అమిత్ షా నిందితుడుగా ఉన్న కేసును విచారిస్తున్న జడ్జి మృతిపై మూడేళ్ల తర్వాత అనుమానాలు

  • 24 నవంబర్ 2017
జస్టిస్ లోయా Image copyright Caravan Magazine

సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బ్రిజ్‌మోహన్ హరికిషన్ లోయా మృతికి దారితీసిన పరిస్థితులపై విచారణ జరిపించాలని దిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఏపీ షా డిమాండ్ చేశారు. జస్టిస్ లోయా 2014 డిసెంబర్‌లో మహారాష్ట్రలో మరణించారు.

లోయా మరణించిన మూడేళ్లకు పలు సందేహాలు తలెత్తుతున్నాయి. లోయా కుటుంబీకులతో జరిపిన సంభాషణల ఆధారంగా 'ద కారవాన్' పత్రిక ప్రచురించిన కథనంలో ఆయన మృతికి దారితీసిన పరిస్థితులు అనుమానాస్పదంగా ఉన్నాయని పేర్కొన్నారు.

దీనిపై న్యాయవిచారణ అవసరమేనా, కాదా అన్న విషయంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గానీ లేదా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గానీ నిర్ణయం తీసుకోవాలని 'ద వైర్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జస్టిస్ షా అన్నారు.

ఈ ఆరోపణలపై విచారణ జరిపించని పక్షంలో అది న్యాయవ్యవస్థకు మాయని మచ్చగా మిగిలిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

మరణించే నాటికి జస్టిస్ లోయా ముంబయి ప్రత్యేక సీబీఐ కోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు. ఒక వివాహ వేడుకలో పాల్గొనేందుకు ఆయన నాగ్‌పూర్ వెళ్లారు.

జస్టిస్ లోయా ఆ సమయంలో సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసును విచారిస్తున్నారు. ఆ కేసులో ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సహా పలువురు సీనియర్ పోలీసు అధికారులు నిందితులుగా ఉన్నారు.

చిత్రం శీర్షిక సోహ్రాబుద్దీన్, ఆయన భార్య కౌసర్‌బీ (ఫైల్ ఫోటో)

ఇప్పుడు ఈ కేసును మూసేశారు. అమిత్‌షాను నిర్దోషిగా ప్రకటించారు.

నాగ్‌పూర్‌లో ఉన్న సమయంలోనే ఆయనకు గుండెపోటు రావడంతో చనిపోయారని ప్రకటించారు.

కానీ ఇటీవలే ఆయన కుటుంబ సభ్యులు 'ద కారవాన్' పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మృతి చెందిన పరిస్థితులపై అనేక సందేహాలు లేవనెత్తారు. ఆయనను ఒక మామూలు ఆస్పత్రిలో చేర్పించారనీ, ఆ సమయంలో ఆయన వెంట కుటుంబ సభ్యులెవరూ లేరని 'ద కారవాన్' కథనం తెలిపింది.

"కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలపై విచారణ జరిపించనట్టయితే న్యాయవ్యవస్థకు, ప్రత్యేకించి కింది కోర్టులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయి" అని జస్టిస్ షా 'ద వైర్'తో అన్నారు.

లోయా మృతిపై సోషల్ మీడియాలో చర్చ

"భయం గొల్పే విషయాలివి. బహుశా లోయా గుండెపోటుతో చనిపోయి ఉండకపోవచ్చు. న్యాయమూర్తులు మౌనంగా ఉన్నారు. భయంతో ఉన్నారా? మమ్మల్ని కాపాడలేకపోయినా సరే కనీసం మీ వాళ్లనైనా కాపాడుకోండి" అని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ ట్వీట్ చేశారు.

దీనిపై వామపక్ష నేత, సీపీఐఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా ట్వీట్ చేశారు. "సీబీఐ జడ్జి హెచ్‌పీ లోయా మృతికి సంబంధించి ఇప్పుడు హత్య, లంచం, చట్టాన్ని అణిచెయ్యడం, మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య సంస్థలను దుర్వినియోగం చేయడం వంటి ఇబ్బందికరమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీటిపై చాలా సీరియస్‌గా విచారణ జరిపించాల్సి ఉంది’’ అన్నారు.

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దీనిపై చేసిన ట్వీట్‌లో "ప్రధాన స్రవంతి మీడియా ధైర్యంగా ముందుకొచ్చి దీనిని పెద్ద ఎత్తున లేవనెత్తాలి" అని అన్నారు.

చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్ కూడా ఈ విషయంపై ట్వీట్ చేశారు. "జడ్జి లోయా మృతిపై కారవాన్ పత్రికలో అచ్చయిన కథనం పట్ల ఎలక్ట్రానిక్ మీడియా మౌనం వహించడం ఆందోళనకరంగా ఉంది. అయితే ఇది ఆశ్చర్యకరమైందేమీ కాదు. దీనిని నిర్భయంగా రాసిన జర్నలిస్టు నిరంజన్ టక్లేకు మద్దతునివ్వాల్సిన అవసరం ఉంది" అని ఆయన తెలిపారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)