జీఈఎస్ సదస్సు: ‘పెట్టుబడి పెట్టమంటే.. నీ వయసెంత? నువ్వు పెళ్లెప్పుడు చేసుకుంటావు అన్నారు’

  • 29 నవంబర్ 2017
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవ్యాపారం 'నాడి' పట్టారు

ఎంసెట్‌లో మంచి ర్యాంక్ తెచ్చుకుని మెడిసిన్ చదివిన అమ్మాయి డాక్టర్‌గా ప్రాక్టీస్ చేయకుండా వ్యాపారంలోకి అడుగుపెట్టింది.

రోగుల నాడి పట్టుకోవాల్సిన మహిళ సొంతంగా స్టారప్ట్ మొదలుపెట్టి అదరగొట్టింది.

కంభం మేఘన.. మెడిసిన్ చదివిన ఈ అమ్మాయి హైదరాబాద్ కేంద్రంగా కేర్ అండ్ గ్రో పేరుతో ఒక స్టార్టప్ నడుపుతున్నారు.

చికిత్స కంటే నివారణే మేలు అనే సూత్రమే ఈమె స్టార్టప్‌నకు పునాదిరాయి.

మనకొచ్చే వ్యాధుల్లో చాలా వరకూ ముందుగానే నివారించగలిగేవే. వాటిని పసిగట్టి, సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. సరిగ్గా ఇదే పాయింట్ ఆధారంగా మేఘన ఓ స్టార్టప్ ప్రారంభించారు.

చిత్రం శీర్షిక కంభం మేఘన

విద్యార్థులకు ఏడాది పాటూ ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్పడం, వివిధ రకాల వైద్య పరీక్షలు చేయడం మేఘన కంపెనీ చేస్తుంది. ఇప్పటి వరకూ 12 వేల మందికి ఇలా చికిత్స అందించింది మేఘన. ప్రతీ విద్యార్థికీ దాదాపు 45 రకాల పరీక్షలు చేస్తారు.

భారతదేశం నుంచి ఉబర్ కంపెనీ ఎంపిక చేసిన అత్యంత ప్రభావశీల స్టార్టప్స్ లో ఒకటిగా మేఘన సంస్థ నిలిచింది. అంతేకాదు, ఈమె ప్రాజెక్టుకు మైక్రోసాఫ్ట్ సంస్థ సహకారం కూడా అందిస్తోంది.

మెడిసిన్ చదువుతున్నప్పుడు రోగుల అవస్థలు చూసి, తమ కుటుంబం నడిపే స్కూల్లో పిల్లల పరిస్థితి చూసి ఈ స్టార్టప్ మొదలుపెట్టాను అంటారు మేఘన.

చాలా మంది అవగాహన లేక అరికట్టగలిగే ఎన్నో వ్యాధులను పీకలమీదకు తెచ్చుకుంటున్నారు. ఆ పరిస్థితి నన్ను చాలా బాధించింది అని మేఘన చెప్పారు.

స్టార్టప్ ప్రారంభించడానికి మేఘన మొదట్లో చాలా ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా పెట్టుబడిదారులను ఒప్పించడం ఆమెకు పెద్ద సమస్యగా మారింది.

''ఎవరి దగ్గరికైనా వెళ్లి పెట్టుబడి పెట్టమంటే వాళ్లు ముందు అడిగే ప్రశ్న.. నీ వయసెంత? వయసుతో ఏం పని అంటే, నువ్వు పెళ్లెప్పుడు చేసుకుంటావు అని అడుగుతారు. అదే ప్రశ్న అబ్బాయిని అడగరు'' అని తనకెదురైన అనుభవాలను మేఘన వివరించారు.

చిత్రం శీర్షిక పాఠశాల విద్యార్థులకు ఆరోగ్యకర అలవాట్లపై అవగాహన కల్పిస్తున్న మేఘన

''అమ్మాయి అబ్బాయి తేడా మొదటిసారి స్టార్టప్ మొదలుపెట్టినప్పుడే తెలిసింది. మహిళలు పెట్టుబడి గురించి అడిగితే ఇన్వెస్టర్లు అంత సీరియస్‌గా తీసుకోరు.

ఎంట్రప్రెన్యూర్షిప్ అంటే రిస్క్, అది అమ్మాయి నుంచి అంటే ఇంకా రిస్క్. ఎవరైనా పెట్టుబడి పెట్టి అది సక్సెస్ అయితే మాత్రం అప్పుడు పెట్టుబడి పెట్టడానికి చాలా మంది ముందుకు వస్తారు'' అని మేఘన చెప్పారు.

''జీఈఎస్ వంటి సమావేశాలు అవసరం. సెలబ్రిటీలు, ప్రభుత్వం మహిళావ్యాపారులను ప్రోత్సహించాలి. వ్యాపారంలో లింగవివక్షత, అసమానత్వం చాలా కాలం నుంచి ఉంటోంది. ఆ లోటు పూడ్చడానికి ఇలాంటి సమావేశాలు చాలా అవసరం. ఇలాంటి సదస్సులతో చిన్న పట్టణాల్లో ఉండే మహిళలు కూడా ప్రేరణ పొందుతారు. కొన్నాళ్ల నుంచి దేశంలో ఎంట్రప్రెన్యూర్షిప్‌కి ప్రోత్సాహం పెరిగింది. అదింకా పెరగాల్సి ఉంది. '' అని మేఘన అన్నారు.

''ఆంక్షలను పట్టించుకోవద్దు. బయటకు వెళ్లి మీ కలలు నెరవేర్చుకోండి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనకడుగు వేయోద్దు'' అని మహిళలకు మేఘన సలహా ఇస్తున్నారు.

చిత్రం శీర్షిక ప్రియా అనంత్

వృద్ధుల రక్షణే ‘స్టార్టప్’

వృద్ధాప్యంలో రోగాల బారిన పడినవారికి సేవలు చేయడం చాలా కష్టంతో కూడుకున్నపని. సమయానికి మందులు ఇవ్వాలి. హెల్త్ చెకప్స్ చేయాలి. ఇంట్లోవాళ్లకు కూడా ఇది సాధ్యం కాదు.

ఈ సమస్యనే వ్యాపార అవకాశంగా మార్చుకున్నారు హైదరాబాద్ కి చెందిన ప్రియా అనంత్.

అనారోగ్యంతో బాధపడుతున్నవారికి, వృద్ధులకు ఇంటివద్దే సేవలందించేందుకు లైఫ్ సర్కిల్ పేరుతో ఆమె ఓ స్టార్టప్‌ను ప్రారంభించారు. కొంతకాలం వరకూ టీ హబ్‌లో స్టార్టప్ నిర్వహించిన ఆమె ఇప్పుడు విడిగా ఆఫీసు నిర్వహిస్తున్నారు.

ఉన్నత చదువులు చదివిన ప్రియా ఆ తర్వాత చాలా కాలం ఉద్యోగం కూడా చేశారు. ఆ తర్వాతే ఇటువైపు అడుగులు వేశారు.

ప్రియ ప్రారంభించిన స్టార్టప్ అనారోగ్యంతో బాధపడేవారికి, వృద్ధాప్యంలో ఉన్నవారికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చినవారితో వారి ఇంటివద్దే సేవలందిస్తుంది.

''2013లో మా అత్తగారికి మోకాలి ఆపరేషన్ చేయించాం. పోస్ట్ సర్జికల్ కాంప్లికేషన్స్ వచ్చాయి. అప్పడు చాలా ఇబ్బంది పడ్డాం. ఇది మా ఒక్కరి సమస్యే కాదు. చాలా మంది సమస్య. అప్పుడే ఈ ఆలోచన వచ్చింది. దీని గురించి ఎంతో పరిశోధన చేశా. శిక్షణ విషయంలో ఓ ఫ్రెంచ్ కంపెనీ సహకారం తీసుకున్నా. తరువాత వారే మా సంస్థలో పెట్టుబడి కూడా పెట్టారు.'' అని ప్రియాంక అన్నారు.

చిత్రం శీర్షిక ప్రియా అనంత్

''ప్రస్తుతం పారిశ్రామికరంగంలో మహిళల శాతం తక్కువగా ఉంది. టీ హబ్ ఇందుకు ఒక ఉదాహరణ. ఇక్కడ చాలా మంది అమ్మాయిలు పనిచేస్తున్నారు. కానీ, మహిళలు నడుపుతున్న స్టార్టప్స్ చాలా తక్కువ'' అని ఆమె చెప్పారు.

''ఒక ఇంటర్వ్యూలో చందా కొచ్చార్ (ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో) చెప్పినట్టు పనిచేసే మహిళలు రెండుసార్లు జీవిస్తారు. ఉద్యోగం చేసే స్త్రీలకు ఇల్లు, పిల్లలు తక్కువేం కాదు. ముఖ్యంగా భారతీయ మహిళలకు రెండు బాధ్యతలు ఉంటాయి. ఇది ఒక సవాల్. వీలైనంత అనువుగా దీన్ని మలుచుకోవడం, దాన్ని సమతుల్యం చేసుకోవడం ముఖ్యం'' అని ప్రియ అన్నారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)