తెలంగాణ: భరత్ రెడ్డి దాడి చేసిన ఆ దళితులిద్దరూ ఏమయ్యారు?

  • 24 నవంబర్ 2017
దళిత యువకులపై దాడి చేస్తున్న భరత్‌రెడ్డి Image copyright facebook

నిజామాబాద్ జిల్లాలో అభంగపట్నం దళిత యువకులు ఇద్దరు గత రెండు వారాలుగా కనిపించకుండా పోయారు.

వారిపై దాడికి పాల్పడిన భరత్‌రెడ్డి కోసం పోలీసులు ఇంకా గాలిస్తూనే ఉన్నారు. తమ వారిని భరత్‌రెడ్డే కిడ్నాప్ చేశాడని బాధితుల కుటుంబాలు ఆరోపిస్తున్నాయి.

ఇంతకీ బాధితులిద్దరూ ఏమయ్యారు?

Image copyright facebook

అభంగపట్నంలో ఏం జరిగింది?

తెల్లటి లాల్చీలో గుబురు గడ్డంతో ఉన్న ఓ వ్యక్తి చేతిలో కర్ర పట్టుకుని ఇద్దరు వ్యక్తులను కొడుతూ వారిని మురుగు నీటిలో మునిగేలా చేస్తూ హింసించిన వీడియో నవంబర్ రెండో వారంలో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అది వెంటనే వైరల్‌గా మారింది.

ఆ హింసిస్తున్న వ్యక్తి పేరు భరత్‌రెడ్డి అనే 'బీజేపీ నాయకుడు' అని.. బాధితులిద్దరూ దళితులని వెల్లడవడంతో దళిత వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది.

తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా నవీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అభంగపట్నం గ్రామంలో సెప్టెంబర్ 17వ తేదీన ఈ ఘటన జరిగిందని.. అక్రమంగా జరుగుతున్న మొరం తవ్వకాలను అడ్డుకున్నందునే సదరు దళిత యువకులపై భరత్‌రెడ్డి దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.

ఈ వీడియో వెలుగు చూసినప్పటి నుంచీ.. అటు దాడికి పాల్పడ్డ భరత్‌రెడ్డి.. ఇటు బాధితులైన కొండ్రా లక్ష్మణ్, బచ్చల రాజేశ్వర్ అదృశ్యమయ్యారు.

Image copyright facebook

ఎవరీ భరత్‌రెడ్డి?

అభంగపట్నం గ్రామానికి చెందిన భరత్‌రెడ్డి గతంలో ఏబీవీపీ నాయకుడిగా ఉన్నాడని, ప్రస్తుతం స్థానిక బీజేపీ నాయకుడని గ్రామస్తులు చెప్తున్నారు.

అయితే అతడికి తమ పార్టీతో సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.

రెండు హత్య కేసుల్లోనూ భరత్‌రెడ్డి నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు.

Image copyright facebook

పోలీసులు ఏమంటున్నారు?

దళితులపై దాడికి సంబంధించిన వీడియో ఆధారంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ కార్యదర్శి మానికొళ్ల గంగాధర్ నవీపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు భరత్‌రెడ్డి మీద కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

బాధితులైన లక్ష్మణ్, రాజేశ్వర్‌లు కనిపించకపోవడం మీద వారి కుటుంబ సభ్యులు.. దళిత, ప్రజా సంఘాల నాయకుల సమక్షంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ భర్తలను భరత్‌రెడ్డి కిడ్నాప్ చేశారని లక్ష్మణ్ భార్య భావన, బచ్చల రాజేశ్వర్ భార్య లలిత ఆ ఫిర్యాదులో ఆరోపించారు.

తమ భర్తలు ఆదివారం నాడు రోజు లాగే పనికి వెళుతున్నట్లు చెప్పి వెళ్లారని.. అప్పటి నుంచీ తిరిగి రాలేదని వారు పేర్కొన్నట్లు న్యూస్‌ మినిట్ వెబ్‌సైట్ కథనం పేర్కొంది. దీంతో భరత్‌రెడ్డి మీద కిడ్నాప్ కేసు కూడా నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.

Image copyright facebook

ప్రజా సంఘాలు ఏమంటున్నాయి?

దళిత యువకులపై దాడి ఉదంతంపై దళిత, విద్యార్థి, ప్రజాసంఘాలు నవీపేట్, అభంగపట్నం గ్రామాల్లో నవంబర్ 19న భారీ ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించాయి.

తెలంగాణలోని వివిధ యూనివర్శిటీల నుంచి విద్యార్థి సంఘాల నాయకులు, కార్యకర్తలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.

దళితులపై దాడికి పాల్పడ్డ భరత్‌రెడ్డిని వెంటనే అరెస్ట్‌ చేయని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని దళిత సంఘాలు హెచ్చరించాయి.

Image copyright facebook

‘బాధితులను టెర్రరైజ్ చేస్తున్నారు’

''దళితులపై దాడికి పాల్పడ్డ భరత్‌రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి. కిడ్నాప్‌కు గురైన బాధిత దళితులను తక్షణం చెర విడిపించాలి'' అని దళిత బహుజన విద్యార్థి సంఘం (డీబీఎస్ఏ) రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు నలిగంటి శరత్ డిమాండ్ చేశారు.

''భరత్‌రెడ్డి మీద గతంలో హత్య కేసులు ఉన్నాయి. అతడు అధికార పార్టీ నాయకుల సాయంతో బాధితులను భయపెట్టి, చంపేస్తామంటూ టెర్రరైజ్ చేస్తూ.. కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కుమార్తె, ఎంపీ కవిత సొంత లోక్‌సభ స్థానంలో దళితులపై దాడులు జరుగుతోంటే ఆమె మౌనంగా ఉన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. భరత్‌రెడ్డి మీద పాత కేసులను రీఓపెన్ చేయాలి. దాడి బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి'' అని ఆయన డిమాండ్ చేశారు.

Image copyright Facebook

కాగా, ఈ అంశంపై నిజామాబాద్ జిల్లా పోలీసు అధికారులను బీబీసీ సంప్రదించింది. సమాచారం నిర్ధరణ చేసుకునేందుకు ప్రయత్నించగా.. వారు స్పందించలేదు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)