తిరుమలలో సోనియా గాంధీ తన మతం గురించి ఏమని రాశారు?

  • 30 నవంబర్ 2017
సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ Image copyright Getty Images

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తరహాలోనే ఆమె కుమారుడు రాహుల్‌గాంధీ వ్యక్తిగత అంశం చర్చనీయంగా మారింది.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ 2017 నవంబర్‌లో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడి హోదాలో చారిత్రక సోమ్‌నాథ్ ఆలయాన్ని సందర్శించినపుడు అక్కడ తాను హిందువేతరుడ్నని పేర్కొన్నట్లు చెప్తున్న విషయం మీద ట్విటర్, ఇతర మీడియా వేదికలు హోరెత్తాయి. ఆ ఆలయం వద్ద హిందువేతరులందరూ తమ గుర్తింపును ప్రకటించాల్సి ఉంటుంది.

బీజేపీ ఐటీ సెల్ అధినేత అమిత్ మాలవీయ తక్షణమే ట్వీట్ చేస్తూ: ''ఎట్టకేలకు రాహుల్ గాంధీ తన మతం గురించి స్పష్టంగా చెప్పారు. సోమ్‌నాథ్ వద్ద (నిబంధన ప్రకారం) హిందువేతరుల కోసం ఉద్దేశించిన సందర్శకుల రిజిస్టరులో సంతకం చేశారు'' అని వ్యాఖ్యానించారు.

''ఆయన ఆచరిస్తున్న హిందువు సంగతి తర్వాత.. విశ్వాసం రీత్యా కూడా హిందువు కానపుడు ఈ ఆలయ సందర్శనలతో ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారు?'' అని ప్రశ్నించారు కూడా.

దీనిపై వివరణ ఇవ్వడానికి కాంగ్రెస్ తక్షణమే స్పందిస్తూ అది వాస్తవాల వక్రీకరణ అని పేర్కొంది.

ఆ పార్టీ అధికారిక ట్విటర్ హ్యాండిల్ @INCIndia.. ''సోమ్‌నాథ్ ఆలయం వద్ద ఒకే ఒక్క సందర్శకుల పుస్తకం ఉంది. అందులోనే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సంతకం చేశారు. దీనిపై చేస్తున్న ఇతరత్రా ప్రచారమంతా కల్పితం. అవి నిస్పృహతో చేస్తున్న తెంపరి పనులా?'' అంటూ ట్వీట్ చేసింది.

Image copyright Getty Images

హిందూయేతరుల నమోదు నమోదు తప్పనిసరి

టెలివిజన్ జర్నలిస్ట్ బ్రజేశ్ కుమార్ సింగ్.. ''సోమ్‌నాథ్ ఆలయాన్ని రాహుల్ సందర్శించినపుడు ఆయన మీడియా కోఆర్డినేటర్ మనోజ్ త్యాగి.. ఆలయాన్ని సందర్శించే హిందూయేతరుల కోసం నిర్వహించే ప్రత్యేక రిజస్టర్‌లో అహ్మద్‌పటేల్ పేరుతో పాటు రాహుల్ గాంధీ పేరును పేర్కొన్నారు. ఎన్నికల సీజన్‌లో ఇది పెద్ద పొరపాటు'' అని పేర్కొన్నారు.

త్యాగి కూడా ఒక ప్రకటన జారీ చేశారు. ''నేను మీడియా సిబ్బందిని సోమ్‌నాథ్ ఆలయం లోపలికి తీసుకెళ్లడం కోసం కేవలం నా పేరును మాత్రమే నమోదు చేశాను. రాహుల్‌గాంధీ పేరు కానీ, అహ్మద్ పటేల్ పేరు కానీ అప్పుడు రిజిస్టరులో లేవు. వాటిని ఆ తర్వాత చేర్చి ఉండొచ్చు'' అని అందులో పేర్కొన్నారు.

కానీ సోమ్‌నాథ్ ఆలయానికి చెందిన ప్రజా సంబంధాల అధికారి ధృవ్ జోషి మాత్రం త్యాగిని తప్పుపడుతున్నారు.

''అహ్మద్ పటేల్, రాహుల్‌ గాంధీల పేర్లను రాహుల్ మీడియా కోఆర్డినేటర్ మనోజ్‌త్యాగి హిందూయేతరుల రిజిస్టరులో నమోదు చేశారు. హిందూయేతరులందరూ ప్రవేశ ద్వారం దగ్గర సెక్యూరిటీ పాయింట్ వద్ద ఇలా నమోదు చేయడం నిబంధన ప్రకారం తప్పనిసరి'' అని జోషి చెప్పారు.

Image copyright Getty Images

''రామరాజ్యం వర్సెస్ 'రోమ్' రాజ్యం''

ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ హిందువా కాదా అనే చర్చ కొన్ని వర్గాల్లో మొదలైంది. రాహుల్‌కి మాత్రం.. రాజీవ్‌గాంధీ రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటి నుంచీ సోనియా గాంధీ ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారనేది జ్ఞప్తికి తెచ్చే ఉదంతమిది.

సోనియా గాంధీ 1998లో రాజకీయల్లోకి లాంఛనంగా ప్రవేశించనప్పటి నుంచీ తన విశ్వాసానికి సంబంధించిన వివాదంలోకి జారిపోకుండా జాగ్రత్తపడ్డారు.

నిజానికి.. రాజకీయ ఆవశ్యకతల వల్ల సోనియా తన తల్లిదండ్రుల అభీష్టానికన్నా అధికంగా హిందూమతానికి చేరువయ్యారని విమర్శకులు అంగీకరిస్తారు.

1999 సాధారణ ఎన్నికల సమయంలో సోనియా మూలాలు, ఆమె క్రైస్తవ మత విశ్వాసం ప్రాతపదికలుగా సంఘ్ పరివార్ దేశ వ్యాప్తంగా ''రామరాజ్యం వర్సెస్ 'రోమ్' రాజ్యం'' ప్రచారాన్ని ప్రారంభించింది.

అప్పుడు భారతదేశంలోని రోమన్ క్యాథలిక్ అసోసియేషన్ అనూహ్యంగా స్పందిస్తూ.. సోనియా మతాన్ని ఆచరిస్తున్న క్యాథలిక్ కాదంటూ తిరస్కరించింది.

భక్తులను ఆయన కాలితో తంతారు

సోనియా, రాజీవ్‌ల వివాహం తర్వాత.. రాజీవ్ ఎప్పుడు ఏ ప్రార్థనా స్థలాన్ని సందర్శించినా ఆయన వెంట సోనియా కూడా తరచుగా కనిపించేవారు. ఆమె తన తలను చీర కొంగుతో కప్పుకుని కిందకు వంగి మతపెద్దల పాదాలను కూడా తాకేవారు.

1989 ఎన్నికల సమయంలో రాజీవ్ దేవ్రహ బాబాను కలిసినపుడు సోనియా కూడా ఆయన వెంట ఉన్నారు. ఆ బాబా.. మానవ కంపనాలు తనకు తాకకుండా ఉండేందుకోసమంటూ నేలకు ఆరడుగుల ఎత్తున దిమ్మెల మీద నిర్మించిన ఒక చెక్క వేదిక మీద ఉండేవారు.

ఆయన ఆశీర్వదించే తీరు కూడా ప్రత్యేకమైనది. భక్తులను ఆయన కాలితో తంతారు.

ఆ తర్వాత రాజీవ్, సోనియాలు గుజరాత్‌లోని అంబాజీ ఆలయానికి వెళ్లారు. ఇందిరాగాంధీ 1979-80 ఎన్నికల కోసం ఇంటింటి ప్రచారం ప్రారంభించే ముందుగా 1979లో మొదటిసారిగా సోనియాను అక్కడికి తీసుకెళ్లిన తర్వాత ఆమె ఆ ఆలయాన్ని సందర్శించడం ఇది రెండోసారి.

అప్పుడు ఇందిరను అంబాజీ ఆశీర్వదించారు. ఆమె తిరిగి అధికారంలోకి వచ్చారు.

Image copyright Getty Images

తిరుమలలో సోనియా..

1998 సాధారణ ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షురాలైన సోనియా ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతిలో వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు.

తాను తన భర్త, అత్తల మతాన్ని పాటిస్తున్నట్లు నాడు సోనియా రాశారు.

ఆమె తాను హిందువును అని నేరుగా చెప్పకపోయినప్పటికీ.. ఆమె మద్దతుదారులు, అప్పటి టీటీడీ చైర్మన్ సుబ్బిరామిరెడ్డి ఆమెకు దర్శనం ఏర్పాటు చేశారు. సోనియాకు బాలాజీ ఆశీర్వాదాలు లభించాయి.

సోనియా తిరుపతి పర్యటన తర్వాత కొంత కాలానికి సీడబ్ల్యూసీ.. 'హిందూమతం భారతదేశంలో లౌకికవాదాన్ని పరిరక్షించే అత్యంత సమర్థవంతమైన మతం' అంటూ ఒక తీర్మానం ఆమోదించింది.

1989లో సోనియా రాజీవ్‌తో కలిసి కఠ్మాండూ వెళ్లినపుడు.. ప్రపంచంలో ఏకైక హిందూ రాచరిక రాజ్యమైన నేపాల్‌తో సంబంధాలను రాజీవ్ ఒక దారిలోకి తెస్తారని భావించినందున ఆ పర్యటనకు చాలా ప్రాముఖ్యత ఉండింది. భారత ప్రధాని చారిత్రక పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించాలని నిర్ణయించుకునే ముందు వరకూ ఆయన, నేపాల్ రాజు బీరేంద్ర సుహృద్భావం కొనసాగింది.

తిరుపతి, పూరి ఆలయాల తరహాలోనే అక్కడ పవిత్ర ఆలయ ప్రాంగణంలోకి హిందువేతరులకు ప్రవేశం నిషిద్ధం. రాజీవ్ తనతో పాటు సోనియాను కూడా తీసుకెళ్లాలని పట్టుపట్టారు. కానీ ఆలయ పూజారులు అంగీకరించలేదు.

నేపాల్‌లో ‘అవమానం’

దేవుడి ప్రతినిధుల మాటను తిరస్కరించలేనంటూ రాజు బీరేంద్ర తన అశక్తతను వ్యక్తంచేశారు. రాజు బీరేంద్ర భార్య రాణి ఐశ్వర్యకు ఆ ఆలయ ట్రస్టు మీద కొంత పట్టు ఉందనీ, సోనియాను ఆలయంలోకి అనుమతించరాదని ఆమె కూడా దృఢ నిర్ణయం తీసుకున్నారనీ అప్పుడు వినిపించింది.

రాజీవ్ దీనిని వ్యక్తిగత అవమానంగా పరిగణించారని, రాజు బీరేంద్ర తనను అవమానించడానికి ఈ మార్గం ఎంచుకున్నారని ఆయన భావించారని చెప్తారు. ఆయన పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించకుండానే వెనుదిరిగారు.

ఈ పర్యటన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడకపోగా మరింత క్షీణించాయి. భారత్ - నేపాల్ సరిహద్దు వెంట ఆర్థిక దిగ్భంధనం అమలైంది. అది నేపాల్‌ను బాగా దెబ్బతీసింది.

భారత్‌కు వ్యతిరేకంగా నేపాల్‌లో ఆగ్రహం పెల్లుబికింది. రాచరిక వ్యతిరేక శక్తుల నుండి రాజు మీద ఒత్తిడి విపరీతంగా పెరిగింది. నాటి విదేశాంగ మంత్రి నట్వర్‌సింగ్ రహస్యంగా నేపాల్ వెళ్లి రాజు బీరేంద్రతో చర్చలు జరిపిన తర్వాత సంధి ప్రకటించడం జరిగింది.

Image copyright Getty Images

బనారస్ నుంచి కుటుంబ పండితుడు

2001లో మతపరంగా చాలా ప్రాముఖ్యత గల కుంభమేళా సందర్భంగా అలహాబాద్‌లో పవిత్ర స్నానం చేయాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నిర్ణయించుకున్నారు.

2001 జనవరి 24న త్రివేణి వద్ద పవిత్ర స్నానం చేయడం ద్వారా రెండు అంశాలపై సందేశం పంపాలని సోనియా భావించారు.

తన మూలాల గురించిన వివాదాన్ని సద్దుమణచడంతో పాటు.. సంఘ్ తరహా హిందుత్వకు ఉదారమైన, సరళమైన ప్రత్యామ్నాయాన్ని ప్రదర్శించడం ఆమె ఉద్దేశం.

సోనియాగాంధీ నీటిలో మునగడం, గంగా పూజ, గణపతి పూజ, కులదేవత పూజ, త్రివేణీ పూజ చేస్తున్న ఫొటోలు ప్రచారంలోకి వచ్చాయి.

ఒక హిందూ పూజారి తనకు ఇచ్చిన ఒక ఎర్ర దారాన్ని సోనియా ఇప్పటికీ తన మణికట్టుకు కట్టుకునే ఉన్నారు. ఆ ఎర్ర దారం తనను అన్ని అరిష్టాల నుంచీ రక్షిస్తుందని ఆమెకు చాలా విశ్వాసముంది.

ఏదైనా కుటుంబ కార్యక్రమం జరిగిన ప్రతిసారీ మత క్రతువులు నిర్వహించడం కోసం బనారస్ నుంచి కుటుంబ పండితుడ్ని పిలిపిస్తారు సోనియా.

ప్రియాంక కుమారుడు రేహన్ పుట్టినపుడు సోనియా ఆ పండితుడ్ని పిలిపించారు. ఆయన సుదీర్ఘ పూజలు నిర్వహించి నామకరణం చేశారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)