గుజరాత్: '2002 అల్లర్ల తర్వాత 15 ఏళ్లుగా ఓట్లేసినా ఒరిగిందేమీ లేదు'

  • 22 నవంబర్ 2017
రేష్మా ఆపా

గుజరాత్‌లోని అహ్మదాబాద్ సరిహద్దుకు దగ్గరలో మాకో పెద్ద పర్వతంలా సిటిజన్‌నగర్‌ కనిపించింది. అహ్మదాబాద్ చెత్తనంతా ఈ ప్రాంతంలోనే డంప్ చేస్తారు.

ఎటు చూసినా గ్యాస్, పొగ, చెత్తా కనిపించే సిటిజన్‌నగర్‌లో రేష్మా ఆపా నివాసముంటున్నారు.

సిటిజన్‌నగర్‌లో రేష్మాతోపాటు గుజరాత్ అల్లర్ల బాధితులైన మరో 100 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇక్కడ రోడ్డు సదుపాయం లేదు. తికమకపెట్టే రోడ్ల ద్వారా ఎలాగోలా మేం ఇక్కడకు చేరుకున్నాం.

సాయంత్రం ఆరు గంటలకు సిటిజన్‌నగర్‌లోని రాహత్ క్లినిక్ వద్ద ఇక్కడి కుటుంబాలను కలిశాను. రాహత్ క్లినిక్‌ను కూడా సిటిజన్‌నగర్‌లానే కొందరు సామాజిక కార్యకర్తలు ఏర్పాటు చేశారు. దీనికి ఎటువంటి ప్రభుత్వ సహకారం అందలేదు.

"అల్లర్ల తర్వాత ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోలేదు. ప్రతిపక్ష పార్టీలు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. ఇక్కడ ఇళ్ళు, పాఠశాలలు, వైద్య సదుపాయం, ఉపాధి వంటి సదుపాయాలేవీ లేవు. 15 ఏళ్లు ఓట్లు వేసి చూశాం. ఈ సారి ఎన్నికల్లో ఎవరికీ ఓట్లు వేయకూడదని నిర్ణయించుకున్నాం" అని అహ్మదాబాద్‌లోని నరోడా పాటియా నుంచి ఇక్కడికి వలసవచ్చిన రేష్మా తెలిపారు.

రెండు గదుల ఇళ్లు వరుసగా ఇక్కడున్నాయి. ఇంటికి బయట కరెంటు మీటర్లు కనిపించాయి. ఇక్కడ డ్రైనేజీ, రోడ్డు వంటి సదుపాయాలు లేవు. ప్రభుత్వ పాఠశాల కూడా ఇక్కడినుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది కానీ అక్కడకు వెళ్లేందుకు రిక్షా, బస్సు సౌకర్యం ఏదీ లేదు.

స్కూలుకు వెళ్లాలంటే కూడా డబ్బు ఖర్చు పెట్టాల్సిందే. ఇక ప్రభుత్వం నుంచి ఓ సామాన్య ఓటరు కోరుకునేదేమిటి?

ఇక్కడే అబ్రార్ అలీ సయ్యద్ రాహత్ క్లినిక్‌ను స్థాపించారు. ఆయనే నిధులు సమకూర్చి డాక్టర్లను నియమించారు. గుజరాత్‌లో అల్లర్లు జరిగినప్పుడు ఆయనకు 22 ఏళ్లు.

2002 ఫిబ్రవరి, మార్చిలో అల్లర్లు చెలరేగినప్పుడు అహ్మదాబాద్‌లోని షా ఆలం ప్రాంతంలో ఉన్న తన ఇంటి నుంచి పరారై సురక్షిత ప్రాంతాల్లో అబ్రార్ అలీ తలదాచుకున్నారు.

గుజరాత్ అల్లర్లకు సంబంధించి కొన్నేళ్ల పాటు పీడకలలు వచ్చేవి. అల్లర్లలో హింసను ప్రేరేపించిన 'ముల్లా మియా' వ్యాఖ్యలు గుర్తుకొచ్చినప్పుడల్లా భయంతో వణికిపోయేవాడినని ఆయన తెలిపారు.

ఇప్పుడు అబ్రార్ అలీ సయ్యద్ అహ్మదాబాద్ యూనివర్సిటీలో బోధిస్తున్నారు. ఏ పార్టీని నమ్మకూడదనీ, దానికి బదులు ప్రజలను నమ్మడమే ఉత్తమమని ఈ పదిహేనేళ్లలో నేర్చుకున్నానని ఆయన తెలిపారు.

"2002 అల్లర్ల తర్వాత బీజేపీ ప్రభుత్వం హిందూ, ముస్లింల మధ్య విభేదాల్ని పెంచింది. 1980లో కాంగ్రెస్ కూడా ఇలానే మతతత్వాన్ని రెచ్చగొట్టింది. నేడు రాహుల్ గాంధీ ముస్లిం నాయకులను ఎందుకు కలవట్లేదు" అని ఆయన ప్రశ్నించారు.

