ఉత్తర కొరియా ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న దేశం: ట్రంప్

  • 21 నవంబర్ 2017
డొనాల్డ్ ట్రంప్ Image copyright EPA

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 'ఉత్తర కొరియాను ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దేశం'గా ప్రకటించారు. 9 ఏళ్ల కిందటే ఆ దేశాన్ని ఈ జాబితాలోంచి తొలగించారు. అయితే మరోసారి ట్రంప్ అదే జాబితాలో చేర్చారు.

మంగళవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ, ఈ నిర్ణయంతో ఉత్తరకొరియాపై మరిన్ని కఠిన ఆంక్షలు విధించినట్లయిందని అన్నారు.

ఉత్తర కొరియా అణు పరీక్షలను తప్పుపట్టిన ట్రంప్ ఆ దేశ చర్యలు తీవ్రవాదానికి ఊతమిచ్చేలా ఉన్నాయన్నారు. 'అసలు ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకోవాల్సింది' అని వ్యాఖ్యానించారు.

అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్ మాట్లాడుతూ.. కఠిన ఆంక్షల ప్రభావం ఆచరణలో పరిమితంగానే ఉండొచ్చని చెప్పారు.

ఉత్తర కొరియా ఆరోసారి అణుపరీక్షలు నిర్వహించడంతో పాటు, మరోసారి క్షిపణులను ప్రయోగించిన నేపథ్యంలో ఆ దేశం మీద ఆంక్షలు విధించాలని గత సెప్టెంబరులోనే ఐక్యరాజ్యసమితికి అమెరికా ప్రతిపాదించింది.

Image copyright Reuters

ట్రంప్ తాజా ప్రకటనతో అంతర్జాతీయంగా తీవ్రవాద చర్యలకు ఊతమిస్తున్నాయన్న ఆరోపణలున్న ఇరాన్, సుడాన్, సిరియాల జాబితాలో ఇప్పుడు ఉత్తర కొరియా కూడా చేరింది.

2008 వరకు ఉత్తరకొరియా ఈ జాబితాలోనే ఉండేది. అయితే, ఆ దేశంతో అణు కార్యక్రమాలపై చర్చల సందర్భంగా నాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యు బుష్ ఉత్తర కొరియాను అందులోంచి తొలగించారు.

ఈ నిర్ణయంతో చర్చల్లో ప్రతిష్టంభన

బార్బరా ప్లెట్ అషర్, స్టేట్ డిపార్ట్‌మెంట్ కరస్పాండెంట్, బీబీసీ న్యూస్

ఉత్తరకొరియాతో చర్చల ద్వారానే పరిష్కార మార్గాన్ని కనుగొనాలని అమెరికా విదేశాంగ మంత్రి టిల్లర్సన్ భావిస్తున్నారు.

దౌత్యమార్గాలపై తనకు నమ్మకముందని ఆయన పాత్రికేయులతో చెప్పారు. అయితే ఉత్తరకొరియాను ఉగ్రవాదానికి మద్దతిస్తున్నదేశాల జాబితాలో తిరిగి చేర్చడంతో మళ్లీ రెండు దేశాల మద్య చర్చలు జరిగే అవకాశాలు ఇప్పట్లో కనిపించడం లేదు.

మరో క్షిపణి పరీక్షకు సిద్ధమవుతోన్న ఉత్తర కొరియాకు ఈ నిర్ణయం ఓ పెద్ద దెబ్బ.

Image copyright KCNA

చైనాతో సహా, ఇతర దేశాల మీద ఒత్తిడి తెచ్చి ప్యానగ్యాంగ్‌ దూకుడును కట్టడి చేయడంలో అమెరికా కొంతమేర విజయం సాధించింది.

టిల్లర్సన్‌కు మిగిలిన లక్ష్యం ఒకటే. ఉత్తరకొరియాతో చర్చలు జరిపి అణు కార్యక్రమాలను నిలిపివేసేలా ఒప్పించడం. కానీ, ఆ పని చేయడానికి ఉత్తరకొరియా నిరాకరిస్తోంది.

మరో వైపు చైనా కూడా చర్చల ప్రక్రియ మొదలుపెట్టాలని ఉత్తరకొరియాపై ఒత్తిడి తెస్తోంది.

దేశం వెలుపల హత్యలు చేయించడం, రసాయన ఆయుధాల ఉపయోగించడం తదితర చర్యల ఫలితంగానే ఉత్తరకొరియాపై ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు వైట్ హౌజ్‌లో నిర్వహించిన పత్రికా సమావేశంలో విదేశాంగ మంత్రి టిల్లర్సన్ వివరించారు.

’కఠిన చర్యలు ఆచరణాత్మకంగా పరిమితంగానే ఉండొచ్చు. కానీ, మేం కొన్ని లోపాలను సరిదిద్దుతున్నామని భావిస్తున్నాం‘ అని ఆయన చెప్పారు.

Image copyright KOREAN CENTRAL NEWS AGENCY

ఐక్యరాజ్యసమితి విధించిన ఆంక్షలను ధిక్కరిస్తూ కిమ్ తరచూ అణు ప్రయోగాలు, క్షిపణి పరీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు.

ప్యోంగ్యాంగ్ ప్రణాళికను కిమ్ రహస్యంగా ఏమీ ఉంచడం లేదు. అమెరికా భూ భాగాన్ని తాకే క్షిపణులను అభివృద్ధి చేసినట్లు చెప్పుకొస్తున్నారు. హైడ్రోజన్ బాంబును కూడా అభివృద్ధి చేసినట్లు ప్రకటించారు.

అణుదాడి హెచ్చరికలు ఉత్తరకొరియా నుంచి పెరుగుతున్నాయని గత నెలలోనే అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మట్టిస్ చెప్పారు.

గత వారం ట్రంప్ ఆసియా పర్యటన ముగించుకొని వచ్చిన అనంతరం ఈ ప్రకటన వెలువడింది.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)