ఆంధ్రప్రదేశ్: ‘వాళ్లు చేసుండేది నేరమే కద సార్. ఒక ఆడ మనిషికి.. ముగ్గురు, నలుగురు పట్టుకు పెరికితే తప్పే కదా!’

  • 27 నవంబర్ 2017
మహిళను నెడుతున్న పోలీసు Image copyright CPIM/Kadiritown

ధర్నాలు, రాస్తారోకోలు,బంద్‌లు .. ఇలా నిరసన కార్యక్రమాలన్నింటిలోనూ తమ గళం విప్పి, సమస్యలను పరిష్కరించుకునేందుకు ఇప్పుడు మహిళలు కూడా ముందుంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో స్త్రీలపై మగ పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్న ఘటనలు కూడా పెరుగుతున్నాయి.

స్త్రీలను తాకరానిచోట తాకుతూ పోలీసులు అవమానిస్తున్నారనే వార్తలు తరచూ వస్తున్నాయి. మహిళల మానప్రాణాలను రక్షించాల్సిన పోలీసులే ఎందుకు వారిపట్ల అసభ్యకరంగా ప్రవర్తించాల్సి వస్తోంది?

అనంతపురం జిల్లా కదిరి సమీపంలో జాతీయరహదారి విస్తరణలో ఇళ్లు కోల్పోబోతున్న కుటగుళ్ల గ్రామానికి చెందిన పేద గిరిజనులు ఈనెల 16వ తేదీన కదిరిలో జాయింట్ కలెక్టర్ వాహనాన్ని అడ్డుకున్నారు. తమకు పరిహారం చెల్లించాలంటూ ఆందోళన చేపట్టారు. ఆ ఆందోళనలో కూడా ఇలాగే జరిగింది. దీనిపై స్థానిక మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి.

Image copyright CPIM/Kadiritown

ఆందోళన చేస్తున్న మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించారంటూ కదిరి ఎస్ఐ గోపాలుడుతో సహా మొత్తం నలుగురు పోలీసుల్ని ఉన్నతాధికారులు అనంతపురంలోని ఎస్పీ కార్యాలయానికి జత చేశారు.

అసలు ఇలా ఎందుకు జరుగుతుందనే అంశంపై బీబీసీ దృష్టి సారించింది. ఈ వ్యవహారంలో పోలీసులు, బాధితులు, ఉన్నతాధికారులతో మాట్లాడే ప్రయత్నం చేసింది. వారు చెప్పింది.. వారి మాటల్లోనే..

Image copyright CPIM/Kadiritown

'ఆయమ్మ మా మాదిరి ఆడదే'

'ఆడోళ్లు వీళ్లు అనేది రొంతగానీ ఇది లేకోకుండా.. నూకడము, కాళ్లు ఇలా ప్యాచరేయటమూ అవసరమా సార్? వాళ్లకు అధికారం ఉండబట్టే కద సార్ అలా చేసుండేది. అధికారం లేకుంటే అలా చేయరు కదా! మాతో కలెక్టర్ (జేసీ) ఒక్క మాట మాత్రం మాట్లాడలా. ఆయమ్మ ఒక్క మాట మాట్లాడుంటే.. ఒట్టే. ఆయమ్మ గాని మా మాదిరి ఆడదే. ఆయమ్మ మీదకు కొట్లాటకు గాని, దాడికి గాని మేం పాలే. మేం మా కడుపాత్ర కోసం.. న్యాయం చేయమ్మా అని అడుక్కోనీకి పోయినాం మేము. అంతకు మించి ఆయమ్మ మీద ఏదీ లేదు సార్ మాకు. ఆయమ్మ సానుభూతి ఈయలా. పోలీసోళ్లు.. కనీసం ఆడోళ్లని కనికరించలా. వాళ్లు చేసుండేది నేరమే కద సార్. ఒక ఆడ మనిషికి.. ముగ్గురు, నలుగురు పట్టుకు పెరికితే తప్పే కదా! మేమైతే చెడు ఉద్దేశ్యంతో పోలే వాళ్ల మీదకి. కలెక్టర్ (జేసీ) వచ్చింది.. ఏదైనా న్యాయం జరుగుతుంది అని పోతే.. ఆయమ్మ ఇంతగాని రెస్పెక్ట్ లేకోకుండా ఏదీ లేకోకుండా పోలీసోళ్లతో లాగిపేపించింది' అని బాధితుల్లో ఒకరైన గిరిజన మహిళ బి లక్ష్మి తన ఆవేదన వ్యక్తం చేశారు. జాయింట్ కలెక్టర్ తమకు పరిహారం ఇప్పించకపోయినా, కనీసం కారుదిగి తమ సమస్య విన్నా ఇంత అవమానం జరిగేదికాదని ఆమె అన్నారు.

Image copyright CPIM/Kadiritown

'నేను మీటింగ్‌కి వెళ్లాలి. త్వరగా ఖాళీ చేయండి'

'ఈనెల 16వ తేదీన ఉదయం 11 గంటల సమయంలో నేను స్టేషన్‌లో ఉన్నప్పుడు డీఎస్పీ మేడమ్ నుంచి ఫోన్ వచ్చింది. 'గోపాల్.. జేసీ మేడమ్ బయటకు వెళ్తుంటే ఎవరో వెహికల్‌కు అడ్డు పడుతున్నారంట. త్వరగా వెళ్లి క్లియర్ చేయండి' అని అన్నారు. అందుబాటులో ఉన్న కానిస్టేబుళ్లను ఎక్కించుకుని నేను వెళ్లాను. అప్పటికే కొంతమంది ట్రాఫిక్ సిబ్బందిని తీసుకుని టౌన్ ఎస్ఐ అక్కడికి చేరుకున్నారు. అక్కడున్నవాళ్లతో మాట్లాడుతున్నారు. వాహనానికి అడ్డుపడొద్దు. లేవండి అని చెబుతున్నారు. ఇంతలో మేడమ్ (జేసీ) ఆయన్ను (వాహనం) డోర్ దగ్గరికి పిలిచి.. 'ఎస్ఐ గారూ నేను మీటింగ్‌కి వెళ్లాలి. త్వరగా ఖాళీ చేయండి' అన్నారు. మేం పురుషుల్ని లాగటానికి ప్రయత్నిస్తే.. మహిళలు అడ్డం వచ్చారు. వాళ్లను పక్కకు తోశాం. వాహనం రోడ్డుపైకి వచ్చేసింది. అయినా వాళ్లు అడ్డం పడ్డారు. మళ్లీ వాళ్లను పక్కకు తోశాం. దీంతో మేడమ్ వెళ్లిపోయారు. అదీ విషయం' అని చెప్పుకొచ్చారు ఎస్ఐ గోపాలుడు.

Image copyright CPIM/Kadiritown

'మహిళా కానిస్టేబుళ్లు వచ్చేదాకా ఆగలేదు'

'మాకు ముందస్తు సమాచారం లేదు. ఎవరు అడ్డుపడుతున్నారో కూడా తెలియదు. మహిళలు ఉన్నారని అక్కడికి వెళ్లాకే తెలిసింది. ముందే సమాచారం ఉంటే కనుక మేం ముందే మహిళా కానిస్టేబుళ్లను అందుబాటులో పెట్టుకునేవాళ్లం. కనీసం మేడమ్ (జేసీ) కదిరి వస్తున్నారన్న సమాచారం కూడా మాకు లేదు. గెస్ట్‌హౌస్‌కు వస్తున్నారని కూడా తెలియదు. రూరల్ ఏరియాలో ఎమ్మార్వోలతో మేడమ్ కార్యక్రమం పెట్టుకున్నారు. అప్పుడే గెస్ట్‌హౌస్‌కు వచ్చారు. మహిళా కానిస్టేబుళ్లంతా వేరే కార్యక్రమంలో ఉన్నారు. మహిళా రక్షక్ అని.. మహిళల రక్షణకు సంబంధించిన అవగాహన కల్పించేందుకు కాలేజీకి వెళ్లారు. వాళ్లను పిలిచాం. వారు రావటానికి 10-15 నిమిషాలు టైం పడుతుంది. కానీ, తక్షణం ఖాళీ చేయించండి అని జేసీ మేడమ్ ఆదేశించారు. పై అధికారులు అలా ఆదేశిస్తే మేం పాటించకుండా ఎలా ఉంటాం. పైగా ఒకపక్క వాహనం కదులుతోంది. మరోపక్క వీళ్లు అడ్డం పడుతున్నారు. అందుకే మేం ఖాళీ చేయించాల్సి వచ్చింది' అని గోపాలుడు వివరించారు.

Image copyright G. Gopaludu

'మాకు అక్కా చెల్లెళ్లు, అమ్మోళ్లు ఉండరా?'

'మాకు ఏం ఉద్దేశాలూ లేవు. మనకూ అక్కా చెల్లెళ్లుండరా? అమ్మోళ్లు ఉండరా? ఆ టైంలో అలా ఎలా అనిపిస్తుంది అసలు?’ అని గోపాలుడు ప్రశ్నించారు. మరి తప్పేమీ చేయనప్పుడు వీఆర్‌కు ఎందుకు పంపిస్తున్నారని ఉన్నతాధికారుల్ని ప్రశ్నించలేదా? అని అడగ్గా.. 'పై ఆఫీసర్లు చెప్పినప్పుడు వాళ్లను మనం ప్రశ్నించగలమా? నాతో పాటు మరో ముగ్గురి పేర్లు చెప్పారు. హెడ్డాఫీసుకు వెళ్లమన్నారు. వెళ్లాం. అంతే. నేనేం ప్రశ్నించలేదు. అడగలేదు. నేనేం తప్పు చేయలేదు. నేను నా డ్యూటీ చేశా. పొరపాటున ఎవరైనా జాయింట్ కలెక్టర్ మేడమ్‌పైన దాడి చేసి ఉంటే? రాయి విసిరి అద్దం పగలగొట్టి ఉంటే? ఇవన్నీ ఊహించుకోలేం. అందుకే ఒక మంచి ఉద్దేశ్యంతో.. జేసీకి ఏమీ కాకూడదనే మేం మా పని చేశాం' అని అన్నారు.

Image copyright CPIM/Kadiritown

'తొందరపెట్టడంతో ఇదంతా జరిగిపోయింది'

'అది యాదృచ్ఛికంగా జరిగిపోయింది. మాకు ముందస్తు సమాచారం లేదు. ఉన్నట్టుండి ఫోన్ చేశారు. ‘మేడమ్ (జేసీ) కారుకు అడ్డుపడుతున్నారు' అని మాత్రమే చెప్పారు. ఎంత మంది ఉన్నారు.. ఎవరున్నారు.. అన్నది రెవెన్యూ వాళ్లు చెప్పలేదు. అందుబాటులో ఉన్న సిబ్బంది వెళ్లారు. వెళ్లి క్లియర్ చేశారు. అంతే తప్ప ఉద్దేశ్యపూర్వకంగా ఏమీ జరగలేదు. అంతా ఐదు నిమిషాల్లో జరిగింది' అని కదిరి డీఎస్పీ శ్రీలక్ష్మి చెప్పారు.

Image copyright K Sree Lakshmi

‘మహిళా సిబ్బంది ఉండి.. వాళ్లతోనే ఖాళీ చేయిస్తే బాగుండేది’

'స్త్రీలపైన చేయి చేసుకోవాలనే దురుద్దేశ్యం అక్కడ ఎవరికీ లేదు. కదిరి టౌన్‌లో మొత్తం నలుగురు మహిళా పోలీసులు ఉన్నారు. అందులో ఒకరు మెటర్నిటీ లీవ్‌లో ఉన్నారు. మిగతా ముగ్గురు మహిళా రక్షక్ విధుల్లో ఉన్నారు. కాసేపు మేడమ్ (జేసీ) ఆగి ఉంటే సరిపోయేది. కానీ, ఆమె తక్షణం ఖాళీ చేయాలని కోరటంతో ఇదంతా జరిగిపోయింది. మహిళా సిబ్బంది ఉండి.. వాళ్లతోనే ఖాళీ చేయిస్తే బాగుండేది. కానీ, ఒక గందరగోళ పరిస్థితిలో.. తొందరపెట్టడంతో ఇదంతా జరిగిపోయింది' అని శ్రీలక్ష్మి అన్నారు.

Image copyright I and PR/Ananthapuram

ఈ వివాదంపై జాయింట్ కలెక్టర్ రమామణితో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ, ఆమె స్పందించలేదు. ‘మేడమ్ అందుబాటులో లేరు. తర్వాత ప్రయత్నించండి’ అని ఆమె పీఏ సమాధానం ఇచ్చారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం