బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్: ప్రధాని నరేంద్ర మోదీ సొంతూరులో స్వచ్ఛ భారత్ అమలు ఇలా ఉంది..

  • 24 నవంబర్ 2017
వడ్‌నగర్‌

నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమం స్వచ్ఛ భారత్ అభియాన్. పరిశుభ్రమైన దేశంగా తీర్చిదిద్దాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్పం ప్రధాని మోదీ సొంతూరు గుజరాత్‌లోని వడ్‌నగర్‌లో నిరాశాజనకంగా ఉంది.

వడ్‌నగర్ గుజరాత్‌ రాష్ట్రంలోని మెహ్‌సానా జిల్లాలో ఉన్న మున్సిపాలిటీ. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టి పెరిగింది ఇక్కడే.

ప్రధాని సొంతూరు కావడంతో దీన్ని చారిత్రక ప్రాముఖ్యం కలిగిన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నారు.

పడకేసిన పారిశుద్ధ్యం

నేను వడ్‌నడర్‌లోని రోహిత్ వాస్ ప్రాంతంలోకి వెళ్లగానే "మీరు ఇప్పుడు వడ్‌నగర్ వైఫై జోన్‌లోకి ప్రవేశించారు" అని నా స్మార్ట్‌ఫోన్‌లో ఓ మెసేజ్ వచ్చింది. అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పబ్లిక్ వైఫై సదుపాయం చాలా బాగా పనిచేస్తోంది. కానీ, స్థానికులను టాయిలెట్ల గురించి అడిగితే, సమీపంలోని ఓ మైదానం పక్కన బహిరంగ మలమూత్ర విసర్జన చేసే ప్రదేశాన్ని చూపించారు.

సుమన్, హెత్వి, మోనికా, బిస్వా, అంకిత, నేహాలు అందరూ పాఠశాల విద్యార్థులు. వారి ఇళ్లలో పారిశుద్ధ్య సదుపాయాల గురించి అడిగినప్పుడు ఈ బాలికలు బీబీసీ ప్రతినిధిని దగ్గరలోని ఓ మైదానం వద్దకు తీసుకెళ్లారు. అక్కడికే రోజూ బహిర్భూమికి వెళ్తామని వారు చెప్పారు.

అమలుకు నోచుకోని హామీలు

"తమ ప్రాంతంలో మురుగు నీటి కాల్వలన్నీ ఓపెన్‌గానే ఉంటాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేదు" అని స్థానికురాలు దక్షా బెన్ తెలిపారు.

"చిన్న పిల్లల నుంచి యుక్త వయసు అమ్మాయిల వరకు అందరూ బహిరంగ మలమూత్ర విసర్జనకు వెళ్తారు. మాకు ఉండేందుకు ఇళ్లు లేవు. టాయిలెట్ల గురించి ఎవరూ మమ్మల్ని అడగలేదు. ఇప్పటికీ రోజూ 'బయటికే' వెళ్లాల్సి వస్తోంది" అని ఆమె చెప్పారు.

ఆ పక్కనే ఉన్న నిర్మలా బెన్‌ మాట్లాడుతూ.. "వడ్‌నగర్‌కు ఇచ్చిన హామీలన్నింటినీ మోదీ ప్రభుత్వం నెరవేర్చలేదు. పక్కా ఇళ్లు, టాయిలెట్లు నిర్మించి ఇస్తామన్నారు. కానీ, ఏవీ ఇవ్వలేదు" అని అన్నారు.

అక్టోబర్‌ 8న ప్రధాని మోదీ తన సొంతూరును సందర్శించడాన్ని ప్రస్తావిస్తూ.. "ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడ్డాయి కాబట్టి, ఆయనకు తన సొంతూరు గుర్తొచ్చింది. లేకపోతే ఇన్నాళ్లూ ఎవరూ మావైపు చూడలేదు. మా సమస్యలను పట్టించుకోలేదు" అని నిర్మల తెలిపారు.

వడ్‌నగర్ వాసులు చెప్పిన వివరాల ప్రకారం మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 30 వేల జనాభా ఉంది. అందులో 500 కుటుంబాలకు మరుగు దొడ్లు లేవు.

రోహిత్ వాస్, ఒధ్ వాస్, భోయవాస్, ఠాకూర్ వాస్, దేవిపూజక్ వాస్ వంటి బీసీ, ఎస్సీ కాలనీల్లోనే ఈ సమస్య అధికంగా ఉంది.

తెరిచి ఉన్న మురుగు నీటి కాల్వలు, గుంతలు పడిన రోడ్డుతో ఉన్న ఇరుకు గల్లీ నుంచి నడిచి కొంచెం ముందుకు వెళ్లాను.

చారిత్రక పర్యాటక ప్రాంతంగా వడ్‌నగర్‌ను తీర్చిదిద్దేందుకు 550 కోట్ల రూపాయలు విడుదల చేయనున్నట్టు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ నిధులతో పట్టణంలో వైద్య సదుపాయాలు మెరుగుపరచడంతో పాటు, సాంకేతిక వసతులు కల్పిస్తామని పేర్కొంది.

450 కోట్ల రూపాయలతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, మెడికల్ కళాశాల నిర్మించాలనేది దీని ఉద్దేశం.

చేతిలో ఎర్రని డబ్బాతో బహిర్భూమికి వెళ్తున్న 70 ఏళ్ల మని బెన్ జీవితంలో ఈ ప్రకటనలు పెద్దగా మార్పేమీ తేలేదు.

రోహిత్ వాస్ ప్రాంతంలో రెండు మైదానాలు ఉన్నాయి. ఒకటి పురుషులకు, మరొకటి మహిళలకు. అంతా అక్కడికే ఆరుబయలుకు వెళ్తారు.

స్వచ్ఛ భారత్ మిషన్ కింద మరుగుదొడ్ల నిర్మాణానికి కేటాయించిన 1.9 కోట్ల రూపాయల నిధులు మోదీ సొంతూరికి చేరనేలేదు.

తమకు ప్రభుత్వ పథకాల గురించి ఏమీ తెలియదని అడ్కి బెన్, లక్ష్మీ బెన్, అమి బెన్‌లు అన్నారు. తమ ఇళ్లలో టాయిలెట్ల నిర్మాణం కోసం ఎదురుచూస్తున్నామని వారు చెప్పారు.

మీ ఊరిలో పుట్టి, పెరిగి, ప్రధాని అయిన మోదీ నుంచి మీరేం కోరుకుంటున్నారని నేనడిగితే, తమకు టాయిలెట్లు కట్టించి ఇవ్వాలని రోహిత్ వాస్ మహిళలు అన్నారు.

అక్కడి నుంచి నేను బయలుదేరుతున్నప్పుడు లక్ష్మీ బెన్ నా దగ్గరికి వచ్చారు. బహిర్భూమికి వెళ్తున్నట్టు చెప్పారామె. ఇలా బహిరంగంగా మలమూత్ర విసర్జనకు వెళ్లడం మహిళలకు చాలా ఇబ్బందిగా ఉందని ఆమె వాపోయారు.

అందుకే, ఈ ఎన్నికల సందర్భంగా ఇప్పుడు వారు చేస్తున్న ప్రధాన డిమాండ్ మరుగుదొడ్ల నిర్మాణమే.

ఈ సమస్యల గురించి భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి భరత్ పాండ్యా ముందు బీబీసీ ప్రస్తావించింది. మరుగుదొడ్లు లేవనడం అవాస్తవమని ఆయన అన్నారు. అలవాట్లను మార్చుకోనివారే ఈ విమర్శలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

మా ఇతర కథనాలు:

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionమోదీ, రాహుల్‌తో గుజరాత్ ప్రజలు తమ మనసులోని మాటను ఇలా చెబుతున్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు