ప్రెస్‌రివ్యూ: ఇవాంక మది దోచిన ముగ్గురు

  • 29 నవంబర్ 2017
ఇవాంక ట్రంప్ Image copyright GES
చిత్రం శీర్షిక ఇవాంక ట్రంప్

నూట యాభైకి పైగా దేశాల నుంచి తరలివచ్చిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, వ్యాపార వాణిజ్య రంగాల దిగ్గజాలతో హైదరాబాద్‌లో మంగళవారం ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్) ఘనంగా ప్రారంభమైనట్లు 'ఈనాడు' పత్రిక పేర్కొంది.

'ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంక ట్రంప్‌ ఈ సదస్సుకు ప్రధాన ఆకర్షణగా నిలిచారు.'

'డొనాల్డ్‌ ట్రంప్‌ రూపంలో భారతావనికి శ్వేతసౌధంలో అప్తమిత్రుడున్నారంటూ ఇవాంక చేసిన ప్రసంగం.. దేశాల మధ్య బంధం వేసే ప్రయత్నం చేసింది. భారతదేశ వృద్ధిలో ప్రపంచ పారిశ్రామికవేత్తలందరూ భాగస్వాములు కావాలన్న ప్రధాని మోదీ పిలుపు.. అవకాశాలకు ద్వారాలు తెరిచామని స్పష్టం చేసింది. మరోవైపు హైదరాబాదీ ఆతిథ్యం, బిర్యానీ మాధుర్యం.. అజర్‌బైజాన్‌ నుంచి అమెరికా దాకా, ఘనా నుంచి చైనా వరకు.. ప్రపంచం నలుమూలల నుంచి తరలివచ్చిన పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారుల మనసు చూరగొంటోంది" అని ఈనాడు పేర్కొంది. అలాగే, ఇవాంక ట్రంప్, ప్రధాని మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీఈఎస్‌లో చేసిన ప్రసంగాలను ప్రముఖంగా ప్రచురించింది.

ఏపీ సచివాలయం వద్ద అక్కాచెల్లెళ్ల ఆత్మహత్యాయత్నం

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా వెలగ పూడిలోని రాష్ట్ర సచివాలయం ప్రధాన గేటు వద్ద మంగళవారం అక్కాచెల్లెళ్లు షాకిరా, ఫాతిమా ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం తీవ్ర కలకలం సృష్టించిందని సాక్షి దినపత్రిక ఆంధ్రప్రదేశ్ ఎడిషన్‌లో ఓ కథనాన్ని ప్రచురించింది. 'సీఎంకు గోడు వెళ్లబోసుకునేందుకు కర్నూలు జిల్లా నుంచి రాగా, భద్రతా సిబ్బంది లోపలికి అనుమతించకపోవడంతో మనస్తాపానికి గురై పురుగు మందు తాగి బలవన్మరణానికి సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రిని కలవడానికి ఇప్పటికే పదిసార్లు తాము వెలగపూడి సచివాలయానికి వచ్చామని వారి తల్లి మొహిద్దీన్‌షా చెప్పారు. తమ గోడు ఎవరూ వినిపించు కోవడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. పదకొండోసారి కూడా పోలీసులు అడ్డగించారని తెలిపారు' అని సాక్షి పేర్కొంది.

Image copyright FACEBOOK/HYDMETRORAIL
చిత్రం శీర్షిక మెట్రో రైలులో ప్రయాణిస్తున్న ప్రధాని మోదీ, గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్

నేటి నుంచి మెట్రో ప్రారంభం

మెట్రో రైలు సేవలు బుధవారం నుంచి నగరవాసులకు అందుబాటులోకి రానున్నాయని, ఉదయం 6 గంటలకు మియాపూర్‌, నాగోల్‌ నుంచి ఏకకాలంలో రెండు రైళ్లు ప్రయాణికులతో గమ్యస్థానాలకు పయణమవుతాయని ఆంధ్రజ్యోతి పత్రిక పేర్కొంది.

'2 కారిడార్ల పరిధిలో 30 కిలోమీటర్ల మార్గంలో మెట్రో రైళ్లు తిరగనున్నాయి. 24 మెట్రో స్టేషన్ల నుంచి ప్రయాణికులు తమ గమ్య స్థానాలను చేరుకునేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు రైళ్లను నడపనున్నారు' అని తెలిపింది.

Image copyright GES WEBSITE
చిత్రం శీర్షిక ఇవాంక ట్రంప్

ఇవాంక మదిదోచిన ఆ ముగ్గురు

జీఈఎస్‌ సదస్సు ప్రారంభోత్సవంలో అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంక ట్రంప్‌... ఇద్దరు మహిళా పారిశ్రామికవేత్తలను, ఒక బాలికను ప్రత్యేకంగా అభినందించినట్లు ఈనాడు ఓ కథనాన్ని ప్రచురించింది. 'వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలతో సమాజ సేవ చేస్తున్న రేయాన్, రాజలక్ష్మీ, దారా డాట్జ్ ఈ సదస్సుకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారంటూ ఇవాంక కొనియాడారు. తన ప్రసంగంలో వారిని పేరుపేరునా పిలిచి అందరికీ పరిచయం చేశారు. ఆ ముగ్గురు మహిళలు సవాళ్లను అధిగమించి ముందుకెళ్లగలరని చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచారని ప్రశంసించారు' అని పేర్కొంది.

Image copyright facebook/Pjtsau telangana jac
చిత్రం శీర్షిక ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ

అంగట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు!

తెలంగాణలోని జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 234 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీలో అక్రమాలు చోటుచేసుకుంటున్నట్లు సాక్షి పత్రిక ఓ కథనాన్ని ప్రచురించంది.

'అక్రమార్కులకు అండగా అన్నట్లు ఇంటర్వ్యూ కోసం ఏకంగా 25 మార్కులు కేటాయించారు. కొందరు దళారులు, అభ్యర్థులు ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లి పైరవీలు ముమ్మరం చేసినట్లు విశ్వవిద్యాలయంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒక్కో పోస్టుకు రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు డిమాండ్‌ చేస్తున్నారని ప్రొఫెసర్లే అంటున్నారు.' అని సాక్షి పేర్కొంది.

Image copyright FACEBOOK/GHMC
చిత్రం శీర్షిక హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్

సోషల్ మీడియాలో మేయర్ రాజీనామా వదంతులు

మెట్రోరైల్‌ ప్రాజెక్టు ప్రారంభోత్సవం శిలాఫలకంపై హైదరాబాద్ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పేరు లేకపోవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయినట్లు ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది.

'శిలాఫలకంపై ఆయన పేరు లేకపోవడం.. ఏం ప్రొటోకాల్‌ ..? అన్న సందేశంతో కూడిన పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. మేయర్‌ బొంతు రామ్మోహన్‌ రాజీనామా చేసినట్టు కొన్ని పోస్టులు వచ్చాయి. దీనిపై స్పందించిన మేయర్‌ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. మేయర్‌ రాజీనామా వార్తల్లో వాస్తవం లేదని వారు పేర్కొన్నారు అని ఆంధ్రజ్యోతి తెలిపింది.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)