ప్రెస్ రివ్యూ: సినీనటి త్రిషకు యునిసెఫ్ విశిష్ట రాయబారి హోదా

  • 21 నవంబర్ 2017
Image copyright facebook

సినీనటి త్రిషకు యునిసెఫ్ విశిష్ట రాయబారి హోదా

నమస్తే తెలంగాణ: ప్రముఖ సినీనటి త్రిష యునిసెఫ్ విశిష్ట రాయబారి హోదాకు ఎంపికయ్యారు. ఆమె చిన్నారులు, కౌమారదశలో ఉన్న బాలబాలికలు, యువత హక్కులపై కృషి చేస్తారని యునిసెఫ్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.

రక్తహీనత, బాల్యవివాహాలు, బాలకార్మికులు, చిన్నారులపై అఘాయిత్యాలు వంటి సమస్యలకు వ్యతిరేకంగా ఆమె అన్ని వర్గాల మద్దతును కూడకడుతారని తెలిపింది. ప్రత్యేకంగా తమిళనాడు, కేరళ రాష్ర్టాల పరిధిలో ఆమె పనిచేస్తారని చెప్పింది.

కౌమార బాలబాలికలు, యువత ఆకాంక్షలకు ప్రతిరూపంగా త్రిష నిలుస్తారని, కుటుంబాల్లో పిల్లలపై జరిగే హింస, సమాజంలోని బాలల సమస్యలపై మాట్లాడుతారని తమిళనాడు, కేరళ రాష్ర్టాల యునిసెఫ్ కార్యాలయ ముఖ్యాధికారి జాబ్ జకారియా పేర్కొన్నారు.

బాలబాలికల విద్య, ఆరోగ్యం, సమాజానికి ఆడపిల్లల అవసరంపై ఆమె ప్రచారం చేస్తారని, యునిసెఫ్ విశిష్ట రాయబారి హోదా దక్కించుకున్న మొదటి దక్షిణభారత నటి త్రిషే అని తెలిపారు.

ఈ సందర్భంగా త్రిష స్పందిస్తూ ఆరోగ్యం, విద్య, పోషకాహారం, చిన్నపిల్లల రక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

పోషకాహార లోపంలేని, బహిరంగ మలవిసర్జన రహితం కోసం తమిళనాడు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తన మద్దతు ఉంటుందని తెలిపారు.

Image copyright facebook

దేవుణ్ని నమ్మను.. నాగార్జునని నమ్ముతా: రామ్‌గోపాల్‌ వర్మ

ఈనాడు: ''... నేను దేవుణ్ని నమ్మను కానీ, నాగార్జునని నమ్ముతా. దానికి కారణం నాగార్జున నా జీవితానికి మలుపునిచ్చాడు. 'శివ' విడుదలయ్యాకే రామ్‌గోపాల్‌ వర్మ అయ్యాడు, దర్శకుడయ్యాడు, ప్రతిభ ఉందనీ తెలిసింది. కానీ ఏం చేస్తాడో తెలియకుండా కేవలం నా నిజాయతీని, నా నిర్ణయాల్ని గమనించి స్వేచ్ఛనిచ్చాడు నాగార్జున. అందుకే 'శివ' సినిమా అలా వచ్చింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఒక కథ అనుకొని నాగార్జున దగ్గరికి వెళ్లి చెప్పినప్పుడు ఆయన స్పందించిన విధానం నాకు ఆత్మవిశ్వాసాన్నిచ్చింది'' అని దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ పేర్కొన్నారు.

నాగార్జున కథానాయకుడిగా రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైందీ చిత్రం.

నాగార్జునపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి రామ్‌గోపాల్‌ వర్మ తల్లి సూర్యావతి క్లాప్‌నిచ్చి, తన తనయుడి నుదుటిపై ముద్దుపెట్టి ఆశీర్వదించారు.

రామ్‌గోపాల్‌ వర్మ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా రామ్‌గోపాల్‌ వర్మకి మైండ్‌ పోయింది, తనలో జ్యూస్‌ అయిపోయింది అనే మాటలు వినిపిస్తున్నాయి. జ్యూస్‌ అయిపోయిందా లేదా అనేది ఈ సినిమా తర్వాత చూస్తారు. సామాజిక మాధ్యమాల్లో నేను వెలిబుచ్చే అభిప్రాయాలవల్ల 'ఎక్కువ మాట్లాడుతూ తక్కువ పనిచేస్తున్నాడ'ని అంటున్నారు. అందరూ చెప్పేమాటే అయినా నేనెప్పుడూ చెప్పలేదు కాబట్టి ఈసారి నేను కాకుండా, నా పనే మాట్లాడుతుందని చెబుతున్నా'' అన్నారు.

అంతకు ముందు నాగార్జున మాట్లాడుతూ ''ఒక నటుడికిగానీ మనిషికి గానీ 28 యేళ్లకి పరిపక్వత, పరిపూర్ణత వస్తుందని మా నాన్నగారు అప్పట్లో నాతో అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి. 28 యేళ్ల వయసులో నేను 'శివ' చేశా. సరిగ్గా మళ్లీ అన్నేళ్లు పూర్తయ్యాయి. అంటే రెండింతలు ఎదిగాం. అందుకే 'శివ' కంటే ఈ చిత్రం పెద్ద హిట్టవుతుందని నా నమ్మకం'' అన్నారు నాగార్జున.

Image copyright Getty Images

హోదా ఇవ్వడం లేదనే ప్యాకేజీకి ఒప్పుకొన్నా: చంద్రబాబు

ఆంధ్రజ్యోతి: 'కేంద్రం కొత్తగా ఏ రాష్ట్రానికీ హోదా ఇవ్వడం లేదు. అందుకే ప్యాకేజీకి ఒప్పుకున్నాం' అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

సోమవారం అసెంబ్లీలో ఉపాధి హామీ పథకంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. విభజన హామీల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ప్యాకేజీ ఇంకా ఫైనల్‌ కాలేదని, ఎంత ఇస్తారనే దానిపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. రాష్ట్రానికి ఎన్నో సమస్యలున్నాయని, నిధులు చాలా అవసరమన్నారు.

హోదాపై పోరాటం చేసే వాళ్లు ఇక్కడ కాదని, ఢిల్లీ వెళ్లి చేయాలని చంద్రబాబు సూచించారు. ఇలాంటి ఆందోళనలతో ప్రజల్లో అభద్రతాభావం ఏర్పడుతుందన్నారు.

విభజన హామీలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చిద్దామని సూచించారు. ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి సభలో స్వల్పకాలిక చర్చ నిర్వహించాలని స్పీకర్‌కు సూచించారు. రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు సమీకరించుకోవాలని, దీని కోసం బీజేపీ నేతలు తమతో కలిసి రావాలని కోరారు.

Image copyright facebook

తెలుగు చదివితేనే ఉద్యోగ భరోసా: కేసీఆర్

నవతెలంగాణ: తెలుగు భాషను చదివిన వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరికే విధానం అమలు చేస్తామని సీఎం కె చంద్రశేఖర్‌రావు తెలిపారు.

అమ్మను కాపాడుకున్నట్లే తెలుగునూ కాపాడు కోవాలని కోరారు.

సోమవారం ప్రగతిభవన్‌లో ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణపై సాహితీవేత్తలతో సీఎం కేసీఆర్‌ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ...తెలంగాణ భాషకు అద్భుతమైన భవిష్యత్‌ ఉందనే గట్టి సంకేతాలు పంపే విధంగా, భాగ్యనగరం భాసిల్లేలా ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ జరగాలని ఆకాంక్షించారు.

తెలంగాణలో జరిగిన సాహిత్య సృజన, పటిమపై చర్చ జరగాలని, అన్ని సాహిత్య ప్రక్రియలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, కళలకు తగు ప్రాధాన్యత ఉండాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు చెప్పారు.

మహాసభల సందర్భంగా తెలంగాణ సాహిత్య చరిత్రను ప్రపంచానికి చాటాలని కోరారు. మహాసభల సందర్భంగా తెలుగుకు అద్భుతమైన భవిష్యత్‌ ఉందనే విశ్వాసం కలిగించాలని కోరారు.

ఇంటర్మీడియేట్‌ వరకూ తెలుగు సబ్జెక్టు బోధించాలని నిబంధన పెట్టామనీ, ఉర్ధూమీడియం స్కూళ్లలోనూ ఈ విధానం అమలు చేయాలని ముస్లిం మతపెద్దలు కోరారని చెప్పారు.

Image copyright Getty Images

హైదరాబాద్‌లో అమెరికా ఏజెంట్ల నిఘా

సాక్షి: అమెరికా రహస్య ఏజెంట్లు ఇప్పుడు హైదరాబాద్‌లో సంచరిస్తున్నారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తిరుగుతూ అక్కడి పరిస్థితులపై 'నిఘా' పెట్టారు.

ఇదంతా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె ఇవాంకా హైదరాబాద్‌ పర్యటన కోసమే. ఈ నెల 28 నుంచి హైదరాబాద్‌లో జరుగనున్న సదస్సులో ఆమె పాల్గొంటున్న విషయం తెలిసిందే.

దీంతో 15 మంది అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు నెల రోజుల కిందే హైదరాబాద్‌కు వచ్చి.. పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు కేంద్ర నిఘా వర్గాల ద్వారా తెలిసింది.

ఇవాంకా పర్యటనలో ఎక్కడెక్కడకు వెళతారు? ఎవరెవరు ఆమెను కలుస్తారు? వారి నేపథ్యం ఏంటి? వారికున్న భద్రత, సామాజిక స్థాయి ఏమిటి? ప్రధాని మోదీని కూడా ఎవరు కలుస్తారు, ఇవాంకా పాల్గొనే సదస్సులో వేదిక మీద ఉండే వాళ్లు ఎవరు, వారి పూర్తి వివరాలేమిటి అనే అంశాలతోపాటు చార్మినార్, ఫలక్‌నుమా ప్యాలెస్‌ ప్రాంతాలు, అక్కడి నిర్వాహకులెవరనే సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది.

సాధారణ విదేశీ పర్యటకులుగా వచ్చిన ఆ ఏజెంట్లు.. ఇవాంకా పర్యటించే ప్రాంతాలు, అక్కడి పరిస్థితులు, రోడ్‌మ్యాప్, ఇక్కడి పోలీసులు చేపడుతున్న భద్రతా వ్యవహారాలు.. తదితర అంశాలనూ క్షుణ్నంగా పరిశీలించి అమెరికా భద్రతా విభాగాలకు పంపిస్తున్నట్లు సమాచారం.

ఈ ప్లాన్, సమాచారాన్ని బట్టి ఇవాంకా ట్రంప్‌ పర్యటన తుదిరూపు ఉంటుందని కేంద్ర నిఘా వర్గాలు చెబుతున్నాయి. మన దేశ ప్రధాన మంత్రి ఎప్పుడు విదేశీ పర్యటనకు వెళ్లినా.. దేశంలోని కీలకమైన విభాగాలైన ఇంటలిజెన్స్‌ బ్యూరో (ఐబీ), రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌ (రా) అధికారులు రహస్య ఏజెంట్లుగా పనిచేస్తారని కేంద్ర నిఘా అధికారులు తెలిపారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)