అభిప్రాయం: పరీక్షల ఒత్తిడిని జయించడం ఎలా?

  • 22 నవంబర్ 2017
చదువులు, పరీక్షలు, ఒత్తిడి Image copyright Getty Images

చదువులు, పరీక్షల ఒత్తిడిని జయించడం ఎలా? ఈ 5 మార్గాలలో ప్రయత్నించండి.

తెలంగాణలో ఇటీవలి కాలంలో 60 రోజుల వ్యవధిలో సుమారు 50 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విద్యార్థుల్లో చాలామంది డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని కలలు కన్నవాళ్లే.

విద్యార్థులు పరీక్షలు బాగా రాయాలని, మంచి కెరీర్‌ను నిర్మించుకోవాలని ఎన్నో ఆశలతో ఉంటారు. కానీ కొన్నిసార్లు భరించలేని ఆ ఒత్తిడి వారి ప్రాణాలను హరిస్తోంది.

Image copyright Getty Images

ముందుగానే సంకేతాలను గుర్తించడం:

నిద్ర పట్టకపోవడం, ఆకలి లేకపోవడం, ఉత్సాహం తగ్గిపోవడం వంటివి విద్యార్థుల్లో డిప్రెషన్‌కు మొదటి గుర్తు.

భవిష్యత్తు గురించి నిరాశ, తాము అప్రయోజకులం అన్న భావన, తమను తామే అసహ్యించుకోవడం వంటి వాటి వల్ల వారి ప్రవర్తనలో, ఆలోచనల్లో మార్పులు వస్తాయి. ఇలాంటి వారు నలుగురితో కలవకపోవడం, మాట్లాడకపోవడం గుర్తించవచ్చు.

గతంలో ఆనందాన్నిచ్చే ఏ కార్యకలాపాల్లోనూ ఆసక్తి లేకపోవడం, ప్రతిదానికీ చిరాకు పడడం, తరచుగా వాదనకు దిగడం కూడా ఉంటాయి.

Image copyright Getty Images

చదువులు, పరీక్షలకు సంబంధించిన ఒత్తిడిని జయించే ఐదు మార్గాలు:

  1. ఒత్తిడిని జయించే ఆరోగ్యకరమైన అలవాట్లను అలవాటు చేసుకోవడం - ఆటలు, రాయడం, చదవడం, పెయింటింగ్, ఏదైనా సంగీత పరికరాన్ని వాయించడం, వంట చేయడం వంటివి విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి.
  2. చెడు అలవాట్లను ఆశ్రయించొద్దు - ఒత్తిడిని తగ్గించుకోవడానికి డ్రగ్స్, ఆల్కహాల్‌ తీసుకోవడం, మొబైల్‌ను ఎక్కువగా ఉపయోగించడం లాంటి వాటి వల్ల ఆరోగ్యం పాడవడంతో పాటు దీర్ఘకాలంలో ఆ అలవాట్లు ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తాయి.
  3. ఇతరులతో పంచుకోండి - విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పలు మార్గాలు అవసరం. తమకు ఎదురయ్యే సవాళ్లను, సమస్యలను తోటి విద్యార్థులతో పంచుకోవడం ద్వారా విద్యార్థులు వాటిని సులభంగా పరిష్కరించుకోగలరు. దీని వల్ల వారిలో ఈ పోరాటంలో తాము ఒంటరి కాదన్న భావం ఏర్పడుతుంది. విద్యాసంస్థలోనే సామాజిక కార్యకర్తలు, కౌన్సెలర్లతో ఒక సహాయక బృందం ఉంటే విద్యార్థులు సులభంగా వారి సహాయాన్ని పొందుతారు. అలాంటి సదుపాయం ఉంటే విద్యార్థికి ఆ విద్యాసంస్థ పట్ల వ్యతిరేకత తగ్గుతుంది. విద్యార్థులు తమ సమస్యలను ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా తల్లిదండ్రులతో పంచుకోగలిగే అవకాశం ఉండాలి. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల మధ్య సంభాషణ కేవలం చదువు, పరీక్షల గురించి మాత్రమే ఉండకూడదు.
  4. ప్రత్యామ్నాయ అవకాశాలు - విద్యార్థులు ప్రత్యామ్నాయ ఉపాధి గురించి కూడా ఆలోచించుకోవాలి. చాలా సందర్భాల్లో విద్యార్థులు చదువులో ఏదో ఒకే లక్ష్యాన్ని, ఉదాహరణకు - చదువులో ఫస్ట్ రావాలని, ఏదో ఒక కాలేజీలో సీటు రావాలని, ఎంట్రన్స్ పరీక్షలో పాస్ కావాలని లక్ష్యంగా నిర్దేశించుకుంటారు. ప్రత్యామ్నాయ ఆలోచన లేకపోవడం వల్ల అది కాకుంటే ఇంకేదీ లేదు అన్న నిరాశాపూరిత దృక్పథం ఏర్పడుతుంది. చాలా మంది ప్రత్యామ్నాయ అవకాశాల గురించి ఆలోచించకుండా, ఉన్న అవకాశాలను పరిమితం చేసుకుంటారు. దీని వల్ల ఒత్తిడి పెరిగి, ఫలితం తమకు అనుకూలంగా రానపుడు వారిలో వైఫల్య భావం ఏర్పడుతుంది.
  5. విశాల దృష్టిని అలవర్చుకోండి - విద్యార్థులు తమకున్న శక్తిసామర్థ్యాలపై నమ్మకముంచుకోవాలి. వారికున్న శక్తియుక్తులను ఉపయోగించుకుంటే వారు సుదూర లక్ష్యాలను చేరుకోగలరు. కేవలం వైఫల్యాలు, పరిమితుల మీదే దృష్టి పెట్టడం వల్ల నిరాశాపూరితమైన ఆలోచనలు వస్తాయి. విద్యార్థులు తరచుగా తమలోని లోపాల గురించి మాత్రమే ఆలోచిస్తుంటారు. అలా కాకుండా వ్యక్తిత్వం, సామర్థ్యం, తెలివి వంటి వాటి విషయంలో తమకు మాత్రమే ప్రత్యేకమైన లక్షణాలను ఉపయోగించుకోవాలి.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

సంబంధిత అంశాలు