ను ఆ అమ్మాయి పలకరించింది".
"ఏం ఆంటీ? ఇంకా వెళ్లలేదు" అని అడిగింది.
"ఐదు అయ్యే వరకూ ఉంటాలేమ్మా" అన్నాను.
"ఏం అలా అడిగారు" అన్నా..
"ఊరికే" అంటూ నవ్వుతూ వెళ్లిపోయింది.
"మరునాడు సాయంత్రం టీవీ చూశాను. రాత్రంతా చూస్తూనే ఉన్నాను. ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు" పార్కులో బెంచీపై కూర్చుని, కృష్ణా నది బోటు ప్రమాదంలో మరణించిన కుసుమాంబ, బిందుశ్రీలను గుర్తు చేసుకుంటూ దీర్ఘాలోచనలో మునిగిపోయారు అరుణ.
అరుణ చాలా ఏళ్లుగా అదే పార్కులో పనిచేస్తున్నారు.
వాకర్స్ క్లబ్ 1994లో రిజిష్టర్ అయింది. కరణం బలరాం, మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎంపీలుగా ఉన్నప్పుడు పార్కులో కొన్ని అభివృద్ధి పనులు చేశారు.
గతంలో మూడేళ్లకోసారి, ఇప్పుడు రెండేళ్లకోసారి క్లబ్ అధ్యక్ష పదవి కోసం ఎన్నికలు జరుగుతాయి. వాకర్స్ దగ్గర నుంచి 200 రూపాయలు చందా వసూలు చేసి అభివృద్ధి పనులకు వాడతారు.
అక్కడ వాకింగ్‌కి వచ్చే వారి కోసం రోజుకు 25 క్యాన్ల మంచినీరు పెడతారు. ప్రతి వారం ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తారు. ఉచిత మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తుంటారు. ఈ కార్యక్రమాలన్నీ చురుగ్గా నిర్వహించే ముఖ్యులు సీతారామయ్య, శాయని కోటేశ్వర రావు, జెట్టి ప్రభాకర రెడ్డి, గురునాథం విజయవాడ బోటు ప్రమాదంలో మరణించారు.
"ఏటా కార్తీక మాసంలో వన భోజనాలకు వెళ్తాం. దాదాపు ఆరేళ్ల నుంచి వెళ్తున్నాం. ఇందుకు కమిటీ దగ్గర ఉన్న ఫండ్ కాకుండా, వేరుగా చందా వసూలు చేస్తాం. ఇప్పటి వరకూ అన్నిసార్లూ బాగానే జరిగింది. ఈసారి అమరావతి, భవానీ ద్వీపం, జల హారతి చూడాలనుకున్నాం. నాకు ఇంట్లో పని ఉండి ఈసారి వెళ్లలేదు" అన్నారు వాకర్స్ క్లబ్ జాయింట్ సెక్రటరీ ఎస్వీ కృష్ణా రెడ్డి.
"ఎక్కడికెళ్లినా ఎప్పటికప్పుడు మేమంతా మాట్లాడుకుంటూనే ఉంటాం. ప్రమాదం జరిగిన రోజు కూడా ప్రభాకర రెడ్డి 3-4 సార్లు ఫోన్ చేశారు. ఆ రోజు సాయంత్రం 3 గంటలప్పుడు చివరిసారి మాట్లాడాను. ఇప్పుడు బోట్ ఎక్కుతున్నాం. ప్రైవేటు బోటు అన్నారు. తర్వాత ఏమీ తెలియలేదు. 5 గంటలప్పుడు మళ్లీ ఫోన్ చేశాను. ఫోన్ పనిచేయలేదు. కోటిరెడ్డికి చేశాను. ఆయన ఫోనూ కలవలేదు. టీవీ పెడితే ప్రమాదం వార్త వచ్చింది. కాసేపటికి మృతులు ఒంగోలు వాకర్స్ క్లబ్‌కు చెందినవాళ్లు అన్నారు."
పార్కు పక్కనున్న చెరువు నుంచి పట్టణానికి నీళ్లు వెళ్తాయి. అక్కడ ఎలక్ట్రీషియన్‌గా పనిచేసే వెంకటప్పయ్య విజయవాడ యాత్రకు వెళ్లారు కానీ, బోట్ ఎక్కలేదు.
ఎలక్ట్రీషియన్ వెంకటప్పయ్య
"ఇక్కడ 15 ఏళ్ల నుంచి పనిచేస్తున్నా. అందరూ చాలా పరిచయం. మొన్న వాకర్స్ క్లబ్ యాత్రకు అందరితో పాటు నేనూ వెళ్లా. రెండు బస్సుల్లో 62 మంది వెళ్లాం. ఉండవల్లి నుంచి దుర్గ గుడి దగ్గరకు వెళ్తే బస్ ఆపనీయలేదు. దీంతో భవానీపురం వెళ్లాం. అక్కడ కొందరు బోట్ ఎక్కుతాం అన్నారు. గవర్నమెంటు బోట్ టైమ్ అయిపోయింది. మనిషికి 300 ఇస్తే ఒక ట్రిప్ వేస్తామనీ, హారతి చూపిస్తామని చెప్పాడు ప్రైవేటు వ్యక్తి. కొందరు ఓకే అన్నారు. నేను, మరికొంతమంది మాత్రం బేరం ఆడాం. ముందు 200 ఇస్తాం. 60 మంది ఉన్నాం కదా అన్నాం. అతను ఒప్పుకోలే.. 250, 275.. ఇలా సాగింది బేరం. అయినా అతను ఒప్పుకోలేదు. బెట్టు చేశాడు. మేమూ తగ్గలేదు. ఇతని బోట్లో మేం వెళ్లేదేంటని మానుకున్నాం. అవసరమైతే ఆటోలో వెళ్లి హారతి చూద్దాం అనుకున్నాం."
మా ఇతర కథనాలు
"వాళ్ళు బయల్దేరాక, గట్టు మీదే కూర్చుని మేం కబుర్లు చెప్పుకుంటున్నాం. ముక్కాల గంట తరువాత (45నిమిషాల తరువాత) ఒంగోలు నుంచి ఫోన్లు వచ్చాయి.. బోట్ మునిగిందని. అప్పటి వరకూ మాకు తెలియదు. వాళ్లింకా వస్తారని మేం ఎదురు చూస్తున్నాం. ఆ ఫోన్ల గురించి కంగారు పడుతుంటే, అటు నుంచి వచ్చే కొందరు తమ ఫోన్లలో శవాల ఫోటోలు తీసుకు వచ్చారు. ఇక్కడ ఒంగోలు వాళ్ళు ఎవరని అడిగారు. ముందు మేం కాదులే అన్నాం. పక్కనే ఉన్న అద్దంకి బస్ వాళ్ళు కంగారు పడ్డారు. ఈలోపు మేం ఫోన్లో ఉన్న ఫోటోలు చూస్తే ఆ శవాలు మా వాళ్ళవే. నేను చూసిన మొదటి ఫోటో సీతారామయ్య, ప్రభాకర రెడ్డిలది"
"మాలో కొందరు విజయవాడలో తెలిసిన వాళ్ల దగ్గరకు వెళ్లారు. మరికొందరు మినీ బస్ తీసుకుని ఆసుపత్రులకు వెళ్లారు. మేం ఆటోలో ఆంధ్రా ఆసుపత్రికి వెళ్లాం. ప్రతిచోటా కొంతమంది ఉన్నారు. చనిపోయిన వారిని రాత్రి 11-12 గంటలకు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. నేను అయ్యప్ప మాలలో ఉన్నా. శవాలను చూడకూడదు అన్నారు. నాతో వచ్చిన వాళ్లు నన్ను రావద్దు అన్నారు. ఇంట్లో వాళ్ళు మీరు వెళ్లొద్దు అన్నారు. కానీ ఆగలేకపోయాను. కలిసి వచ్చిన వాళ్లం. అందుకే ఆసుపత్రిలోకి వెళ్లి అందరి శవాలు చూశాను. చాలా టెన్షన్ అయింది. కాళ్లాడలేదు. అప్పటిదాకా సరదాగా మాట్లాడుకున్నాం. రోజూ కనపడే వాళ్లు."
వెంకటప్పయ్య ఇప్పటికీ వాళ్లను మర్చిపోలేకపోతున్నారు. ఎప్పుడూ ఇక్కడే ఉండి, పార్కులో వాకర్స్ అడిగిన పాటలను ప్లే చేసే సీతారామయ్య, అందరికీ సాయం చేసే ప్రభాకర్‌రెడ్డి, గురునాథం, కోటేశ్వరరావు.. అంతా ఆయన కళ్ల ముందే కదులుతున్నారు. కాసేపు మౌనంగా ఉన్న వెంకటప్పయ్య, మౌనంగానే తనపనిలో మునిగిపోయారు.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)