ఈ పదిహేనేళ్లలో వచ్చిన మార్పేమిటో వారి సూటి ప్రశ్నల్లో కనిపిస్తోంది.

అహ్మదాబాద్ నుంచి 4 గంటల ప్రయాణం చేసి బిల్కిస్ సొసైటీకి చేరుకున్నాం. ఇక్కడ అల్లర్లలో దెబ్బతిన్న కుటుంబాలు 36 ఉంటున్నాయి. ఇక్కడ కూడా రోడ్లు, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాలేవీ లేవు.

కనీసం ఇక్కడ గ్యాస్ కనెక్షన్ కూడా ఎవరికీ లేదు. వీరంతా ఇప్పటికి ఇక్కడ కట్టెల పొయ్యిపైనే వంట చేస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల మధ్యనే ఇక్రా అస్లం షికారి తన స్కూలు చదువును పూర్తిచేశారు. ముస్లింల ద్వారా నడిచే ఓ స్కూల్లో ఆమె చదువుకున్నారు.

"ఐదేళ్ల క్రితం కూడా మీడియా వాళ్లు, రాజకీయ నాయకులు ఇక్కడకు వచ్చారు. అయినా ఎటువంటి మార్పూ రాలేదు. మేమెందుకు మీతో మాట్లాడాలి? అసలు మార్పు వస్తుందా?" అని ఆమె ప్రశ్నించారు.

వడోదర నుంచి వలస వచ్చిన కుటుంబాలే ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. టైలరింగ్, అగర్బత్తి ఫ్యాక్టరీలలో పనిచేయడమే వారికి జీవనోపాధి.

సిటిజన్‌నగర్‌లో ఉన్న ఇళ్లతో పోలిస్తే ఇక్కడ చాలా చిన్న చిన్న ఇళ్లున్నాయి. "కొన్నిసార్లు ఇంట్లో ఉన్న పురుషులు పొలాలకు వెళ్లి పడుకోవాల్సి వస్తుంది" అని 34 ఏళ్ల సమీరా హుస్సేన్ తెలిపారు.

సమీరా హుస్సేన్‌కు ఇక్కడకు వలస వచ్చిన ఓ వ్యక్తితో వివాహం జరిగింది. అంతకన్నా తనకు మరో అవకాశం లేదని ఆమె తెలిపారు.

ఆమె ఎనిమిదో తరగతి వరకూ చదువుకున్నారు. అల్లర్లకు ముందు కూడా ముస్లిం అమ్మాయిలు ఇంతే చదువుకునేవారని ఆమె చెప్పారు.

ఇప్పుడు ఆమెకు 10 ఏళ్ల ఓ కూతురు, ఓ చిన్న అబ్బాయి ఉన్నాడు.

"మా కోసం ఏ పార్టీ ఏమీ చేయలేదు. ఇళ్లు, నష్టపరిహారం ఏమీ ఇవ్వలేదు. మా పిల్లల గురించైనా పట్టించుకోవాలి. వారు చదువుకునేలా, కొత్త నైపుణ్యాలు నేర్చుకొని ఉద్యోగాలు సంపాదించుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి." అని ఆమె తెలిపారు.

వకార్ కాజీ 'ఉర్జా ఘర్' అనే ఓ స్వచ్చంద సంస్థను నడుపుతున్నారు. ఈ సంస్థ పిల్లలు, గిరిజన, ముస్లిం యువత సంక్షేమం కోసం పనిచేస్తుంది.

గుజరాత్ అల్లర్ల తర్వాత ముస్లిం మహిళలు తమ సమస్యల పరిష్కారం కోసం ధైర్యంగా ముందుకొచ్చారని ఆయన అన్నారు.

"గుజరాత్ అల్లర్ల తర్వాత పురుషుల్లో తీవ్రమైన భయం నెలకొంది. అప్పుడు మహిళలే పోలీసు, సహాయక కమిటీలు, న్యాయవ్యవస్థ, ఉపాధి వంటి అంశాల్లో ధైర్యంగా ముందుకొచ్చి తమ స్వరాన్ని వినిపించారు." అని ఆయన అన్నారు.

ఇప్పుడు విద్య ప్రాముఖ్యతను అర్థం చేసుకొని మహిళలు ముందుకు సాగుతున్నారని ఆయన తెలిపారు. ముస్లింలు, ముస్లిం సంస్థలు ఈ విషయంలో ప్రముఖ పాత్ర పోషించాయని ఆయన తెలిపారు.

క్లినిక్ ద్వారా సేవలందించిన తర్వాత ఇప్పుడు సిటిజన్‌నగర్‌లోని పిల్లలకు విద్య అందించాలని అబ్రార్ ప్రయత్నిస్తున్నారు.

తాను చేసే ఈ ప్రయత్నాల్లో ఎందరో ముస్లిమేతరులు కూడా ఉన్నారని ఆయన అన్నారు. ఈ 15 ఏళ్లలో తనకు రాజకీయాలపై నమ్మకం ఎంత సన్నగిల్లిందో, మానవత్వంపై అంతే పెరిగిందని ఆయన అన్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం