దిల్లీ కాలుష్యానికి ఇదే కారణం!

  • 27 నవంబర్ 2017
Image copyright Getty Images

ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్: నవంబర్ మొదటి వారంలో దిల్లీకి ఊపిరాడకుండా చేసిన స్మాగ్ నిజానికి మూడు వేల కిలోమీటర్ల దూరంలో ఇరాక్, కువైట్, సౌదీ అరేబియాలో పుట్టిందని.. ప్రభుత్వ సంస్థ నివేదికను ఉటంకిస్తూ ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఆంగ్లపత్రిక కథనం ప్రచురించింది. ఆ కథనం సారాంశమిది.

భూశాస్త్రాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌క్యాస్టింగ్ అండ్ రీసెర్చ్ (ఎస్‌ఏఎఫ్‌ఏఆర్) నవంబర్ 6-16 తేదీల మధ్య కాలానికి సంబంధించి.. ఒక నివేదికను ప్రచురించింది. దిల్లీ నగరాన్ని, పరిసర ప్రాంతాలను ఊపిరాడకుండా చేసిన ధూళి, పొగ మేఘాల (స్మాగ్)కు రెండు 'తీవ్ర' పరిణామాలు కారణమని అందులో పేర్కొంది. ఆ నివేదికలో 'రెండో తీవ్ర' కారణంగా పేర్కొన్న పంజాబ్, హరియాణా, ఉత్తర ప్రదేశ్‌లోని పొలాల్లో గడ్డి దహనం విషయం మీద విస్తృతంగా చర్చ జరిగింది.

అందులో చెప్పిన 'ఒకటో తీవ్ర' కారణం.. 'ఇరాక్, కువైట్, సౌదీ అరేబియాల వద్ద 2017 అక్టోబర్‌లో పుట్టి నవంబర్ 3-4 తేదీల వరకూ కొనసాగిన భారీ ధూళి తుపాను'. స్మాగ్ తీవ్రంగా ఉన్న రోజు (నవంబర్ 8)న 'కాలుష్యానికి 40% ఆ ధూళి తుపాను కారణమైతే.. 25% గడ్డి దహనం చేయడం' అని ఆ నివేదిక పేర్కొంది.

నోవా-నాసా సువోమి ఎన్‌పీపీ ఉపగ్రహం తీసిన చిత్రాలను బట్టి అక్టోబర్ 29న సౌదీ అరేబియా, ఇరాక్‌ల మీద భారీ ధూళి తుపాను కనిపించిందని.. అది ఉత్తర సిరియా, ఇరాక్‌లలో పుట్టినట్లు భావిస్తున్నామని నోవా తెలిపింది. ఆ ధూళి తుపాను వల్ల ఇరాక్ వ్యాప్తంగా ఊపిరాడని కేసులు 4000 నమోదయ్యాయని, ఇరాక్ పౌర విమానయాన విభాగం విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందని, ఇస్లామిక్ స్టేట్ - ఇరాకీ సైన్యానికి మధ్య యుద్ధం కూడా తాత్కాలికంగా నిలిచిపోయిందని మీడియాలో వార్తలు వచ్చాయి. అక్టోబర్ చివర్లో ఈ ధూళి తుపాను కువైట్, పర్షియన్ గల్ఫ్‌ను కూడా చుట్టుముట్టింది.

ఈ తుపానును చల్లటి గాలులు తూర్పు దిశగా తీసుకొచ్చాయని ఎస్‌ఏఎఫ్‌ఏఆర్ నివేదిక చెప్తోంది. ''గాలి ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల.. గాలులు, ధూళి తగ్గడం నెమ్మదించే అవకాశముంది. కానీ అప్పటికే ఆ తుపాను వాతావరణంలోని పై భాగానికి చేరుకుంది. అక్కడ గాలులు చాలా బలంగా ఉన్నాయి. అది భారతదేశం దిశకు మళ్లింది. ఫలితంగా ఆ ధూళి దిల్లీ సహా జాతీయ రాజధాని ప్రాంతంలో అధిక భాగంపై ప్రభావం చూపింది'' అని ఆ నివేదిక వివరిస్తోంది. ఈ గాలి మార్గంలో గల పశ్చిమ, ఉత్తర భారతదేశం సహా అన్ని దేశాల మీదా ప్రభావం చూపిందని ఎస్‌ఏఎఫ్ఏఆర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ గుఫ్రాన్ బేగ్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో పేర్కొన్నారు.

Image copyright Getty Images

అంగన్‌వాడీల్లో గుడ్డు లేకుండానే ఫుడ్డు

నవతెలంగాణ: తెలంగాణలో అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం కోసం అందిస్తున్న 'గుడ్డు' గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. కోడి గుడ్డు రేటు అమాంతం పెరగడంతో ఆ ధరను తాము భరించలేమని కాంట్రాకర్లు చేతులేత్తేశారు. కాంట్రాక్టర్లు ఆయా కేంద్రాలకు నెలకు మూడు దఫాలుగా గుడ్లు పంపిణీ చేయాల్సి ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఒకసారి మాత్రమే సరఫరా చేస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో పంపిణీ పూర్తిగా నిలిపేశారు. దీంతో రాష్ట్రంలోని కొన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో గుడ్డు లేకుండానే ఫుడ్డు అందిస్తున్న పరిస్థితి ఏర్పడింది.

ఐదేండ్లలోపు చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలకు ప్రతిరోజు భోజనంలో కోడిగుడ్డు పెట్టాల్సి ఉంది. కానీ, వీటి ధర అమాంతం పెరగడంతో నెలన్నర రోజులుగా పప్పన్నంతో సరిపెడుతున్నారు. రాష్ట్రంలో 149 ఐసీడీఎస్‌ ప్రాజెక్డులు ఉండగా.. వీటి పరిధిలో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 2,90,076 మంది గర్భిణులు, 2,49,502 మంది బాలింతలు , 0-3 ఏండ్లలోపు చిన్నారులు 11,19,075 మంది, 3-6 లోపు పిల్లలు 13,54,973 మంది ఉన్నారు. వీరందరికీ ఆయా కేంద్రాల్లో ప్రతిరోజు అన్నం, పప్పు, కూరగాయలు, భోజనంతోపాటు ఉడకబెట్టిన కోడిగుడ్డు పెట్టాలి. 98 మంది కాంట్రాక్టర్లు నెలకు సగటున 3.20 కోట్ల కోడిగుడ్లను అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు.

అయితే, ధర పెరగడంతో ప్రస్తుతం వీరికి భోజనంలో కోడిగుడ్డు ఇవ్వడంలేదని సమాచారం. ప్రభుత్వం ఒక్కో గుడ్డుకు రూ.3.40 పైసల చొప్పున కాంట్రాక్టర్లకు చెల్లిస్తోంది. కానీ గుడ్డు ప్రస్తుతం హౌల్‌సేల్‌ మార్కెట్లో రూ.4.66 పైసలకు విక్రయిస్తున్నారు. దీంతో ఒక్కో గుడ్డుకు రూ.1.26 పైసలు నష్టం భరించాల్సి రావడంతో పక్కనబెట్టారు. మరికొంత మంది నిర్వాహకులు ధర పెరిగినప్పటి నుంచి గుడ్డు పరిమాణం తగ్గించినట్టు తెలిసింది. ఒక గుడ్డు 50గ్రాముల బరువు ఉండాల్సి ఉండగా, 20-35 గ్రాముల గుడ్లను సరఫరా చేస్తున్నారు. అయితే, రాష్ట్రంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు క్రమం తప్పకుండా కోడిగుడ్లను సరఫరా చేస్తున్నామని ఐసీడీఎస్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గిరిజ 'నవతెలంగాణకు తెలిపారు.

మా ఇతర కథనాలు:

Image copyright Getty Images

సెంచరీ కొట్టిన క్యారెట్

ఆంధ్రజ్యోతి: ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని రకాల కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మరోవైపు, దిగుబడి తగ్గడంతో, డిమాండ్‌ ఉన్న కూరగాయలు సాగుచేసిన రైతుల పంట పండుతోంది. ధరలు పెరిగిన వాటిలో క్యారెట్‌, క్యాప్సికం, బీట్రూట్‌ వంటివి కొనాలంటేనే భయపడుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో 10 కిలోల క్యారెట్‌ రూ. 850-రూ.900 ఉంది. విడిగా కిలో కావాలంటే రూ. 100 చొప్పున అమ్ముతున్నారు. 10 ములక్కాడల ధర రూ. 250 పలుకుతోంది. ఒకటి కావాలంటే కాయను బట్టి రేటు ఫిక్స్‌ చేస్తున్నారు.

ధర ఎక్కువగా ఉన్నా కొన్ని మార్కెట్‌లలో క్యాప్సికం దొరకడం లేదు. బయట మార్కెట్‌ కంటే ఈ కూరగాయల ధరలు రైతుబజార్‌లో కాస్త తక్కువగానే ఉన్నాయి. క్యారెట్‌ అధికంగా సాగవుతున్న లంక గ్రామాల రైతుల నుంచి 50 కిలోల బస్తా రూ. 2,500కే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మార్కెట్‌లో ఎక్కువకు అమ్ముతున్నారు. టమోటా కిలో రూ.40- రూ.50 పలుకుతోంది.

మా ఇతర కథనాలు:

Image copyright Getty Images

దోమలు కనిపిస్తే కాల్చివేత..!

సాక్షి: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్‌)కు హాజరయ్యే అతిథులు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక విందు ఇవ్వనున్న గోల్కొండ కోట సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. విందు నాటికి గోల్కొండ కోటలో ఒక్క దోమ కూడా లేకుండా జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ విభాగం దోమల నిర్మూలన చర్యల్ని ముమ్మరం చేసింది. ఇప్పటి వరకూ ఫాగింగ్, స్ప్రేయింగ్‌లకు శక్తిమంతమైన అల్ఫా సైపర్‌ మెథ్రిన్, సిఫనోథ్రిన్‌తోపాటు పొగ రాకుండా పైరిథ్రమ్‌ను వాడుతున్న సిబ్బంది.. తాజాగా పరిమళాలు వెదజల్లే సిట్రనెల్లా ఆయిల్, డెల్టా మిథిలీన్‌ లిక్విడ్‌లను స్ప్రే చేస్తున్నారు. వీటివల్ల దోమల నిర్మూలనే కాకుండా పరిసరాల్లో సువాసనలు వెదజల్లుతాయి.

దోమల నిర్మూలనకు చేపట్టిన చర్యలతో పాటు ఏరోజుకారోజు ప్రత్యేకంగా మస్కిటో డెన్సిటీ అధ్యయనం చేస్తున్నారు. ఇందుకు గానూ గోడలపై సక్షన్‌ ట్యూబ్‌లను ఉంచి గాలి గుంజుతారు. దీంతో పరిసరాల్లోని దోమలు ట్యూబ్‌లోకి వస్తాయి. వాటిని టెస్ట్‌ట్యూబ్‌లోకి పంపి లెక్కిస్తారు. బుధవారం విందు సమయానికి ఒక్క దోమా లేకుండా చేసేందుకు ఈ పరీక్షలు నిర్వహిస్తూ అందుకు అనుగుణంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సాయంత్రం.. చీకటి పడ్డ తర్వాత ఇలా రోజుకు రెండు పర్యాయాలు ఈ పరీక్షలు చేస్తున్నారు. గోల్కొండ కోటలో పరీక్షల్లో ఐదు రోజుల క్రితం గంటకు 200 దోమలు ఉండగా.. శనివారం నాటికి 40కి తగ్గాయి. సోమవారం వరకు వీటిని జీరో చేసే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు.

గోల్కొండ కోట పరిసరాల్లో దోమల లార్వా వ్యాప్తికి కారణమవుతున్న గుర్రపుడెక్కను తొలగించారు. శాతం చెరువు, హుడా తలాబ్, టిప్పుఖాన్‌ బ్రిడ్జి తదితర ప్రాంతాల్లోనూ గుర్రపుడెక్క తొలగించినట్లు సీనియర్‌ ఎంటమాలజిస్ట్‌ లచ్చిరెడ్డి తెలిపారు. ఇప్పటికే పరిమళాలు వెదజల్లే లిక్విడ్స్‌తో స్ప్రేయింగ్‌ పనులు చేస్తుండగా విందురోజు ప్రత్యేక పరిమళాలతోపాటు దోమలను దరి చేరకుండా చేసే లెమన్‌గ్రాస్‌తో తయారు చేసిన ప్రత్యేక అగర్‌బత్తీలను గోల్కొండ కోటలో వినియోగించనున్నారు. లెమన్‌ గ్రాస్‌.. దోమల రెపెల్లెంటే కాక సుగంధం వెదజల్లడంతో సదరు అగర్‌బత్తీలను నాందేడ్‌ నుంచి తెప్పిస్తున్నారు.

మా ఇతర కథనాలు:

Image copyright Facebook

వీధిలో నిలబడే వీడియో కాన్ఫరెన్స్‌

ఈనాడు: ‘‘టెలీ వీడియో కాన్ఫరెన్సు ఒక వినూత్న ప్రక్రియ. దీనివల్ల మీరు (ఉద్యోగులు) ఎక్కడున్నా మిమ్నల్ని సంప్రదించవచ్చు. అదే సందర్భంలో మీరు పనిచేస్తున్నారా లేదా కూడా తెలిసిపోతుంది. సాంకేతికతను ఉపయోగించుకుని మనమందరం ఆనందంగా పనిచేద్దాం’’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఆదివారం సచివాలయంలోని సీఎం కార్యాలయ బ్లాకులో 'రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ రాష్ట్ర కేంద్రాన్ని, అందులోని అత్యాధునిక 'కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. నూతన పాలికామ్‌ వీడియో కాన్ఫరెన్సు విధానాన్ని ఆవిష్కరించారు.

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తొలిసారి అన్ని ప్రభుత్వ విభాగాలను అనుసంధానిస్తూ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. 24 గంటలూ ఇక్కడి నుంచి రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోవచ్చన్నారు. మొత్తం 88 వేల మంది ఉద్యోగులను దీనికి అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు. అలాగే 20వేల సర్వైలెన్స్‌కెమరాలను రాష్ట్రమంతటా ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా తిలకిస్తామన్నారు. ఈ-ఫైళ్ల విధానం ద్వారా ఉద్యోగులు సకాలంలో ఫైళ్లు పూర్తి చేస్తున్నారా లేదా అనేది తెలిసిపోతుందన్నారు.

కమాండ్‌ కంట్రోల్‌ విశిష్టతలను వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్‌ రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ సీఈఓ అహ్మద్‌ బాబు సీఎంకు వివరించారు. ఆసియాలోనే అతి పెద్దదైన 85 అడుగుల పొడవైన 'వీడియో వాల్‌' ఏర్పాటు చేశామని, ఒకేసారి వంద కెమెరాల దృశ్యాలను వీక్షించవచ్చన్నారు. ఇంత పెద్ద వీడియోవాల్‌ ప్రపంచంలోనే ఎక్కడా లేదని తెలిపారు. అమెరికాలోని ఎఫ్‌బీఐ, సింగపూర్‌, హిటాచి తదితర దేశాలు, సంస్థల్లో అమలు చేస్తున్న ఈ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాలను పరిశీలించి వచ్చి ఇప్పుడు వాటన్నిటికంటే మిన్నగా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు.

మా ఇతర కథనాలు:

Image copyright Facebook

వెంచర్ క్యాపిటలిస్టులు కాదు.. అడ్వెంచర్ క్యాపిటలిస్టులు కావాలి: కేటీఆర్

నమస్తే తెలంగాణ: ప్రస్తుత తరుణంలో మనకు కావాల్సింది వెంచర్ క్యాపిటలిస్టులు కాదు అడ్వెంచర్ క్యాపిటలిస్టులని తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా స్టార్టప్‌లే కాదు ప్రభుత్వాలు కూడా ఇన్నోవేటివ్‌గా ఆలోచించాలని పిలుపునిచ్చారు. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్) నేపథ్యంలో నీతిఆయోగ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఆదివారం నిర్వహించిన సన్నాహక సదస్సులో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు.

అమెరికాలో అమలయ్యేవి ఇక్కడ అమలు చేయటం సాధ్యం కాదని, మనకు కావాల్సిన వనరులను మనమే సృష్టించుకోవాలని, వాటి ఆధారంగా మన సత్తా చాటుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. తాము ఇదే రీతిలో ఎంవ్యాలెట్ యాప్‌ను తీసుకొచ్చామని గుర్తుచేశారు. ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్.. నగరం ఏదైనా వాహనదారులను పత్రాలు చూపించాలని పోలీసులు అడుగుతారు. ఎన్నో పత్రాలు మనం వెంటబెట్టుకోవాల్సి ఉంటుంది. దీనికి పరిష్కారం చూపించాం. ఎంవ్యాలెట్ పేరుతో మేం తీసుకొచ్చిన ఆవిష్కరణ ద్వారా రకరకాల పత్రాలు వెంటబెట్టుకొనిపోయే బాధ తప్పింది. ఇది వాహనదారులకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నది. 1.5 మిలియన్ డౌన్‌లోడ్లు అవడం ఇందుకు నిదర్శనం అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

ప్రస్తుతం మనం ఒక ఆసక్తికరమైన ప్రపంచంలో నివసిస్తున్నాం. ప్రపంచంలో అతిపెద్ద రవాణా సేవలు అందిస్తున్న సంస్థకు ఒక్క వాహనం కూడా లేదు. ఆ సంస్థ పేరు ఉబర్. ప్రపంచంలో అతిపెద్ద పుస్తకాలు అమ్మే సంస్థకు ఒక్క బుక్‌స్టోర్ కూడా లేదు. ఆ సంస్థ పేరు అమెజాన్. భారత్‌లో యువరక్తం ఉరకలెత్తుతున్నది. ఇప్పుడు ఇండియా టైం నడుస్తున్నది. సమయం వచ్చినప్పుడు ఎవరూ ఆపలేరు. అలాంటి నూతన ఆలోచనలకు భారత్ వేదికగా నిలుస్తుందని మంత్రి కేటీఆర్ తన ఆకాంక్షను వ్యక్తంచేశారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionనా బాధ చూసి రెండేళ్ల కూతురు కూలి పనికి వస్తానంటోంది!

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం