ఫాతిమా కాలేజి విద్యార్థుల అలుపెరుగని పోరాటం

  • 8 డిసెంబర్ 2017
ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థులు
చిత్రం శీర్షిక దీక్ష చేస్తున్న ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థులు

ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ఫాతిమా మెడికల్ కాలేజి విద్యార్థుల సమస్య అంతులేని కథలా కొనసాగుతోంది. ఇప్పటివరకూ మేం చూసుకుంటాం అని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు వచ్చే ఏడాది నీట్ రాయాలని ఆదేశించడంతో విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ప్రతి ఏటా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెడికల్ కాలేజీల‌ను తనిఖీ చేసి గుర్తింపు ఇస్తుంది. 2015-16 విద్యాసంవత్సరం కోసం ఫాతిమా కాలేజీలో తనిఖీలు చేసిన ఎంసీఐ, ఆ కాలేజీకి గుర్తింపు ఇవ్వలేదు. యాజమాన్యం కోర్టుకు వెళ్లడంతో.. మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం అడ్మిషన్లు నిర్వహించారు.

విద్యార్థులు చేరిన 6 నెలల తరువాత తుది తీర్పు వచ్చింది. కాలేజీకి గుర్తింపు రాలేదు. దాంతో విద్యార్థుల అడ్మిషన్లు రద్దయ్యాయి. సాధారణంగా ఇలాంటివి జరిగినప్పుడు విద్యార్థులను వేరే కాలేజీలలో రీలొకేట్ చేస్తారు. కానీ ప్రభుత్వం ఆ పని చేయలేదు.

విద్యార్థులు తిరిగి అదే కాలేజీలో చదివేందుకు అనుమతివ్వాలనీ, అదే విద్యా సంవత్సరానికి అనుమతి కావాలని యాజమాన్యం, ప్రభుత్వం కోరుతున్నాయి. హైకోర్టు, సుప్రీంకోర్టులు దీనికి ఒప్పుకోవడం లేదు. దీంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionబలిపశువులుగా మారిన ఫాతిమా కాలేజి విద్యార్థులు

న్యాయపోరాటం

హైకోర్టు తీర్పు తరువాత దాదాపు 30 మంది విద్యార్థుల చేత యాజమాన్యం ఒక పిటిషన్ వేయించ‌గా, మిగిలిన 60 మంది విద్యార్థులు విడిగా మరో పిటిషన్ వేశారు. కానీ, విద్యార్థుల పిటిషన్‌ను అసలు విచారణకే స్వీకరించలేదు.

కాలేజి పిటిషన్ విచార‌ణకు వ‌చ్చినా, కోర్టు దానిని కొట్టేసింది. విద్యార్థులను వేరే కాలేజీలలో రీలొకేట్ చేయకుండా మళ్లీ తమకే అనుమతి ఇవ్వాలని యాజమాన్యం కోరడం వల్లే కేసు కొట్టేసినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

రాజకీయ పోరు

కోర్టుల్లో దార్లు మూసుకుపోవడంతో, రాజకీయ పోరాటం మొదలైంది. 2016 డిసెంబరు 22న విజ‌య‌వాడ‌లో ఫాతిమా విద్యార్థులు ఆందోళన చేశారు. దాంతో ఏపీ ప్రభుత్వం 50 మంది విద్యార్థులను ప్రభుత్వ కాలేజీల్లో, 50 మందిని ప్రైవేటు కాలేజీల్లో రీలొకేట్ చేస్తామని ప్రకటించింది. అయితే అది కార్యరూపం దాల్చలేదు.

ఆ తర్వాత విద్యార్థులు ముఖ్యమంత్రిని కలవగా... జిల్లా టీడీపీ నాయ‌కుల స‌హ‌కారంతో కొంద‌రు విద్యార్థుల‌ను దిల్లీ పంపించారు. దాదాపు నెల రోజులకు పైగా విద్యార్థులు దిల్లీలో తమ సమస్యలను వివిధ శాఖల అధికారుల వద్ద మొర పెట్టుకున్నా ఉపయోగం లేకపోయింది.

ఆ తర్వాత వారు ప్రతిపక్షనేత వైయ‌స్ జ‌గ‌న్‌ను కలవగా.. ఆయన ఈ అంశంపై కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ న‌డ్డాకు లేఖ రాశారు.

హామీల మీద హామీలు

తమను రీలొకేట్ చేయడం అంత కష్టమేమీ కాదంటున్నారు విద్యార్థులు. ''మేం కనీసం 30-40 సార్లు మంత్రి కామినేనిని కలిసాం. మమ్మల్ని రీలొకేట్ చేయమంటే కాలేజి ఒప్పుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కావాలని ఆలస్యం చేస్తోంది. మంత్రి కామినేని రోజుకో మాట మాట్లాడుతున్నారు'' అని ముజీర్ అనే విద్యార్థి తెలిపారు.

భవిష్యత్తు తేల‌క కొట్టుమిట్టాడుతున్న విద్యార్థులు ఇటీవల విజయవాడలో సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. దీంతో చంద్రబాబు విద్యార్థులను పిలిపించి మాట్లాడారు. విద్యార్థుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.

అయితే ముందు జాగ్రత్త చర్యగా వారు మళ్లీ నీట్‌కు ప్రిపేర్ కావాలని సూచించారు. అందుకయ్యే ఖర్చునూ ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చారు.

విద్యార్థులే బలిపశువులు

ఇలాంటి సందర్భాల్లో ఎప్పుడూ విద్యార్థులే బలి పశువులుగా మారుతుంటారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు డాక్టర్ సమరం అన్నారు.

''వీళ్ల విషయంలో ప్రభుత్వం బాధ్యత తీసుకుని ఇతర మెడికల్ కాలేజీలలో రీలొకేట్ చేయాలి. అదనంగా ఒక్క సీటు ఇవ్వడానికి కూడా ఎంసీఐ ఒప్పుకోదు. ఇలాంటి సందర్భాల్లో సాధారణంగా నష్టపోయేది విద్యార్థులే'' అని వివరించారు.

సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలతో ఒక ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు ఏపీ ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాసరావు తెలిపారు. దీనిపై నవంబర్ 29న కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాను కలిసినట్లు తెలిపారు.

''రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన అందగానే ఉమ్మడి సమావేశం నిర్వహిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ఆయన కోరినట్లు మేం త్వరలో ప్రతిపాదన పంపుతాం. విద్యార్థుల సమస్య పరిష్కరించడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాం'' అని కామినేని తెలిపారు.

పరిష్కారం ఏంటి?

విద్యార్థులకు న్యాయం చేయడానికి దేనికైనా సిద్ధమే అంటోంది కాలేజీ యాజమాన్యం. అవసరమైతే వచ్చే ఏడాది తాము ఒక బ్యాచ్ వదులుకుని నష్టపోయిన విద్యార్థులకు సీటిస్తామని తెలిపింది. ఎంసీఐ, కోర్టులు ఏం చెప్పినా దానిని పాటించడానికి సిద్ధమని అంది.

కొందరు విద్యార్థులు తరచుగా క్యాంపస్‌కు వచ్చి గొడవ చేయడం వల్లే తాము కేసు పెట్టాల్సి వచ్చిందని కాలేజీ సెక్రటరీ జవ్వాద్ అహ్మద్ ఖురేషీ వివరించారు.

ప్రస్తుతం ప్రభుత్వం ముందున్నవి రెండు ఆప్షన్లు. ఒకటి ఫాతిమాలో ఒక బ్యాచ్‌ను రద్దు చేసి, ఆందోళన చేస్తున్న విద్యార్థులను తీసుకోవడం. రెండు - వారిని మిగతా కాలేజీల్లో రీలొకేట్ చేయడం. ఈ ప్రతిపాదనను రాష్ట్రం కేంద్రానికి పంపితే, కేంద్రం దాన్ని సుప్రీంకు పంపాలి. దానికి ఎంసీఐ అభ్యంతరం చెప్పకపోతే విద్యార్థులు తమ చదువు కొనసాగించవచ్చు.

ఇప్పుడు ఫాతిమా విద్యార్థుల భవిష్యత్ సుప్రీంకోర్టు, ఎంసీఐ చేతిలో ఉంది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)