ఇందిరా గాంధీ: ‘గూంగీ గుడియా’ నుంచి ‘ఐరన్ లేడీ’గా ఎలా మారారు?
- సయీద్ నక్వీ
- సీనియర్ పాత్రికేయులు, బీబీసీ కోసం
ఫొటో సోర్స్, Getty Images
ఇందిరా గాంధీని చూడ్డానికి ముందే నేను ఫిరోజ్ గాంధీని చాలా దగ్గర నుంచి చూశాను. మా అంకుల్ సయ్యద్ వసీ నక్వీ అసెంబ్లీ నియోజకవర్గం రాయ్ బరేలీ.. ఫిరోజ్ పార్లమెంటరీ నియోజకవర్గంలోనే ఉండేది.
ఫ్యూడల్ భావాలు ఎక్కువగా ఉన్న అవధ్‌లో నెహ్రూ కుటుంబం గురించి తప్పుగా మాట్లాడ్డానికి ప్రజలు చాలా భయపడేవారు. కానీ చాటుగా ఫిరోజ్ మూలాల గురించి గుసగుసలాడుకునేవారు.
బ్రాహ్మణ అగ్రకులానికి చెందిన ప్రధాని కూతురు ఒక 'బనియా'ను ఎలా వివాహం చేసుకుంటుంది? గాంధీ అనేది ఒక బనియా పేరని వారు నిర్ణయించేశారు. కానీ నిజానికి ఫిరోజ్ అసలు పేరు ఫిరోజ్ జహంగీర్ ఘాంధీ.
ఘాంధీ.. గాంధీగా మారడం వెనుక తమది నెహ్రూ-గాంధీల కుటుంబంగా చెప్పుకోవచ్చనే ఇందిరా గాంధీ, కాంగ్రెస్‌ల ఆలోచన ఉంది. ఇలా ఆ కుటుంబం జవహర్ లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీల ప్రతినిధిగా ఆవిర్భవించింది.
ఫొటో సోర్స్, Keystone/Hulton Archive/Getty Images
ఇందిర, ఫిరోజ్ గాంధీల వివాహం
1966లో తాష్కెంట్లో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణించగా, ఇందిరా గాంధీ పార్టీలోని సంప్రదాయవాది మొరార్జీ దేశాయ్‌ను ఓడించి ప్రధాన మంత్రి అయ్యారు. అయితే ఆమె నేతృత్వంలో మొదటి సాధారణ ఎన్నికల్లోనే పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ ఎనిమిది రాష్ట్రాల్లో ఓటమి పాలైంది. పార్లమెంట్లో కూడా పార్టీ సభ్యుల సంఖ్య తగ్గింది.
దాంతో సోషలిస్ట్ పార్టీ నేత రామ్ మనోహర్ లోహియా 'గూంగీ గుడియా' (మూగ బొమ్మ) అంటూ ఇందిరను పరిహాసం చేసేవారు.
రాజా దినేష్ సింగ్‌ను జూనియర్ ఎంపీ స్థాయి నుంచి సహాయ మంత్రి స్థాయికి ప్రమోట్ చేయడంపై మాజీ ఐసీఎస్, ఫార్వర్డ్ బ్లాక్ సభ్యుడు హెచ్ వీ కామత్ ఇందిరపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
'ఆయనలో ఏ టాలెంట్‌ను చూసి ఈ ప్రమోషన్ ఇచ్చారో ప్రధానికే ఎరుక'' అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై కొద్దికాలం పుకార్లు కూడా వెలువడ్డాయి. ప్రముఖ సాధువు ధీరేంధ్ర బ్రహ్మచారి ప్రధాని ఇంట్లో కనిపించడంపై కూడా చాలా మంది కనుబొమలు ఎగురవేశారు.
ఇందిరా గాంధీ: జననం నుంచి మరణం దాకా...
1957లో ఇందిర కాంగ్రెస్ అధ్యక్షురాలు కావడానికి ఆమె నెహ్రూ కూతురు కావడమే కారణం. ఇది సహజంగానే పార్టీలోని సాంప్రదాయ మితవాదుల నుంచి ఆమెకు రక్షణ కల్పించింది.
బహుశా వారిని సంతృప్తి పరచడం కోసమే ఆమె తాను పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నికైన ఏడాదే కేరళలో ప్రపంచంలోనే మొదటిసారిగా బ్యాలెట్ బాక్సు ద్వారా అధికారంలోకి వచ్చిన కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని డిస్మిస్ చేశారు. రాష్ట్రపతి పాలన విధించడానికి అక్కడ శాంతి భద్రతలు లేకపోవడమే కారణంగా పేర్కొన్నారు.
ఫొటో సోర్స్, Central Press
'లెఫ్ట్ ఆఫ్ సెల్ఫ్ ఇంటరెస్ట్'
మితవాదుల వైపు మొగ్గుచూపుతున్నారన్న వ్యాఖ్యలను బ్యాలెన్స్ చేయడానికి అన్నట్లుగా ఆమె 1969లో బ్యాంకులను జాతీయం చేశారు. భారతీయ యువరాజుల రాజభరణాలను రద్దు చేశారు. టైమ్స్ లండన్ ప్రతినిధి పీటర్ హేజిల్హర్ట్స్ ఆమెను 'లెఫ్ట్ ఆఫ్ సెల్ఫ్ ఇంటరెస్ట్' అన్నారు.
ఆమె ప్రిన్సిపల్ సెక్రటరీ పీఎన్ హక్సర్ వామపక్షవాది అయినా, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాతో కాంగ్రెస్ కలిసి పని చేయడానికి కారణం మాత్రం ఆమె కేబినెట్ మంత్రి, సలహాదారు మోహన్ కుమారమంగళం.
సీపీఐ సెక్రటరీ జనరల్ శ్రీపద్ డాంగే దీనిని కలిసి పోరాడే వ్యూహంగా అభివర్ణించారు. అంటే కాంగ్రెస్ ప్రజానుకూల విధానాలపై కలవడం, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడడం.
ఫొటో సోర్స్, Getty Images
అటల్ బిహారీ వాజ్‌పేయి
సోవియట్ యూనియన్ సహాయంతో బంగ్లాదేశ్ ఏర్పాటుకు సహకరించడంతో ఈ వామపక్ష ధోరణి పతాక స్థాయికి చేరింది. అప్పుడే అటల్ బిహారీ వాజ్‌పేయి ఆమెను 'దుర్గ'గా అభివర్ణించారు.
కమ్యూనిస్టులతో కాంగ్రెస్ చెట్టపట్టాలు భారతదేశంలోనే కాదు, అంతర్జాతీయంగానూ ప్రకంపనలు సృష్టించాయి. మరీ ప్రత్యేకించి పాశ్చాత్య దేశాలతో సోవియట్ సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్న సమయంలో.
ఈ 'ప్రమాదకర ధోరణి' కారణంగానే కాంగ్రెస్ లోపల, బయట ఉన్న సోషలిస్టులు, అమెరికా కాంగ్రెస్ కన్జర్వేటివ్స్ అనుకూలురు, జనసంఘ్ (నేటి బీజేపీ) కలిసి ప్రముఖ గాంధేయవాది, మాజీ సోషలిస్టు నేత జయప్రకాశ్ నారాయణ్ నేతృత్వంలో ఒకటిగా ఏర్పడి ఇందిర పాలనలోని అవినీతికి వ్యతిరేకంగా ఒక ఉద్యమం లేవదీశారు.
ఫొటో సోర్స్, SHANTI BHUSHAN
జయప్రకాశ్ నారాయణ్
జేపీ ఉద్యమంతో ఇందిర తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. ఆ ఆందోళన సందర్భంగా జేపీ నన్ను తన కదం కౌన్ నివాసంలో ఉండాలని ఆహ్వానించారు.
దీంతో ఇందిర నా నుంచి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి నెహ్రూ కుటుంబానికి పాత మిత్రుడు, నా గురించి బాగా తెలిసిన మహమ్మద్ యూనుస్‌ను సంప్రదించారు.
ఆమె ప్రశ్నలు చాలా వరకు రాజకీయ ముచ్చట్ల తరహాలో ఉండేవి. శ్యామ్ నందన్ మిశ్రాను జేపీ విశ్వసిస్తారా? దినేష్ సింగ్ నిజంగా జేపీకి దగ్గరా?.. ఇలాంటివి. వీళ్లిద్దరూ కూడా ఇందిరా గాంధీ, జేపీల మధ్య సందేశాలను చేరవేస్తూ.. వారధిగా పని చేసేవారు.
నెహ్రూ భారతదేశ వైభవానికి ప్రాతినిధ్యం వహిస్తే, ప్రపంచ దేశాల మధ్య ఇందిర భారతదేశ శక్తికి ప్రతీకగా నిలిచారు. కానీ జేపీ ఉద్యమం ఊపందుకుంటున్న దశలో ఆమె చాలా ఆందోళన చెందారు.
ఫొటో సోర్స్, Getty Images
ఈ ఇందిర ఆ ఇందిర కాదు
ఎన్నికల్లో అక్రమాలకు గాను ఆమె ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు ప్రకటించడంతో ఆమె దిగ్భ్రమ చెందారు.
జూన్ 25, 1975న దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించడానికి కారకుడు ఆమె చిన్న కుమారుడు సంజయ్ గాంధీ. ఇందిర చుట్టూ ఉన్న ముఖ్య అధికారులు పీఎన్ హక్సర్, మీడియా సలహాదారు శారదా ప్రసాద్‌లను నిర్వీర్యం చేసింది కూడా సంజయే.
యూనుస్ భాయ్ (మహమ్మద్ యూనుస్) ఇందిర, సంజయ్‌లకు ఎంత సన్నిహితుడంటే ఆయన తనను తాను 'ప్రత్యేక ప్రతినిధి'గా నియమించుకున్నారు.
ఇందిరలో ఎవరూ చూడని కోణాన్ని చూసే అవకాశాన్ని ఆయన నాకు కల్పించారు. ఆయన ద్వారా నాకు లండన్‌లో సండే టైమ్స్ తరపున ఆమెను ఇంటర్వ్యూ చేసే అవకాశం దక్కింది. అది ఎమర్జెన్సీ విధించిన తర్వాత ఇందిర ఇచ్చిన మొదటి ఇంటర్వ్యూ.
ఆ ఇంటర్వ్యూలో ఇందిర చాలా బెదిరిపోయినట్లు కనిపించారు. ఆమె ముఖం కాగితంలా తెల్లగా పాలిపోయి ఉంది. నేను వేసిన ఏ ఒక్క ప్రశ్నకూ ఆమె సమాధానం ఇవ్వలేదు. ఎలాంటి భావమూ లేకుండా ఆమె గోడ వైపు చూస్తూ కూర్చున్నారు.
ఫొటో సోర్స్, Getty Images
ఇందిరను తల్చుకుంటే నాకు గుర్చొచ్చేది ఇదొక్క చిత్రమే కాదు, వేరేవీ ఉన్నాయి. ఉదాహరణకు బంగ్లాదేశ్ యుద్ధం సందర్భంగా ఆమెకు 'ఐరన్ లేడీ' అన్న పేరు వచ్చింది. కానీ ఆ పేరు కానీ, ఆమె సెక్యులర్ ఇమేజ్ కానీ నిష్కళంకమేమీ కాదు.
1982 జమ్మూ ఎన్నికల్లో ఆమెపై మతం ముద్ర పడింది.
జమ్మూలో కాంగ్రెస్ ప్రచారం మతం రంగు పులుముకోవడానికి ఒక నేపథ్యముంది. అదే పంజాబ్‌లోని ఖలిస్తాన్ ఉద్యమం. 1984లో ఇందిర మరణం తర్వాత కూడా ఈ ధోరణి కొనసాగింది.
ఫొటో సోర్స్, STEFAN ELLIS
కాంగ్రెస్‌లో హిందూ ఆధిపత్య భావన
ఇందిర మరణాంతరం ముందెన్నడూ లేని విధంగా కాంగ్రెస్ 514 సీట్లలో 404 సీట్లు గెల్చుకోవవడానికి సానుభూతే కారణమని చాలా మంది భావించారు. కానీ పార్టీలో మైనారిటీ మతవాదంపై హిందూ ఆధిపత్యమే దీనికి కారణమని పార్టీలోని కొందరు సీనియర్లు భావిస్తారు.
1984లో ఆ మైనారిటీలు సిక్కులు అయి ఉండొచ్చు కానీ, మైనారిటీలకు వ్యతిరేకంగా పార్టీలో హిందూవాదాన్ని ఒక సిద్ధాంతంగా బలోపేతం చేయడం జరిగింది.
1989లో రాజీవ్ గాంధీ రామరాజ్యం స్థాపిస్తామన్న హామీతో అయోధ్య నుంచి ప్రచారాన్ని ప్రారంభించడంలో ఆశ్చర్యమేం లేదు. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా విశ్వహిందూ పరిషత్ రామాలయం కోసం శిలాన్యాస్ చేయాలని డిమాండ్ చేసిన చోటే రాజీవ్ దానిని అనుమతించారు. ఈ ధోరణి నేటికీ కొనసాగుతోంది.
ఫొటో సోర్స్, PTI
ఎన్నికల సీజన్లో పుంజుకున్న ఆలయాల సందర్శన
ఇటీవల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గుజరాత్లో ఒక ఆలయాన్ని సందర్శించడం ద్వారా తన ప్రచారాన్ని ప్రారంభించారు. హిందువులు ఎక్కువగా ఉన్న దేశంలో నాయకులు ఇలా ఆలయాలను సందర్శించడం పెద్ద విశేషమేమీ కాదు.
కానీ బీజేపీ తమపై 'ముస్లిం అనుకూలురు' అన్న ముద్ర వేయకుండా ఎన్నికల సీజన్లో ఈ ఆలయాల సందర్శన వేగం పుంజుకుంటుంది. కాంగ్రెస్ 60 ఏళ్ల పాలనలో ముస్లింలు ఎంత సంతృప్తిగా జీవించారో 2005లో సచార్ కమిటీ చెప్పనే చెప్పిందిగా!
అలాంటప్పుడు కాంగ్రెస్ దాని గురించి భయపడడం ఎందుకు?
ప్రస్తుతం ఉదారవాద వర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే అన్న వ్యాఖ్య వినిపిస్తోంది. ఆ వ్యాఖ్య ఇవాళ మరింత ప్రస్ఫుటంగా వినిపించడానికి తానూ ఒక కారణమన్న అపవాదు నుంచి ఇందిర తప్పించుకోలేరు.
ఇవి కూడా చదవండి:
- ఈ వారం మీరు ఎన్ని సిగరెట్లు తాగారో తెలుసా-
- ఏడు దశాబ్దాల బంధం
- పదవి వదిలేది లేదంటున్న ముగాబే
- గుజరాత్లో కాంగ్రెస్, బీజేపీ 'సోషల్' వార్
- తెలుగు రాజకీయాల్లో పాదయాత్రల ట్రెండ్
- ఈ ఎన్నికల సంఘం మోదీదో కాదో కానీ శేషన్ది మాత్రం కాదు!
- మోదీ లేదా రాహుల్... విదేశాల్లో ఎవరు పాపులర్?
- జింబాబ్వే: ఎవరీ గ్రేస్ ముగాబే? ఎందుకీ సంక్షోభం?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)