కృష్ణానది పడవ ప్రమాదం - ఆ 30 నిమిషాలు!

  • బళ్ళ సతీష్
  • బీబీసీ ప్రతినిధి
చావును చూసొచ్చారు!
ఫొటో క్యాప్షన్,

నా ముక్కు వరకు నీళ్లు వచ్చాయి. ఒకరు నా జడ, మరొకరు నా కొంగు పట్టుకుని అరగంట సేపు నీటిలో వేలాడారు - తులసి

కృష్ణానది పడవ ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. ఆత్మీయులకు అంతులేని ఆవేదన, కన్నవారికి కడుపుకోత మిగిల్చింది. మరెందరో జీవితాల్లో చీకట్లు నింపింది.

ఈ ప్రమాదంలో కొందరు క్షేమంగా బయటపడ్డారు. మరికొందరు చావు అంచుల దాకా వెళ్లొచ్చారు. ఆ క్షణంలో మరణం వారి కళ్లముందు కదలాడింది. నోటి వరకు నీటిలో మునిగి, మునివేళ్లపై నిలబడి ప్రాణాల కోసం అరగంట సేపు పోరాటం చేశారు. హాహాకారాల మధ్య మృత్యు ముఖం నుంచి బయటపడ్డారు.

పడవ ప్రమాదంలో క్షేమంగా బయటపడి తిరిగొచ్చిన వారితో బీబీసీ సంభాషించింది. ఆనాటి అనుభవాలను, ప్రమాద సమయంలో తాము అనుభవించిన నరకాన్ని వారు గుర్తుచేసుకున్నారు. తాము ఇంకా బతికే ఉన్నామన్న విషయాన్ని వాళ్లు ఇంకా నమ్మలేకపోతున్నారు.

ఫొటో క్యాప్షన్,

మేం బతుకుతామని అస్సలు అనుకోలేదు-వెంకటేశ్వర్లు

ఒంగోలు ఎన్జీవో కాలనీకి చెందిన వ్యాపారి వెంకటేశ్వర్లు తన భార్యతో కలిసి యాత్రకు వెళ్లారు. యాత్రను ఆర్గనైజ్ చేసిన ఒంగోలు వాకర్స్‌ క్లబ్‌కు చెందిన కోటేశ్వరరావుకు ఈయన దూరపు బంధువు. ఆయన ఆహ్వానం మేరకే యాత్రకు వెళ్లారు. ఆ రోజు ఏం జరిగిందో వెంకటేశ్వర్లు, తులసీ మాటల్లోనే విందాం.

వెంకటేశ్వర్లుః సాయంత్రం నాలుగు గంటలకు భవానీ ఘాట్ దగ్గరకు వెళ్లాం. 4.30కి బోట్ దగ్గరకు వెళ్లాం.

తులసిః గవర్నమెంటు బోట్ సాయంత్రం 4 తరువాత ఉండదని చెప్పారు. 50 రూపాయలు టికెట్ అన్నారు. సరే.. ఇక వెళ్ళకుండా వెనక్కి వచ్చేద్దాం అనుకున్నాం. నలుగురైదుగురు మాత్రం ఇంతదూరం వచ్చి బోట్ చూడకపోతే ఎలా అన్నారు. మాకంటే ముందే కొందరు వెళ్లి రేట్ మాట్లాడారు. మమ్మల్నీ రమ్మన్నారు. డబ్బుల కోసం ఆగిపోయారని అనుకుంటారని, మొహమాటంతో వెళ్లాం. మేం చివర్లో వెళ్లడంతో కూర్చోడానికి చోటు లేదు. మేం వెళ్లాక గేటు వేసారు. అక్కడే కుర్చీ వేస్తే కుర్చున్నాం. చీకటి పడుతోంది కదా అని లైటింగ్ గురించి భయపడితే మా ఆయన ధైర్యం చెప్పారు.

మా ఇతర కథనాలు:

వెంకటేశ్వర్లుః మా టీమ్ నుంచి 32 మందిమి బోట్ ఎక్కాం. బోట్ ఎక్కగానే మా పార్టనర్ అడగమంటే నేనే అడిగాను, లైఫ్ జాకెట్లు కావాలని. కానీ వాళ్లు అవసరం లేదని చెప్పారు.

తులసిః నదిలో డబ్బులు, పువ్వులు, ఇంటి నుంచి పట్టుకెళ్లిన గోధుమ పిండి ముద్ద (చేపలకు మేతగా) వేస్తూ కూర్చున్నాను. బోటింగ్ ఉంటుందని ముందుగా తెలుసు కాబట్టే ఇంటి నుంచి గోధుమ పిండి పట్టుకెళ్లా. చేతిలో పిండి అయిపోయాక పక్కనున్న వాళ్లతో మాట్లాడుతున్నా, పది నిమిషాల తరువాత ఇది జరిగింది.

వెంకటేశ్వర్లుః బోట్ దాదాపు 15 కిలోమీటర్లు వెళ్లింది. డ్రైవర్‌కి అనుభవం లేకపోవడం వల్ల రోడ్డు వైపు తిప్పాడు. అక్కడ ఇసుక తిన్నెలు ఉన్నాయి. వాటిని గుద్దుకుంది. ఒకవేళ అలాగే వదిలేస్తే చెల్లా చెదురుగా పడి బతికి ఉండే వాళ్లమేమో, కానీ బోట్‌ను స్పీడ్‌గా తిప్పాడు. దీంతో బోట్ ఒరిగింది. బరువు ఒకవైపు పడి తిరగబడింది. చివర కూర్చుని, కడ్డీలను పట్టుకున్న వాళ్లు బతికారు. దాదాపు 25 మంది వరకూ ఒకరి మీద ఒకరు పడ్డారు. మాకు ఒక కడ్డీ దొరికితే దాన్ని పట్టుకున్నాం.

తులసిః బోటు అట్లా, ఇట్లా ఊగింది. అటోళ్లం ఇటొచ్చాం. మళ్లీ ఇటు ఊగింది. తరువాత బోర్లా పడింది. ఒక మునక వేశాం. ఒక మునక వేశాక, అంతకుముందు మేం పట్టుకున్న కడ్డీలు కాళ్లకు తగిలాయి. వాటి మీద నుంచుని, పైన చెక్క వస్తే దాన్ని పట్టుకున్నా. ఈలోపు ఒకామె వచ్చి నా జడ పట్టుకుంది. ఆమెకు ఏ ఆధారమూ దొరకలేదు. నీటిలో తేలుతూ నా జడ పట్టుకుంది. మరో ఆమె నా పైట చెంగు పట్టుకుంది. ఆమె కాలికి ఆధారం దొరికిందనుకుంటా, చేతి పట్టుకోసం నా పైట పట్టుకుంది. జడ పట్టుకున్న ఆమెతో ప్లీజ్ నా జడ వదలండి అన్నాను. కానీ ఆవిడ వదల్లేదు. సరే ఎట్లైతే అట్లా అనుకున్నా. మా ఆయన నా పక్కనే ఉన్నారు. అలా దాదాపు అరగంట గడిచింది.

తులసిః నాకు ఇక భరించే శక్తి లేక నేను వదిలేస్తానండీ అని పక్కనే ఉన్న మా ఆయనకు చెబుతున్నా. ఆయన.. ఒక్క నిమిషం ఓర్చుకో అని నాకు చెబుతున్నాడు. ఇక నేను పట్టుకోలేను వదిలేస్తాను అంటుండగా చేపలు పట్టే వారు వచ్చారు. తాడు విసిరారు. ఆ తాడు ముందు నా జడ పట్టుకున్న ఆమెకు ఇచ్చా, ఆ తరువాత నా పైట పట్టుకున్న ఆమెకు ఇచ్చా. చివరగా నేను వచ్చాను. కడ్డీలు మా కిందకు రావడం మేలైంది. నేను మాత్రం అక్కడే నుంచున్నాను. నేను ఎత్తు తక్కువ అవడం వల్ల నా ముక్కుపైకి నీళ్లు వచ్చేసాయి. దీంతో మూతి బిగించి మెడ సాగదీసి తల పైకెత్తి ఉన్నాను. అయినా ముక్కులోని నీళ్లు వెళ్లాయి. దాదాపు అరగంట అలానే ఉన్నాం. రక్షించండి అని కేకలు వేశాం. నమః శివాయ అంటూ దేవుడిని తలచుకున్నాను. మేం బతికాం అంటే పిల్లల అదృష్టం.

వెంకటేశ్వర్లుః తలచుకుంటేనే భయం భయంగా ఉంది. చేపల పట్టే వాళ్లు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా నేను బతికేవాణ్ని కాదు. మాతోపాటూ మొత్తం 11 మందిని రక్షించారు. పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవడానికి దాదాపు గంట పట్టింది. లేకపోతే 90 శాతం మంది బతికేవారు.

మా ఇతర కథనాలు:

ఫొటో క్యాప్షన్,

నా తల ఒక్కటే బయట ఉంది. చేపలు పట్టే వాళ్లు రావడం ఒక్క నిమిషం ఆలస్యమైనా బతికేవాడిని కాదు-హరిబాబు

హరిబాబు, సునీత దంపతులు కూడా ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. వీరిది వెంకటేశ్వర్లు పక్క ఇళ్లే. ప్రమాదం గురించి వాళ్లేం చెప్పారో చూడండి.

హరిబాబుః మేం ముందు ఎక్కలేదు. కానీ మూడు గంటలు ఏం చేస్తారు. రండి అని వాళ్లు గొడవ చేస్తే ఎక్కాం. అదిగో పట్టిసీమ వాటర్ కలిసే ప్లేస్ అన్నారు. ఈలోపు బోట్ కుడి వైపుకు ఒరిగింది. బోట్‌లో ప్లాస్టిక్ కుర్చీలు రౌండ్‌గా వేశారు. మేం ఎడమవైపు కూర్చున్నాం. మేం లేచేలోపు మరోవైపు తిరిగింది. అందరూ మరోవైపుకు ఒరిగారు. బోట్ తిరగబడిపోయింది. నేను నీళ్లల్లో పడిపోయాను. నేను కేకలేస్తే చేపలు పట్టే వ్యక్తి వచ్చి నన్ను రక్షించాడు. మా మైండ్ బ్లాంక్ అయిపోయింది. మనుషులం ఇక్కడున్నా మనసిక్కడ లేదు. చేపలు పట్టే వారి వల్లే బతికాం.

సునీతః నీళ్లల్లో ఒక చిన్న ఊచ అంచు దొరికింది. మునివేళ్లతో ఇలా పట్టుకున్నా. ఏమాత్రం వదిలినా పడిపోతా. అలానే అరగంట సేపు వేలాడాను. దూరం నుంచి మా ఆయన కనిపించారు. ఆయన తల కనిపించింది. ఆయన్ను కాపాడండి అని కేకలు వేశాం. మమ్మల్ని కొందరు వచ్చి తాడుతో లాగారు.

మా ఇతర కథనాలు:

ఫొటో క్యాప్షన్,

నీళ్లలో దొరికిన ఊచ నా ప్రాణాలు కాపాడింది - సునీత

ఈ ఘటనలో సుబ్బాయమ్మ అనే మహిళ బతికింది. ఆమె బోటు తిరగబడినప్పుడు ఇంజిన్ ఉండే కింది భాగంలో పడిపోయింది. అక్కడ ఆమెతో పాటూ మరో మహిళ చాలాసేపు ఉండిపోయారు. అయితే రక్షణ సిబ్బంది బోటును తిరగవేసేప్పుడు లోపల ఎవరైనా ఉన్నారా అనేది చూడకుండా ఒకేసారి బోటును తలకిందులు చేసేసారు. దీంతో ఆమె ఇంజిన్‌పై పడ్డారు. ఇంజిన్ వేడిగా ఉండడంతో ఆమె శరీరం చాలా చోట్ల కాలింది. తాను లోపలి నుంచి కేకలు వేస్తున్నా వినిపించుకోలేదని ఆక్రోశం వ్యక్తం చేశారామె. బోటు తిరగబెట్టాక అక్కడ ఉన్న ఖాళీ నుంచి చేతులు పైకి చాపితే అప్పుడు సుబ్బాయమ్మతో పాటూ మరో మహిళను రక్షించారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)