కవల్‌ప్రీత్‌‌కౌర్: పాకిస్తాన్ వ్యతిరేక పోస్టర్ గర్ల్‌గా చూపొద్దన్న భారత విద్యార్థిని

  • 24 నవంబర్ 2017
కవల్‌ప్రీత్‌కౌర్ అసలు ట్వీట్ Image copyright Kawalpreet Kaur
చిత్రం శీర్షిక కవల్‌ప్రీత్‌కౌర్ జూన్‌లో పోస్ట్ చేసిన అసలు ఫొటో

భారత విద్యార్థిని ట్విటర్‌లో పోస్టు చేసిన ఒక ఫొటోను వక్రీకరించి.. ఆ విద్యార్థిని తన దేశాన్ని ద్వేషిస్తున్నట్లుగా చూపుతూ ఒక అనధికారిక పాకిస్తానీ డిఫెన్స్ బ్లాగ్ ట్విటర్‌లో పోస్టు చేసింది. ఆ విద్యార్థిని పిలుపుతో సదరు పాకిస్తానీ డిఫెన్స్ అకౌంట్‌ను సస్పెండ్ చేసింది ట్విటర్. పాకిస్తానీ దుష్ప్రచారంపై 'విజయం'గా భారత మీడియా దీన్ని కీర్తించింది. కానీ ఆ కథనం సరికాదని ఆ విద్యార్థిని కవల్‌ప్రీత్‌కౌర్ అంటున్నారు.

ఆ ట్వీట్లలో ఏముంది?

రాజధాని దిల్లీలోని 16వ శతాబ్దపు జామా మసీదు ముందు నిల్చొని.. "నేనొక భారత పౌరురాలిని. మా రాజ్యాంగపు లౌకిక విలువలను నేను పాటిస్తాను. మా దేశంలో ముస్లింలను కొట్టిచంపుతున్న మతతత్వ మూకలకు వ్యతిరేకంగా నేను రాస్తాను. #CitizensAgainstMobLynching" అని రాసివున్న ప్లకార్డును చేతుల్లో పట్టుకుని చూపుతూ దిగిన ఫొటోను కవల్‌ప్రీత్ కౌర్ గత జూన్ నెలలో ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

హిందువులకు పవిత్రమైన గోవుల రక్షణ పేరుతో ముస్లింలు, హిందువులపై పెరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన 'నాట్ ఇన్ మై నేమ్' (నా పేరుతో కాదు) ఉద్యమంలో భాగంగా జూన్ నెలలో తాను ఈ ఫొటో దిగినట్లు కౌర్ బీబీసీతో పేర్కొన్నారు.

పాకిస్తాన్ డిఫెన్స్ అకౌంట్‌ ఆమె ఫొటోను మార్పుచేసి, ఆమె చేతిలో ఉన్న ప్లకార్డులోని మాటలను తొలగించి.. "నేను భారతీయురాలిని. కానీ నేను భారత్‌ను ద్వేషిస్తున్నా. ఎందుకంటే నాగాలు, కశ్మీరీలు, మణిపురీలు, హైదరాబాద్, జునాఘడ్, సిక్కిం, మిజోరం, గోవా వంటి దేశాలను ఆక్రమించిన వలసవాద దేశం భారతదేశం కనుక" అనే వ్యాఖ్యలు పెట్టింది.

ఇలా మార్చిన ఫొటోకు "భారతీయులు చివరికి నిజం తెలుసుకుంటున్నారు. వారి దేశం నిజానికి ఒక వలసవాద దేశం" అనే ట్వీట్‌ను జోడించి ట్విటర్‌లో పోస్టు చేసింది.

Image copyright Kawalpreet Kaur
చిత్రం శీర్షిక పాకిస్తాన్ డిఫెన్స్ పేరుతో చేసిన ట్వీట్ స్క్రీన్‌షాట్‌ను కవల్‌ప్రీత్‌కౌర్ పోస్ట్ చేశారు

పాకిస్తాన్ డిఫెన్స్ ఎవరిది?

"పాకిస్తాన్ రక్షణ, వ్యూహాత్మక వ్యవహారాలు, భద్రతా అంశాలు, ప్రపంచ రక్షణ, సైనిక వ్యవహారాలన్నీ ఒకచోట లభించే వనరు" అని పాకిస్తాన్ డిఫెన్స్ తన గురించి పేర్కొంది. పాకిస్తాన్ ప్రభుత్వానికీ దీనికీ అధికారికంగా సంబంధం లేదు.

అయితే ఈ ట్విటర్ అకౌంట్‌ను సైనిక, పాకిస్తానీ వ్యాఖ్యాతలు చాలా మంది ఫాలో అవుతున్నారు. ఈ అకౌంట్ ప్రభుత్వ అజెండాను అనుసరిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఖాతా తీవ్ర మితవాద సమాచార ప్రచారానికి పేరు గాంచింది. అధికంగా దేశంలోని పాత్రికేయులు, లౌకిక గళాన్ని లక్ష్యంగా చేసుకుంది.

తాజా పరిణామాలపై స్పందించాలన్న బీబీసీ విజ్ఞప్తులకు ఈ అకౌంట్ స్పందించలేదు.

పాకిస్తాన్ డిఫెన్స్ ట్విటర్ అకౌంట్‌ను సస్పెండ్ చేసినప్పటికీ.. దాని వెబ్‌సైట్ క్రియాశీలంగానే ఉంది. ఫేస్‌బుక్‌లో దానికి 80 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు.

పాకిస్తాన్ డిఫెన్స్ తన ఫొటోను వక్రీకరించి చేసిన పోస్టు గురించి తన ఫ్రెండ్ ఒకరు తనను అప్రమత్తం చేశారని కౌర్ పేర్కొన్నారు.

"ట్విటర్ హ్యాండిల్‌ను బట్టి అది వెరిఫైడ్ అకౌంట్ అని తెలుసుకున్నా. దీంతో ఆ ఫొటోను తొలగించి, క్షమాపణ చెప్పాలని కోరాను. కానీ వారు నా జవాబును రీట్వీట్ చేస్తూ.. కశ్మీర్‌కు భారతీయులు ఏం చేశారో అప్రమత్తం చేయడానికే అలా చేశామన్న సందేశాన్ని జోడించారు. అది చాలా అసంబద్ధంగా ఉంది" అని ఆమె బీబీసీకి చెప్పారు.

దీంతో సదరు అకౌంట్ మీద ట్విటర్‌కు ఫిర్యాదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు కౌర్. దీనికి భారత్‌లోనూ, పాకిస్తాన్‌లోనూ ప్రతిస్పందన లభించింది. నిజానికి వక్రీకరించిన తన ఫొటోను తాను చూడటానికి ముందుగానే చాలా మంది పాకిస్తానీలు తనకు మద్దతుగా స్పందించారని ఆమె తెలిపారు.

ఈ నేపథ్యంలో సదరు అకౌంట్‌ను ట్విటర్ శనివారం నాడు సస్పెండ్ చేసింది. దీనిపై భారతీయ మీడియాలో పతాకశీర్షికల్లో వార్తలు వచ్చాయి. చాలా మంది అది పాకిస్తాన్ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన అకౌంట్ అని పొరపాటుగా రాశారు.

గత సెప్టెంబర్‌లో ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధి మలీహా లోధీ.. 'కశ్మీర్‌లో భారత క్రూరత్వానికి సాక్ష్యం' అంటూ ఒక ఫొటోను చూపించి అభాసుపాలైన ఉదంతంతో కొందరు పోల్చారు. అప్పుడు చూపిన ఫొటో వాస్తవానికి అవార్డు విజేత అయిన ఫొటో గ్రాఫర్ హైదీ లెవీన్ 2014లో గాజాలో తీసిన ఒక 17 ఏళ్ల పాలస్తీనా బాలిక ఫొటో అని తేలడంతో పాక్ ఇరకాటంలో పడింది.

కవల్‌ప్రీత్ కౌర్ ఏమంటున్నారు?

తన ఫొటోను వక్రీకరించిన పాకిస్తాన్ డిఫెన్స్ అకౌంట్‌ను సస్పెండ్ చేయడం కౌర్‌కు ఊరటనిచ్చింది. అయితే.. పాకిస్తాన్‌పై భారత 'విజయాని'కి ప్రతీకగా తనను చూపడం ఆమెకు రుచించలేదు. ఈ విషయాన్ని 'సంచలానత్మకం' చేయవద్దని, దీనిని 'భారత్ - పాకిస్తాన్ మధ్య యుద్ధం'గా మార్చవద్దని ఆమె పలుమార్లు విజ్ఞప్తి చేశారు. "భారత వ్యతిరేక, పాకిస్తాన్ వ్యతిరేక మనోభావాలను వ్యాప్తి చేయడానికి నన్ను పావుగా వాడుకోవడానికి నేను ఎప్పటికీ అంగీకరించను" అంటూ ఆమె ఒక ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు.

"అంతకంటే వెగటు పుట్టించే విషయమేమిటంటే.. నేను ట్విటర్‌లో పోస్ట్ చేసిన అదే ఫొటోను అంతకుముందు భారతదేశానికి చెందిన మితవాద బృందాలు వక్రీకరించడం" అని ఆమె బీబీసీకి చెప్పారు.

"నేను సైబర్ సెక్యూరిటీ సెల్‌కు ఫిర్యాదు చేశాను. కానీ ఏ ఒక్కరూ కనీస స్పందన చూపలేదు. దీనినిబట్టి ఏం తెలుస్తోంది? పాకిస్తానీ మితవాద అకౌంట్లు మాత్రమే నన్ను లక్ష్యంగా చేసుకోవడం సరికాదు.. కానీ అదే భారతదేశంలో జరిగితే సరైనదేననా?"

పాకిస్తానీ ట్విటర్ అకౌంట్ మీద తన ఫిర్యాదు విషయంలో మీడియాలో జరిగిన ప్రచారం.. భారతదేశంలో లౌకిక గళాలను ప్రభుత్వ అనుబంధ మితవాద సంస్థలు కూడా లక్ష్యంగా చేసుకుంటున్నాయన్న వాస్తవాన్ని విస్మరించిందని ఆమె తప్పుపట్టారు.

"చాలా మందిని ట్రాల్ చేస్తున్నారు. వారిని చంపుతామని బెదిరింపులూ జారీ చేస్తున్నారు. ఇది ఎంతలా సాగుతోందంటే.. చాలా మంది ప్రభుత్వాన్ని విమర్శించకుండా స్వీయ సెన్సార్ వైపు మొగ్గు చూపుతున్నారు" అని కౌర్ వ్యాఖ్యానించారు.

"నా సొంత దేశం నుంచి కూడా కొంత జవాబుదారీతనం కావాలని నేను కోరుకుంటున్నా" అని చెప్పారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionకశ్మీర్ భారతదేశంలో ఇలా కలిసింది!

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు

చైనాలో అదృశ్యమైన వీగర్ ముస్లిం ప్రొఫెసర్‌ ఏమయ్యారు?

ఏడేళ్ల వయసులో నాపై జరిగిన అత్యాచారాన్ని 74 ఏళ్ల వయసులో ఎందుకు బయటపెట్టానంటే...

రెడ్డి సుభానా: "మా బిడ్డ కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి" అని వీళ్లు కోర్టును ఎందుకు కోరుతున్నారు

IND Vs SA రెండో టెస్టు: ఇన్నింగ్స్ 137 పరుగులతో భారత్ విజయం

కంట్లో ప్రతిబింబించిన చిత్రంతో పాప్‌సింగర్ ఇల్లు కనిపెట్టి వేధించిన యువకుడు

హాగిబిస్‌ పెనుతుపాను: అతలాకుతలమైన జపాన్, 18 మంది మృతి, నీట మునిగిన బుల్లెట్ రైళ్లు

నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసిన తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతి

నింజా టెక్నిక్: వ్యాసం రాయమంటే 'ఖాళీ' పేపర్‌ ఇచ్చిన అమ్మాయికి అత్యధిక మార్కులు.. ఎలా