ప్రెస్‌ రివ్యూ: ఐకానిక్ ప్రాంతాల జాబితాలో చార్మినార్

  • 22 నవంబర్ 2017
Image copyright Getty Images

నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌లోని చార్మినార్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. స్వచ్ఛభారత్ మిషన్ దేశవ్యాప్తంగా ఎంపికచేసిన రెండో దశ పది ఐకానిక్ ప్రాంతాల జాబితాలో చార్మినార్‌కు స్థానం లభించింది. ఇందులో భాగంగా చార్మినార్ ప్రాంతాన్ని స్వచ్ఛ మోడల్‌గా తీర్చిదిద్దుతారు. ఈ బాధ్యతను కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ కింద ఎన్టీపీసీ సంస్థకు అప్పగించారు.

దేశవ్యాప్తంగా మొత్తం వంద నగరాలను స్వచ్ఛతకు మోడల్‌గా తీర్చిదిద్దాలని స్వచ్ఛభారత్ మిషన్ సంకల్పించింది. మొదటిదశలో అమృత్‌సర్ సహా పది ప్రాంతాలను స్వచ్ఛ ఐకాన్‌గా గుర్తించారు. రెండో దశలో చార్మినార్ సహా పది ప్రాంతాలను ఎంపికచేశారు.

రెండో దశ ఐకానిక్ ప్రాంతాలు ఇవీ: 1.చార్మినార్, 2.గంగోత్రి 3. యమునోత్రి 4. ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ 5. గోవాలోని చర్చ్ అండ్ కాన్వెంట్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సిస్సి 6.ఎర్నాకులంలోని ఆది శంకరాచార్య నివాసం 7. శ్రావణబెళగొళలోని గోమఠేశ్వర్, 8.దేవ్‌ఘర్‌లోని బైజనాథ్‌ధామ్ 9. బీహార్‌లోని గయా త్రిథ్ 10. గుజరాత్‌లోని సోమనాథ్ టెంపుల్.

Image copyright AP Legislature

ఏపీలో ప్రజా సేవల హామీ చట్టం: గడువు మీరితే పరిహారం

ఈనాడు: ప్రభుత్వం, ప్రభుత్వ ప్రాధికార సంస్థల నుంచి పౌరులు తమకు కావాల్సిన సేవలకు దన్నుగా నిలిచే 'ఏపీ ప్రజా సేవల సమకూర్చు హామీ చట్టం-2017'ను శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ చట్టం ద్వారా ప్రజలకు సేవలు అందించడంలో ప్రభుత్వ అధికారుల్లో జవాబుదారీతనం పెంచేలా దీన్ని రూపొందించారు. పరిశ్రమలశాఖ మంత్రి అమరనాథరెడ్డి బిల్లును ప్రవేశపెట్టారు.

ఈ చట్టం కింద ప్రతి వ్యక్తి నిర్ణీత సమయంలోపు సేవలను పొందే హక్కు కలిగి ఉంటారు. పౌరులు ఆన్‌లైన్‌ సేవల కోసం చేసుకున్న ప్రతి దరఖాస్తుకు ఒక నంబరు కేటాయిస్తారు. పరిష్కారానికి నిర్ణీత గడువు సూచిస్తారు. సకాలంలో ఆ పౌరుడికి ఆ సేవలను సంబంధిత శాఖ అందించాలి.

సమస్య పరిష్కారం ఎందుకు ఆలస్యమవుతుందో అధికారులు ముందుగానే దరఖాస్తుదారుకు రాతపూర్వకంగా తెలియజేయాలి. అలా కాని పక్షంలో కాలయాపనకు తగిన పరిహారం చెల్లించాలని కోరుతూ దరఖాస్తుదారు అప్పిలేట్‌ అథారిటీకి అప్పీలు చేసుకోవచ్చు. ఆలస్యం అయినందుకు సంబంధిత అధికారి పౌరుడికి జరిమానా చెల్లిస్తారు.

Image copyright KTR Facebook

గొడ్డుకారం ఇంకెన్నాళ్లు?: కేటీఆర్‌ను ప్రశ్నించిన ఓ నిరుద్యోగి

ఆంధ్రజ్యోతి: 'గొడ్డు కారం తింటున్నం. అదీ ఒక్క పూట తిని పస్తులుంటున్నం. ఇంకా ఎన్నేళ్లు ఇలా? నోటిఫికేషన్లు ఏవి? మాకు ఉద్యోగాలు వచ్చేది ఎప్పుడు?' అంటూ తెలంగాణ పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారకరామారావును ఓ నిరుద్యోగి ప్రశ్నించారు. దీనికి కేటీఆర్ స్పందిస్తూ.. ''ఉద్యమంలో పాల్గొన్నది మీరు. రాష్ర్టాన్ని తెచ్చింది మీరు. మమ్మల్ని కుర్చీల్లో కూర్చోబెట్టింది మీరు. మీ రుణం తీర్చుకుంటాం. వందకు వంద శాతం ఏడాదిలో 1.12 లక్షల ఉద్యోగాలు భర్తీ చే స్తాం. నోటిఫికేషన్‌ కేలండర్‌ ప్రకటిస్తాం'' అని పేర్కొన్నారు.

సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంగళవారం ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్‌తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయానికి వచ్చిన కేటీఆర్‌ అక్కడి పరిస్థితులను పరిశీలించారు.

'టీఆర్‌టీ నోటిఫికేషన్‌ కొత్త జిల్లాల వారీగా ఇచ్చారు. డీఎస్సీ అయినా ఉమ్మడి జిల్లాల వారీగా ప్రకటించండి' అని అక్కడి ఓ విద్యార్థి కేటీఆర్‌తో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఆయన.. టీఆర్‌టీ భర్తీ విషయంలో సిరిసిల్ల జిల్లా నుంచి తనపైనా ఒత్తిడి ఉందని, డీఎస్సీ ఎలా వేయాలనేది ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

Image copyright Getty Images

ఏపీ వారికి హైదరాబాద్‌లో ఆరోగ్యశ్రీ చికిత్సకు చెల్లు

సాక్షి: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆరోగ్యశ్రీ (ఎన్‌టీఆర్ వైద్యసేవ) హైదరాబాద్‌లో వర్తించదంటూ రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల క్రితం తీసుకున్న నిర్ణయం వేలాది కుటుంబాలను దుఃఖసాగరంలో ముంచుతోంది. గుండె జబ్బులు, కేన్సర్‌ వ్యాధులున్న పద్దెనిమిదేళ్ల లోపు వారికి మాత్రమే హైదరాబాద్‌లో ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందుతుందని, మిగతా 1,042 వ్యాధులకు ఈ పథకం వర్తించదని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తేల్చేసింది.

హైదరాబాద్‌లో గత మూడు దశాబ్దాలుగా ప్రైవేట్‌ ఆసుపత్రులు శరవేగంగా అభివృద్ధి చెందాయి. ప్రపంచస్థాయి అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. చికిత్సల కోసం విదేశాల నుంచి కూడా రోగులు వస్తుంటారు. హైదరాబాద్‌లో లభించే చాలా వైద్య చికిత్సలు ఆంధ్రప్రదేశ్‌లో లభ్యం కావడం లేదు. రాష్ట్రంలో ఎవరికైనా ప్రమాదకరమైన జబ్బులు సోకితే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు వెళ్తుండేవారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా చికిత్స పొందేవారు.

ఏపీలో ప్రభుత్వ పరిధిలో క్యాన్సర్‌ ఆసుపత్రులే లేవు. ఏపీలోని ప్రైవేట్‌ హాస్పిటళ్లలో గుండె, మూత్రపిండాలు, కాలేయం, న్యూరో, గ్యాస్ట్రో ఎంటరాలజీ, హెమటాలజీ, ఆంకాలజీ విభాగాల్లో స్పెషలిస్టులు లేరు. పుట్టుకతోనే మూగ, చెవుడు (బధిరులు) బాధితులు మరింత వేదనకు గురవుతున్నారు. ఆరోగ్యశ్రీ కింద ఆరున్నర లక్షల రూపాయల ఆపరేషన్‌ చేయించుకోవచ్చు. తెలంగాణలో వాసవి, అపోలో ఆసుపత్రుల్లో బధిరులకు ఆపరేషన్లు చేసేవారు. సర్కారు నిర్ణయంతో తెలంగాణలో వైద్యానికి ఏపీ బధిరులు అనర్హులుగా మారారు.

కర్ణాటక రోగులు హైదరాబాద్‌లోని ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్సలు చేయించుకుంటున్నారు. తమ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ కింద ఈ వైద్య సేవలు పొందుతున్నారు.

Image copyright Getty Images

సుప్రీంకోర్టు సహా న్యాయస్థానాల్లో విచారణలన్నీ ఆడియో, వీడియో రికార్డింగ్‌

నవతెలంగాణ: ఉన్నత న్యాయస్థానాల్లో విచారణలను ఆడియో, వీడియో రికార్డింగ్‌ చేయడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అలా రికార్డింగ్‌ చేయడం న్యాయస్థానాల ప్రైవసీకి విఘాతం కలిగిస్తుందన్న వాదనలను న్యాయ మూర్తులు ఏకె గోయెల్‌, యుయు లలిత్‌తో కూడిన సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది.

కోర్టు గదుల్లో ప్రైవసీ ఏమీ ఉండదని, మేమంతా ఇక్కడ కూర్చునేది అందరి కోసమని జస్టిస్‌ గోయెల్‌ స్పష్టం చేశారు. రికార్డు చేయడంలో ఇతర దేశాల్లోని కోర్టులకు అభ్యంతరం లేనప్పుడు మనకెందుకని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. ఇదే అంశం పై ఈ ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు ఇది చేర్పుగా భావిస్తున్నారు.

కనీసం ఒక్కో రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంలోని రెండు జిల్లాల్లోని కోర్టుల్లో సీసీ కెమెరాలను అమర్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మూడు నెలల్లోగా పని పూర్తి చేయాలని సూచించింది. అయితే, సీసీ కెమెరాలకు ఆడియో రికార్డింగ్‌ లేకుండా అమర్చాలని గత ఆదేశాల్లో తెలిపింది. తాజా ఆదేశాల్లో ఆడియో రికార్డింగ్‌ను కూడా చేర్చడం గమనార్హం. సుప్రీంకోర్టు, హైకోర్టులకూ తాజా ఆదేశాలు వర్తిస్తాయి. ఈ రికార్డులను ఆర్‌టీఐ కింద పౌరులు పొందేందుకు వీలు లేదు. అందుకు రాష్ట్రాల్లో హైకోర్టుల నుంచి అనుమతి అవసరం.

Image copyright Twitter

లోకేష్‌ సీఎం అయితే మేం తెలుగు రోహింగ్యాలమవుతాం: పోసాని కృష్ణమురళి

ప్రజాశక్తి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించిన మూడేళ్ల నంది అవార్డుల వివాదంపై సీనియర్‌ నటుడు పోసానికృష్ణ మురళి తనదైన శైలిలో స్పందించారు. 'టెంపర్‌' సినిమాలో ఆయన నటనకుగాను నంది అవార్డు ప్రకటించారు.

'కమ్మ కులస్థుడు కాబట్టి నందిని అందుకున్నాడు అనే నింద నాకొద్దు. ఈ నందిని వినమ్రంగా తిరస్కరిస్తున్నాను. ఈ నందులను రద్దు చేసి చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఐవీఆర్‌ఎస్‌ పద్ధతి అమలుజేసినప్పుడు అవార్డు వస్తే అప్పుడు తీసుకుంటాను' అని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఆధార్‌, ఓటర్‌ కార్డులు లేనివారు నంది అవార్డులను విమర్శిస్తున్నారంటూ మంత్రి నారా లోకేష్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. తాము ఎన్నారైలు అయితే లోకేష్‌ ఎవరని ప్రశ్నించారు. లోకేష్‌కు ఉన్న మనస్తత్వం తెలంగాణ ప్రజలకు ఉంటే... మమ్మల్ని తరిమికొట్టేవారని చెప్పారు. నారా లోకేష్‌ ముఖ్యమంత్రి అయితే తాము తెలుగు రోహింగ్యాలమవుతామని చెప్పారు.

తెలంగాణలో పన్నులు కడుతున్నందుకు తాము ఏపీ గురించి మాట్లాడకూడదా? అని ప్రశ్నించారు. తెలంగాణలో మీకు ఇళ్లు, వ్యాపారాలు లేవా? అని ప్రశ్నించారు. ఒకటి రెండు విమర్శలు చేసినంత మాత్రాన అవార్డులను ఎత్తేస్తారా? అని అన్నారు.

విమర్శించే వాళ్లు నాన్‌ లోకల్‌ అయితే జ్యూరీలో ఉన్న సభ్యుల మాట ఏంటి.. వాళ్లకు కూడా హైదరాబాద్‌లోనే ఆధార్‌ కార్డులున్నాయి కదా, వారు కూడా ఇక్కడే ట్యాక్స్‌లు కడుతున్నారు కదా.. మరి వారిని జ్యూరీలోకి ఎలా తీసుకున్నారని పోసాని ప్రశ్నించారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)