సుప్రీంకోర్టు సంక్షోభం: న్యాయమూర్తుల మధ్య అనైక్యతతో న్యాయవ్యవస్థకు చేటు

  • 21 నవంబర్ 2017
సుప్రీంకోర్టు Image copyright Reuters

ఓ విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తిపై వచ్చిన అవినీతి ఆరోపణలతో భారత సుప్రీంకోర్టులో కొద్దిరోజులుగా కొన్ని వింతైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

బ్లాక్ లిస్టులోని మెడికల్ కళాశాలల మీద అవినీతి ఆరోపణల కేసుపై విచారణ జరిపే విషయంలో సీనియర్ న్యాయమూర్తుల మధ్య తలెత్తిన విభేదాలు బహిరంగ రహస్యమే.

2017 సెప్టెంబర్‌లో అరెస్టైన మాజీ జడ్జి ఇష్రాత్ మష్రూర్ ఖుద్దుసీ బెయిల్‌ మీద విడుదలయ్యారు. ఆయన ఇప్పుడు బ్లాక్ లిస్టులో ఉన్న ఓ మెడికల్ కళాశాలను తిరిగి తెరిపించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పలువురు సుప్రీంకోర్టు జడ్జీలు ఆరోపణలు చేశారు.

గత వారం మెడికల్ కళాశాలల కేసుపై విచారణ చేసేది తానేనంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్. దీపక్ మిష్రా చెప్పడంపై సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తీవ్ర నిసరన తెలిపారు.

భారత ఉన్నత స్థాయి జడ్జీల మధ్య సఖ్యత లోపించిందనడానికి ఈ వివాదం అద్దం పడుతుంది.

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన కోర్టుల్లో ఒకటైన భారత అత్యున్నత న్యాయస్థానానికి ఈ పరిణామం ఏమాత్రం మంచిది కాదు.

"ఉన్నతస్థాయి జడ్జీల మధ్య నెలకొన్న ఈ అనైక్యత, కోర్టు భవిష్యత్తునే ప్రశ్నించే విషయమని" విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. "న్యాయవ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని నిలబెట్టలేకపోవడంలో జడ్జీలు, న్యాయవాదుల సమష్టి వైఫల్యమిది’’ అని వ్యాఖ్యానిస్తున్నారు.

"ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ తర్వాత ఇలాంటి సంక్షోభాన్ని" అత్యున్నత న్యాయస్థానం ఎన్నడూ ఎదుర్కోలేదని ప్రముఖ విశ్లేషకుడు ప్రతాప్ భాను మెహతా అభిప్రాయపడ్డారు.

ఆయన చెబుతున్నది వాస్తవమే కావచ్చు.

"ఎమర్జెన్సీ సమయంలో జడ్జీలను బలహీనులను చేసి ప్రభుత్వం నియంత్రించింది. ప్రస్తుతం మనం చూస్తున్నది అంతర్గత సంక్షోభం" అని బెంగళూరులోని ఓ న్యాయ సలహా సంస్థకు చెందిన అలోక్ ప్రసన్న కుమార్ పేర్కొన్నారు.

"వ్యవస్థను కాపాడాల్సిన జడ్జీలలోనే, ఒకరిపై ఒకరికి నమ్మకం ఉన్నట్లు కనిపించడంలేదు. అది ఒక గొప్ప పేరున్న వ్యవస్థను అప్రతిష్ఠపాలు చేస్తుంది" అని ఆయన వ్యాఖ్యానించారు.

భారత్‌లో సుప్రీంకోర్టు కిందే మిగతా కోర్టులన్నీ పనిచేస్తాయి. బలమైన రాజ్యాంగబద్ధ అధికారాలు కలిగిన సంస్థ అది. అత్యంత బిజీగా ఉండే కోర్టు. 2015లో 47,000కు పైగా కేసులకు తీర్పులు చెప్పింది. అయినా గతేడాది ఫిబ్రవరి వరకు దాదాపు 60,000 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

Image copyright J Suresh

సునిశిత పరిశీలన

ప్రస్తుతం దేశ అత్యున్నత న్యాయస్థానంలో నెలకొన్న సంక్షోభం న్యాయవ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని దిగజార్చుతుందని చాలా మంది వ్యక్తపరుస్తున్న అభిప్రాయం.

జడ్జీలు నిష్పక్షపాతంగా, నిజాయితీగా తీర్పుచెప్పే వారిగా దేశ ప్రజలు భావించకపోవచ్చు.

ఇప్పటికీ దేశంలోని జిల్లా కోర్టుల్లో మూడు కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటన్నింటి విచారణ పూర్తవ్వాలంటే సంవత్సరాలు, దశాబ్దాలు పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

దశాబ్ద కాలంగా దేశ జనాభా పెరుగుతున్నా కోర్టుల్లో నమోదవుతున్న సివిల్ కేసుల సంఖ్య మాత్రం తగ్గుతూ వస్తోంది. చాలా మంది ప్రజలు వివాదాలను రాజకీయ నాయకులు, పోలీసుల సమక్షంలో పరిష్కరించుకునేందుకే మొగ్గుచూపుతున్నట్లు అర్థమవుతోంది.

గడిచిన దశాబ్ద కాలంలో ఎగువ కోర్టుల్లోనూ లోపాలు ప్రారంభమయ్యాయని కొందరు నిపుణులు చెబుతున్నారు.

"కింది కోర్టులు ఒకవేళ రాజీ పడితే ఉన్నత స్థాయి న్యాయస్థానాలు దానిపై అభ్యంతరం చెప్పాలి. కానీ, అలాంటి సూచనలు కనిపించడంలేదు. అది అత్యంత భయంకరమైన విషయం" అని సుప్రీంకోర్టు మీద పుస్తకం రాసిన శైలాష్రి శంకర్ వ్యాఖ్యానించారు.

గడిచిన ఏడాది కాలంలోనే వివిధ కారణాలతో సుప్రీంకోర్టు వార్తల్లోకి ఎక్కింది.

Image copyright AFP

ఆ వివాదాలలో కొన్ని

  • తమిళనాడులో 2014లో జల్లికట్టును నిషేధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కానీ, ఈ ఏడాది జనవరిలో ఆ తీర్పును కాదని, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం జల్లికట్టుకు అనుమతించింది. దాంతో తమిళనాడులో జల్లికట్టుకు మద్దతుగా ఉవ్వెత్తున ఎగిసిన ఆందోళనలు సద్దుమణిగాయి.
  • జూన్‌లో సుప్రీంకోర్టు జడ్జీలపై చర్యలు తీసుకోవాలంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాసిన ఓ సిట్టింగ్ హైకోర్టు జడ్జిని బాధ్యతల నుంచి తప్పిస్తూ, జైలు శిక్ష విధించింది సుప్రీంకోర్టు.
  • హోటళ్లు, రెస్టారెంట్ల నిరసనల నేపథ్యంలో వచ్చిన ఒత్తిడి కారణంగా జాతీయ రహదారుల వెంట మద్యం దుకాణాలను నిషేధిస్తూ గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సవరించాల్సి వచ్చింది. చాలా మంది ప్రేక్షకులకు విసుగు తెప్పించేలా సినిమా థియేటర్లలో జాతీయ గీతం వేయాలంటూ కోర్టు ఆదేశాలిచ్చింది.

జడ్జీల నియామకాలకు సంబంధించిన కొలీజియం వ్యవస్థ, సమాచార హక్కు చట్టం పరిధిలోకి కోర్టులను తీసుకురాకుండా సుప్రీంకోర్టు అడ్డుపడుతోందన్న విమర్శలూ వచ్చాయి.

గే సెక్స్‌ను నిషేధించడం, ట్రాన్స్‌జెండర్లను థర్డ్ జెండర్‌గా గుర్తించడంపైనా నిరసనలు వ్యక్తమయ్యాయి.

Image copyright AFP

రాజకీయ ఒత్తిళ్లు

ఉన్నత స్థాయి జడ్జీల నియామకాల్లో ప్రాంతీయ, లింగ పక్షపాతం, జడ్జీలు, హైకోర్టు లాయర్ల మధ్య "సన్నిహిత సంబంధాలు" ఉంటున్నాయని విమర్శలూ ఉన్నాయి.

రాజకీయ ఒత్తిళ్లు కూడా ఉంటాయని చాలా మంది జడ్జీలు చెబుతుంటారు. ఎందుకంటే, చాలామంది పదవీ విరమణ అనంతరం ప్రభుత్వంలో ఏదో ఒక ఉన్నతస్థాయి పోస్టులు సంపాదించుకుంటున్నారు.

అదే సమయంలో, ఉన్నత స్థాయి జడ్జీలలో తలకు మించిన భారాన్ని నెత్తిన వేసుకుంటున్న వారూ ఉన్నారు.

ఒకే హైకోర్టు జడ్జి ప్రతి రోజూ వాయిదాలతో కలిపి, దాదాపు 100 కేసులును విచారిస్తున్నట్లు డాక్టర్. శంకర్ పరిశోధనలో తేలింది. ఒకే రోజు 300 కేసుల్లో వాదనలు విన్నానంటూ సన్నిహితులతో ఓ జడ్జి చెప్పారు. ఒక సుప్రీంకోర్టు జడ్జి నాలుగేళ్లలో 6,000 కేసుల్లో వాదనలు విన్నారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)