ప్రెస్ రివ్యూ: మంగళగిరి రాజకీయ హబ్‌ - పార్టీల కార్యాలయాలన్నీ అక్కడే

  • 24 నవంబర్ 2017
Image copyright Wikipedia

ప్రజాశక్తి: గుంటూరు జిల్లా మంగళగిరి ప్రాంతం పొలిటికల్‌ హబ్‌గా మారుతోంది. చెన్నై కోలకతా జాతీయ రహదారిని ఆనుకుని రాజధాని అమరావతికి కూతవేటు దూరంలో ఉండటంతో ఈ ప్రాంతం ప్రాధాన్యం పెరిగింది. అధికార టీడీపీ, ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలు ఇప్పటికే కార్యాలయాల ఏర్పాటును ఖరారు చేశాయి. తాజాగా జనసేన పార్టీ కూడా తన ప్రధాన కార్యాలయాన్ని మంగళగిరి ప్రాంతంలోనే ఏర్పాటు చేయడానికి రైతుల నుంచి భూమిని తీసుకుంది.

రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకున్న ప్రధాన పార్టీలన్నీ కార్యాలయాల ఏర్పాటును వేగవంతం చేశాయి. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మణిపాల్‌ ఆస్పత్రికి సమీపంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. స్థానిక వైసీపీ నేతకు చెందిన రెండెకరాల స్థలంలో పార్టీ కార్యాలయంతో పాటు జగన్‌ నివాస గృహాన్నీ నిర్మిస్తున్నారు.

టీడీపీ తన ప్రధాన కార్యాలయాన్ని తాత్కాలికంగా గుంటూరులో కొనసాగిస్తోంది. శాశ్వత కార్యాలయ భవనాన్ని మాత్రం మంగళగిరి ప్రాంతంలో నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించి మంగళగిరి-ఆత్మకూరు ప్రాంతంలో ఏపీ పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ ఎదురుగా ఈ నెల 26వ తేదీ ఉదయం 5 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేయనున్నారు.

పవన్‌ కల్యాణ్‌ కూడా జనసేన కార్యాలయ ఏర్పాటుకు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చారు. మంగళగిరి మండలంలోని చినకాకాని వద్ద కార్యాలయ నిర్మాణం కోసం 3.42 ఎకరాలను మూడేళ్లకు లీజుకు తీసుకున్నారు. త్వరలో జరగబోయే జనసేన కార్యాలయ శంకుస్థాపనకు పవన్‌ వస్తారని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

Image copyright Getty Images

న ‘పట్టభద్రుల’కు ఉద్యోగాలు తక్కువే

ఆంధ్రజ్యోతి: దేశంలో ఏటా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకుంటున్న విద్యార్థుల్లో అతి తక్కువ మంది మాత్రమే మంచి ఉద్యోగాలు దక్కించుకుంటున్నారు. ఎక్కువ మందికి ఉద్యోగాలే రావడం లేదు. దీనికి కారణం నైపుణ్యాల కొరతేనని 'టైమ్స్‌ ఉన్నత విద్య అంతర్జాతీయ ఉపాధి ర్యాంకింగ్స్‌- 2017' తాజా సర్వే స్పష్టం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వర్సిటీల్లో ఉన్నత విద్యను పూర్తిచేసిన విద్యార్థుల్లో ఎందరు ఉద్యోగాలు పొందుతున్నారనే అంశంపై టైమ్స్‌.. గ్లోబల్‌ యూనివర్సిటీ ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్స్‌ (జీఈఆర్‌) సర్వేను నిర్వహించింది. సర్వేలో భాగంగా ప్రపంచంలోని 150 యూనివర్సిటీలపై 22 దేశాలకు చెందిన రిక్రూటర్లు, వృత్తి నిపుణుల అభిప్రాయాలను సేకరించారు. ఇందులో భారత్‌కు చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) 29వ స్థానంలో నిలిచింది. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఢిల్లీ (ఐఐటీడీ) 145వ స్థానంలో ఉండగా, ఐఐటీ ముంబయి 148వ స్థానంలో ఉంది. ఈ రెండు విద్యా సంస్థలకు గతేడాది ర్యాంకులు దక్కకపోవడం గమనార్హం.

ప్రస్తుతం ప్రపంచంలోని వర్సిటీలన్నీ పట్టభద్రులను తయారు చేయడమేగాక వారికి ఉద్యోగావకాశాలను కల్పించడంపైనా ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు సర్వేలో వెల్లడైంది. కానీ, మన వర్సిటీలు మాత్రం విద్యార్థుల సంఖ్యను పెంచుకునేందుకే ఆసక్తి చూపుతున్నట్లు తేల్చింది. మన పట్టభద్రులు హెచ్‌ఆర్‌ మేనేజ్‌మెంట్‌, నెట్‌వర్క్స్‌, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీలో బాగా వెనకబడి ఉన్నట్లు దాదాపు 35% మంది నిపుణులు అభిప్రాయపడగా; ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, యంత్రాలపై సరైన అవగాహన లేదని మరో 17% మంది పేర్కొన్నారు. విద్యార్థులకు డిజిటల్‌ నైపుణ్యాలను అందించడంలో దేశం ఇంకా వెనుకబడే ఉందని సర్వే తేల్చింది.

టైమ్స్‌ ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో టాప్‌ 200లో చైనా వర్సిటీలు ఏడు ఉండగా.. మన యూనివర్సిటీ ఒక్కటీ లేకపోవడం గమనార్హం. జీఈఆర్‌లో అత్యుత్తమ స్థానం పొందిన ఐఐఎస్‌సీ కూడా 251-300 ర్యాంకుల మధ్య ఉంది. ఐఐటీడీ, ఐఐటీబీ సంస్థలైతే 350 ర్యాంకుల తర్వాతే ఉండడం గమనార్హం. చైనా ఉన్నత విద్యపై 142 బిలియన్‌ డాలర్లు ఖర్చు పెడుతోంది. ఇది ఆ దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 2.28 శాతం. భారత్‌ మాత్రం 1.12 బిలియన్‌ డాలర్లే వెచ్చిస్తోంది.. ఇది మన జీడీపీలో 0.53 శాతం కావడం గమనార్హం. ఇదే సమయంలో యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా పరిశోధనలకు 1 బిలియన్‌ డాలర్లను వెచ్చిస్తోంది. అంటే మనం మొత్తం ఉన్నత విద్యపై ఖర్చుచేస్తున్న దానికి దాదాపు సమానం. అందుకే టాప్‌ 150 యూనివర్సిటీల్లో అమెరికా వర్సిటీలు 35 వరకు ఉన్నాయి. నాణ్యమైన విద్యనందించడంలో మన వర్సిటీలు చాలా వెనకబడి ఉన్నాయని సర్వే స్పష్టం చేసింది.

Image copyright Getty Images

ఇంటర్‌ గడప దాటగానే 15% డ్రాపౌట్‌

సాక్షి: తెలంగాణలో ఏటా వేలాది మంది విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారు.. పదో తరగతి, ఇంటర్‌ పాసైనా పైచదువులకు వెళ్లకుండా పని బాట పడుతున్నారు. ఓవైపు కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు ఈ పరిస్థితికి కారణం కాగా.. విద్యార్థుల్లో పైచదువులపై అవగాహన లోపం, సామర్థ్యాల లేమి మరో కారణంగా నిలుస్తోంది. ముఖ్యంగా ఏటా ఇంటర్మీడియట్‌ తర్వాత సగటున 15 శాతం మంది చదువు ఆపేస్తుండడం ఆందోళనకరమైన అంశం.

విద్యాశాఖ లెక్కలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 2016-17 విద్యా సంవత్సరంలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సర పరీక్షలకు 4,14,213 మంది హాజరుకాగా.. అందులో 3,38,903 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 2,91,088 మంది వివిధ కోర్సుల్లో చేరగా.. 47,842 మంది వివిధ కారణాలతో చదువుకు దూరమయ్యారు. ఇంటర్ తర్వాత 90,631 మంది వివిధ వృత్తి విద్యా కోర్సులు చేస్తున్నారు. డిగ్రీ కోర్సుల్లో 2,00,457 మంది చేరారు.

2016-17 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షలకు 5,97,064 మంది హాజరుకాగా.. అందులో 4,80,831 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 3,99,377 మంది ఇంటర్‌లో, 26,594 మంది ఐటీఐలలో, 31,040 పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో చేరారు. మొత్తంగా పదో తరగతి పూర్తయిన వారిలో... 4,57,011 మంది వివిధ కోర్సుల్లో చేరగా 23,820 మంది చదువును ఆపేసినట్లు ఉన్నత విద్యా మండలి లెక్కలు వేసింది.

Image copyright Getty Images

ఏపీలో బీసీ యువతకు వాహన చోదనలో శిక్షణ

ఈనాడు: ఆంధ్రప్రదేశ్‌లో వెనకబడిన తరగతుల్లోని యువకులకు భారీ వాహనాలను నడపడంలో శిక్షణనిప్పించాలని బీసీ కార్పొరేషన్‌ నిర్ణయించింది. దీనికోసం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సహకారం తీసుకోనుంది. నైపుణ్యాభివృద్ధి కోసం బీసీ కార్పొరేషన్‌కు కేటాయించిన నిధుల నుంచి డ్రైవింగ్‌ శిక్షణ వ్యయాన్ని భరించనున్నారు.

రాష్ట్రంలో లక్షకుపైగా లారీలు డ్రైవర్ల కొరతతో షెడ్‌కే పరిమితమయ్యాయి. ప్రైవేట్‌ ట్రావెల్స్‌నూ ఇదే కొరత వేధిస్తోంది. భారీ వాహనాలను నడిపేందుకు సక్రమమైన శిక్షణనిచ్చే కేంద్రాలు లేకపోవడం ప్రధాన సమస్యగా ఉంది. క్లీనర్‌గా లారీలపైనో, బస్సులపైనో పని చేసి అక్కడి అనుభవంతోనే భారీ వాహనాలను నడుపుతున్నారు. డ్రైవర్‌, క్లీనర్‌ ఉద్యోగాల వైపు వచ్చేవాళ్ల సంఖ్య కూడా తగ్గింది. ఈ అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది.

ఆర్టీసీకి విజయనగరం, విజయవాడ, నెల్లూరు, కడపల్లో డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రాలున్నాయి. విజయవాడ లారీ యజమానుల సంఘానికి ఓ శిక్షణ కేంద్రం, ప్రత్యేకమైన ట్రాక్‌ ఉంది. ఆర్టీసీతోపాటు లారీ యజమానులకు సంబంధించిన శిక్షణ కేంద్రం సేవలనూ ఇందుకు వినియోగించుకోనున్నారు. శిక్షణ పొందినవారికి డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఇప్పించి వారి వివరాలతో డేటాబేస్‌ను ఆర్టీసీ నిర్వహిస్తుంది. సంస్థ అవసరాలకు ఈ డేటాబేస్‌ నుంచి డ్రైవర్లను ఎంచుకునే అవకాశం ఉంటుంది. లారీలు, ప్రైవేట్‌ ట్రావెల్స్‌ యజమానులు కూడా డ్రైవర్ల వివరాలను తెలుసుకొని ఉద్యోగాలకు ఎంపిక చేసుకోవచ్చు. తొలి విడత 200 మందికి శిక్షణనిచ్చే అవకాశాలున్నాయని సమాచారం.

Image copyright facebook

28న హైదరాబాద్ మెట్రో రైల్ ప్రారంభం

నమస్తే తెలంగాణ: హైదరాబాద్ మహానగరానికి మణిహారం కాబోతున్న మెట్రోరైల్ ఈ నెల 28న ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. మియాపూర్ స్టేషన్ నుంచి మెట్రోరైలుకు ప్రధాని పచ్చజెండా ఊపుతారు. అనంతరం ప్రత్యేకంగా ముస్తాబు చేసిన మెట్రోరైల్‌లో ప్రయాణిస్తారు. ఇందుకు సంబంధించి ప్రధాని పర్యటన షెడ్యూల్ ఖరారైంది. తాత్కాలిక షెడ్యూలు ప్రకారం.. ప్రధానమంత్రి నవంబర్ 28న నగరంలో ఏడు గంటలపాటు ఉంటారు.

ప్రధాని బేగంపేట విమానాశ్రయం నుంచి మియాపూర్‌కు వెళ్లి మెట్రోరైల్‌ను ప్రారంభిస్తారని, ఆ తరువాత హెచ్‌ఐసీసీలో జరిగే ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొంటారని సీఎస్ తెలిపారు. మెట్రోరైల్ ప్రారంభోత్సవంతోపాటు, గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ (జీఈఎస్) కూడా ప్రారంభం అవుతున్నందున ప్రధానితో సహా ఈ సదస్సుకు వచ్చే అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లుచేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

హెచ్‌ఐసీసీలో జీఈఎస్‌ను ప్రారంభించడానికి ముందు అక్కడ ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్‌ను ప్రధాని పరిశీలిస్తారని తెలిపారు. ఆ తరువాత పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారని చెప్పారు. ఈ సమయంలో ప్రధాని మోదీ, ఇవాంకతో కలిసి వివిధ సంస్థల సీఈవోలతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొంటారని చెప్పారు. అనంతరం ఫలక్‌నుమా ప్యాలెస్‌లో విదేశీ అతిథులకు ప్రధాని విందు ఇస్తున్నారని, అతిథులను హెచ్‌ఐసీసీ నుంచి తీసుకువెళ్లడానికి పకడ్బందీ ప్రణాళికను రూపొందించాలని సీఎస్ ఆదేశించారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)