ప్రెస్ రివ్యూ: పాత పది జిల్లాల ప్రకారమే టీఆర్‌టీ!

  • 25 నవంబర్ 2017
Image copyright Getty Images

వారంలో టీఆర్‌టీ నోటిఫికేషన్

ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో పాత పది జిల్లాల ప్రకారమే నియామకాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని 'సాక్షి' కథనం పేర్కొంది.

ఈ మేరకు టీఆర్‌టీ నోటిఫికేషన్‌ సవరణ చేయాలని.. పాత జిల్లాల ప్రకారం పోస్టులు, రోస్టర్, రిజర్వేషన్ల వివరాలను సిద్ధం చేయాలని విద్యా శాఖను ఆదేశించింది.

ఇక ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు జిల్లాల ఆప్షన్‌ను ఎడిట్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించ నున్నారు.

కొత్తగా దరఖాస్తు చేసేవారికి పాత పది జిల్లాల ఆప్షన్లే వచ్చేలా మార్పులు చేయనున్నారు. వారం రోజుల్లో సవరణ నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశముంది.

దరఖాస్తుల గడువును కూడా వచ్చే నెల 15వ తేదీ వరకు పొడిగించనున్నట్లు సమాచారం. 8,792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం గత నెల 21న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే.

అదే నెల 30వ తేదీ నుంచి ఈనెల 30 వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించింది.

అయితే ఈ నోటిఫికేషన్‌ను 31 కొత్త జిల్లాల ప్రాతిపదికన జారీ చేశారని, రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు 10 జిల్లాల వారీగా భర్తీ చేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.

వాదనలు విన్న కోర్టు పాత జిల్లాల ప్రకారమే నియామకాలు చేపట్టాలని శుక్రవారం తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు.

పాత పది జిల్లాల ప్రకారం పోస్టులు, రోస్టర్, రిజర్వేషన్ల వివరాలను సిద్ధం చేయాలని ఆదేశించినట్టు 'సాక్షి' కథనం తెలిపింది.

Image copyright Getty Images

మనకు ఆధార్, ఆస్తులకు భూధార్

'భూధార్‌' పేరుతో ప్రతి సర్వే నెంబరుకూ విశిష్ట సంఖ్య ఇవ్వబోతున్నారని 'ఈనాడు' కథనం తెలిపింది.

ఈ సంఖ్యతో సంబంధిత పోర్టల్‌లోకి ప్రవేశిస్తే చాలు సంబంధిత సర్వే నెంబరు వివరాలు, రికార్డులు, భూచిత్ర పటాలు సమస్తం కంప్యూటరు తెర మీదకు వస్తాయి.

ఆధార్ తరహాలోనే భూమి, ఆస్తులకు ఇచ్చే ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇది. ఈ సంఖ్యలో 11 అంకెలు ఉంటాయి.

పట్టణాలు, పంచాయితీలు అనే భేదం లేకుండా ప్రతి చిన్న వ్యక్తిగత ఆస్తి, భూమి అన్నిటికీ దీన్ని అమలు చేస్తారు. భూధార్ 28 అంకెతో ప్రారంభమవుతుంది. భారత ప్రభుత్వం మన రాష్ట్రానికి ఉపయోగించే కోడ్ నంబర్ ఇది.

రాష్ట్రంలో మొత్తం 4.15 కోట్లకుపైగా వ్యక్తిగత, ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాలున్నాయి. ప్రతి చిన్న భూభాగాన్ని, భవనం, ఆస్తిని కూడా ఉపగ్రహం ద్వారా చిత్రీకరిస్తారు.

డిజిటల్ ట్యాగింగ్ చేసి, ఆ భూమికి డిజిటల్ సరిహద్దులు, మూలలు కూడా గుర్తిస్తారు. వీటిని భూధార్‌తో అనుసంధానించి ఒకచోట కేంద్రీకృతం చేస్తారు.

ఈ భూధార్ నంబరును భూసేవ పోర్టల్‌లో నమోదు చేస్తేచాలు ఆ భూమి చరిత్ర తెలిసిపోతుంది..

ప్రయోగాత్మక పరిశీలన పూర్తయ్యాక ముఖ్యమంత్రి చేతుల మీదుగా భూధార్‌ను ప్రారంభించనున్నట్టు ఈనాడు కథనం.

Image copyright facebook

డిసెంబర్‌ 4 లేదా 5న 'కొలువుల కొట్లాట': కోదండరాం

కొలువుల కోసం కొట్లాట సభ డిసెంబర్‌ 4 లేదా 5న జరుగుతుందని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎం.కోదండరాం చెప్పారని 'సాక్షి' రాసింది.

కొలువుల కోసం కొట్లాట సభకు హైకోర్టు అనుమతి ఇవ్వాలని ఆదేశించిన తర్వాత శుక్రవారం ఆయన మాట్లాడుతూ... భవిష్యత్‌పై ఆందోళనతో, భవిష్యత్తుపై భరోసా కావాలని కొట్లాడే యువకులపై నిర్బంధం విధించాలని అనుకోవడం అప్రజాస్వామికమన్నారు.

కొలువులు వస్తాయని తెలంగాణ కోసం కొట్లాడిన యువకులు, ఇప్పుడు అవి కావాలని అడిగితే తప్పా... అని ప్రశ్నించారు.

నిరుద్యోగులపై నిర్బంధం విధిస్తున్న ప్రభుత్వం విలాసాలకు, పెడదోవ పట్టించే కార్యక్రమాలకు మాత్రం అండగా ఉంటుందని కోదండరాం ఆరోపించారని 'సాక్షి' కథనం పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

Image copyright Getty Images

ఇవాంకా 29న ఏం చేయబోతున్నారు?

ఇవాంకా ట్రంప్‌ భద్రతా ఏర్పాట్లపై అమెరికా భద్రతా సర్వీసుల ప్రతినిధులు శుక్రవారం వివిధ శాఖల ప్రతినిధులతో ఫలక్‌నుమా ప్యాలెస్‌లో సమావేశమయ్యారని 'ఈనాడు' ప్రచురించిన కథనంలో ఉంది.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఆమె కాన్వాయ్‌ ఏ రోడ్డులో హెచ్‌ఐసీసీ చేరుకుంటుందనే అంశాన్ని పోలీసులు పవర్‌ పాయింట్‌ ద్వారా వివరించారు.

సదస్సులో పాల్గొన్న తర్వాత ఆమె డిన్నర్‌కోసం ఫలక్‌నుమా ప్యాలె్‌సకు వెళ్తున్న సమయంలో కాన్వాయ్‌లో ఇవాంకకు సంబంధించిన 3 వాహనాల(అమెరికాకు చెందినవి)తో పాటు మరో రెండు పోలీసు వాహనాలు కూడా ఉంటాయని వివరించారు.

వాహనాల సిరీస్‌ను కూడా వివరించినట్లు సమాచారం. ఎయిర్‌ పోర్టు ల్యాండింగ్‌, సదస్సుకు హాజరు, డిన్నర్‌ ఆ తర్వాత హోటల్‌, మరుసటి రోజు సదస్సు, 29న రాత్రి 9.20 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఇవాంకా తిరుగు ప్రయాణం గురించి మాత్రమే అమెరికా సర్వీస్‌ ప్రతినిధుల వద్ద సమాచారం ఉన్నట్లు పోలీసులకు వివరించారు.

29న ఎక్కడికైనా వెళతారా లేదా అనేది తమకు కూడా తెలియదని వారు స్పష్టం చేశారు. అలాంటి ఆదేశాలు రాగానే పోలీసులకు సమాచారం ఇస్తామని తెలిపారు.

ఇవాంకాను రిసీవ్‌ చేసుకోడానికి హాజరయ్యే అధికారిక ప్రతినిధుల వివరాలు.. సదస్సు కార్యక్రమాలు, ప్రొటోకాల్‌ వివరాల గురించి జిల్లా కలెక్టర్‌ ద్వారా వివరాలు సేకరించారు.

డైనింగ్‌ టేబుల్‌పై కూర్చునేవారి గురించి కూడా తెలుసుకున్నట్లు సమాచారం. అధికారిక సమావేశాలతో పాటు యూఎస్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌తో హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీసులు కలిసి ఓ మాక్‌ డ్రిల్‌ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు సమాచారం.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు