గుజరాత్: 'రేషన్.. రిజర్వేషన్ రెండూ సమస్యలే' అంటున్న సూరత్ తెలుగు ప్రజలు

  • 25 నవంబర్ 2017
సూరత్ తెలుగు ప్రజలు Image copyright Macha Veeranna/Surat

గుజరాత్‌ రాష్ట్రాన్ని అభివృద్ధికి నమూనాగా దేశమంతా ప్రచారం చేసి లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు సాధించిన మోదీకి ఇప్పుడు స్వరాష్ట్రంలో జరిగే ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి.

గుజరాత్‌ విధానసభకు డిసెంబర్ 9, 14 తేదీల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇక్కడ గత 22 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది.

అయితే అభివృద్ధి విషయంలో మాత్రం గుజరాత్‌లో వేర్వేరు అభిప్రాయాలున్నాయి. ఈ అభివృద్ధితో "లాభపడ్డామ"ని కొందరంటుంటే, అది "కొందరికే పరిమితం" అని మరి కొందరంటున్నారు.

ఇలాంటి భిన్నాభిప్రాయాలు స్థానిక గుజరాతీలలోనే కాదు, బతుకుదెరువు కోసం గుజరాత్‌ను తమ "కర్మభూమిగా మల్చుకున్న" తెలుగు ప్రజల మాటల్లో కూడా వ్యక్తమయ్యాయి.

Image copyright Macha Veeranna/Surat

తగ్గుతున్న వలసలు, తరలిపోతున్న తెలుగు జనాభా

సిల్క్ సిటీగా పేరు గాంచిన సూరత్‌, మాంఛెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన అహ్మదాబాద్ నగరాలలో పలు దశాబ్దాలుగా తెలుగు జనం నివసిస్తున్నారు. వీరంతా తమ శ్రమశక్తి ద్వారా వస్త్ర పరిశ్రమను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు.

వీరిలో అత్యధికులు తెలంగాణలోని కరీంనగర్, నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలు, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు.

గుజరాత్‌కు తెలుగు ప్రజల వలస దాదాపు 60-70 ఏళ్ల కింద మొదలైనట్టు దుడుక సత్యనారాయణ బీబీసీతో చెప్పారు. 1985-90 మధ్య తెలుగు వాళ్ల వలస మరింత పెరిగిపోయిందని ఆయనన్నారు. ఆయన గత నాలుగు దశాబ్దాలుగా సూరత్‌లో ఉంటున్నారు.

"పది, పదిహేనేళ్ల కిందట ఇక్కడ నివసించే తెలుగువారి సంఖ్య 7-8 లక్షల దాకా ఉండేది. అయితే ఇప్పుడు బాగా తగ్గిపోయారు" అని సత్యనారాయణ అన్నారు. ప్రస్తుతం తెలుగు వారి సంఖ్య దాదాపు 2 లక్షల దాకా ఉండొచ్చని ఆయన అంచనా.

"2008లో మొదలైన ఆర్థిక మాంద్యం ప్రభావంతో ఇక్కడ కొన్ని కార్ఖానాలు మూతపడ్డాయి. అదే సమయంలో తెలంగాణ ఉద్యమం మొదలు కావడం వల్ల కూడా కొంత మంది వెనక్కి వెళ్లిపోయారు" అని 'సూరత్ తెలంగాణ వలస ప్రజల ఐక్య సమితి' అద్యక్షుడు మచ్చ వీరన్న అన్నారు. ఇటీవలి పరిణామాల ఫలితంగా మరింత ఎక్కువ మంది వెనక్కి వెళ్లిపోయారని ఆయన చెప్పారు.

"సూరత్‌ మునిసిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 29 మంది కార్పొరేటర్లలో ఒకప్పుడు నలుగురు తెలుగువారుండేవారు. ఆ సంఖ్య క్రమంగా రెండుకు చేరగా, ఇప్పుడు ఒక్కరు కూడా లేరు" అని బీజేపీ సూరత్ నగర సమితి ఉపాధ్యక్షుడు పీవీఎస్ శర్మ బీబీసీతో చెప్పారు.

అహ్మదాబాద్‌లో ఈ సంఖ్య మరీ తక్కువని ఆయనన్నారు. తెలుగు వారికి తగినంత రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవడం ఒక లోటే అని ఆయన అభిప్రాయపడ్డారు.

గత 32 ఏళ్లుగా గుజరాత్‌లో నివసిస్తున్న పీవీఎస్ శర్మ తెలుగు ఫౌండేషన్ పేరుతో సూరత్‌లో సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.

Image copyright Gundu Rameshbabu/Surat

'నోట్లరద్దు - జీఎస్టీలు దెబ్బతీశాయి'

స్థానిక మార్కండేయ సమాజం కార్యకర్త వెల్గం శ్రీనివాస్ బీబీసీతో మాట్లాడుతూ, "నోట్ల రద్దు, జీఎస్టీల ఫలితంగా చాలా మంది వెనక్కి వెళ్లిపోయారు. నోట్ల రద్దుతో ఒక్కసారిగా చాలా కార్ఖానాలు మూతబడి పోయాయి" అని ఆయన చెప్పారు. మచ్చ వీరన్న కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

"ఇక్కడ తెలుగు వాళ్లు ఎక్కువగా పని చేసేది చిన్న చిన్న కార్ఖానాల్లోనే. ఒక్కో ఫ్యాక్టరీలో 12 నుంచి 24 పవర్‌లూమ్స్ నడుస్తాయి. వీటి యజమానులు పదిహేను రోజులకోసారి కార్మికులకు వేతనాలు చెల్లించాలి. ముడిసరుకు తెచ్చుకోవడానికి యజమానులకు నిరంతరం నగదు కావాలి. కానీ నోట్లరద్దుతో నగదుకు కటకట ఏర్పడడంతో కార్ఖానాలు నడపలేక చాలా వరకు మూసేశారు" అని ఆయన చెప్పారు.

"సొంత ఇళ్లలో లేదా షెడ్లలో కార్ఖానాలు పెట్టిన వారు మాత్రం కొన్ని నెలలు మూసేసి మళ్లీ ప్రారంభించారు. కానీ కిరాయి షెడ్లలో కార్ఖానాలు నడిపించిన చిన్న తరహా పెట్టుబడిదారులు పూర్తిగా దెబ్బతిని అడ్డికి పావుషేరు లెక్కన (కారుచౌకగా) మిషన్లను అమ్మేసుకున్నారు" అని వీరన్న వివరించారు.

ఇప్పటికీ చాలా కార్ఖానాలు మూతబడి పడావుగా ఉన్నాయనీ, ఈ కాలంలో తెలుగు ప్రాంతాలకు చెందిన వలస కార్మికులు చాలా మంది వెనక్కి వెళ్లిపోయారని ఆయన చెప్పారు.

"ఆ తర్వాత అమలులోకి వచ్చిన జీఎస్‌టీ చిన్న తరహా పరిశ్రమల యజమానులను కోలుకోలేకుండా దెబ్బతీసింది" అని ఆయన చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచే తెలుగు వాళ్లు వెనక్కి వెళ్లడం మొదలైందని గౌరి యతిరాజం అనే కార్మికుడు బీబీసీతో చెప్పారు.

"తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి వలసలు తగ్గుముఖం పట్టాయి. క్రమంగా ఇక్కడి నుంచి వెనక్కి వెళ్లేవారు ఎక్కువయ్యారు. నోట్లరద్దు, జీఎస్టీ దెబ్బతో మరింత పెద్ద సంఖ్యలో వెనక్కిపోయారు. అలా సూరత్‌లో తెలుగు వారి సంఖ్య బాగా తగ్గింది. అటు నుంచి రావటం కూడా తగ్గిపోయింది" అని ఆయన చెప్పారు.

Image copyright PVS Sharma/Surat
చిత్రం శీర్షిక తెలుగు ప్రజలకు తగినంత రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవడం ఒక లోటు

'కోటా మాకూ సమస్యే!'

పాటీదార్లకు రిజర్వేషన్ అనే అంశం గుజరాత్‌లో ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే తెలుగు ప్రాంతాల నుంచి వలస వెళ్లిన ప్రజలు కూడా చాలా ఏళ్లుగా మరో రూపంలో 'కోటా' సమస్యను ఎదుర్కొంటున్నారు.

"ఓబీసీ రిజర్వేషన్ అనేది తెలుగు వారికి చాలా పెద్ద సమస్యే. ఇక్కడికి వలస వచ్చిన వాళ్లలో దాదాపు 90 శాతం పద్మశాలీలు, గౌడ్, ముదిరాజ్ తదితర వెనుకబడిన కులాల వాళ్లే. వీళ్లందరికీ స్వరాష్ట్రంలో బీసీ గుర్తింపు ఉంది. కానీ గుజరాత్‌లో అందరికీ ఓబీసీ గుర్తింపు లభించలేదు" అని సత్యనారాయణ చెప్పారు.

వెల్గం శ్రీనివాస్ దీని గురించి చెబుతూ, "1970 దశకంలో గుజరాత్ ప్రభుత్వం నియమించిన బక్షీ కమిషన్ పద్మశాలీ తదితర కులాలను వెనుకబడిన కులాల జాబితాలో చేర్చింది. కానీ 1978 లేదా అంతకన్నా ముందు నుంచి ఇక్కడ నివాసం ఉన్నవారికే అది వర్తించేలా ఆ ప్రభుత్వ ఆదేశం ఉండడం వల్ల అత్యధికులు లబ్ధి పొందలేకపోయారు" అని అన్నారు.

ఈ సమస్యపై మచ్చ వీరన్న మాట్లాడుతూ "కటాఫ్ సంవత్సరాన్ని 1995-2000 వరకు మారిస్తే బాగుంటుంది" అని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే 1980వ దశకం నుంచే సూరత్‌కు వలసలు ఎక్కువగా సాగాయని ఆయన చెప్పారు.

"ఒకప్పుడు పొట్ట చేతపట్టుకొని ఇక్కడికి వచ్చిన వాళ్లు పెద్దగా చదువుకోలేదు. కానీ తమ పిల్లలు బాగా చదువుకొని ఉద్యోగస్తులు కావాలని ఎవరైనా ఆశిస్తారు. కానీ కోటా వర్తించకపోవడంతో చాలా మంది నష్టపోయారు" అని సర్వేశ్ తెలిపారు.

ఇంటర్నెట్, ఆన్‌లైన్ రిజర్వేషన్ సెంటర్ నడిపించే కల్వకుంట్ల సర్వేశ్ ఖమ్మం జిల్లాకు చెందినవారు. ఆయన సోదరులు కూడా సూరత్‌లోనే స్థిరపడిపోయారు. ఒకప్పుడు అందరూ మరమగ్గాలు నడిపిన వాళ్లే కానీ ఇప్పటితరం మాత్రం ఎవరూ నడపడం లేదనీ, చాలా మంది చదువుకొని టెక్స్‌టైల్ డిజైనింగ్, మోడలింగ్ వంటి పనులు చేస్తున్నారని సర్వేశ్ అన్నారు.

"1978 లేదా అంతకన్నా ముందు నుంచి ఉన్న వాళ్లలో కూడా చాలా మందికి ఓబీసీ గుర్తింపు లభించలేదు. వారి వద్ద ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోవడమే దానికి కారణం. ఇక్కడ కార్ఖానాల్లో కార్మికులకు గుర్తింపు కార్డులుండవు. పేస్లిప్‌లు ఇవ్వరు. మురికివాడల్లో కిరాయి ఇళ్లలో జీవనం గడుపుతుంటారు కాబట్టి తమ ఉనికిని ఏ విధంగానూ నిరూపించుకోలేరు" అని శ్రీనివాస్ చెప్పారు.

అయితే ప్రభుత్వం మరోసారి కమిషన్ వేసి సమగ్రంగా సర్వే జరిపిస్తే తప్ప ఈ సమస్యను పరిష్కరించలేమని బీజేపీ నేత పీవీఎస్ శర్మ అన్నారు.

Image copyright Gundu Rameshbabu/Surat

పన్నెండు గంటల పనిభారం!

బతుకుదెరువు కోసం సూరత్‌కు వచ్చిన తెలుగు వాళ్లంతా ప్రధానంగా చేసేది మరమగ్గాలపై నేత పనే. ఇక్కడ వీటిని 'సాంచాలు' అని పిలుస్తారు.

"మొదట్లో ఒక్కో కార్మికుడు రెండేసి మిషన్లు నడిపించే వాడు. ఆ తర్వాత అవి నాలుగు మిషన్లకు, ఆరు, ఎనిమిది మిషన్లకు చేరి.. ఇప్పుడు ఒక్కో కార్మికుడు 12 మిషన్లు నడిపిస్తున్నారు" అని శ్రీనివాస్ చెప్పారు.

"అప్పటితో పోలిస్తే ఇప్పుడు మిషన్ల పనితీరు కొంత మెరుగైన మాట నిజమే. అప్పట్లో పోగులు(దారాలు) తెగిపోవడం పని బాగా ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడా సమస్య అంతగా లేదు. కానీ ఒక కార్మికుడు వరుసగా 12 గంటల పాటు పన్నెండేసి మిషన్లు నడిపించడం చాలా దుర్భరం" అని వీరన్న తెలిపారు.

1978లో సూరత్ వచ్చే నాటికి వీరన్నకు 16 ఏళ్లు. ముగ్గురు అన్నదమ్ముల్లో చిన్నవాడైన వీరన్న కార్మికుడిగా పని చేస్తూ ట్రేడ్ యూనియన్ కార్యకలాపాల్లో కూడా పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత తమ సమస్యల పరిష్కారం కోసం పలుమార్లు తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందించామని ఆయన తెలిపారు.

"ఎనిమిది గంటలకు మించి పని చేయించొద్దని చట్టాలు ఘోషిస్తున్నా ఇక్కడి ఫ్యాక్టరీల్లో 12 గంటల పని మామూలే. 12 గంటలే కాదు, రిలీవ్ కార్మికుడు పనికి రాకుంటే అతని షిఫ్టును కూడా కలిపి 36 గంటల సేపు నిరవధికంగా పని చేయించడం కూడా ఇక్కడ మామూలే. వారానికి ఒక రోజు సెలవు ఇవ్వాలి. అదీ ఇవ్వరు. ఐడీ కార్డులు, బోనస్ వంటి కనీస హక్కులు ఏవీ ఉండవు" అని మచ్చ వీరన్న అన్నారు.

"వయస్సులో ఉన్నప్పుడు కార్మికులు పెద్దగా ఇబ్బంది పడరు. కానీ వయసు పెరిగిన కొద్దీ వారి శక్తి ఉడిగిపోతుంది" అని ఆయన చెప్పారు.

మహబూబ్‌బాద్ జిల్లా కురవి గ్రామానికి చెందిన వీరన్న తెలంగాణ(ఆనాడు ఆంధ్రప్రదేశ్)లో తగిన ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్లనే తన లాంటి చాలా మంది సూరత్ బాట పట్టాల్సి వచ్చిందని అన్నారు.

Image copyright Macha Veeranna/Surat

అభివృద్ధి ఫలాలు అందలేదు!

గుజరాత్ అభివృద్ధి గురించి ప్రస్తావించినప్పుడు 'అది పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకే' అని వీరన్న అన్నారు.

"గుజరాత్‌లో మొదటి నుంచీ కరెంటుకు కొరత లేదు. వనరులు పుష్కలం. దాంతో పారిశ్రామిక రంగం అభివృద్ధి బాగానే జరిగింది. ఉపాధి కూడా దాదాపు అందరికీ అందుబాటులోకి వచ్చింది. కానీ వలస కార్మికుల జీవన పరిస్థితులు చాలా దుర్భరంగా ఉన్నాయి" అని వీరన్న అన్నారు.

మానవాభివృద్ధి సూచికల్లో గుజరాత్ పరిస్థితి ఏమంత బాగా లేదని సుశీల అన్నారు. ఆమె యాక్షన్ ఎయిడ్ అనే స్వచ్ఛంద సంస్థలో పని చేస్తారు.

"అభివృద్ధి ఎక్కువగా అహ్మదాబాద్‌లోనే కనిపిస్తుంది. ఇక్కడికి 20-30 కి.మీ. దూరం వెళ్తే చాలు పౌష్టికాహార లోపం వంటి సమస్యల తీవ్రతేమిటో తెలుస్తుంది. తాగునీటికి కూడా కటకటలాడే గ్రామాలు చాలా ఉన్నాయి" అని సుశీల అన్నారు.

అయితే బీజేపీ నేత పీవీఎస్ శర్మ మాత్రం తమ ప్రభుత్వం అన్ని వర్గాలకూ సామాజికంగా భద్రత కల్పించిందని చెప్పారు. గుజరాత్ సాధించిన అభివృద్ధికి ఇదే ఆధారమని ఆయన అభిప్రాయపడ్డారు.

Image copyright Gundu Rameshbabu/Surat

రేషన్, రిజర్వేషన్, ఉద్యోగాలు!

"ఈ ఎన్నికల్లో నాయకుల నుంచి మీరేం హామీలు ఆశిస్తున్నారు" అని బీబీసీ ప్రశ్నించినప్పుడు "రేషన్, బీసీ రిజర్వేషన్, మా పిల్లలకు ఉద్యోగాలు... ఇవే మేం కోరుకునేది" అని గౌరి యతిరాజం అన్నారు.

వరంగల్ జిల్లా తొర్రూర్ మండలం చర్లపాలెం గ్రామం నుంచి 1971లో సూరత్‌కు వచ్చినప్పుడు యతిరాజం వయస్సు కేవలం పదిహేనేళ్లే. దాదాపు 45 ఏళ్ల పాటు టెక్స్‌టైల్స్ పరిశ్రమలో పని చేసిన యతిరాజం గత రెండేళ్లుగా 'రిటైర్డ్' జీవితం గడుపుతున్నారు.

మొదటికీ ఇప్పటికీ పనిలో ఎంత మార్పొచ్చిందని అడగగా, "అప్పట్లో మేం రెండు సాంచలు నడిపేవాళ్లం. రెండు, మూడొందల ఆదాయం వచ్చేది. దాంతో బాగానే నడిచేది. స్వరాష్ట్రంలో మా కష్టానికి ఆ మాత్రం కూడా ఫలితం దక్కేది కాదు కాబట్టి అప్పట్లో ఇది లాభదాయకంగానే అనిపించేది. కానీ ఇప్పుడు కార్మికులు 10-15 వేలు సంపాదిస్తున్నా ఖర్చులకు ఏమాత్రం సరిపోవడం లేదు" అని ఆయనన్నారు.

"రేషన్ షాపుల్లో గతంలో మాకు గోధుమలు దొరికేవి. అయితే ఇప్పుడు కార్డుల్ని చాలా వరకు తగ్గించేశారు. ఇక్కడ ప్రభుత్వం నుంచి వృద్ధాప్య, వితంతు పెన్షన్లు అందడం కూడా చాలా కష్టం. 18 ఏళ్ల వయసున్న కొడుకు ఉంటే పెన్షన్ల పథకాలేవీ వర్తించవు" అని యెతిరాజం అన్నారు.

గుజరాత్ అభివృద్ధిని గురించి ప్రస్తావించినప్పుడు "రోడ్లను చూసే అందరూ అభివృద్ధి అంటున్నారు" అని ఆయనన్నారు.

మచ్చ వీరన్న ఈ అంశంపై మాట్లాడుతూ, "ఇక్కడ బీజేపీ మత ప్రాతిపదికన ఓటు బ్యాంకును తయారు చేసుకుంది. ప్రజల సమస్యలను చేపట్టి వీధుల్లోకొచ్చి ఉద్యమాలు చేసే స్థితిలో కాంగ్రెస్ లేదు. మిగతా పార్టీల ఉనికి ఇక్కడ లేదని చెప్పొచ్చు" అని ఆయనన్నారు.

మొత్తంగా, ఎవరు గెల్చినా సరే తమ పని పరిస్థితులు మెరుగు పడాలనీ, రేషన్, పెన్షన్ వంటి సదుపాయాలు లభించాలనీ, ఓబీసీ కోటాలో తమ వాటా తమకు దక్కాలనీ ఆశిస్తున్నట్టుగా సూరత్‌వాసులైన తెలుగు ప్రజల మాటల్లో వ్యక్తమైంది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)