ప్రెస్ రివ్యూ: గోల్కొండ కోటలో 'యువరాణి' ఏమన్నారు?

 • 30 నవంబర్ 2017
Image copyright 2017 Global Entrepreneurship Summit/Facebook

కోటలోయువరాణి!

నమస్తే తెలంగాణ: మా దేశంలో ఇలాంటి కోటలు లేవు. ఇవి మీ పూర్వీకుల ఇంజినీరింగ్ నైపుణ్యాన్ని తెలియజేసే గొప్ప కట్టడాలు... జీఈ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు అమెరికా నుంచి వచ్చిన విశిష్ట అతిథి ఇవాంకా ట్రంప్ బుధవారం చారిత్రాత్మక గోల్కొండ కోటను సందర్శించిన తర్వాత అన్నమాటలివి. గోల్కొండకోట నిర్మాణవైభవాన్ని చూసి ఇవాంక అబ్బురపడిపోయారు. ఇలాంటి కోటలు ఆనాటి సాంకేతిక పరిజ్ఞానానికి నిలువుటద్దాలని ప్రశంసించారు.

మధ్యాహ్నం మూడు గంటలకు ఆమె కాన్వాయ్ గోల్కొండకోటలోని బాలాహిసార్‌కు చేరుకొన్నారు. గోల్కొండకోటకు చేరుకోగానే నీతిఆయోగ్, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు ఆమెను సాదరంగా ఆహ్వానించారు. బాలాహిసార్‌లో పరిసరాలను పరిశీలించిన ఇవాంక.. కోటలో చప్పట్లు కొట్టే ప్రదేశాన్ని (క్లాపింగ్ ఏరియా) చాలా ఆసక్తిగా పరిశీలించారు. చప్పట్లు కొడితే రాజదర్బార్ వరకు వినిపించడం ఆమెను ఆశ్చర్యపరిచింది. గైడ్‌తోపాటు ఆమె కూడా చప్పట్లు కొట్టి సంతోషం వ్యక్తంచేశారు.

కోటలో ఒకబావి నుంచి ఎత్తులో ఉన్న మరోబావిలోకి నీటిని తోడి రాజప్రసాదాలు, రాణివాసాల వరకు నీటిని సరఫరా చేసే వ్యవస్థను ఆమె శ్రద్ధగా గమనించారు. అనంతరం రాణిమహల్‌ను సందర్శించి, అక్కడి విశేషాలను ఆసక్తిగా తెలుసుకొన్నారు. ఆయుధగారాన్ని కూడా ఆసక్తిగా గమనించారు. ఇవాంకాట్రంప్ కోసం ప్రత్యేకంగా సౌండ్ అండ్‌లైట్ షోను ప్రదర్శించారు.

Image copyright Getty Images

ఏపీలో నిరుద్యోగ భృతిపై ప్రకటన

ఈనాడు: రాష్ట్రంలో నిరుద్యోగభృతి పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం శాసనసభలో ప్రకటించే అవకాశం ఉంది. పథకం అమలుకి సంబంధించి విధివిధానాల రూపకల్పనకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం వీటిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. శనివారం శాసనసభలో దీనిపై చర్చించనున్నారు.

అర్హుల ఎంపికకు మంత్రివర్గ ఉపసంఘం సిద్ధం చేసిన ప్రతిపాదనలివీ:

 • కనిష్ఠ వయోపరిమితి 18 ఏళ్లు. గరిష్ఠ వయోపరిమితి 35 ఏళ్లు.
 • కనీస విద్యార్హత ఇంటర్మీడియెట్‌.
 • ఒక్కొక్కరికి నెలకు రూ.1500 చొప్పున నిరుద్యోగ భృతి.
 • ఒక కుటుంబంలో ఒక్కరికే.
 • తెల్ల రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, ఓటరు గుర్తింపుకార్డు తప్పనిసరి.
 • మాగాణి భూమి అయితే రెండున్నర ఎకరాల లోపు, మెట్ట భూమి అయితే ఐదు ఎకరాల లోపు ఉన్నవారే అర్హులు.
 • వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లు, విభాగాల ద్వారా స్వయం ఉపాధి పథకాల కింద రాయితీలు పొందిన వారు నిరుద్యోగ భృతికి అనర్హులు.
 • నిరుద్యోగ భృతి తీసుకుంటున్నవారిలో సామాజిక స్పృహను పెంచేందుకు స్వచ్ఛభారత్‌, వనం-మనం వంటి నాలుగైదు ప్రభుత్వ కార్యక్రమాల అమలు బాధ్యతను అప్పగిస్తారు.
 • నిరుద్యోగ భృతికి అర్హులు 8 లక్షల మంది నుంచి 10 లక్షల మంది వరకు ఉంటారని అంచనా.
 • రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించిన రూ.500 కోట్లు, నిరుద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం నుంచి వస్తున్ననిధులు, వివిధ ఉపప్రణాళికల ద్వారా ఖర్చు చేస్తున్న నిధులు వంటివన్నీ సమీకృతంచేసి ఈపథకాన్ని అమలు చేస్తారు.
Image copyright 2017 Global Entrepreneurship Summit/Facebook

మగాళ్లతోనే మార్పు ప్రారంభం కావాలి

సాక్షి: ‘‘ఇది సమాన ప్రపంచం. ఇక్కడ పురుషులు, స్త్రీలు అందరూ సమానమే. వేతనాల్లోనూ, అవకాశాల్లోనూ ఇద్దరికీ తగిన అవకాశాలుండాలి. పురుషాధిక్య సమాజంలో మార్పు రావాలంటే ముందు పురుషుడి ఆలోచనలో మార్పు రావాలి. స్త్రీలు తమకంటే ఎందులోనూ తక్కువ కాదని పురుషులు ఆలోచిస్తే అప్పుడు తాము తక్కువ కాదని స్త్రీలు ఆలోచించడం మొదలు పెడతారు. నాకెప్పుడూ అసమానత ఎదురుకాలేదు’’ అని ప్రపంచ సుందరి మానుషీ ఛిల్లర్‌ పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్‌)లో బుధవారం మహిళా సాధికారతపై జరిగిన చర్చాగోష్టిలో ఆమె పాల్గొన్నారు. ‘‘ఏ పనయినా నాతో కాదు అన్న భావన రాకూడదు. ప్రతి ఒక్కరూ మార్పు తీసుకురాగలరు. ఓ చిరు నవ్వు కూడా పరిస్థితిలో మార్పు తెస్తుంది. గుడ్‌ మార్నింగ్‌ అంటూ పలకరించడం కూడా ఎదుటి వారిలో మనపై అభిప్రాయాన్ని మారుస్తుంది. ఎదుటివారిని సంతోషపరిస్తే మనల్ని కూడా వారు సంతోషపరిచేందుకు ప్రయత్నిస్తారు. ప్రతి ఒక్కరికీ సమాజంలో మార్పు తెచ్చే అవకాశం ఉంది. మార్పు తెచ్చేందుకు మిస్‌ వరల్డే కానక్కర్లేదు’’ అని చెప్పారు.

‘‘ఒక మహిళ ఎదిగేందుకు మరో మహిళ తోడ్పాటు నివ్వాలి. మహిళల్లో అవగాహన లేమితో పాటు అనుకూలతలు లేకపోవడం వల్ల కూడా రాణించలేకపోతున్నారు. అందుకే కొన్ని అవకాశాలను వారికి కల్పించాలి. ఆ కోణంలోనే రుతుక్రమంలో పాటించాల్సిన శుభ్రత గురించి ఆలోచించి ఓ కంపెనీ ఏర్పాటు చేశా. స్థానిక వ్యాపారులతోపాటు వాల్‌మార్ట్‌ లాంటి సంస్థతో కూడా అనుసంధానమయ్యాం. దాదాపు ఉత్తర భారతదేశమంతా శానిటరీ నాప్‌కిన్స్‌ను మా కంపెనీ అందిస్తుంది. దీంతో 20 గ్రామాల్లోని మహిళలు ఉపాధి పొందుతున్నారు. వారు కూడా పారిశ్రామికవేత్తలవుతున్నారు‘‘ అని ఆమె తెలిపారు.

Image copyright Getty Images

తెలుగు రాష్ట్రాలపై ఎయిడ్స్ పంజా

ఆంధ్రజ్యోతి: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో 2015లో 13,732 మంది ఎయిడ్స్‌తో మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఒకపక్క 2030 నాటికి ఎయిడ్స్‌ రహిత దేశంగా మార్చాలని ఆశయం పెట్టుకుంటే మరోపక్క రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎయిడ్స్‌ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2015 న్యాకో లెక్కల ప్రకారం దేశంలో ఎయిడ్స్‌తో 21.17 లక్షల మంది బాధ పడుతున్నారు. దేశంలోనే అత్యధికంగా తెలుగు రాష్ట్రాల్లో 3.95 లక్షల మంది ఎయిడ్స్‌ బాధితులు ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి.

నిరుటితో పోలిస్తే ఈ ఏడాది తెలంగాణలో ఎయిడ్స్‌ కేసుల సంఖ్య పెరిగింది. ఈ ఏడాది ఆర్నెల్లలో 2,84,180 మందికి ర్యాండమ్‌గా పరీక్షలు నిర్వహించగా 5,789 కేసులు నమోదయ్యాయి. అంటే 2.04 శాతం. గత ఏడాది 5,87,738 మందికి హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించగా 11,403 మందికి వ్యాధి నిర్ధారణ అయింది. అంటే 1.94 శాతం. గత ఏడాదితో పోలిస్తే ఆరు నెలల్లోనే కేసుల సంఖ్యలో పెరుగుదల ఉండటం గమనార్హం. రెండేళ్ల కిత్రం న్యాకో విడుదల చేసిన ఎయిడ్స్‌ డేటా ప్రకారం... రెండు తెలుగు రాష్ట్రాలలో 9,521 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుత సర్వేలో ఒక్క తెలంగాణలోనే కొత్తగా 5,789 కేసులు నమోదు కావడంతో తీవ్రత బాగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు.

హైదరాబాద్‌లో 40,395 మందిని పరీక్షించగా 1024 (2.53 శాతం) మందికి హెచ్‌ఐవీ సోకిందని తేలింది. మెదక్‌, నల్గొండ, హైదరాబాద్‌లలో ఎయిడ్స్‌ కేసుల తీవ్రత అధికంగా ఉంది. మెదక్‌ జిల్లాలో 19,335 మందిని పరీక్షించగా 574(2.97 శాతం) మందికి హెచ్‌ఐవీ ఉందని తేలింది. నల్గొండ జిల్లాలో కూడా 27,812 మందిని పరీక్షించగా 738(2.65 శాతం) మందికి హెచ్‌ఐవీ ఉందని నిర్ధారణ అయ్యింది. కొత్తగా ఎయిడ్స్‌ బారిన పడుతున్న వారిలో అత్యధికులు 40 ఏళ్లు దాటిన వారే ఉంటున్నట్టు తేలింది. ఎయిడ్స్‌ బారినపడ్డా గతంలోలా వెంటనే మరణించే అవకాశాల్లేవు. ఇదో దీర్ఘకాలిక వ్యాధిగా మారింది. అందుబాటులో ఉన్న మందుల వల్ల ఎయిడ్స్‌ బారినపడ్డా 20 సంవత్సరాలకు పైబడి బతుకుతున్నారు.

Image copyright Getty Images

పాఠశాలల్లో తెలుగు తప్పనిసరి: చంద్రబాబు

ప్రజాశక్తి: ఆంధ్రప్రదేశ్‌లో అన్ని పాఠశాలల్లోనూ తెలుగు మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. మున్సిపల్‌ పాఠశాలల్లోను తెలుగు కొనసాగుతుందన్నారు. ఇంగ్లీషు మీడియం అమలుకు ఇచ్చిన జీవోను సవరించామని చెప్పారు. ప్రజా ప్రాముఖ్యం గల పరిపాలన, విద్యా రంగాల్లో తెలుగు భాష అమలు గురించి సభ్యులిచ్చిన నోటీసుపై శాసనసభలో బుధవారం చర్చించారు.

ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ తెలుగు భాషాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్‌ తెలుగు భాషాభివృద్ధి అథారిటీని ఏర్పాటు చేస్తామన్నారు. తెలుగు అమలుకు అవసరమైన సాంకేతిక శిక్షణ ఉద్యోగులకు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇంగ్లీషు మీడియంతో తెలుగు, తెలుగు మీడియంతో ఇంగ్లీషు ఉండాలన్నారు. ప్రాచీన భాషా కేంద్రాన్ని అమరావతిలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. న్యాయశాఖలో తెలుగు అమలుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి రెండేళ్లకోసారి ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నామన్నారు.

తెలుగు భాష అమలుపై చర్చకు నోటీసు ఇచ్చిన సభ్యులు శ్రావణకుమార్‌ తన కుమార్తెను బెంగళూరులో ఇంగ్లీషు మీడియంలో చదివిస్తున్నారని, గౌతు శ్యాంసుందర శివాజీ అమెరికాలో ఉన్న తన కుమార్తెతో ఇంగ్లీషులోనే మాట్లాడతారని ముఖ్యమంత్రి చెప్పడంతో సభలో నవ్వులు విరిశాయి. రాష్ట్రంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు తెలుగును తప్పని సరిచేస్తూ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ మంగళవారం రాత్రి జీవో జారీ చేశారు. రాష్ట్రంలో ఇతర మాధ్యమాల్లో చదువుతున్న విద్యార్థులందరికీ తెలుగును రెండో భాషగా తప్పని చేసినట్లు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Image copyright Getty Images

ప్రజల సొమ్ముతో నేతలకు భద్రతా?: బాంబే హైకోర్టు

నవతెలంగాణ: పన్నుల రూపంలో ప్రజల నుంచి రాబడుతున్న సొమ్ముతో రాజకీయ నాయకులకు పోలీసు భద్రత కల్పించడం అవసరమా? అని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని బాంబే హైకోర్టు ప్రశ్నించింది. ఒకవేళ సదరు నాయకులు తమకు సెక్యూరిటీ అవసరమనుకుంటే వారి పార్టీకి చెందిన నిధులను వెచ్చించాలని అభిప్రాయపడింది.

రాష్ట్రంలో పోలీసు భద్రత పొందుతున్న రాజకీయ నాయకులు, సినీ నటులు, ప్రయివేటు వ్యక్తుల నుంచి బకాయిలను రాబట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఓ వ్యక్తి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. పోలీసు సెక్యూరిటీ పొందుతున్నప్పటికీ వారు.. ప్రభుత్వానికి డబ్బులు చెల్లించడం లేదని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై చీఫ్‌ జస్టిస్‌ మంజులా చెల్లూర్‌, న్యాయమూర్తి ఎంఎస్‌ సోనక్‌ల నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టి తాజా వ్యాఖ్యలు చేసింది.

భద్రత పొందుతున్న వీఐపీల జాబితాను పునఃపరిశీలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎవరైనా వ్యక్తులకు ప్రాణ హాని తొలగిపోతే వారికి వెంటనే సెక్యూరిటీని తొలగించాలని వెల్లడించింది. రాజకీయ నాయకులు, ప్రయివేటు వ్యక్తులకు భద్రతగా పంపిస్తున్న పోలీసులను దీర్ఘకాలం పాటు అదే డ్యూటీలో కొనసాగించడం సరికాదని తెలిపింది. సెక్యూరిటీ గార్డుగా నియ మించిన ఆరు నెలల తర్వాత తిరిగి వారిని పోలీసు శాఖలోకి తీసుకోనెలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. నేర చరిత్ర ఉన్న వారికి సెక్యూరిటీ కల్పించొద్దని ప్రభుత్వ తరఫు న్యాయవాది అభినందన్‌ వాగ్యానీ చేసిన ప్రతిపాదనను ధర్మాసనం తప్పుబట్టింది. నేర రికార్డు ఉన్నంత మాత్రాన వారికి స్చేచ్ఛగా బతికే హక్కు లేదని భావిస్తున్నారా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఎంతమంది మహిళలు వేధింపులకు గురవుతున్నారు?

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)