వ్యవసాయాన్నీ, రైతులనూ ప్రభుత్వాలు దెబ్బతీస్తున్నాయి: మేధా పాట్కర్

  • ప్రవీణ్ కాసం
  • బీబీసీ తెలుగు ప్రతినిధి
మేధా పాట్కర్ (ఫైల్ ఫోటో)

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

మేధా పాట్కర్ (ఫైల్ ఫోటో)

ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్నీ, రైతాంగాన్నీ దెబ్బతీస్తున్నాయని ప్రముఖ సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ ఆరోపించారు. కార్పొరేట్ ప్రయోజనాల కోసం భూముల్ని, నీటినీ అప్పజెప్తున్నారని ఆమె అన్నారు.

'కిసాన్ సంసద్' పేరుతో దిల్లీలో జరుగుతున్న రైతుల ప్రదర్శన సందర్భంగా ఆమె బీబీసీతో మాట్లాడారు.

ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నష్టదాయకమైన వ్యాపారంగా చూస్తోందని ఆమె ఆరోపించారు.

'జీఎస్టీ కోసం అర్ధరాత్రి పార్లమెంటు ఉభయసభలను సమావేశపరిచిన ప్రభుత్వం రైతు సమస్యల మీద సమావేశం నిర్వహించలేదా' అని ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు ఆర్. నారాయణమూర్తి ప్రశ్నించారు.

రైతుల ప్రదర్శనకు మద్దతుగా దిల్లీ వచ్చిన సందర్భంగా, బీబీసీతో మాట్లాడుతూ, "దేశంలో ఇప్పటి వరకు 64 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అన్నదాత ఆత్మహత్యలపై కూడా పార్లమెంట్‌లో అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేయాలి. 2007లో స్వామినాథన్ చేసిన సిఫార్సులను అమలు చేయాలి" అని నారాయణమూర్తి అన్నారు.

గిట్టుబాటు ధరలు ఇస్తేనే రైతులు ఆత్మహత్యలు చేసుకోరని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లోనే అమలవుతున్న రుణమాఫీని దేశం మొత్తంలో అమలు చేయాలని నారాయణమూర్తి అన్నారు.

వివిధ రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు దిల్లీలోని పార్లమెంటు వీధిలో చేపట్టిన మూడు రోజుల ప్రదర్శన సోమవారం మొదలైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల రైతులు 'కిసాన్ సంసద్' పేరుతో ఒక వినూత్న కార్యక్రమం చేపట్టారు.

'అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి' (ఏఐకేఎస్‌సీసీ) ఆధ్వర్యంలో రైతులు తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కావాలనీ, రైతులను ప్రైవేటు, ప్రభుత్వ రుణాల నుంచి విముక్తుల్ని చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు.

కేంద్రం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని పథకాలు ప్రకటిస్తున్నా రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదని ఎన్‌సీఆర్‌బీ (జాతీయ నేర గణాంక సంస్థ) గణాంకాలు చెబుతున్నాయి.

రైతులు, రైతుల సంఘాల ప్రతినిధులు బీబీసీతో మాట్లాడుతూ ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు కంటితుడుపుగా ఉన్నాయనీ, కేంద్రం చొరవ తీసుకొని రైతు సమస్యల పరిష్కారానికి తగిన విధానం రూపొందించాలని డిమాండ్ చేశారు.

వివిధ రాష్ట్రాల్లో ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతుల కుటుంబ సభ్యులు కూడా ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు.

ఫొటో సోర్స్, Reuters

ఆగని రైతు ఆత్మహత్యలు

1995 నుంచి దేశంలో 10 వేలకు పైగా రైతులు ప్రతీ యేటా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. 10 ఏళ్ల గణాంకాలు గమనిస్తే దేశవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్న రైతుల సంఖ్య లక్ష దాటింది.

గత 20 ఏళ్ల రికార్డులు పరిశీలిస్తే 2004లో అత్యధికంగా 18,241 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు.

2015లో 12,602 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడగా, 2016లో ఈ సంఖ్య 6,867కి చేరింది.

కాగా, మధ్యప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడులోనే రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయని ఎన్‌సీఆర్‌బీ రిపోర్ట్ ప్రకారం తెలుస్తోంది.

ఫొటో సోర్స్, KONDALREDDY/FACEBOOK

ఫొటో క్యాప్షన్,

ఆత్మహత్య చేసుకున్న భర్త ఫొటోలతో దిల్లీలో ఆందోళన చేస్తున్న తెలుగు రాష్ట్రాల మహిళలు.

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల ఆత్మహత్యలు

తెలుగు రాష్ట్రాల్లో రైతులు పెద్ద సంఖ్యలో బలవన్మరణాలకు పాల్పడుతున్నట్లు ఎన్‌సీఆర్‌బీ నివేదికలో తెలుస్తోంది.

ఈ రిపోర్టు ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో 2014 లో 160 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడగా, 2015లో ఈ సంఖ్య 516కు పెరిగింది. అంటే ఏడాది కాలంలో ఆత్మహత్యలు 322 శాతం పెరిగాయి.

ఇక, తెలంగాణలో 2014లో 898 మంది ఆత్మహత్య చేసుకోగా, 2015లో ఈ సంఖ్య 1,358 కి పెరిగింది. 2014తో పోల్చితే ఈ సంఖ్య 152 శాతం ఎక్కువని ఎన్‌సీఆర్‌బీ గణాంకాలు తెలుపుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

గిట్టుబాటు ధర రాకపోవడంతో దేశంలో రైతులు ఆత్మహత్యబాట పడుతున్నారు.

లెక్కల్లో తేడాలు: రైతు స్వరాజ్య వేదిక

తెలుగు రాష్ట్రాలలో అన్నదాతల సమస్యలపై పని చేస్తున్న రైతు స్వరాజ్య వేదిక చెబుతున్న లెక్కల ప్రకారం తెలంగాణలో 2016లో 774 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒక్క ఆగస్టు-సెప్టెంబర్ మధ్య కాలంలోనే 134 మంది చనిపోయారని ఆ సంస్థ వెల్లడి చేసింది.

2017లో ఇప్పటి వరకు రాష్ట్రంలో 155 మంది చనిపోయినట్లు రైతు స్వరాజ్య వేదిక స్థానిక మీడియాలో వచ్చిన ఆధారాలతో చెబుతోంది.

అప్పుల ఊబిలో కూరుకుపోవడం, గిట్టుబాటు ధర రాకపోవడం, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతోనే రైతులు ఆత్మహత్య వంటి తీవ్ర నిర్ణయానికి వస్తున్నారని ఎన్‌సీఆర్‌బీ నివేదిక స్పష్టం చేస్తోంది.

రైతుల ఆగ్రహం

తాము పండించే పంటలకు ప్రభుత్వాలు గిట్టుబాటు ధర కల్పించకపోవడం, రుణాలు అందకపోవడంతో వివిధ రాష్ట్రాల్లో రైతులు ధర్నాలు, ప్రదర్శనలు చేపడుతున్నారు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో మిర్చి పంటకు గిట్టుబాటు ధరకల్పించాలంటూ చేపట్టిన ప్రదర్శన హింసాత్మకంగా మారింది. పోలీసులు రైతులను అరెస్టు చేసి బేడీలు వేయడం వివాదాస్పదమైంది.

గత జూన్ 6న మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ జిల్లాలో గిట్టుబాటు ధర కోసం రైతులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పోలీసులు కాల్పులకు దిగడంతో ఆరుగురు అన్నదాతలు చనిపోయారు.

ఫొటో సోర్స్, Reuters

మందసౌర్ ఘటనతో ఏకమైన రైతు సంఘాలు

మందసౌర్ ఘటనపై దేశవ్యాప్తంగా రైతుసంఘాల తీవ్రంగా స్పందించాయి. దాదాపు 160 రైతు సంఘాలు సమావేశమై రైతు సమస్యల కోసం సంఘటితంగా ఉద్యమించాలని తీర్మానించాయి.

దీనికి కొనసాగింపుగానే 160 సంఘాలు కలసి 'అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి' పేరుతో ఏకమయ్యాయని రైతు స్వరాజ్య వేదిక నాయకుడు కొండల్ రెడ్డి బీబీసీతో చెప్పారు.

'కిసాన్ ముక్తి సదన్' పేరుతో నవంబర్ 20 నుంచి మూడో రోజుల పాటు దేశ రాజధాని దిల్లీలో ఆందోళన కార్యక్రమాలకు ఈ సమితి రూపకల్పన చేసింది.

ఫొటో సోర్స్, BBC

ఫొటో క్యాప్షన్,

అప్పులు బాధతో తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకోవడంతో ఒంటరైన మనీశా.

"స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేసినట్లుగా వ్యవసాయ పంటలకు ఉత్పత్తి ఖర్చులపై 50 శాతం కలిపి గిట్టుబాటు ధర ఇవ్వాలి. కౌలు రైతులు, వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలకు ప్రైవేటు అప్పులతో సహా, మొత్తం అప్పులు రద్దు చేయాలనేది మా రెండు ప్రధాన డిమాండ్లు" అని కొండల్ రెడ్డి చెప్పారు.

ఫొటో క్యాప్షన్,

పత్తి పంటలో నష్టంరావడంతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని చెబుతున్న స్వాతి

రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో దిల్లీకి చేరుకున్న బాధిత రైతు కుటుంబ సభ్యులు కొందరు సోమవారం పార్లమెంట్ సమీపంలో బీబీసీ ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడారు. ప్రభుత్వం తమ కుటుంబాలను ఆదుకోవడం కోసం చేస్తున్నదేమీ లేదని వారు ఆరోపించారు.

"కేరళ తరహాలో రుణమాఫీని తీసుకొస్తే తెలుగు రాష్ట్రాల్లో రైతు ఆత్మహత్యలు నివారించవచ్చు" అని రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధి కొండల్ రెడ్డి బీబీసీతో చెప్పారు. "స్వామినాథన్ సిఫార్సులను తక్షణం అమలు చేయాల్సిన అవసరం ఉంది" అని ఆయన అభిప్రాయపడ్డారు.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)