తెలంగాణ భాషను అవమానిస్తున్నారంటూ బిత్తిరి సత్తిపై దాడి

  • 27 నవంబర్ 2017
బిత్తిరి సత్తి Image copyright ట్విటర్

హాస్యనటుడు, వ్యాఖ్యాత బిత్తిరి సత్తి అలియాస్ రవిపై హైదరాబాద్ వాసి హెల్మెట్‌తో దాడి చేశాడు. బిత్తిరి సత్తి వీ6 ఛానెల్లో పని చేస్తున్నారు.

పోలీసులు.. స్థానికుల కథనం ప్రకారం.. బిత్తిరి సత్తి కోసం మణికంఠ అనే వ్యక్తి వీ6 ఛానెల్ కార్యాలయం వద్ద కాపుగాశాడు.

సత్తి అటువైపు రాగానే.. మణికంఠ అతనిపై హెల్మెట్‌తో దాడి చేశాడు. గాయపడిన సత్తిని వీ6 సిబ్బంది వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

అనంతరం మణికంఠ మీడియాతో మాట్లాడుతూ.. బిత్తిరి సత్తి తెలంగాణ భాషను అవమానిస్తున్నారని.. అందుకే అతనిపై దాడి చేశానని చెప్పాడు.

''నేను సినిమా డైరెక్టర్ అవుదామనుకుంటున్నాను. త్వరలోనే సినిమా తీస్తాను. నాది సికింద్రాబాద్. తెలంగాణలోనే హైదరాబాద్‌లోనే పుట్టాను'' అని మణికంఠ వెల్లడించాడు.

''నేను తెలంగాణావాడిని.. తెలంగాణ భాషను అవమానపరుస్తున్నాడన్న కారణంతో సత్తిని కొట్టాను'' అని చెప్పాడు.

మణికంఠను అరెస్ట్ చేసిన పోలీసులు బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.

Image copyright ట్విటర్

బిత్తిరి సత్తిపై జరిగిన దాడి విషయమై వీ6 సీఈఓ అంకం రవిని బీబీసీ సంప్రదించింది. దాడికి పాల్పడ్డ వ్యక్తి ఉదయం నుంచి అక్కడే వేచి ఉన్నాడని వాచ్‌మెన్ చెప్పారని ఆయన అన్నారు.

"మణికంఠ అనే వ్యక్తికి మతి స్థిమితం ఉన్నట్టు లేదు. ఇక్కడికి వచ్చే ముందు ఇంట్లో తన తల్లిని కూడా కొట్టి వచ్చాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం కేసును పోలీసు దర్యాప్తు చేస్తున్నారు" అని అంకం రవి చెప్పారు.

బిత్తిరి సత్తికి గతంలో ఏవైనా బెదిరింపులు వచ్చాయా అని అడగగా, అలాంటిదేమీ లేదని, చాలా మంది అభిమానులు ఆయనను కలవడానికి వస్తారని చెప్పారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు