బెంగళూరు ఇందిర క్యాంటీన్లు: కడుపు నింపుతాయి సరే.. మరి ఓట్లు రాలుస్తాయా!

  • 25 నవంబర్ 2017
బెంగళూరులో ఇందిర క్యాంటీన్ వెలుపల అల్పాహారం తింటున్న ఇద్దరు యువతీ యువకులు Image copyright Asif Saud

బెంగళూరులో సిటీ మార్కెట్ సమీపంలో ఉంది ఆ క్యాంటీన్. ఉదయం ఏడు గంటలు దాటినప్పటి నుంచి దాని ముందు జనం పోగవుతున్నారు. ఏడున్నర గంటలకు తలుపులు తెరచుకున్నాయి.

జనం బిలాబిలా లోపలకు వెళ్లి, క్యూ కడుతున్నారు. కొంత తోపులాట కూడా కనిపిస్తోంది. క్యూ వేగంగా కదులుతోంది.

మగవారు, ఆడవారు ఒక చిన్న కిటికీ దగ్గరకు వెళ్తున్నారు. అక్కడ డబ్బులు ఇచ్చి తలా ఒకటి, లేదా రెండు ఆకుపచ్చ రంగు టోకెన్లు తీసుకొంటున్నారు.

అక్కడి నుంచి ఒక కౌంటరు దగ్గరకు వెళ్తున్నారు. టోకెన్లు కౌంటరులో ఇచ్చి ఆహారం తీసుకొంటున్నారు.

తీసుకున్న ఆహారం తినేందుకు క్యాంటీన్ లోపల ఉన్న బల్లల వద్దకు లేదా వెలుపలకు వెళ్తున్నారు.

Image copyright Asif Saud

నేను (బీబీసీ ప్రతినిధి గీతా పాండే) అల్పాహారం (బ్రేక్ ఫాస్ట్) టోకెన్లు తీసుకొన్నా. మెనూలో ఇడ్లీలు, పొంగలి, కొబ్బరి చట్నీ ఉన్నాయి. వంటకాలు బాగున్నాయి... వేడి వేడిగా... రుచికరంగా..!

అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే- ఇక్కడ ఏ వంటకమైనా కేవలం ఐదు రూపాయలే!

'ఇందిర క్యాంటీన్లు' పేరుతో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ క్యాంటీన్లు ఏర్పాటు చేసింది.

ఆగస్టు 16న బెంగళూరులో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేతుల మీదుగా వీటిని ప్రారంభించారు.

Image copyright Asif Saud

ఒక కేంద్రీకృత వంటశాలలో ఆహారం వండి, సమీపంలోని క్యాంటీన్లకు తరలిస్తారు.

తమిళనాడులో బాగా ప్రాచుర్యం పొందిన 'అమ్మ క్యాంటీన్ల'ను ప్రేరణగా తీసుకొని వీటిని ఏర్పాటు చేసినట్లు కనిపిస్తోంది.

తమిళనాడులో జయలలిత హయాంలో అమ్మ క్యాంటీన్లను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో కూడా ఇలాంటి క్యాంటీన్లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించాయి.

నేను నిరుడు అమ్మ క్యాంటీన్‌లో తిన్నాను. అక్కడ ఆహారం బాగుంది. ఇందిర క్యాంటీన్‌లో ఇంకా బాగుంది.

Image copyright Asif Saud

'రూ.25 మిగులుతోంది'

ఈ క్యాంటీన్లకు ఎక్కువగా పేదలు, దినసరి కూలీలు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులు, యాచకులు వస్తుంటారు.

బెంగళూరులో ఒక షాపింగ్ కేంద్రంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే మొహమ్మద్ ఇర్షద్ అహ్మద్ నాతో మాట్లాడుతూ- ఇందిర క్యాంటీన్‌కు రోజూ వస్తానని చెప్పారు.

''ఇక్కడ వంటకాలు చాలా బాగుంటాయి. ఇంతకుముందు దగ్గర్లోని ఒక రెస్టారెంట్లో తినేవాణ్ని. అల్పాహారానికి రూ.30 అయ్యేది. ఇక్కడైతే 5 రూపాయలే. రూ.25 మిగులుతోంది. ప్రభుత్వం కర్ణాటక అంతటా ఇలాంటి క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది'' అని ఆయన సూచించారు.

Image copyright Asif Saud
చిత్రం శీర్షిక ‘‘క్యాంటీన్ వల్ల నా పని తేలికయ్యింది. క్యాంటీన్‌లో ధరలు చాలా తక్కువ’’ అని లక్ష్మి సంతోషం వ్యక్తంచేశారు.

పొద్దున పూట వండే పని తప్పింది!

ఇందిర క్యాంటీన్‌కు వచ్చే లక్ష్మి అనే మహిళను నేను పలకరించాను.

ఆమె రోజూ మార్కెట్‌లో పండ్లు కొని, ఓ పాఠశాల వెలుపల అమ్ముతుంటారు.

''ఈ క్యాంటీన్ పుణ్యమా అని నాకు ఇంటి దగ్గర పొద్దున పూట వండే పని తప్పింది. నా పని తేలికయ్యింది. క్యాంటీన్‌లో ధరలు చాలా తక్కువ. నేను భరించగలిగిన స్థాయిలోనే ఉన్నాయి. వంటలు కూడా చాలా బాగుంటాయి'' అని లక్ష్మి సంతోషం వ్యక్తంచేశారు.

క్యాంటీన్‌కు దగ్గర్లో ఒక లాడ్జీలో ఉండే మోహన్ సింగ్ అనే వ్యక్తి అయితే మూడు పూటలా ఇక్కడే తింటారు.

ఇక్కడ మూడు పూటలకూ కలిపి తనకు కేవలం రూ.40 అవుతుందని, బయట తింటే బాగా ఖర్చవుతుందని, గతంలో ఇంచుమించు రూ.140 అయ్యేదని ఆయన చెప్పారు.

Image copyright Asif Saud
చిత్రం శీర్షిక బీబీసీ ప్రతినిధి గీతా పాండే రెండు ఇందిర క్యాంటీన్లలో ఆహారం తిని చూశారు.

జయ విజయంలో అమ్మ క్యాంటీన్ల పాత్ర

ఇలాంటి క్యాంటీన్ల నిర్వహణతో ప్రభుత్వ ఖజానాపై భారీగా భారం పడుతుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తుంటారు.

అయితే రోజుకు కనీసం రూ.70 ఆదాయం కూడా లేని ప్రజలు కోట్ల సంఖ్యలో ఉన్న భారత్‌లో ఇలాంటి పథకాలు విజయవంతమవుతున్నాయి.

2016 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత విజయానికి అమ్మ క్యాంటీన్ల పథకం ఒక ప్రధాన కారణమని ఎంతో మంది విశ్లేషకులు చెబుతారు.

Image copyright Asif Saud

ఓట్లపై కాంగ్రెస్ ఆశలు

కర్ణాటక అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్నాయి.

ఇందిర క్యాంటీన్లను పేదల ఆకలి తీర్చేందుకే ఏర్పాటు చేశామని పాలనా యంత్రాంగం చెబుతున్నా, వచ్చే సంవత్సరం ప్రారంభంలో కర్ణాటకలో ఎన్నికలు జరగాల్సిన నేపథ్యంలో దీని వెనుక రాజకీయ ఉద్దేశం ఉందన్నది స్పష్టం.

ఈ పథకం తమకు ఓట్లు తెచ్చిపెడుతుందని కాంగ్రెస్ ఆశిస్తోంది.

''పేదలకు ఆహారం అందించాలని మా ముఖ్యమంత్రి నిర్ణయించారు'' అని ఇందిర క్యాంటీన్ల వ్యవహారాలు చూసే ఉన్నతాధికారి మనోజ్ రంజన్ బీబీసీతో చెప్పారు.

''ఈ క్యాంటీన్లు ముఖ్యంగా వలసవచ్చేవారు, క్యాబ్ డ్రైవర్లు, విద్యార్థులు, ఉద్యోగాలు చేసే దంపతుల కోసం ఉద్దేశించినవి. వారనేకాదు, ఇక్కడ ఎవరైనా తినొచ్చు'' అని ఆయన వివరించారు.

Image copyright Asif Saud

ఇందిర క్యాంటీన్ల పథకంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఏప్రిల్‌లో ప్రకటన చేశారు.

ప్రణాళికను ఆచరణలోకి తెచ్చేందుకు మనోజ్ రంజన్ బృందం రేయింబవళ్లు శ్రమించింది.

ఈ క్యాంటీన్లలో వాటర్ కూలర్లు, వృద్ధులు కూర్చోవడానికి ఏర్పాట్లు, మరుగుదొడ్లు కూడా ఉన్నాయి.

రోజుకు రెండు లక్షల భోజనాలు

ప్రస్తుతం బెంగళూరులో 152 ఇందిర క్యాంటీన్లు ఉన్నాయి. వీటిలో రోజూ రెండు లక్షలకు పైగా భోజనాలు అవుతున్నాయి.

రోజూ మూడు లక్షల భోజనాలు అయ్యేలా నవంబరు చివర్లోగా క్యాంటీన్ల సంఖ్యను 198కి పెంచాలనే ప్రణాళికపై మనోజ్ రంజన్ బృందం పనిచేస్తోంది.

ప్రభుత్వం జనవరిలోగా ఈ పథకాన్ని రాష్ట్రమంతటా విస్తరించనుంది. అప్పుడు మొత్తం క్యాంటీన్ల సంఖ్య 300పైనే ఉంటుంది.

Image copyright Asif Saud

ప్రభుత్వం మారితే ఎలా?

మధ్యాహ్నం అయ్యే సరికి మళ్లీ ఆకలి వేయడంతో బెంగళూరులోనే మార్ఖమ్ రోడ్ ప్రాంతంలో ఉన్న మరో ఇందిర క్యాంటీన్‌కు వెళ్లాను.

అల్పాహారం తీసుకున్న సిటీ మార్కెట్ ప్రాంతంలోని క్యాంటీన్‌తో పోలిస్తే ఇక్కడ జనం పలుచగా ఉన్నారు.

తినేవారిలో ఆఫీసు వర్కర్లు, పాఠశాల విద్యార్థులు కనిపించారు. ఇక్కడ సాంబార్, అన్నం తిన్నాను. బాగుంది.

నాతో పాటు భోజనం చేసిన వెంకటేశ్ అనే వ్యక్తితో నేను మాట్లాడాను. ప్రభుత్వం మారితే ఈ క్యాంటీన్లను మూసేస్తారనే అనుమానం ప్రజల్లో ఉందని ఆయన చెప్పారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే వీటి పరిస్థితి ఏమిటని నేను మనోజ్ రంజన్‌ను అడిగాను.

''ఇది పౌరులే కేంద్రంగా ఉన్న పథకం. అధికారంలో ఎవరున్నా కొనసాగుతుంది'' అని ఆయన బదులిచ్చారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు