ప్రెస్ రివ్యూ : 2019 ఎన్నికలకు తొలి అభ్యర్థిని ప్రకటించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ

  • 26 నవంబర్ 2017
Image copyright PrajaSankalpaYatra/FACEBOOK
చిత్రం శీర్షిక వైఎఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి తమ పార్టీ తరఫున తొలి అభ్యర్థిని ప్రకటించారు.

2019 ఎన్నికలకు తొలి అభ్యర్థిని ప్రకటించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదికిపైగా సమయం ఉంటుండగానే విపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన ప్రారంభించింది.

ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోంచి సాగుతున్న సందర్భంగా ఆ అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిగా స్థానిక నేత శ్రీదేవిని ప్రకటించారు. శ్రీదేవి భర్త చెరుకులపాడు నారాయణరెడ్డి ఈ ఏడాది హత్యకు గురయ్యారు.

పాదయాత్రలో జగన్ మాట్లాడుతూ.. ''ఎన్నికలకు ఇంతముందుగా ఏ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీదేవిని పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తున్నా'' అని చెప్పినట్లు 'సాక్షి' కథనం తెలిపింది.

పత్తికొండ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి చెందిన కేఈ కృష్ణమూర్తి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు.

Image copyright Getty Images

మూడు రోజులు... రెండు లక్షల పెళ్లిళ్లు

'ఆంధ్రజ్యోతి' ప్రచురించిన ప్రత్యేక వార్తా కథనం ప్రకారం, ఈనెల 23, 24, 25 తేదీల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రెండు లక్షల వివాహాలు జరిగినట్లు అంచనా. కొన్ని కల్యాణ మండపాలను ఒకే రోజులో షిఫ్టుల వారీగా అద్దెకు ఇచ్చారు. గుంటూరు, విజయవాడ వంటి చోట్ల ఫంక్షన్‌ హాళ్లుదొరక్క... అపార్ట్‌మెంట్ల సెల్లార్లు, ఇంటి ఆవరణల్లోనే వివాహాలు జరిపించారు.

ఈ మూడు రోజులకు సంబంధించి... సగటున ప్రతి ఇంటికీ మూడేసి చొప్పున 'ఆహ్వానాలు' అందాయి. దీంతో... ప్రయాణాలే ప్రయాణాలు! బస్సులన్నీ కిటకిట! ఒక వ్యక్తి శుక్రవారం మధ్యాహ్నం విజయవాడ బస్సు కోసం హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో మూడు గంటలు వేచి చూడాల్సి వచ్చిందంటే... పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

హైదరాబాద్‌లోని ఓ కన్వెన్షన్‌ సెంటర్‌లో... ఓ బడా పారిశ్రామిక వేత్త కూతురు వివాహమది! ఒక్క ప్లేటు భోజనానికి కేటరర్‌కు చెల్లించిన డబ్బు రూ.1800. ఇక... వేలరూపాయల విలువైన 'రిటన్‌ గిఫ్టులు'! మొత్తంగా తన కుమార్తె వివాహానికి ఆయన పెట్టిన ఖర్చు... తక్కువలో తక్కువ రూ.7 కోట్లు! అంతేనా అనకండి! అంతకుమించిన పెళ్లి ఇంకొకటుంది...

హైదరాబాద్‌లోనే ఒక కాంట్రాక్టరు కుమార్తె పెళ్లిలో అతిథులకు పెట్టిన భోజనం ఖరీదు రూ.7500. ఏంటి... వెండీ బంగారం వడ్డించారా? అని ఆశ్చర్యపోవద్దు! యూరప్‌ సెట్టింగ్‌లో ధూమ్‌ధామ్‌గా జరిగిన పెళ్లి ఇది.

ఓ పారిశ్రామిక వేత్త ఇంట్లో పెళ్లి ముందు పెట్టిన 'సంగీత్‌'కు బాలీవుడ్‌ తారలూ హాజరయ్యారు. కేవలం ఈ కార్యక్రమం కోసం రూ.6 కోట్లు వెదజల్లినట్లు ప్రచారం జరుగుతోంది!

ఇంట్లో పెళ్లికి ఇంత హడావుడి అవసరమా అనొద్దు! హంగూ ఆర్భాటాలకు ఏమాత్రం తగ్గకపోవడం 'డబ్బున్నోళ్ల కష్టాల్లో' ఒకటని 'ఆంధ్రజ్యోతి' కథనం తెలిపింది.

Image copyright Getty Images

కృష్ణా బేసిన్‌లో పెరిగిన నీటి లభ్యత

కృష్ణా బేసిన్‌లో నీటి లభ్యత పెరిగిందని కేంద్ర జలసంఘం నివేదిక ఇచ్చినట్టు ఈనాడులో కథనం వెలువడింది. ఈ కథనం ప్రకారం..

కృష్ణా బేసిన్‌లో నీటి లభ్యత తగ్గుతోందని నిపుణులు ఆందోళన చెందుతోంటే.. నీటి లభ్యత 20శాతం పెరిగిందని కేంద్ర జలసంఘం చెబుతోంది.

గతంలో 75శాతం నీటి లభ్యత కింద 2,130 టిఎంసీలు నీటి లభ్యత ఉందని బచావత్ ట్రైబ్యునల్ తేల్చితే, బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ 2,179 టిఎంసీలు అని తేల్చింది.

కానీ తాజా అధ్యయనం ప్రకారం 75శాతం నీటి లభ్యత కింద 2,522.9 టిఎంసీల నీటి లభ్యత ఉందని నివేదిక వెల్లడించింది. దీంతో బచావత్, బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునళ్ల సమయంలో పనిచేసిన ఇంజనీర్లు ఆశ్చర్యపోతున్నారు.

కృష్ణా బేసిన్‌లో 1971 - 85 మధ్య కంటే 1985 - 2015 మధ్య 6.6 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది.

బేసిన్‌లో 1985 - 86లో 70,72,365 హెక్టార్ల ఆయకట్టు ఉంటే 2014 - 15 నాటికి 81,69,157 హెక్టార్లకు పెరిగింది.

ఆవిరయ్యే నీరు 72.39 టిఎంసీలు.

Image copyright Getty Images

ఉపాధ్యాయ నియామక పరీక్షపై అనుమానాలు

'నవతెలంగాణ' ప్రచురించిన వార్త ప్రకారం, తెలంగాణలో ఉపాధ్యాయ అభ్యర్థులకు కొత్త సందేహాలు తలెత్తుతున్నాయి.

ఉపాధ్యాయ నియామక పత్రాలను ఇచ్చేదెవరన్నది ప్రస్తుతం అందరిలోనూ చర్చనీయాంశంగా మారింది.

పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం పది జిల్లాలను 31 జిల్లాలకు పెంచింది. అందుకు అనుగుణంగా జిల్లా స్థాయి పోస్టులైన ఉపాధ్యాయ నియామకాలను కొత్త జిల్లాల ప్రకారమే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

31 జిల్లాల ప్రాతిపదికన ఉపాధ్యాయ నియామకాలు చేపడుతున్నట్టు పాఠశాల విద్యాశాఖ అక్టోబర్‌ 10న జీవో నెంబర్‌ 25 జారీ చేసింది.

ప్రభుత్వ నిర్ణయం ఆధారంగా 8,792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఐదు నోటిఫికేషన్లు గతనెల 21న విడుదల చేసింది.

టీఆర్టీ నోటిఫికేషన్‌లో స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ) 1,941 పోస్టులు, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ (పీఈటీ) 416 పోస్టులు, స్కూల్‌ అసిస్టెంట్‌ (ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌) 9 పోస్టులు, భాషా పండితులు (ఎల్‌పీ) 1,011 పోస్టులు, సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) 5,415 పోస్టుల చొప్పున మొత్తం 8,792 పోస్టులున్నాయి.

జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ తర్వాత 31 జిల్లాల ప్రకారం వెలువడిన తొలినోటిఫికేషన్‌ టీఆర్టీ కావడం విశేషం.

31 జిల్లాలకు రాష్ట్రపతి ఉత్తర్వుల్లో స్థానం లేదని కొందరు అభ్యర్థులు ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన కోర్టు పాత పది జిల్లాల ప్రకారమే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని శుక్రవారం ఆదేశించిన విషయం తెలిసిందే.

31 జిల్లాల ప్రకారం ఉపాధ్యాయ నియామకాల చేపట్టేందుకు 31 జిల్లాల్లోనూ డీఈవోలు విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్లూ, ఇతర అధికారులున్నారు.

కానీ పాత పది జిల్లాల ప్రకారం ఉపాధ్యాయ నియామకాలు చేపట్టడం ఎలా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఉమ్మడి జిల్లాపై అధికారాలున్న అధికారి ఎవరన్న ప్రశ్న తలెత్తుతున్నది.

జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ తర్వాత జిల్లాల భౌగోళిక పరిధి, అధికారాలు పూర్తిగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ నియామక పత్రాలు ఎవరిస్తారనేది అందరిలోనూ చర్చనీయాంశంగా మారిందని ఆ పత్రిక తెలిపింది.

Image copyright Getty Images

ఇంజినీరింగ్ కోర్సులో మార్పులు

ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రభుత్వం మార్పులు తీసుకువస్తోందని ఈనాడు పత్రిక ఓ వార్తను ప్రచురించింది.

అందులో.. 2018 - 19 బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి అమలు చేయాలని 'ఏఐసిటిఇ' పేర్కొన్నట్టు తెలిపింది.

దేశంలో ప్రతి సంవత్సరమూ 7.50 లక్షల మంది బీటెక్ చదువుతున్నా, వారిలో సగం మంది కూడా క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఎంపిక కావడం లేదని అభిప్రాయపడింది.

ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇంజనీరింగ్ నైపుణ్యానికి బదులు గంటల తరబడి చదవాల్సి వస్తోందని 'ఏఐసిటిఇ' అభిప్రాయపడింది.

మెకానికల్ ఇంజినీరింగ్‌లో ఇప్పటికీ స్టీమ్ రైలు ఇంజిన్ గురించి పాఠాలున్నాయని, ఉద్యోగ అవకాశాలు కల్పించే బుల్లెట్ రైలు గురించి పాఠాలు లేవని జెఎన్‌టియుహెచ్ పరీక్షల విభాగం డైరెక్టర్ కామాక్షి ప్రసాద్ 'ఈనాడు'తో అన్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)