ఆయన పేరు ’విచారం’గా ఎలా మారింది?

  • 28 నవంబర్ 2017
రిగ్రెట్ అయ్యర్ ఇంటి తలుపు వెలుపల నేమ్‌ప్లేట్ Image copyright Asif Saud
చిత్రం శీర్షిక తలుపు వెలుపల నేమ్ ప్లేట్

ఆయనకు తల్లిదండ్రులు సత్యనారాయణ అయ్యర్ అని పేరు పెట్టారు. కానీ ఆయన దానిని ‘రిగ్రెట్ అయ్యర్’ అని మార్చుకున్నారు. ఆయన తన నిర్ణయం పట్ల ఎప్పుడైనా విచారించారా అని తెలుసుకునేందుకు బీబీసీ ప్రతినిధి గీతాపాండే రిగ్రెట్ అయ్యర్‌ను బెంగళూరులో కలిశారు.

రిగ్రెట్ అయ్యర్‌కు చాలా రంగాల్లో ప్రవేశముంది. ఆయన తనను ఒక రచయితగా, ప్రచురణకర్తగా, ఫొటోగ్రాఫర్‌గా, జర్నలిస్టుగా, కార్టూనిస్టుగా అభివర్ణిస్తారు.

ఆయన వయసు ఇప్పుడు 67 సంవత్సరాలు. ఈ నెల ఆరంభంలో నేను ఆయనను కలిసినపుడు.. జర్నలిస్టును కావాలనేది తన చిన్నప్పటి ఆకాంక్ష అని, ఆ ఆకాంక్షే తాను తన పేరు మార్చుకునేలా చేసిందని నాకు చెప్పారు.

1970ల చివర్లో ఆయన కాలేజీ విద్యార్థిగా ఉన్నపుడే రచయిత కావాలనే కోరిక ఆయన మెదడును తొలవడం మొదలైంది. అప్పుడే.. చాలా మంది యుక్తవయస్కులకు మనుగడ మీద వచ్చే ప్రశ్న ‘నేనెవరిని?’ అంటూ ఒక వ్యాసం రాశారు.

ఆ వ్యాసం కాలేజీ మేగజీన్‌లో అచ్చయింది. తాను జర్నలిస్టును కాగలనని ఆయన విశ్వసించేందుకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందించింది.

తొలి రిగ్రెట్ లేఖ...

ఆయన ‘సంపాదకులకు లేఖల’తో రచనా వ్యాసంగం ఆరంభించారు. నేటి డిజిటల్ ప్రపంచంలో ఒక ఆన్‌లైన్ వ్యాసం మీద కామెంట్ చేయడం లాంటిది అది. ఆయన లేఖల్లో చాలా ప్రచురితమయ్యాయి.

ఆయన వాంఛ ఇంకా పెరిగింది. బీజాపూర్ పట్టణ చరిత్ర మీద ఒక వ్యాసం రాసి ప్రముఖ కన్నడ సాయంత్ర వార్తాపత్రిక జనవాణికి పంపించారు.

కొన్ని రోజుల తర్వాత.. ఒక ‘రిగ్రెట్ లెటర్’ (విచార లేఖ)తో పాటు ఆ వ్యాసం తిరిగొచ్చింది. ఆ పత్రిక సంపాదకుడు తమ పత్రిక మీద ఆయనకు గల ఆసక్తికి కృతజ్ఞతలు చెప్తూ.. దానిని ప్రచురించలేమని లేఖలో విచారం వ్యక్తం చేశారు.

‘‘నేను నిరుత్సాహపడ్డాను. కానీ ధైర్యం కోల్పోలేదు’’ అని ఆయన అన్నారు.

Image copyright Asif Saud
చిత్రం శీర్షిక రిగ్రెట్ అయ్యర్ తనను ఒక రచయితగా, ప్రచురణకర్తగా, ఫొటోగ్రాఫర్‌గా, జర్నలిస్టుగా, కార్టూనిస్టుగా ఇంకా పలు పనుల్లో ప్రవేశమున్న వ్యక్తిగా అభివర్ణిస్తారు.
Image copyright Asif Saud
చిత్రం శీర్షిక వార్తాపత్రికలు, మేగజీన్ల నుండి ఆయనకు వందలాది ‘రిగ్రెట్ లెటర్లు’ వచ్చాయి

ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు ఇంగ్లిష్, కన్నడ వార్తాపత్రికలకు వారు కోరకుండానే లేఖలు, వ్యాసాలు, కార్టూన్లు, ఫొటోలు, చివరికి పద్యాలు కూడా పంపిస్తూ ఉన్నారు. ఆలయాల గురించి, పర్యాటక ప్రాంతాల గురించి రాయడంతో పాటు.. వార్త ఆసక్తి గల అంశాల మీద వ్యాసాలు రాశారు. ప్రజల సమస్యలు, బస్సు సేవలు సరిగా లేకపోవడం, చెత్త పేరుకు పోవడం వంటి అంశాలపై ఫిర్యాదులు ఆ లేఖల్లో ఉన్నాయి.

1970, 80 సంవసరాల్లో ఆయనతో సంబంధాలున్న స్థానిక సీనియర్ పాత్రికేయులు.. ‘‘ఆయన సంపాదకులకు పీడకల వంటివారు’’ అని చెప్తారు.

ఆయన రచనల్లో కొన్ని ప్రచురితమయినా.. అత్యధికం తిరస్కరణకు గురయ్యాయి. కొన్నేళ్లలోనే ఆయన 375 రిగ్రెట్ లేఖలు సేకరించారు. అన్ని రకాల సంస్థల నుంచీ.. భారతదేశ సంస్థలే కాదు.. అంతర్జాతీయ సంస్థల నుంచీ ఆ లేఖలు వచ్చాయి.

సమస్య ఏమిటో సంపాదకులు చెప్పలేదు...

‘‘రిగ్రెట్ లెటర్లతో నన్ను ముంచెత్తారు. నా రచనలను ఎందుకు తిరస్కరిస్తున్నారో నాకు అర్థమయ్యేది కాదు. నాలో ఏం లోపించింది? అనే దానిపై నేను ఆలోచించడం మొదలుపెట్టాను. కానీ.. ఒక రచయితకు లేదా ఫొటోగ్రాఫర్‌కు వారు పంపిన వాటిలో ఉన్న సమస్య ఏమిటో వారికి చెప్పే ప్రయత్నం సంపాదకుల వైపు నుంచి లేదు’’ అని అయ్యర్ పేర్కొన్నారు.

ఇందుకు ఆయన ‘భ్రష్టమైన’ రాతే కారణమని సీనియర్ జర్నలిస్ట్ నాగేశ్ హెగ్డే అంటారు. అయ్యర్‌కు కొత్త పేరు ఇచ్చింది ఈయనేనని చెప్తారు.

‘‘ఆయన వార్తలను బాగా పసిగడతారు. సమీకరిస్తారు. కథనాలను గుర్తించడంలో ఆయనకు చాలా ప్రతిభ ఉంది. కానీ ఆకట్టుకునేలా రాసే సామర్థ్యం ఆయనకు లేదు. చాలా దరిద్రంగా రాస్తారు’’ అని హెగ్డే ఇటీవల నాతో అన్నారు.

Image copyright Asif Saud
Image copyright Asif Saud
చిత్రం శీర్షిక అసాధారణ ఫొటోలు తీసే చూపు అయ్యర్‌కు ఉంది - అందులో కొన్ని అయ్యర్ ఇంటి గోడపై ఇలా చేరాయి

కన్నడ భాషా పత్రికల్లో ఆనాడు అగ్రస్థానంలో ఉన్న ప్రజావాణి వార్తాపత్రికలో ప్రజాదరణ గల వారం వారం కాలమ్ రాసిన హెగ్డే.. అయ్యర్ నుంచి వచ్చే రచనలు, ఇతర సమాచారాన్ని నిరంతరం తిరస్కరిస్తూ ఉండాల్సి వచ్చేది.

రిగ్రెట్ పేరు ఇలా స్థిరపడింది....

‘‘అయ్యర్ నా వెంట పడకుండా తప్పించుకోవడానికి కొన్నిసార్లు ఆయన రాసిన వాటిలో ఒక ముక్క ప్రచురించేవాడిని’’ అని ఆయన చెప్పారు.

అప్పుడు 1980లో తను పంపిన మరొక వ్యాసం తిరస్కరణకు గురైన తర్వాత అయ్యర్ ప్రజావాణి కార్యాలయానికి వచ్చారు. హగ్డేను కలిసి తన వద్ద ఉన్న రిగ్రెట్ లెటర్ల గురించి చెప్పారు.

‘‘నేను సాక్ష్యం ఏమిటని అడిగాను. మరుసటి రోజు ఆయన వందలకొద్దీ రిగ్రెట్ లెటర్లు పట్టుకుని వచ్చారు’’ అని హెగ్డే తెలిపారు.

దీంతో తర్వాతి వారం తన కాలమ్‌లో ‘‘రిగ్రెట్ అయ్యర్’’ గురించి రాశారు హెగ్డే.

‘’ఇంకెవరైనా అయితే అవమానంగా భావించి ఆ లేఖలు దాచేసే వాళ్లు. కానీ ఆయన తనకు వచ్చిన లేఖలను గర్వంగా ప్రదర్శించారు’’ అని హెగ్డే నాతో చెప్పారు.

ఎప్పుడూ ఆశావాదిగా ఉండే అయ్యర్‌కు.. తనకు ఎదుర్యే ప్రతికూలతను అతిపెద్ద సానుకూలతగా మార్చుకోవడం ఎలాగో.. తన వైఫల్యాలను విజయానికి మెట్లుగా ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసు.

‘‘నా కోసం కొన్ని పేర్లు పరిశీలించామని, చివరికి రిగ్రెట్ అయ్యర్‌ను ఖరారు చేశామని సంపాదకులు నాకు చెప్పారు’’ అని అయ్యర్ తెలిపారు. తనకు కొత్త పేరు వచ్చిన తర్వాత ‘కత్తి కన్నా కలం గొప్పదని నాకు తెలిసింది’ అని అంటారాయన.

దీంతో ఆయన సివిల్ కోర్టుకు వెళ్లి.. తన పేరును అధికారికంగా మార్చుకోవడానికి అఫిడవిట్ తెచ్చుకున్నారు.

‘‘నా పోస్‌పోర్ట్, బ్యాంక్ అకౌంట్లో కూడా నేను నా పేరు మార్చుకున్నాను. నా పెళ్లి ఆహ్వాన పత్రికలో కూడా నా కొత్త పేరునే వాడాను’’ అని ఆయన చెప్పారు.

Image copyright Asif Saud
చిత్రం శీర్షిక అయ్యర్ భార్య విజయలక్ష్మి కూడా తన మధ్య పేరులో రిగ్రెట్‌ చేర్చుకున్నారు
Image copyright Asif Saud
చిత్రం శీర్షిక ‘అత్యధిక సంఖ్యలో రిగ్రెట్ చీటీలు అందుకున్నందుకు’ గాను ఆయన లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు

‘‘మొదట జనం నన్ను చూసి నవ్వారు. ఇతడో అవివేకి అని, పిచ్చివాడేమో అని అన్నారు. అవమానం జరిగింది. కానీ మా నాన్న నాకు ధైర్యం చెప్పారు. భూమి మీద ఉన్న వాళ్లలో నేను చాలా అదృష్టవంతుడినని నేను అనుకుంటాను. ఎందుకంటే నా కుటుంబం నాకు మనస్ఫూర్తిగా అండగా నిలిచింది’’ అని ఆయన చెప్తారు.

పెద్దయ్యాక చాలా కాలం తన తండ్రి జేబు ఖర్చుల కోసం ఇచ్చిన డబ్బులతోనే ఆయన జీవించారు. ‘‘జీవన వ్యయం తక్కువగా ఉండేది. మేం నా తల్లిదండ్రులతో కలిసి నివసించే వాళ్లం. వారు మాకు అండగా ఉన్నారు. నా పిల్లల్ని స్కూలుకి, కాలేజీకి వాళ్లే పంపించారు’’ అని అయ్యర్ వివరించారు.

సానుకూలంగా మారిన పరిస్థితులు

అయితే జీవితం క్రమంగా ఆయనకు సానుకూలంగా మారింది. అయ్యర్ లేఖలు, ఫొటోలు ప్రచురితమవడం పెరుగుతూ వచ్చాయి. ఆయన సరైన పనులు చేయడం నేర్చుకున్నారు. కర్ణాటకలోని ప్రధాన ఇంగ్లిష్, కన్నడ పత్రికలన్నీ ఆయన పంపిన వాటిని అంగీకరించడం మొదలైంది.

‘‘నా కెమెరా, పెన్ను, స్కూటర్, హెల్మెట్‌తో.. రిగ్రెట్ అయ్యర్ అనే లోగో గల చొక్కాలతో నేను ఒంటరి సైన్యంగా పనిచేశాను’’ అని ఆయన పేర్కొన్నారు.

కాలం గడిచేకొద్దీ ఆయన భార్య, ఇద్దరు పిల్లలు కూడా రిగ్రెట్‌ను తమ పేర్లలో చేర్చుకున్నారు.

రిగ్రెట్ అయ్యర్‌ను కర్ణాటకలోనే కాదు బహుశా భారతదేశంలోనే తొలి ‘పౌర జర్నలిస్టు’గా చెప్పవచ్చునని హెగ్డే అంటారు.

Image copyright Asif Saud
చిత్రం శీర్షిక బీబీసీని అయ్యర్ ఒక కార్టూన్ వేసి తన ఇంటికి ఆహ్వానించారు

‘‘మాకు ఆయన నిజంగా ఒక చెదలా ఉండేవారు. కానీ పాఠకులకు ఆయన చాలా గొప్పగా నచ్చేవారు. జనం ఎప్పుడూ పత్రికలు, మేగజేన్లలో మొదట చిన్న చిన్న చమత్కారాల కోసం వెదుకుతారు. అయ్యర్ కథనాలు, ఫొటోలు అందుకు సరిగ్గా సరిపోతాయి. అలా ఆయనకు ప్రజాదరణ లభించింది’’ అని హెగ్డే వివరించారు.

అధికారులు ఆయనంటే భయపడేవాళ్లు...

‘‘నిరంతర ప్రయత్నం ఆయనకు గల పెద్ద బలం. వేరే విలేకరులు అసైన్‌మెంట్ పూర్తిచేసి తిరిగొచ్చేసేవారు. కానీ ఆయన అక్కడే వేలాడుతుండేవారు. ఒక కథనం రాయడం కోసం ఆయన ఎంత దూరమైనా వెళ్లేవారు. చెత్త కుండీల వెనుక దాక్కుని ప్రత్యేక వార్తలు కనిపెట్టేవారు. ఆయనకు పేరు వచ్చాక అధికారులు ఆయనంటే భయపడేవాళ్లు’’ అని పేర్కొన్నారు.

‘‘ఆయన ఎల్లప్పుడూ తన కెమెరాను వెంట తీసుకెళ్లేవారు. నకిలీ బిచ్చగాళ్లను, పడిపోయిన చెట్లను, పోలీసుల ఆగడాలను, నీటి పంపుల లీకేజీలను, వీధుల్లో చెత్తను ఫొటోలు తీసేవారు’’ అని హెగ్డే తెలిపారు.

వైఫల్యాల చిట్టా చాలా దీర్ఘంగా ఉన్నప్పటికీ.. వాటి వల్ల అయ్యర్ ఎప్పుడూ నిస్పృహకు లోనవలేదు. ఎందుకంటే తిరస్కరణలతో ఆయనకు సుదీర్ఘ అనుబంధం ఉంది.

కొన్నిసార్లు తన వైఫల్యాల మీద కూడా ఆయన హాస్యమాడుతుంటారు. ‘‘విచార లేఖలు అందుకున్న వారితో అంతర్జాతీయ సంఘం ఏర్పాటు చేయాలని నేను ప్రయత్నించాను. కానీ అందులో చేరడానికి ఎవరూ ముందుకు రాలేదు. చూశారా.. ఎవరూ విఫలురుగా ఉండాలని కోరుకోరు’’ అంటూ ఆయన నవ్వుతారు.

తన పేరును మార్చుకున్నందుకు ఎప్పుడైనా విచారించారా? అని నేను అడిగాను.

‘లేదు’ అని ఆయన వెంటనే బదులిచ్చారు. తాను రిగ్రెట్ లెటర్ల సేకణ కర్తగా చరిత్రలో నిలిచిపోతానని పేర్కొన్నారు.

‘‘అసలు రిగ్రెట్ లెటర్లనేవే లేని రోజు ఒకటి వస్తుంది. నేటి డిజిటల్ ప్రపంచంలో రిగ్రెట్ లెటర్ అంటే ఏమిటని చాలా మంది నన్ను అడుగుతుంటారు. కానీ ఒక రోజు ప్రపంచంలోని కంప్యూటర్లన్నీ మూతపడతాయి. కానీ రిగ్రెట్ లెటర్లతో నిండిన నా అల్మరా అలాగే ఉంటుంది’’ అని రిగ్రెట్ అయ్యర్ ముక్తాయించారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఓ ఫొటో షూట్ ఈమె జీవితాన్ని మార్చేసింది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు