ఆంధ్రప్రదేశ్: పర్యాటకుల్ని ఆకర్షిస్తున్న ‘సాగర సంగమం’ ఎర్ర పీతలు

  • 27 నవంబర్ 2017
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionసాగర సంగమం: పర్యాటకుల్ని ఆకర్షిస్తున్న ఎర్ర పీతలు

మహారాష్ట్రలోని మహాబలేశ్వర్‌ సమీపంలో చిన్న ధారగా మొదలయ్యే కృష్ణానది సముద్రంలో కలిసే ప్రదేశం సాగర సంగమం. ఇక్కడ ఎర్రని సముద్ర పీతలు పర్యాటకుల్ని ఆకట్టుకుంటాయి.

సముద్ర మట్టానికి 1337 మీటర్ల ఎత్తున ప్రారంభమైన కృష్ణ మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు 1400 కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి వస్తుంది.

అవనిగడ్డ సమీపంలో రెండు పాయలుగా, ఆ రెండూ నాలుగు పాయలుగా చీలి సముద్రంలో కలుస్తుంది. మిగతా మూడు సంగమ ప్రదేశాలకు వెళ్లటం చాలా కష్టం.

చిత్రం శీర్షిక ఎడమవైపు నుంచి వస్తున్న కృష్ణానది.. కుడివైపున సముద్రంలో కలుస్తున్న ప్రదేశం ఇది
Image copyright Wikipedia/Nasa
చిత్రం శీర్షిక కృష్ణానది నాలుగు పాయల్లో.. హంసలదీవి సమీపంలో ఒక పాయ, నాగాయలంక సమీపంలో మిగతా మూడు పాయలు సముద్రంలో కలుస్తాయి

హంసలదీవికి దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ సాగర సంగమ ప్రదేశానికి వెళ్లేందుకు ఒక చిన్న రోడ్డు ఉంది. కానీ, సముద్రం పోటెత్తే సమయంలో ఇక్కడికి వెళ్లటం మంచిది కాదు.

రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఒక భవనాన్ని నిర్మించింది. దీనిపై మూడు డాల్ఫిన్ బొమ్మలు ఉంటాయి. ఈ ప్రాంతంలో డాల్ఫిన్లు కూడా కనిపిస్తాయని స్థానికులు అంటుంటారు. కానీ, అధికారికంగా దీనికి గుర్తింపు లేదు.

అయితే, ఈ డాల్ఫిన్ భవనంపై నుంచి సాగర సంగమ దృశ్యాలను చాలా బాగా చూడొచ్చు.

ఎర్ర పీతలే ఆకర్షణ

వేసవి కాలంలో పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. కార్తీక మాసంలో పుణ్య స్నానాలు చేసేందుకు చాలామంది వస్తారు.

మిగతా బీచ్‌లకంటే ఇక్కడి బీచ్ భిన్నంగా ఉంటుంది. కృష్ణానదిలోని ఒండ్రుమట్టి కలవటం వల్ల బీచ్‌లో ఇసుకతో పాటు మట్టి ముద్దలు కూడా ఉంటాయి.

ఉదయాన్నే సూర్యోదయంతో పాటు ఇక్కడ ఎర్రని సముద్ర పీతలు పర్యాటకుల్ని ఆకట్టుకుంటాయి.

చిత్రం శీర్షిక చాలామంది హిందువులు కృష్ణమ్మను పూజించి సంగమం వద్ద స్నానాలు చేస్తుంటారు

సముద్రం ఒడ్డున ఇసుకలో బొరియలు చేసుకుని జీవించే ఈ పీతలు అసలైన సముద్ర పీతలు కాదు. పైగా, ఈ ఎర్రని పీతలు తినటానికి పనికిరావు. కేవలం చూడటానికి మాత్రమే బాగుంటాయి.

ఎవరైనా తమవైపు వస్తున్నారని గమనిస్తే హడావుడిగా పారిపోయి బొరియల్లో దాక్కుంటాయి. బీచ్‌లో నడుస్తున్నప్పుడు ఈ దృశ్యం భలే సరదాగా ఉంటుంది.

చిత్రం శీర్షిక ఈ పీతలు చూడ్డానికే.. తినటానికి కాదు

సదుపాయాలు కరవు

సాగర సంగమానికి మరింత ఆదరణ తీసుకురావాలని, పర్యాటకుల్ని పెంచాలని స్థానికులు కోరుకుంటున్నారు. ఈ మధ్యనే ఒక సినిమా షూటింగ్ కూడా ఇక్కడ జరిగింది.

కానీ, సంగమానికి సమీపంలో ఉన్న గ్రామం పాలకాయతిప్ప. అక్కడికి వెళ్లాలంటే దాదాపు 3 కిలోమీటర్ల దూరం. ఈ మధ్యలో ఉన్న ఒకే ఒక భవనం డాల్ఫిన్ హౌస్. దీంతో కనీస సదుపాయాలైన తాగునీరు, మరుగుదొడ్లు, మహిళలు బట్టలు మార్చుకునే సదుపాయాలు ఇక్కడ లేవు. దీంతో వచ్చే కొద్దిమంది పర్యాటకులు కూడా ఇబ్బందులు పడుతున్నారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం